నేనింతే
మేయర్‌కు కమిషనర్ ఝలక్
సి‘ఫార్సు’లు చెత్తబుట్టలోకి..
టౌన్‌ప్లానింగ్ అక్రమాలపై డేగ కన్ను
విజయవాడ సెంట్రల్ : నగరపాలక సంస్థ కమిషనర్ సి.హరికిరణ్ అధికార పక్షానికి షాక్ ఇచ్చారు. అడ్డగోలు సిఫారసులను పక్కన పడేస్తున్నారు. బదిలీలు, పదోన్నతుల వ్యవహారంలోనూ తనదైన శైలిలో సాగుతున్నారు. అధికార పార్టీ ప్రజాప్రతినిధుల వద్ద హుందాగా వ్యవహరిస్తున్నారు. కమిషనర్ విధి నిర్వహణలో ముక్కుసూటిగా పోతున్నారు. దీంతో మేయర్, కమిషనర్ల మధ్య పవర్ గేమ్ పతాక స్థాయికి చేరింది.
భయపడుతున్న అక్రమార్కులు
టౌన్ ప్లానింగ్ విభాగంలో అవినీతి పేట్రేగడంతో కార్పొరేషన్ అల్లరిపాలవుతోంది. గత నెలలో నగరపాలక సంస్థలో సమీక్ష నిర్వహించిన మున్సిపల్ శాఖ మంత్రి పి.నారాయణ టౌన్ ప్లానింగ్ ఉద్యోగుల వ్యవహార శైలిపై చర్చించారు. తన మాట ఎవరూ విన డం లేదని సిటీప్లానర్ చక్రపాణి చెప్పడం, దానికి మేయర్ చురకలు అంటించడంతో ప్రతిష్ట మరింత దిగజారింది. ఈ క్రమంలో ఆరోపణలు రుజువైతే దండించాలనే నిర్ణయానికి కమిషనర్ వచ్చినట్లు తెలుస్తోంది. శైలజపై సరెండర్ వేటు వేసిన కమిషనర్.. మరో ఇద్దరు బిల్డింగ్ ఇన్స్పెక్టర్ల అక్రమాలపై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. దీంతో టౌన్ ప్లానింగ్ విభాగంలో అక్రమార్కులకు వణుకు మొదలైంది.
ఆచితూచి నిర్ణయం
అర్బన్ కమ్యూనిటీ డెవలప్మెంట్ (యూసీడీ) విభాగంలో ఎస్సీ రుణాల మంజూరు పేరుతో అవకతవకలు జరిగిన సందర్భంలో పోలీస్ కేసు పెట్టాల్సిందిగా మేయర్ కమిషనర్‌ను కోరారు. శాఖాపరమైన విచారణ వైపే హరికిరణ్ మొగ్గుచూపారు.
దర్గా భూముల తీర్మానం తారుమారైన ఘటన కౌన్సిల్‌ను కుదిపేసింది. సెక్రటరీ సెల్ ఉద్యోగుల వల్లే ఈత ప్పు జరిగిందని మేయర్ సభలో చెప్పారు. బాధ్యులపై పోలీస్ కేసు పెట్టాల్సిందిగా మేయర్ కోరినప్పటికీ కమిషనర్ విచారణ నిర్వహిస్తున్నారు.
ఇంజినీరింగ్ సెక్షన్లో జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న ఓ ఉద్యోగిని సర్కిల్-3కు బదిలీ చేయాల్సిందిగా మేయర్ చేసిన ప్రతిపాదనను కమిషనర్ పక్కనపెట్టారు.
టీఎన్‌టీయూ సమావేశం గుల్జార్ సమావేశ మందిరంలో జరపాలని యూనియన్ నేతలు నిర్ణయించగా నిబంధనలు అంగీకరించవని కమిషనర్ స్పష్టంచేశారు.
కంగుతిన్న మేయర్ వర్గం
టౌన్ ప్లానింగ్ విభాగంలో గతంలో అక్రమాలకు పాల్పడిన స్కావెండీష్ను మాతృశాఖకు కమిషనర్ సరెండర్ చేశారు.
అక్రమాల ఆరోపణలు రుజువు కావడంతో బిల్డింగ్ ఇన్స్పెక్టర్ శైలజను డెరైక్టర్ టౌన్ అండ్ కంట్రీప్లానింగ్ (డీటీసీపీ)కి సరెండర్ చేయడం ద్వారా తన పవర్ ఏమిటో పాలకపక్షానికి తెలియజెప్పారు.
టీడీపీ వర్గాలతో సన్నిహితంగా ఉండే శైలజ పటమట, రామలింగేశ్వరనగర్ ప్రాంతాల్లో ఇబ్బడిముబ్బడిగా అక్రమ కట్టడాలను ప్రోత్సహించారు. గ్రీవెన్స్‌డేలో ఫిర్యాదులు అందడంతో కమిషనర్ సీరియస్ అయ్యారు. సరెం డర్ చేస్తానని వార్నింగ్ ఇచ్చారు. సీన్ కట్ చేస్తే మేయర్ కోనేరు శ్రీధర్ కమిషనర్‌కు సర్దిచెప్పారు. అంతా అయిపోయిందని అనుకుంటుండగా శైలజ చేతికి సరెండర్ ఆర్డర్ వచ్చింది. దీంతో మేయర్ వర్గం కంగుతింది.