ఫ్రీ అని.. పరుగెత్తుకొచ్చారు
సినిమా అంటే ఇష్టపడని వారెవరు? అది అజిత్ చిత్రం అంటే మక్కువ పడని వారుం టారా? ఆ చిత్రం ఉచితంగా చూపిస్తానంటే బడికి డుమ్మాకొట్టైనా చూడాలని కోరుకుంటారు పిల్లలు. సరిగ్గా ఇలాంటి సంఘటన తారాపురం అనే గ్రామంలో జరిగింది. విషయం పోలీసుల వరకు వెళ్లి వాళ్లు వచ్చి పిల్లల్ని తరిమికొట్టారు. వివరాల్లో కెళితే, తిరుపూర్ జిల్లా తారాపురం గ్రామంలోని ఒక థియేటర్లో అజిత్ నటించిన వీరం చిత్రం ప్రదర్శిస్తున్నారు. ఈ థియేటర్‌ను నెలకొల్పి దశాబ్దకాలం పూర్తి కావడంతో ఆ థియేటర్ యాజమాన్యం సోమవారం అన్ని ఆటలను ఉచితంగా ప్రదర్శించారు. దీంతో ఈ చిత్రాన్ని చూడటానికి చుట్టుపక్కల ప్రాం తాల జనం గుంపులు గుంపులుగా తరలి వచ్చారు.
విశేషం ఏమిటంటే కళాశాల విద్యార్థులు, పాఠశాల బుడతలు కళాశాలకు, బడికి డుమ్మా కొట్టి చిత్రం చూడటానికి వచ్చారు. పిల్లలు పుస్తకాల బ్యాగ్‌లను భుజాలకు తగిలించుకుని థియేటర్‌కు పరుగులు తీశారు. ఇది చూసిన పెద్దలు నిలువరించినా ఫలితం లేకపోవడంతో పోలీసులకు ఫోన్ చేసి సమాచారమందించారు. దీంతో అక్కడికి వచ్చిన పోలీసులు పిల్లలను అడ్డుకోగా, కాలేజీ కుర్రాళ్లు చూడచ్చు, తాము చూడరాదా? అంటూ మొండికేశారు. పిల్లలకు పోలీసులకు మధ్య కాసేపు వాగ్వాదం జరిగింది. చివరికి పిల్లలను పోలీసు లు తరిమికొట్టారు. అయితే ఈ కారణంగా ఆ ప్రాంతంలో కాస్త ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. థియేటర్ యాజమాన్యం పిల్లలకు ప్రవేశం లేదని ప్రకటిస్తే బాగుండేదనే అభిప్రాయాన్ని పెద్దలు వ్యక్తం చేశారు.