మూతబడిన మరో స్టార్టప్
కార్యకలాపాలు నిలిపేసిన టాస్క్‌బాబ్
న్యూఢిల్లీ: గృహావసరాల సంబంధ సేవలు అందించే ముంబైకి చెందిన స్టార్టప్ సంస్థ టాస్క్‌బాబ్ మూతబడింది. నిర్దిష్ట కారణాలు వెల్లడించనప్పటికీ.. అనూహ్య పరిస్థితుల వల్ల జనవరి 19 నుంచి కార్యకలాపాలు నిలిపివేసినట్లు సంస్థ ఉద్యోగులకు రాసిన అంతర్గత లేఖలో టాస్క్‌బాబ్ సహ వ్యవస్థాపకుడు అసీమ్ ఖరే వెల్లడించారు. ఇప్పటికే వచ్చిన ఆర్డర్లను మాత్రం ప్రాసెస్ చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. ఊహించినంత స్థాయిలో లాభదాయకత, కార్యకలాపాల విస్తరణను సాధించడం సాధ్యం కాకపోవడం వల్లే సంస్థను మూసివేయాల్సి వచ్చినట్లు ఖరే సూచనప్రాయంగా పేర్కొన్నారు.
టాస్క్‌బాబ్ కార్యకలాపాలు నిలిపివేస్తున్నప్పటికీ.. తమ యాప్ లో ఎలక్ట్రీషియన్లు, ప్లంబర్లు, కార్పెంటర్స్ మొదలైన వారి జాబితా అందుబాటులోనే ఉంటుందని, కస్టమర్లు నేరుగా వారికి ఫోన్ చేసి సర్వీసులు పొందవచ్చని ఖరే తెలిపారు. త్వరలోనే మరింత మెరుగ్గా, పటిష్టంగా కార్యకలాపాలు మళ్లీ ప్రారంభించగలమని పేర్కొన్నారు. టాస్క్బాబ్ను 2014లో ఖరే, అభిరూప్ మేధేకర్, అజయ్ భట్, అమిత్ చహాలియా ప్రారంభించారు. ఆ తర్వాత ఐవీక్యాప్ వెంచర్స్, ఓరియోస్ వెంచర్ పార్ట్నర్స్ నుంచి 5 మిలియన్ డాలర్లు సమీకరించారు. గతేడాది మూతబడిన స్టార్టప్ఆస్క్మి, స్నాప్‌డీల్ తోడ్పాటున్న పెప్పర్‌ట్యాప్ వంటి స్టార్టప్‌లు ఉన్నాయి.