మీడియాతో మాట్లాడుతున్న పూనం మాలకొండయ్య, చిత్రంలో కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ తదితరులు
సాక్షి, విశాఖపట్నం : విమ్స్ సేవలు పూర్తిగా ఉచితమని వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి పూనం మాల కొండయ్య చెప్పారు. ఎవరి వద్ద పైసా కూడా వసూలు చేయబోమన్నారు. సాక్షిలో గురువారం కథనం ప్రచురితమైన నేపథ్యంలో ఆమె స్పందిస్తూ విమ్స్‌ను బలోపేతం చేస్తామే తప్ప ప్రైవేటుపరం చేయబోమని భరోసా ఇచ్చారు. విమ్స్‌లో ఖాళీగా ఉన్న వైద్యులు, ఇతర పోస్టులను పర్మినెంట్ రిక్రూట్‌మెంట్ పద్ధతిలోనే భర్తీ చేస్తామన్నారు. దీనిపై వచ్చే కేబినెట్ సమావేశంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందన్నారు. ట్రామా సర్వీసెస్, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ ప్రభుత్వపరంగా చేస్తున్నామన్నారు. కేజీహెచ్‌లో కూడా అందుబాటులో లేని సూపర్ స్పెషాలిటీ సేవలను విమ్స్‌లో అందుబాటులోకి తీసుకొస్తున్నామన్నారు.
కార్డియాలజీతో సహా ఆరు విభాగాల్లో సూపర్ స్పెషాలిటీ బ్లాకులను అందుబాటులోకి తీసుకొస్తున్నారన్నారు. ఇక్కడ ఎన్ని సౌకర్యాలు కల్పించినా పూర్తిగా ఉచితమే తప్ప ఏ అధునాతన సేవకు పైసా వసూలు చేసే ప్రసక్తే లేదన్నారు. విమ్స్‌లో టాటా క్యాన్సర్ సెంటర్ వస్తోందని, వాళ్లకు అవసరమైన సపోర్టు ఇస్తున్నామన్నారు. క్యాన్సర్‌లో స్టేజ్ స్టెమ్‌సెల్స్ రీసెర్చ్ ద్వారా మాత్రమే నివారించగలమని, ఈ అవకాశం రాష్ట్రంలో ఏ కార్పొరేట్ ఆస్పత్రిలోనూ లేదన్నారు. దీన్ని త్వరలో విమ్స్‌లో తీసుకొస్తున్నామన్నారు. ఈ సర్వీసులన్నీ అవుట్ సోర్సింగ్ పద్ధతిలో ఏర్పాటు చేయడం లేదని, పూర్తిగా ప్రైవేటు పార్టనర్ షిప్‌తో ఏర్పాటు చేస్తున్నామన్నారు. చేసిన సేవలకుగాను వాళ్లకు పర్సంటేజ్ ఇస్తామే తప్ప రోగుల నుంచి ఆయా సంస్థలు పైసా కూడా వసూలు చేయనీయమన్నారు. ఇందుకయ్యే వ్యయాన్ని ప్రభుత్వమే భరిస్తుందన్నారు. ఎన్టీఆర్ వైద్య సేవ, ఆరోగ్య రక్ష పరిధిలోకి రాని వ్యాధులకు కూడా విమ్స్‌లో ఉచితంగా సేవలందుతాయన్నారు.
Comments
Please login to add a commentAdd a comment