చట్టాలు చేస్తే సరా?
ప్రభుత్వాధినేతలు చట్టాలు చేస్తారు. ఆదేశాలిస్తారు. కాని అవి ఎంతవరకు పేద ప్రజలకు ఉపయోగపడుతున్నాయో, ఎంతవ రకు ఆ ఫలాలను ప్రజలు అందుకుని అనుభవిస్తున్నారో తెలుసు కోవడం లేదు. పథకాల అమలు విషయంలో అధికారుల, నేతల పర్యవేక్షణా లోపం ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. దేశమంతటా ఇంటింటికీ కనీసం ఒక మరుగుదొడ్డి ఉండాలని కేంద్ర పాలకులు తీర్మానించారు. రాష్ట్ర ప్రభుత్వాలకు మార్గదర్శకాలు కల్పించారు. దాంతో ప్రజలు ఇప్పటికే కొంతమేరకు స్వార్జితంగానో, అప్పో సప్పో తెచ్చుకునో మరుగుదొడ్లు కట్టించుకున్నారు. రెండు నెలలు దాటినా వారికి ప్రభుత్వం నుండి రావలసిన పైకం రాలేదు. ఇచ్చి నా ఎప్పుడిస్తారో తెలియదు. ఇలాంటి లోపాలు ఒకటీ రెండు కా దు. బోలెడు లోపాలను సరిచేయవలసిన బాధ్యత ప్రభుత్వం పైనే ఉంది. అది లేనినాడు ప్రభుత్వంలో ఉన్నది కాంగ్రెస్‌పార్టీ అయినా, బీజేపీ అయినా తెలుగుదేశం అయినా ఫలితం శూన్య మే. ప్రజల కష్టనిష్టూరాలను దాదాపు వార్తాపత్రికలన్నీ బహిరంగ పరుస్తూనే ఉన్నాయి. వార్తల్లోని ప్రజావాణిని చూసైనా పాలకులు ప్రజానురంజకంగా పాలిస్తారని, పాలించాలని ఆశిస్తున్నాం.
సాయి రామానందస్వామి పొదలకొండపల్లి, ప్రకాశం జిల్లా
పొలాలపై పాశుపతాస్త్రమా?
పచ్చని పంట పొలాలతో, ప్రకృతి రమణీయతతో కళకళలాడే తుళ్లూరు మండలాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని ప్రాంతంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏకపక్షంగా తన నిర్ణ యాన్ని ప్రకటించడం విచారకరం. రైతు సంక్షే మమే తమ సంక్షేమమని కల్లబొల్లి కబుర్లతో రైతులను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు చక్కని పంటలు పండే ప్రాంతాన్ని రాజధాని కేంద్రంగా ప్రకటించి, ‘వ్యవసాయం దండగ’ అనే తన సిద్ధాంతానికి చంద్రబాబు మరోసారి బలాన్ని చేకూర్చారు. ఒక చిన్న ప్రాజెక్టు కట్టడానికి కూడా పర్యావరణ అనుమతులు కావాలంటుంది మన చట్టం. అటువంటి చట్టమున్న దేశంలో ఏకంగా 30 వేల ఎకరాలు పంట పొలాలను రాజధాని పేరుతో తీసుకుంటానంటే చట్టం అంగీకరిస్తుందా? భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్ర రాజధాని చరిత్ర చూసినా ఎక్కడా రైతుల అభీష్టానికి వ్యతిరేకంగా పొలాలు లాక్కున్న దాఖలాలు లేవు. ఈ ప్రభుత్వ తీరును ప్రజలందరూ ముక్తకంఠంతో ఖండించాలి.
డా॥తన్నీరు కళ్యాణ్ కుమార్ తెనాలి, గుంటూరు జిల్లా
విల‘పింఛను’
రెండు తెలుగు రాష్ట్రాల్లో పింఛన్ల పరిస్థితి గందరగోళంగానే ఉంది. అసలైన లబ్ధిదారులకు అవి అందకపోవడంతో పింఛన్లు కోల్పోయిన వారు ఆవేదన చెందుతున్నారు. జరుగుతున్న అవక తవకల పట్ల ప్రభుత్వాల స్పందన పేలవంగా ఉంటోంది. ఇరు రాష్ట్రాల్లో ఇదే సమస్య. ఇద్దరు ముఖ్యమంత్రులు చెప్పేది ఒకటే కానీ ఇప్పటివరకు పింఛన్లు, ఆహార భద్రతా కార్డులు, నగదు బదిలీ ఇవన్నీ సగటు మనిషిని ఎన్నడూ లేనంతగా ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఇదిలా ఉంటే రేషన్‌కార్డు దరఖాస్తుల కట్టలకు ఇంకా మోక్షం కలగలేదు సరికదా.. అవి ఇంకా ఫైళ్లలో మూలుగు తూనే ఉన్నాయి. రాష్ట్ర విభజన పద్ధతిగా చేయలేదంటూ మును పటి కేంద్ర ప్రభుత్వంపై ఆరోపిస్తున్నవారు ప్రజాజీవితాలతో ముడిపడి ఉంటున్న వాటి విషయంలో ఇప్పుడు పద్ధతి ప్రకారం చేస్తున్నారా? అధికారం మాది.. మా ఇష్టం వచ్చినట్లు చేస్తాం అనే అహంతో పాలకులు వ్యవహరిస్తున్నప్పుడు పరిస్థితి ఇలాగే ఉంటుంది. ఇప్పటికైనా ప్రభుత్వం లబ్ధిదార్లకు న్యాయం చేయా లి. అన్నిటికంటే మించి పింఛను వస్తుందో రాదోనని కుమిలిపో తున్న లక్షలాది మంది వృద్ధుల ఆవేదనను అర్థం చేసుకోవాలి.
ఎస్. విశ్వనాథం చిక్కడపల్లి, హైదరాబాద్