tanla
-
తాన్లా బోర్డులోకి ట్రాయ్ మాజీ చైర్మన్ ఆర్ఎస్ శర్మ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ట్రాయ్ మాజీ చైర్మన్ ఆర్ఎస్ శర్మను డైరెక్టర్ల బోర్డులో నియమించినట్లు తాన్లా ప్లాట్‌ఫామ్స్ సోమవారం ప్రకటించింది. దీంతో సంస్థ బోర్డ్ డైరెక్టర్ల సంఖ్య ఏడుకు చేరుకుంది. 2015–20 మధ్య ట్రాయ్ చైర్మన్‌గా ఆయన విధులు నిర్వర్తించారు. ఎంపవర్డ్ గ్రూప్ ఆఫ్ కోవిడ్ వ్యాక్సిన్ అడ్మిని్రస్టేషన్ ఛైర్మన్‌గా.. భారత్‌లో కోవిడ్–19 టీకా కార్యక్రమానికి డిజిటల్ వెన్నెముక అయిన కో–విన్ రూపకల్పన, అమలుకు నాయకత్వం వహించారు. నేషనల్ హెల్త్ అథారిటీ సీఈవోగా కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య కార్యక్రమాలైన ఆయుష్మాన్ భారత్ జన్ ఆరోగ్య యోజన, ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ అమలులో కీలకపాత్ర పోషించారు. 2009–13 మధ్య ఆధార్ కార్డుల జారీ సంస్థ యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా డైరెక్టర్ జనరల్, మిషన్ డైరెక్టర్‌గా పని చేశారు. -
ఫిషింగ్ కట్టడికి తాన్లా పరిష్కారం
బార్సిలోనా: ఈ–మెయిల్స్, మొబైల్‌కు సైబర్ నేరగాళ్లు పంపే లింక్స్‌ను ఓపెన్ చేసి డబ్బులు పోగొట్టుకుంటున్న ఘటనలు రోజూ చూస్తున్నాం. ఇలాంటి ఫిషింగ్ సందేశాలు సబ్స్క్రైబర్లకు చేరకుండా నిరోధించే టెక్నాలజీని క్లౌడ్ కమ్యూనికేషన్స్ సేవల్లో ఉన్న హైదరాబాద్ కంపెనీ తాన్లా ప్లాట్‌ఫామ్స్ అభివృద్ధి చేసింది. ప్రస్తుతం వొడాఫోన్ ఐడియా నెట్‌వర్క్‌లో పరీక్షలు జరుగుతున్నాయి. బార్సిలోనాలో జరుగుతున్న మొబైల్ వరల్డ్ కాంగ్రెస్–2023 సందర్భంగా ఈ సాంకేతికతను ట్రాయ్ చైర్మన్ పి.డి.వాఘేలా చేతుల మీదుగా ఆవిష్కరించారు. ‘యాంటీ–ఫిషింగ్‌కు పరిష్కారాన్ని భారత్‌లో అభివృద్ధి చేశాం. సమస్య ప్రపంచవ్యాప్తంగా ఉంది. తాన్లా యాంటీ–ఫిషింగ్ ప్లాట్‌ఫామ్ ఒక నిమిషంలో మోసాన్ని గుర్తిస్తుంది. ఈ సాంకేతికత కోసం అంతర్జాతీయంగా ఆసక్తి కనబరుస్తున్నారు’ అని తాన్లా ప్లాట్‌ఫామ్స్ ఫౌండర్, చైర్మన్, సీఈవో డి.ఉదయ్ రెడ్డి తెలిపారు. మోసగాళ్లను ఏరివేయడానికి నియంత్రణ సంస్థలకు ఇది సాయపడుతుందని అన్నారు. వాయిస్ కాల్ ఆధారిత మోసాలకు చెక్ పెట్టేందుకు సొల్యూషన్స్‌ను అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. దీనిని వచ్చే రెండు త్రైమాసికాల్లో అందుబాటులోకి తెస్తామన్నారు. 30 కోట్ల మందికి ముప్పు.. భారత్‌లో కంపెనీ అంచనాల ప్రకారం దాదాపు 30 కోట్ల మంది ఫిషింగ్ దాడులకు గురయ్యే అవకాశం ఉందని ఉదయ్ రెడ్డి వెల్లడించారు. ‘వీరిలో 5 లక్షల మంది మోసపోయే చాన్స్ ఉంది. బాధితుల్లో 7% మంది మాత్రమే వివిధ కారణాల వల్ల నేరం గురించి ఫిర్యాదు చేస్తున్నారు. ఫేక్ ఎలక్ట్రిసిటీ బిల్ అలర్ట్, నో యువర్ కస్టమర్ వెరిఫికేషన్ వంటి 10–11 పద్ధతుల్లో ఫిషింగ్ మోసాలు ఎక్కువగా జరుగుతున్నాయి. సిమ్, యాప్స్‌ను మోసగాళ్లు వేదికగా చేసుకుంటున్నారు. స్కామ్ సందేశాలు వినియోగదారులకు చేరకుండా చూసుకోవాలి. ఇందుకోసం ఈ టెక్నాలజీని మొబైల్ సర్వీస్ ప్రొవైడర్లతో మాత్రమే కాకుండా గూగుల్, వాట్సాప్ వంటి ప్లాట్‌ఫామ్స్‌తో కూడా అనుసంధానించాం. ఫిషింగ్ సైట్స్‌ను నిరోధించే కొన్ని సర్వీస్ ఏజెన్సీలతో కూడా భాగస్వామ్యం చేసుకున్నాం’ అని వివరించారు. -
ట్రూకాలర్‌తో తాన్లా జట్టు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: సీపాస్ (కమ్యూనికేషన్స్ ప్లాట్‌ఫాం యాజ్ ఎ సర్వీస్) దిగ్గజం తాన్లా ప్లాట్‌ఫామ్స్ తాజాగా కాలర్ ఐడెంటిఫికేషన్ సేవల సంస్థ ట్రూకాలర్‌తో జట్టు కట్టింది. ట్రూకాలర్ బిజినెస్ మెసేజింగ్‌కు తమ వైజ్లీ సీపాస్ ప్లాట్‌ఫామ్ సర్వీసులు అందించనుంది. బార్సెలోనాలో జరుగుతున్న మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2022 సందర్భంగా ఇందుకు సంబంధించిన ఒప్పందం కుదుర్చుకుంది. సాంప్రదాయ ఎస్ఎంఎస్ సర్వీసులకు భిన్నంగా సందేశాలను వేగవంతంగా, చౌకగా డెలివరీ చేసేందుకు ఇది తోడ్పడుతుంది. వ్యాపార సంస్థలు తమ యూజర్లకు వ్యక్తిగతీకరించిన సందర్భోచిత సందేశాలను సురక్షితంగా అందించడానికి ఈ భాగస్వామ్యం ఉపయోగపడగలదని తాన్లా ప్లాట్‌ఫామ్స్ చైర్మన్ ఉదయ్ రెడ్డి తెలిపారు. దీనితో వ్యాపార సంస్థలకు సరళమైన, సమర్థమంతమైన కమ్యూనికేషన్ ప్లాట్‌ఫామ్‌ను అందించగలమని ట్రూకాలర్ సహ వ్యవస్థాపకుడు నామి జారింగ్హాలెమ్ తెలిపారు. -
‘బ్లాక్‌చెయిన్’పై తాన్లా దృష్టి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశీ సీపాస్ (కమ్యూనికేషన్ ప్లాట్‌ఫాం యాజ్ ఏ సర్వీస్) దిగ్గజం తాన్లా ప్లాట్‌ఫామ్స్.. కొత్త ఆవిష్కరణలపై మరింతగా దృష్టి పెడుతోంది. ఇందులో భాగంగా హైదరాబాద్‌లో ప్రపంచ స్థాయి ఇన్నోవేషన్ అండ్ ఎక్స్పీరియన్స్ సెంటర్ ఏర్పాటు చేస్తోంది. ప్రత్యేకంగా బ్లాక్‌చెయిన్, ఆర్టీఫిషీయల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), మెషీ న్ లెర్నింగ్ (ఎంఎల్), క్రిప్టోగ్రఫీ తదితర అంశాల్లో ఆవిష్కరణల కోసం దీన్ని ఉపయోగించనుంది. సుమారు 92,000 చ.అ. విస్తీర్ణంలో దాదాపు రూ. 70 కోట్లతో ఈ సెంటర్ ఏర్పాటు చేస్తున్నట్లు క్యూ2 ఫలితాల వెల్లడి సందర్భంగా కంపెనీ వ్యవస్థాపక చైర్మన్, సీఈవో ఉదయ్ రెడ్డి తెలిపారు. దీనికోసం 300 మంది సిబ్బందిని రిక్రూట్ చేసుకుంటున్న ట్లు, మార్చి నాటి కల్లా ఇది అందుబాటులోకి రానున్నట్లు ఆయన చెప్పారు. అలాగే, టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌తో కలిసి అందిస్తున్న వైజ్లీ ప్లాట్‌ఫామ్‌ను నాలుగో త్రైమాసికంలో అంతర్జాతీయ మార్కెట్లలో పూర్తి స్థాయిలో ప్రవేశపెట్టేందుకు కసరత్తు జరుగుతోందని ఉదయ్ రెడ్డి వివరించారు. దీనికి సంబంధించి ఒక అంతర్జాతీయ కన్సల్టెన్సీ సంస్థ అడ్వైజరీ సర్వీసులు అందిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. గేమింగ్, ఫిన్‌టెక్‌తో సీపాస్కు ఊతం.. కొన్నాళ్లుగా నెలకొన్న పరిస్థితులతో డిజిటలైజేషన్ జోరందుకుందని, దీంతో సీపాస్ విభాగానికి మరింత ఊతం లభిస్తోందని ఉదయ్ రెడ్డి తెలిపారు. బ్యాంకింగ్, బీమా, ఎడ్టెక్, గేమింగ్, ఫిన్‌టెక్ తదితర విభాగాలు ఇందుకు గణనీయంగా తోడ్పడుతున్నాయని చెప్పారు. ఎస్ఎంఎస్లు, ఈమెయిల్స్ మొదలైన వాటి రూపంలో వినియోగదారులకు కంపెనీలు సందేశాలు పంపేందుకు అవసరమైన సీపాస్ సర్వీసులకు డిమాండ్ భారీగా పెరుగుతోందని పేర్కొన్నారు. ఆటో–డెబిట్ నిబంధనల్లో మార్పులు వంటి నియంత్రణ సంస్థలపరమైన చర్యలు, వాట్సాప్ లాంటి ఓవర్ ది టాప్ (ఓటీటీ) ప్లాట్‌ఫామ్‌లకు కావాల్సిన సర్వీసులు మొదలైనవి సంస్థ వ్యాపార వృద్ధికి దోహదపడుతున్నాయని ఉదయ్ రెడ్డి తెలిపారు. ఈ నేపథ్యంలో తాన్లా అవకాశాలను అందిపుచ్చుకుని, వేగంగా వృద్ధి చెందుతోందని ఉదయ్ రెడ్డి చెప్పారు. దేశీ రెవెన్యూ మార్కెట్లో తమ వాటా 45 శాతం పైగా ఉందని ఆయన వివరించారు. కోవిడ్ టీకాల విషయంలో ఓటీపీలు మొదలైనవి పంపేందుకు సంబంధించి ప్రభుత్వానికి కూడా తమ సంస్థ సరీ్వసులు అందిస్తోందని పేర్కొన్నారు. క్యూ2లో లాభం 67% జూమ్.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో తాన్లా ప్లాట్‌ఫామ్స్ నికర లాభం కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన 67% ఎగిసి రూ. 136 కోట్లకు చేరింది. గత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో నికర లాభం రూ. 81 కోట్లు. ఆదాయం 44% వృద్ధితో రూ. 842 కోట్లకు చేరింది. గత ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్ త్రైమాసికంలో ఇది రూ. 583 కోట్లు. ప్రస్తుత కస్టమర్లతో పాటు కొత్త కస్టమర్ల చేరిక, మార్కెట్ వాటా పెంచుకోవడం తదితర అంశాల ఊతంతో ఇది సాధ్యపడిందని ఉదయ్ రెడ్డి వివరించారు. సమీక్షాకాలంలో కొత్తగా 87 కస్టమర్లు జతయ్యారని ఆయన పేర్కొన్నారు. క్యూ4లో 111 మంది ఉద్యోగులు చేరారు. పర్యావరణ, సామాజిక, గవర్నెన్స్ (ఈఎస్జీ) లక్ష్యాలకు సంబంధించి తెలంగాణ విద్యా శాఖతో తాన్లా ఫౌండేషన్ అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. -
మైక్రోసాఫ్ట్‌తో తాన్లా జట్టు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కమ్యూనికేషన్ ప్లాట్‌ఫామ్స్ సేవలందించే తాన్లా ప్లాట్‌ఫామ్స్ తాజాగా బ్లాక్‌చెయిన్ సాంకేతికత ఆధారిత వైజ్లీ ప్లాట్‌ఫాంను ఆవిష్కరించింది. ఇది రోజుకు 100 కోట్ల దాకా మెసేజీలను సురక్షితంగా, వేగవంతంగా ప్రాసెస్ చేయగలదని బుధవారం వైజ్లీ ఆవిష్కరించిన సందర్భంగా తాన్లా ప్లాట్‌ఫామ్స్ చైర్మన్, సీఈవో డి. ఉదయ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. ఐటీ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌తో కలిసి దీన్ని రూపొందించినట్లు ఆయన తెలిపారు. ఇది కంపెనీలు, మొబైల్ క్యారియర్స్, ఓటీటీ సంస్థలు, మార్కెటర్లు, పరిశ్రమ నియంత్రణ సంస్థలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని చెప్పారు. బీమా, బ్యాంకింగ్ తదితర రంగాల సంస్థలు తమ కస్టమర్లకు పంపే మెసేజీలు, ఓటీపీలు, మెయిల్స్ మొదలైనవి డెలివరీ అయ్యే క్రమంలో వివిధ ప్రక్రియల కారణంగా జాప్యం జరగడం, పూర్తి స్థాయిలో ఎన్క్రిప్షన్ లేకపోవడం వంటి సవాళ్లు ఉంటున్నాయని ఉదయ్‌కుమార్ రెడ్డి తెలిపారు. ఈ నేపథ్యంలో ఎన్క్రిప్షన్, డేటా పారదర్శకతకు పెద్దపీట వేస్తూ, ప్రారంభం నుంచి చివరి దాకా గోప్యత దెబ్బతినకుండా చూసేందుకు వైజ్లీ తోడ్పడగలదని ఆయన వివరించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషీన్ లెర్నింగ్ సంబంధిత సాంకేతికతలతో కంపెనీలు సర్వీసుల నాణ్యతను పెంచుకోవడానికి, వ్యయాలను తగ్గించుకోవడానికి ఉపయోగపడగలదని పేర్కొన్నారు. క్రిప్టోగ్రఫీ, బ్లాక్‌చెయిన్ ప్రాసెస్‌లకు సంబంధించి వైజ్లీ ఇప్పటికే మూడు పేటెంట్లు దక్కించుకుందని ఉదయ్‌కుమార్ రెడ్డి చెప్పారు. డేటాకు ప్రైవసీ, భద్రత అత్యంత కీలకమైనవని, వీటికి వైజ్లీ తోడ్పడుతుందని మైక్రోసాఫ్ట్ ఇండియా ప్రెసిడెంట్ అనంత్ మహేశ్వరి ఈ సందర్భంగా తెలిపారు. వైజ్లీలో మార్కెట్ ప్లేస్ విధానం .. ఇప్పటికే ట్రూబ్లాక్ ప్లాట్‌ఫాం ద్వారా దేశీయంగా వివిధ సంస్థలకు ఈ తరహా సర్వీసులు అందిస్తున్నామని ఉదయ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. ఇప్పుడిక వైజ్లీతో ప్రపంచవ్యాప్తంగా సర్వీసులు అందించనున్నామని ఆయన వివరించారు. దీనిలో ప్రప్రథమంగా మార్కెట్‌ప్లేస్ విధానాన్ని కూడా పొందుపర్చామని పేర్కొన్నారు. టెలికం సంస్థలు తదితర సర్వీస్ ప్రొవైడర్లను తమ అవసరాలకు అనుగుణంగా కంపెనీలు పారదర్శకంగా ఎంపిక చేసుకునేందుకు ఇది ఉపయోగపడగలదని ఆయన చెప్పారు. కమ్యూనికేషన్స్ ప్లాట్‌ఫాం యాజ్ ఏ సర్వీస్ (సీపాస్) విభాగంలో ఇలాంటిది అందించడం ప్రపంచంలోనే ఇదే ప్రథమమని ఉదయ్‌కుమార్ రెడ్డి తెలిపారు. క్లౌడ్ ద్వారా వైజ్లీ ప్లాట్‌ఫాంను అందించడానికి మైక్రోసాఫ్ట్‌తో భాగస్వామ్యం తోడ్పడుతుందని ఆయన చెప్పారు. అలాగే మైక్రోసాఫ్ట్ అనుభవం .. దీని రూపకల్పనలో ఉపయోగపడిందని వివరించారు. ఇక, వైజ్లీ విక్రయంలో రెండు సంస్థలు కలిసి పనిచేసేందుకు కూడా భాగస్వామ్యం తోడ్పడగలదన్నారు. 40 బిలియన్ డాలర్లకు గ్లోబల్ సీపాస్ ... ప్రస్తుతం అంతర్జాతీయంగా సీపాస్ వ్యాపార విభాగం సుమారు 20 బిలియన్ డాలర్లుగా ఉందని ఉదయ్ కుమార్ రెడ్డి చెప్పారు. గార్ట్నర్ అంచనాల ప్రకారం వచ్చే మూడేళ్లలో ఇది రెట్టింపై 40 బిలియన్ డాలర్లకు చేరవచ్చని పేర్కొన్నారు. ఇక భారత మార్కెట్ విషయానికొస్తే 1 బిలియన్ డాలర్లకు పైగా ఉంటుందన్నారు. పలు దిగ్గజ సంస్థలతో పాటు ప్రభుత్వానికి కూడా సర్వీసులు అందిస్తూ దేశీయంగా తాము ఈ రంగంలో అగ్రస్థానంలో ఉన్నామని చెప్పారు. కరోనా వైరస్ పరిణామాల తర్వాత డిజిటైజేషన్ మరింత వేగవంతమైందన్నారు. రాబోయే రోజుల్లో ఇది గణనీయంగా పుంజుకుంటుందని, తద్వారా అవకాశాలు మరింత పెరగగలవని ఉదయ్ కుమార్ రెడ్డి చెప్పారు. -
సవాళ్లను అవకాశాలుగా మల్చుకోవాలి
తాన్లా సీఎండీ ఉదయ్ రెడ్డి హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రతి వ్యాపారంలోనూ, ప్రతి ఒక్కరి జీవితంలోనూ అనేక సవాళ్లు ఎదురవుతుంటాయని, అయితే నిబ్బరంగా నిలవగలిగితే అవకాశాలు అందిపుచ్చుకోగలమని మొబైల్ సొల్యూషన్స్ సంస్థ తాన్లా సీఎండీ ఉదయ్ రెడ్డి తెలిపారు. ఇదే ప్రాతిపదికగా.. ప్రతికూలతలను ఎదుర్కొని అసాధ్యాలను సుసాధ్యం చేసే దిశగా తాన్లా ప్రస్థానం సాగుతోందని ఆయన పేర్కొన్నారు. తాన్లా నిర్వహించిన ‘ది డైలాగ్ బాక్స్’ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఉదయ్ రెడ్డి ఈ విషయాలు చెప్పారు. మొబైల్ టెక్నాలజీ రంగంలో ఎదురయ్యే సవాళ్లను ముందుగా ఊహించలేకపోవడం వల్ల తమ సంస్థ కూడా ఒక దశలో ఎదురుదెబ్బలు తిన్నప్పటికీ.. దృఢనిశ్చయంతో వాటిని అధిగమించి ముందుకు సాగామని వివరించారు. ప్రస్తుతం ఏడాదికి 5 బిలియన్ల మెసేజీలు ప్రాసెస్ చేస్తూ ప్రపంచంలోనే అతి పెద్ద ఏ2పీ మెసేజింగ్ ప్లాట్‌ఫాంగా తాన్లా నిలవగలిగిందని ఉదయ్ రెడ్డి తెలిపారు. ప్రతికూలతలను అధిగమించిన నేపథ్యంలో సవాళ్లను వృద్ధి అవకాశాలుగా మల్చుకుంటోందని చెప్పారాయన. ప్రముఖ పాత్రికేయుడు శేఖర్ గుప్తా వ్యాఖ్యాతగా వ్యవహరించిన ఈ కార్యక్రమంలో జనరల్ వేద్ ప్రకాశ్ మాలిక్, మాజీ క్రికెటర్ రాహుల్ ద్రవిడ్, ప్రొస్థెటిక్ కాళ్లతో మౌంట్ ఎవరెస్టును అధిరోహించిన మార్క్ ఇంగ్లిస్ తదితరులు పాల్గొని, తమ అనుభవాలను పంచుకున్నారు. -
మెసేజింగ్ ప్లాట్ఫామ్లో తాన్లా రికార్డు
హైదరాబాద్: తాన్లా సొల్యూషన్స్‌కు చెందిన ఏ2పీ (అప్లికేషన్ టూ పర్సన్) మెస్సేజింగ్ హబ్ ‘ఫాస్ట్‌ట్రాక్’ అక్టోబర్‌లో 500 కోట్ల మెసేజ్‌లను ప్రాసెస్ చేసింది. ఒకేరోజు 20 కోట్లకుపైగా మెసేజ్‌లను ప్రాసెస్ చేసి రికార్డు సృష్టించింది. మెసేజింగ్ ప్లాట్ఫామ్లో ఇది ప్రపంచంలోనే ఒక రికార్డని తాన్లా సొల్యూషన్స్ ఒక ప్రకటనలో తెలిపింది. త్వరితగతిన మెస్సేజ్ ప్రాసెసింగ్, వన్ టైమ్ పాస్వర్డ్స్ వంటి కీలక మెసేజ్‌ల విషయంలో లావాదేవీ, భద్రత, డెలివరీ అలర్ట్స్ వంటివి బ్యాంకులకు, ఈ కామర్స్‌కు, రవాణా, సరఫరాల వ్యవస్థ, సోషల్ మీడియాలకు ఎంతో కీలకమని సంస్థ పేర్కొంది. ఆయా అంశాల్లో తమ సామర్థ్యాన్ని మెసేజింగ్ హబ్ తెలియచెబుతున్నట్లు ఒక ప్రకటనలో తాన్లా సొల్యూషన్స్ సీఈఓ ఉదయ్ రెడ్డి పేర్కొన్నారు. ప్రస్తుత విప్లవాత్మక సాంకేతిక వ్యవస్థలో అప్లికేషన్ టూ పర్సన్ విభాగం కీలకమని ఆయన వివరిస్తూ... ఈ రంగం భవిష్యత్తులో మరింత బలోపేతం అవుతుందని తెలిపారు. 2018 నాటికి ఏ2పీ మెసేజింగ్‌కు సంబంధించి మార్కెట్ విలువ ప్రపంచవ్యాప్తంగా 60 బిలియన్ డాలర్లకు చేరుతుందని అంచనా. 1999లో స్థాపించిన తాన్లా సొల్యూషన్స్‌లో 300కుపైగా టెలికం నిపుణులు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఎన్ఎస్ఈలో గురువారం సంస్థ షేర్ ధర క్రితంతో పోల్చితే 5.66 శాతం పెరిగి (రూ.2.20) రూ.41.10 వద్దకు ఎగసింది.