Tannishtha Chatterjee
-
సైనైడ్ మోహన్ కేసు ఆధారంగా సినిమా
ప్రముఖ దర్శకుడు రాజేష్ టచ్‌రివర్ తెరకెక్కిస్తున్న ప్యాన్ ఇండియా చిత్రం ‘సైనైడ్’. ప్రియమణి కథానాయికగా నటిస్తున్నారు. పలు హాలీవుడ్ చిత్రాల్లో నటించిన తనిష్టా చటర్జీ ఈ సినిమాలో ఓ కీలక పాత్ర చేయనున్నారు. ‘లయన్, బియాండ్ క్లౌడ్స్, షాడోస్ ఆఫ్ ది నైట్స్’ వంటి విదేశీ చిత్రాల్లో నటించి, మంచి గుర్తింపు తెచ్చుకున్నారు తనిష్టా. ‘రోమ్ రోమ్ మెమ్, అన్పోస్టెడ్’ చిత్రాలకు దర్శకత్వం కూడా వహించారామె. ‘సైనైడ్’లో తనిష్టా భాగమవ్వడం గురించి చిత్రనిర్మాతలు ప్రదీప్ నారాయణన్, కె. నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ – ‘‘తనిష్టా చటర్జీ రాకతో మా ‘సైనైడ్’ టీమ్ మరింత బలపడింది. ఈ సినిమా తెలుగు సినీ చరిత్రలో ఒక మైలురాయి అవుతుంది’’ అన్నారు. ‘‘సైనైడ్ మోహన్ సంచలనాత్మక కేసుని తీసుకుని ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం’’ అన్నారు రాజేష్ టచ్‌రివర్. తెలుగు, తమిళ్, మలయాళ, కన్నడ భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది. -
తారలపై విసుర్లు
సోషల్ మీడియాలో బాలీవుడ్ తారలపై బాడీ షేమింగ్ ఏమాత్రం తగ్గుముఖం పట్టడం లేదు. ఇన్‌స్టాగ్రామ్‌లో వాళ్లేదో ఫొటో పోస్ట్ చేస్తారు. వీళ్లు దానిపై కామెంట్ చేస్తారు. దీపికా పదుకోన్ నలుపు రంగు సింగిల్ పీస్ డ్రెస్ ధరించి పోస్ట్ చేసిన ఫొటోలో చాలా బక్కగా ఉన్నారు. ‘ఎముకలున్నాయి, మరి స్కిన్ ఎక్కడ? అని ఓ నెటిజెన్ కామెంట్ చేశారు. ప్రియాంక చోప్రా తన పెదవుల్ని ముందుకు తెచ్చి తీసుకున్న సెల్ఫీపై కూడా ట్రోలింగ్ జరిగింది. ఇంత బండ పెదవులేమిటని! దిషా పటానీ అయితే ‘బక్క’తనానికి పీక్ గ్రేడ్ అయిన ‘పీల’ స్థాయికి బాడీషేమింగ్‌కి గురయ్యారు. పరిణీతి చోప్రా బొద్దుగా ఉంటారు. తిండి తగ్గించమని ఆమెకు కొన్ని వేల ఉచిత సలహాలు లభించాయి. తనిష్ట చటర్జీ ఒంటి రంగు మీద ఓ కామెడీ షోలో షేమింగ్ జరిగింది. నవ్వుతూ నవ్వుతూనే తనది ‘రోస్టెడ్ స్కిన్’ అన్నందుకు తనిష్ట చాలా బాధపడ్డారు. అనేరి వజానీ టీవీ నటి. ఆమె తన బక్కపలుచని ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టీపెట్టగానే∙బాడీ షేమింగ్ మొదలైంది. ‘చీపురు పుల్ల’ అంటూ. ఇలియానాను కూడా ఒకప్పుడు బాడీ షేమింగ్ చేశారట. నడుము కింది భాగం ఎక్కువగా ఉంటుందని. ఇవన్నీ ఇలా ఉంచితే సాటి నటే తన సహనటిని షేమ్ చేసిన ఉదంతం కూడా ఉంది. ‘ఆ మనిషికి హెడ్‌లైట్ ఎక్కడుంటుందో, బంపర్ ఎక్కడ ఉంటుందో చెప్పడం కష్టం. కాలేజీ పిల్లలు నయం. తీరుగా కనిపిస్తారు’ అని భైరవి గోస్వామి.. కీర్తీ సనన్‌పై ట్విట్టర్లో పోస్ట్ పెట్టారు. తప్పు కదా. ఎప్పటికి ఎదుగుతాం?! -
ఆ యాడ్స్ ఇక చేయను : హీరోయిన్
టాలీవుడ్, బాలీవుడ్ అన్న తేడా లేకుండా వెండితెర మీద వెలిగిపోతున్న తారలందరూ తమ స్టార్ ఇమేజ్ను క్యాష్ చేసుకోవాలనుకుంటారు. అందుకే ఎడాపెడా బ్రాండ్ ఎండార్స్మెంట్లను ఒప్పేసుకొని వీలైనంత వెనకేసుకునే ప్రయత్నం చేస్తారు. అయితే ఒకప్పుడు అలాగే అన్ని రకాల బ్రాండ్లను ప్రమోట్ చేసిన సోనాలి బింద్రే, ఇక పై ఫెయిర్‌నెస్ క్రీం యాడ్లను ఎండార్స్ చేయనంటూ ప్రకటించింది. ఓ టివి కామెడీ షోలో హీరోయిన్ తనీషా చటర్జీ స్కిన్ టోన్‌పై చేసిన కామెంట్స్, వివాదాస్పదమైన నేపథ్యంలో... ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొన్న సోనాలి తన నిర్ణయాన్ని ప్రకటించింది. చిన్నవయసులో తనకు డబ్బు అవసరమైనప్పుడు అలాంటి యాడ్స్ చేశాను, కానీ ఇక మీదట ఎవరైనా తనకు అలాంటి ఆఫర్ ఇచ్చినా అంగీకరించనని తెలిపింది. ఒక వ్యక్తి స్కిన్ టోన్ గురించి జోక్స్ వేయటం చాలా పెద్ద తప్పన్న సోనాలి, ప్రస్తుత సమాజంలో ఇలాంటి విషయాలపై స్పందన బాగుందని తెలిపింది. -
నటికి క్షమాపణ చెప్పిన కమెడియన్
బాలీవుడ్ నటి తనిష్టా ఛటర్జీకి కమెడియన్ కృష్ణా అభిషేక్ క్షమాపణ చెప్పాడు. ‘కామెడీ నైట్స్ బచావో’ షోలో తన ఒంటిరంగును హేళన చేస్తూ జోకులు వేశారని తనిష్టా ఛటర్జీ ఆరోపించిన నేపథ్యంలో అభిషేక్ స్పందించాడు. ‘మా కార్యక్రమంలో ఏదైనా తప్పు జరిగిందని తనిష్టా ఛటర్జీ భావిస్తే మావైపు నుంచి ఆమెకు నేను క్షమాపణ చెబుతున్నాను. ఎవరినీ నొప్పించాలని, అవమానించాలని మేము అనుకోవడం లేదు. కామెడీ నైట్స్ బచావో షో రోస్ట్ ఫార్మాట్ లో సాగుతుంది. ఈ కార్యక్రమం ద్వారా ఆరోగ్యకరమైన హాస్యం అందించాలన్నదే మా ఉద్దేశమ’ని అభిషేక్ అన్నాడు. తమ కార్యక్రమాన్ని చూసినవారంతా ఎంతో మెచ్చుకుంటున్నారని చెప్పాడు. షారూఖ్ ఖాన్, వరుణ ధావన్ లాంటి హీరోలు తమ సినిమాల ప్రచారం కోసం ఈ షోకు వచ్చారని గుర్తు చేశాడు. ’తనిష్టా ఛటర్జీకి ఎందుకు బాధ కలిగిందో నాకు తెలియదు. ఎందుకంటే ఆమె వెళ్లిపోయిన తర్వాత నేను వచ్చాను. ఆమెను బాధ పెట్టివుంటే క్షమించమని అడుగుతున్నాను. ఇదంతా కావాలని చేసింది కాద’ని అభిషేక్ పేర్కొన్నాడు. -
కామెడీ షోలో ఆ నటిపై దారుణమైన జోక్స్!
మన టీవీల్లో వచ్చే కామెడీ షోల్లో దారుణమైన కుళ్లు జోకులు వేసి నవ్వించేందుకు కుప్పిగంతులు వేయడాన్ని మనం చూసే ఉంటాం. తాజాగా బాలీవుడ్ నటి తనిష్టా ఛటర్జీకి ఇదేవిధమైన చేదు అనుభవం ఎదురైంది. గ్రామీణ స్త్రీల సమస్యలపై సాహసోపేతంగా తెరకెక్కిన ’పర్చెడ్’ సినిమాలో రాధికా ఆప్తేతో కలిసి ఆమె బోల్డ్‌గా నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రమోషన్లో భాగంగా దర్శకురాలు లీనా యాదవ్, సహనటి రాధికా ఆప్తేతో కలిసి ’కామెడీ నైట్స్ బచావో’ షోలో ఆమె పాల్గొన్నది. ఈ షోలో 'రోస్ట్' (ఆరోగ్యకరమైన జోక్స్) పేరిట ఆమె నల్లగా ఉన్నదని హేళన చేశారు. 'మీకు చిన్నప్పటి నుంచి నల్లరేగడి పళ్లు ఇష్టమా? మీరు అవి బాగా తిని ఉంటారు కదా' అంటూ ఆమె ఒంటిరంగును హేళన చేస్తూ కుళ్లు జోకులు వేశారు. దీంతో కంగుతిన్న ఆమె వెంటనే నిరసన తెలిసింది. మనుషుల రూపురేఖలని చులకన చేసే వ్యాఖ్యలతో పరిహాసమాడటం ఏమీ బాగా లేదని ఆమె షో నుంచి వైదొలిగింది. దేశవ్యాప్తంగా ప్రసారమయ్యే ఓ కామెడీ షోలో ఇంత దారుణంగా జోక్స్ వేయడం తనను షాక్‌కు గురిచేసిందని ఆమె తన ఫేస్బుక్ పేజీలో తెలిపారు. అసభ్యకరమైన పరిహాసాలు చేసినందుకు కామెడీ షో తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఒంటిరంగు కారణంగా మన దేశంలో చాలామందికి ఉద్యోగాలు రావడం లేదని, పెళ్లి ప్రకటనల్లోనూ శరీర ఛాయ ప్రధానపాత్ర పోషిస్తున్నదని, దేశంలోని కులవ్యవస్థ మూలాల్లోనే ఈ వర్ణ వివక్ష కూడా ఉందని ఆమె విశ్లేషించారు. -
బ్రెట్‌లీ ప్రేమ ‘పాఠాలు’
ముంబై: ఆస్ట్రేలియా మాజీ పేస్ బౌలర్ బ్రెట్‌లీ ‘అన్ ఇండియన్’ పేరుతో రూపొందిస్తున్న చిత్రంతో బాలీవుడ్‌లోకి అడుగుపెడుతున్నాడు. భారత్, ఆస్ట్రేలియా మధ్య సంస్కృతీ, సంప్రదాయాల నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. భారత్‌కు చెందిన వితంతువుతో ప్రేమలో పడే టీచర్ పాత్రలో అతను నటిస్తున్నాడు. బెంగాలీ నటి తనిష్ట ఛటర్జీతో ఇటీవల చిత్రీకరించిన ఒక పాటలోని దృశ్యమిది. -
నా పాత్ర ఓ సర్ప్రైజ్..
నీళ్లు ఎక్కడ దొరుకుతాయో చెప్పగలిగే యువకుడు ఓ గ్రామానికి ఎలా సాయం చేశాడు? అనే కథాంశంతో రూపొందిన హిందీ చిత్రం ‘జల్’. ఇందులో నటించిన తనిష్టా చటర్జీ ఓ హాలీవుడ్ చిత్రంలో చాన్స్ కొట్టేశారు. ఈ చిత్రంలో తన పాత్ర సర్ప్రైజ్ ఇస్తుందనీ, చాలా కీలకమైనదనీ తనిష్టా పేర్కొన్నారు. హాలీవుడ్ చిత్రంలో అవకాశం కొట్టేసినందుకు ఆమె ఆనందం వ్యక్తం చేశారు. తల్లి నుంచి తప్పిపోయిన ఓ కుర్రాణ్ని ఆస్ట్రేలియన్ దంపతులు దత్తత తీసుకునే నిజజీవిత కథతో ఈ చిత్రం రూపొందనుంది. ఆస్ట్రేలియా వ్యాపారవేత్త సరూ బ్రీరర్లీ రచించిన ‘ఏ లాంగ్ వే హోమ్’ నవలకు ‘లయన్’ చిత్రం ద్వారా తెరరూపం ఇవ్వనున్నారు. గార్త్ డేవిస్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. -
బాలీవుడ్ తెరపై బ్రెట్ లీ
ముంబై: ఫాస్ట్ బౌలింగ్ తో క్రికెటర్లను గడగడలాడించిన ఆస్ట్రేలియా బౌలర్ బ్రెట్ లీ ఓ రొమాంటిక్ కామెడి చిత్రానికి పచ్చ జెండా ఊపారు. 'అన్ ఇండియన్' చిత్రంలో బాలీవుడ్ తార తనీష్టా చటర్జీ సరసన బ్రెట్ లీ నటించనున్నారు. భారత, ఆసీస్ లు ఆస్ట్రేలియా ఇండియా ఫిల్మ్ ఫండ్ (ఏఐఎఫ్ఎఫ్) పేరుతో ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఈ చిత్రం అక్టోబర్ మాసంలో సిడ్నీలో ప్రారంభమవుతుందని అధికారులు తెలిపారు. ఆస్ట్రేలియా ప్రధాని టోని అబాట్ భారత పర్యటన సందర్భంగా గురువారం ఈ ప్రకటన వెలువడింది. దేవేంద్ర గుప్తా, యతీందర్ గుప్తాలు నిర్మిస్తున్న అన్ ఇండియన్ చిత్రానికి అనుపమ్ శర్మ దర్శకత్వం వహిస్తున్నారు.