మనుషుల్లో దేవుళ్లు
ఈ రెండు కథలకీ పోలికలున్నాయి. సానుభూతికి అడ్రస్ అక్కరలేదు. ఒకాయన మృత్యువుని సుఖవంతంచేయడాన్ని ఉద్యమం చేసుకున్నాడు. మరొకాయన- మృత్యువులో పోగొట్టుకుంటున్న సానుభూతిని సంపాదించి పెట్టాడు.
ఆయన వయసు దాదాపు 30 ఏళ్లు. రోజూ ముంబైలో టాటా క్యాన్సర్ ఆసుపత్రి ఎదురుగా ఉన్న పేవ్మెంట్ మీద నిలబ డేవాడు. ప్రతిదినం మృత్యు వుకి భయపడుతూ లోనికి వెళ్లే వారినీ, వాళ్లని తీసుకెళ్లే బంధువులనీ చూసేవాడు. దీనికి దేవుడు తప్ప ఎవరూ పరిష్కా రం చూపించలేరు. ఈ నిస్సహాయత అతన్ని వేధిస్తూ ఉండేది. వీరిలో చాలామంది పేదవారు. దూరప్రాంతం నుంచి వచ్చినవారు. ఏం చెయ్యాలో, ఎవరిని కలుసుకో వాలో తెలియని నిరక్షరాస్యులు. మందులు కొనడానికీ, భోజనానికీ డబ్బు చాలనివారు. రోగానికి దాక్షిణ్యం లేదు. రోగం సమదర్శి. అందరినీ ఒకే విధంగా బాధి స్తుంది. నిస్సహాయంగా ఈ యువకుడు - ఏం చెయ్యా లో తెలీని పరిస్థితిలో ఇంటి ముఖం పట్టేవాడు. ‘వీళ్లకి ఏదైనా ఉపకారం చెయ్యగలనా?’ అని ఆలోచించేవాడు. చివరికి ఒక మార్గం కనిపించింది.
తనకున్న ఓ చిన్న హోటల్ని అద్దెకిచ్చేశాడు. హోటల్ లాభదాయకంగానే ఉండేది కనుక మంచి డబ్బే వచ్చింది. ఆ డబ్బుతో కొం డాజీ బిల్డింగ్ పక్కన తాను ఊహించుకున్న సహాయక కార్యక్రమాలను ప్రారంభించారు. ఎంతకాలం? గత 27 సంవత్సరాలుగా ఈ సేవా కార్యక్రమాలు జరుగుతున్నా యి. అసలు ఏమిటి ఈ కార్యక్రమం. ఆసుపత్రికి వచ్చే రోగులకూ, వారి బంధువులకూ ఉచితంగా ఆహారం ఇవ్వడం. ఆ చుట్టుపక్కల వారంతా హర్షించారు. ఆహ్వా నించారు. 50 మందికి మొదట్లో ఈ సహాయం అందేది. క్రమంగా సంఖ్య వంద, రెండు వందలు, మూడు వంద లయింది. మంచితనం అంటువ్యాధి. అవసరాన్ని ఆశిం చే పేదల సంఖ్య పెరిగిన కొద్దీ, అవసరం తీర్చే వదా న్యుల సంఖ్యా పెరుగుతూ వచ్చింది. సంవత్సరాలు గడి చిన కొద్దీ ఈ ఉపకారం నిరుపేదలకి అందుతోంది. ఇప్పుడు పేదల సంఖ్య 700 అయింది. ఈ పుణ్యాత్ముడి పేరు హరఖ్‌చంద్ సావ్లా. అవసరాలు పెరిగినా సావ్లా అక్కడే ఆగిపోలేదు. అవసరమున్న పేదవారికి మందు లు కూడా ఉచితంగా ఇవ్వడం ప్రారంభించారు.
ఒక ఫార్మసీ బ్యాంక్ ప్రారంభించారు. వెంటనే ముగ్గురు డాక్టర్లు, మూడు ఫార్మసీ సంస్థలు చేయి కలపడానికి ముందుకు వచ్చాయి. ముఖ్యంగా క్యాన్సర్‌తో బాధపడే పిల్లల సహాయ కార్యక్రమం ‘జీవనజ్యోతి’ తరఫున ఇప్పుడు కనీసం 60 అనుబంధ సంస్థలు నడుస్తున్నా యి. సావ్లాకి ఇప్పుడు 57 సంవత్సరాలు. 27 సంవత్స రాల కిందట లక్ష్యసిద్ధి, దీక్ష ఏమీ తగ్గలేదు. ఇది నిశ్శబ్ద విప్లవం. మానసిక విప్లవం. మానవీయ సంకల్పానికి పట్టాభిషేకం.
ఆసుపత్రిలో చావుబతుకుల్లో ఉన్న ఓ ముసలాయ న దగ్గరకి నర్సు ఓ సైనిక మేజర్ని తీసుకొచ్చింది. ‘‘మీ కోసం మీ అబ్బాయి వచ్చాడు’’ అంటూ అతని చెవులో చెప్పింది. నీరసంగా ముసలాయన కళ్లిప్పాడు. ఆయనకి అర్థమయేలాగ చెప్పడానికి నర్సుకి చాలా సమయం పట్టింది. గుండె నొప్పి కారణంగా ఇంజెక్షన్ ఇవ్వడంతో మత్తులో ఉన్న తండ్రి కొడుకు చేతిని బలహీనంగా పట్టు కున్నాడు. కొడుకు కళ్లలో ఆర్తిని గమనించిన నర్స్ అత ను కూర్చోవడానికి కుర్చీ వేసింది. రాత్రంతా తండ్రి చేతిని పట్టుకుని సముదాయించే చల్లని మాటలని చెబు తున్న కొడుకుని గమనించింది. ఆమెకీ కళ్ల నీళ్లు తిరి గాయి. కాస్సేపు విశ్రాంతి తీసుకోమని కొడుక్కి చెప్పిం ది. కొడుకు మర్యాదగా వద్దన్నాడు.
అతని మాటలు తండ్రికి సగమే అర్థమవుతున్నాయి. కానీ తనని పట్టు కున్న చేతుల్లో ప్రేమ తెలుస్తోంది. తెల్లవారేసరికి ముస లాయన కన్నుమూశాడు. ప్రాణం లేని చేతిని వదిలి ఆ విషయాన్ని నర్స్‌కు చెప్పడానికి మేజర్ వెళ్లాడు. ‘‘ఆయ న చివరి క్షణాల్లో కొడుకుగా ఆయన కోరుకున్న మన శ్శాంతినిచ్చారు’’ అంది నర్స్. ‘‘ఇంతకీ ఎవరతను?’’ అన్నాడు మేజర్. నర్స్ తుళ్లి పడింది. ‘‘మీ నాన్న కాదా?’’ అంది నిర్ఘాంతపోతూ. ‘‘కాదు. నా జీవితంలో ఆయన్ని నేనెప్పుడూ - ఈ రాత్రి తప్ప చూడలేదు’’ అన్నాడు. ‘‘నేను విక్రమ్ సలా రియా అనే ఆయన్ని కలుసుకోవడానికి వచ్చాను. ఆయ న కొడుకు ముందు రోజు రాత్రి పాక్ యుద్ధంలో చని పోయాడు.’’
‘‘ఆయనే విక్రమ్ సలారియా’’ అంది నర్స్. ఇంతే కథ. ఈ రెండింటిలో ఒకటి వాస్తవం. మరొకటి కథ. అయితే ఈ రెండు కథలకీ పోలికలున్నాయి. సానుభూ తికి అడ్రస్ అక్కరలేదు. ఒకాయన మృత్యువుని సుఖ వంతంచేయడాన్ని ఉద్యమం చేసుకున్నాడు. మరొకాయ న- మృత్యువులో పోగొట్టుకుంటున్న సానుభూతిని సం పాదించి పెట్టాడు. మనం అప్పుడప్పుడు దేవుడిని తలచుకుని పరవ శించే మానవమాత్రులం మాత్రమే కానక్కరలేదు. ఓ చిన్న మానవతా చర్య మనం ఊహించకపోయినా మన ల్ని దేవుళ్లని చేస్తుంది.
- గొల్లపూడి మారుతీరావు