Tax Breaks
-
ధనవంతులూ వలసబాట
(ఎం. విశ్వనాథరెడ్డి, సాక్షి ప్రతినిధి): పొట్ట చేతబట్టుకుని బతుకుదెరువు వెతుక్కుంటూ పేదలు వలస వెళ్లడం మనం ఎప్పుడూ చూసేదే. వ్యాపార అవకాశాలను, సౌకర్యాలను, పన్ను రాయితీలను వెతుక్కుంటూ కోటీశ్వరులు కూడా వలసబాట పట్టడం కూడా ఎప్పుడూ ఉన్నదే. సాధారణంగా పేదలు దేశంలోనే ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతానికి వలస వెళ్తారు. ధనవంతులు అందుకు భిన్నంగా వ్యాపార అవకాశాలు పుష్కలంగా ఉన్న దేశాలకు వెళ్తారు. కానీ, పత్రికల్లో పేదల వలసలే పతాక శీర్షికలవుతాయి. పెద్దల వలసల గురించి వార్తలు పెద్దగా కనిపించవు. కరోనా మహమ్మారి విసిరిన సవాళ్లకు బెదిరి.. మన దేశంలో కోట్ల మంది పేదలు వలసబాట పట్టారు. కానీ, కోటీశ్వరులు మాత్రం కరోనా సమయంలో వలస బాటపట్టలేదు. ఉన్న దేశం నుంచి కదల్లేదు. కరోనా శాంతించిన వెంటనే అవకాశాలు వెతుక్కుంటూ రెట్టింపు సంఖ్యలో ప్రపంచవ్యాప్తంగా తమకు అనుకూలంగా ఉన్న దేశాలకు వలస వెళ్లడం ప్రారంభించారు. 2022లో 88వేల మంది హై నెట్‌వర్త్ ఇండివిడ్యువల్స్ (10 లక్షల డాలర్ల సంపద కలిగి ఉన్న వ్యక్తులు) తమ మాతృదేశాన్ని వదిలి మరో దేశానికి వలస వెళ్తారని ‘హెన్లీ గ్లోబల్ సిటిజన్ రిపోర్ట్’ అంచనా వేసింది. ధనవంతుల వలసలు పెరుగుతాయే తప్ప కనుచూపు మేరలో తగ్గే అవకాశంలేదని చెప్పింది. ధనవంతులంతా ఏ దేశం నుంచి ఏ దేశం వెళ్తున్నారనే విషయం ఆసక్తికరం. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) ఎక్కువమందిని ఆకర్షిస్తోంది. ఆ దేశం అనుసరిస్తున్న టైలర్‌మేడ్ వలస విధానాలు ప్రపంచవ్యాప్తంగా ప్రతిభావంతులను, ధనవంతులను ఆకర్షించడానికి కారణంగా నిలుస్తున్నాయి. రెండోస్థానంలో ఉన్న ఆస్ట్రేలియాలో చౌకగా వైద్యం అందుబాటులో ఉండటం, వారసత్వ పన్ను లేకపోవడం, మంచి ఆర్థికవ్యవస్థ కావడం.. ధనవంతులను ఆకర్షిస్తున్న కారణాలని నిపుణులు చెబుతున్నారు. గత రెండు దశాబ్దాల్లో వివిధ దేశాల నుంచి 80 వేల మంది కోటీశ్వరులు ఆస్ట్రేలియాకు వలస వెళ్లారని నివేదిక పేర్కొంది. రష్యా, ఉక్రెయిన్ నుంచి అధికంగా.. ఇక రష్యా, ఉక్రెయిన్ యుద్ధం వల్ల ఆ రెండు దేశాల నుంచి కోటీశ్వరులు పెద్ద సంఖ్యలో వలస వెళ్తున్నారు. ఉక్రెయిన్‌లోని కోటీశ్వరుల్లో 42 శాతం మంది వలస బాట పడతారని అంచనా వేస్తున్నారు. అలాగే, రష్యాలో 15 శాతం మంది కోటీశ్వరులు దేశం విడిచిపెట్టి వెళ్తారని అంచనా. మిగతా అన్ని దేశాలు రెండు శాతం, అంతకంటే తక్కువ మంది కోటీశ్వరులు వలస వెళ్లొచ్చని భావిస్తున్నారు. భారత్ నుంచి వలస వెళ్తారని అంచనా వేస్తున్న 8 వేల మంది, దేశంలోని మొత్తం కోటీశ్వరుల్లో 2 శాతం అని నివేదిక పేర్కొంది. ధనవంతులను ఆకర్షిస్తున్న యూఏఈ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ప్రపంచంలోని అన్ని దేశాల ధనవంతులను ఆకర్షిస్తోంది. దీని కోసం.. ► వీసా నిబంధనలను సరళతరం చేసింది. ► 5.44 లక్షల యూఎస్ డాలర్ల విలువైన ఆస్తి కొనుగోలు చేసే వారికి 10 సంవత్సరాల గోల్డెన్ వీసా ఇస్తున్నారు. ► 2.72 లక్షల డాలర్లు యూఏసీ స్టార్టప్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టేవారికీ గోల్డెన్ వీసాకు అర్హత ఉంటుంది. ► ప్రపంచంలో ఎక్కడైనా తమ స్టార్టప్ కంపెనీని 1.9 మిలియన్ డాలర్లకు విక్రయించిన వారికి కూడా గోల్డెన్ వీసా తీసుకోవడానికి అర్హత కల్పిస్తూ యూఏఈ నిబంధనలను సడలించింది. ► కంపెనీలు ఏర్పాటు చేసుకోవడానికే కాకుండా, ప్రతిభావంతులైన సిబ్బందిని ప్రపంచం నలుమూలల నుంచి తెచ్చుకోవడానికి కూడా యూఏఈ అవకాశం కల్పిస్తోంది. ► ఇక ఔత్సాహిక పారిశ్రామికవేత్తలనే కాకుండా, శాస్త్రవేత్తలు, ప్రొఫెషనల్స్, వివిధ రంగాల్లో అత్యంత ప్రతిభావంతులకు ఆహ్వానం పలుకుతోంది. -
ముందస్తు మద్యం
సాక్షి, అమరావతి బ్యూరో : సాధారణంగా ఎండాకాలంలో బీరుకు గిరాకీ ఉంటుంది. ఆ సమయంలో బీరు తయారీ సంస్థలు, డిపోలు దుకాణదారులకు సమృద్ధిగా సరఫరా చేయలేరు. ఈ డిమాండ్‌ను గుర్తించిన కొందరు వ్యాపారులు గతంలో అనధికారికంగా అధిక ధరలకు అమ్మిన సంఘటనలు ఉన్నాయి. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని మద్యం దుకాణదారులు ముందస్తు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి నెలలో బీరు అమ్మకాలు చాలా తక్కువ స్థాయిలో ఉంటాయి. డిపోలు, తయారీ సంస్థలు.. బీరు అమ్మకాలపై ఆయా నెలల్లో రాయితీలు ఇస్తుంటాయి. ఈ ఏడాది కూడా ఈ రాయితీలు ఇచ్చాయి. దీంతో అమ్మకాలు లేకున్నా భారీస్థాయిలో 3.02 లక్షల కేసుల బీరును ఫిబ్రవరి నెలలో మద్యం దుకాణదారులు కొనుగోలు చేశారు. దీంతో ప్రస్తుతం డిపోల్లో బీరు నిల్వలు అడుగంటాయి. బ్రాందీ, విస్కీ తదితర రకాల అమ్మకాలు కూడా పెరిగాయి. బ్రాందీ, విస్కీ కొంటేనే బీర్.. బీరు కావాలంటూ దుకాణదారుల నుంచి డిమాండ్ రావడంతో డిపోలు కొత్త నిబంధనలను తెరమీదకు తెచ్చినట్లు సమాచారం. ఇతర రకాలు కొనుగోలు చేస్తేనే బీరు ఇస్తామనడంతో మద్యం దుకాణదారుల బ్రాందీ, విస్కీ కేసులను కొనుగోలు చేశారు. గత ఏడాది ఫిబ్రవరి నెలలో 2.91 లక్షల కేసుల లిక్కర్‌ను కొనుగోలు చేయగా.. ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో 3.57 లక్షల కేసులు కొనుగోళ్లు జరిగాయి. ఇది గత ఏడాదితో పోలిస్తే 23 శాతం అధికంగా ఉండటం గమనార్హం. అలాగే బీర్లు అయితే గతేడాది ఫిబ్రవరిలో 1.79 లక్షల కేసుల కొనుగోలు చేయగా.. ఈ ఏడాది ఏకంగా 68 శాతం పెరిగి 3.02 లక్షల కేసులు కొనుగోలు చేయడం జరిగింది. ఫిబ్రవరిలో మద్యం కొనుగోళ్లు ఇలా.. నెల/ఏడాది మద్యం (ఐఎంఎల్) బీర్లు 02/2018 2,19,065 1,79,794 02/2019 3,57,520 3,02,065 బెల్టు షాపులదే హవా.. జిల్లాలో మద్యం దుకాణాలు 339, బార్ అండ్ రెస్టారెంట్లు 141, స్టార్ హోటళ్లు 18 ఉన్నాయి.మద్యం దుకాణాల్లో అమ్మే ప్రతి సీసాపై సమగ్ర వివరాలు ఉంటాయి. ముందస్తుగా భారీ స్థాయిలో కొనుగోళ్లు చేసి నిల్వ చేసిన మద్యం తర్వాత నెలలో అమ్మితే ఆబ్కారీశాఖ తనిఖీల్లో దొరికిపోయే అవకాశం ఉంటుంది. దీనిని గుర్తించి బెల్టు షాపుల్లో అమ్ముతున్నారు. కృష్ణా జిల్లా పరిధిలో చాలా మద్యం దుకాణాలకు అనుసంధానంగా బెల్టు షాపులు ఉన్నాయి. వీటిని అనుమతి పొందిన మద్యం దుకాణదారులే అనధికారికంగా నిర్వహిస్తున్నారు. వీటిల్లో ధర అధికంగా ఉండటంతోపాటు గడువు తీరిన, అదనపు పన్ను కట్టని మద్యం అమ్మకాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం జిల్లా పరిధిలో ఆబ్కారీశాఖలో సిబ్బంది కొరత తీవ్రంగా ఉంది. దీంతో గొలుసు దుకాణాలపై నిఘా పెట్టే పరిస్థితి లేదని తెలుస్తోంది. ప్రభుత్వ ఆదాయానికి భారీ గండి.. దుకాణాలు, బార్లు ప్రతి నెలా లక్ష్యానికి మించి జరిపే అమ్మకాలపై అదనంగా 20శాతం పన్ను కట్టాల్సి ఉంటుంది. అదనపు పన్ను కట్టి జరిపే అమ్మకాలపైనా మద్యం దుకాణదారులకు భారీ స్థాయిలోనే లాభం వస్తుంది. దీనికి సంతృప్తి చెందకుండా దుకాణదారులు ఇతర మార్గాల్లోను ఆదాయం ఆర్జించాలని చూస్తున్నారు. అదనపు పన్ను భారం నుంచి తప్పించుకునేందుకు అమ్మకాలు లేని నెలల్లో సైతం భారీస్థాయిలో కొనుగోళ్లు జరిపి.. మద్యం నిల్వలను పెట్టుకుంటున్నారు. ఆయా నెలల్లో 20 శాతం అదనపు పన్ను లేకుండా ఈ ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. అమ్మకాలపై నిఘా ఉంది.. జిల్లాలో చాలామంది దుకాణదారులు, బారుల యాజమాన్యాలు బీరును భారీస్థాయిలో కొనుగోలు చేస్తున్నట్లు తెలిసింది. దుకాణాలు చేసే క్రయ, విక్రయాలపై దృష్టిపెట్టాం. ఏ దుకాణదారుడు ఎంత కొనుగోలు చేస్తున్నాడు? దానిని ఎక్కడ నిల్వ ఉంచుతున్నాడు? రోజువారీ ఎంత అమ్మకాలు చేస్తున్నాడు? తదితర సమాచారంపై ఆకస్మిక దాడులు చేస్తాం. కొనుగోలు అమ్మకాల్లో వ్యత్యాసాలు ఉంటే కఠిన చర్యలు తీసుకుంటాం. బెల్టుషాపులపై నిఘా పెడతాం. –మురళీధర్, డీసీ, కృష్ణా జిల్లా -
ఎకానమీ మెరుగుపడితే...
న్యూఢిల్లీ: దేశ ఆర్థిక వ్యవస్థ మెరుగుపడిన తర్వాత ఆదాయ పన్ను పరంగా మరిన్ని రాయితీలు కల్పిస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తెలిపారు. గత ప్రభుత్వం అధిక పన్నుల విధానం అనుసరించడం వల్లే ద్రవ్యోల్బణం ఎగిసిందని చెప్పారు. తాము ఆ విధానాన్ని కొనసాగించాలని భావించడం లేదని శనివారం ఒక చానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. కింది స్థాయి నుంచి అధికాదాయ వర్గాల దాకా 3విభాగాల పన్ను చెల్లింపుదారులకు ఏకంగా రూ. 50,000 మేర ఊరటనిచ్చిన ఏకైక ప్రభుత్వం తమదేనన్నారు. ‘మా దగ్గర మరిన్ని నిధులు ఉంటే ఊరట చర్యలు కూడా మరిన్ని ప్రకటించి ఉండేవాళ్లం. ఒకవేళ రేపు ఎప్పుడైనా ప్రభుత్వం దగ్గర మరిన్ని నిధులు ఉంటే, ఆదాయ పన్నుపరమైన రాయితీలు మరింత పెంచుతాం’ అని చెప్పారు. పన్ను చెల్లింపుదారుల కొనుగోలు సామర్థ్యం పెరగడంతో పాటు పొదుపు చేసే అలవాటు పెరిగితే.. ఎకానమీ అధిక వృద్ధి సాధ్యపడుతుందన్నారు. రక్షణ రంగంలో 49 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను (ఎఫ్‌డీఐ) అనుమతించడాన్ని జైట్లీ సమర్థించుకున్నారు. దిగుమతుల మీద ఆధారపడటంతో పోలిస్తే విదేశీ నిధులు, టెక్నాలజీతో భారతీయుల ఆధీనంలోని దేశీ కంపెనీలు రక్షణ పరికరాలు తయారు చేయటం వైపే తాను మొగ్గు చూపుతానని చెప్పారు. సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ విగ్రహం ప్రాజెక్టుకు రూ. 200 కోట్ల కేటాయింపును కూడా సమర్థించుకున్నారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత రెండున్నరేళ్లలో ఏకంగా 550 రాజ్యాలను భారత్‌లో విలీనం చేసిన ఘనత పటేల్‌ది కాగా.. ఒక్కగానొక్క జమ్మూ కాశ్మీర్ వివాదాన్ని కూడా జవహర్లాల్ నెహ్రూ పరిష్కరించలేకపోయారని, ఇప్పుడు కూడా ఆ వివాదం కొనసాగుతూనే ఉందని.. నెహ్రూ-గాంధీ వారసులపై ఆయన పరోక్షంగా విమర్శలు గుప్పించారు. జీఎస్టీ అమలుపై స్పందిస్తూ.. రాష్ట్రాలకు ఉన్న అభ్యంతరాలను పరిష్కరించాక అమల్లోకి తెస్తామన్నారు. పీఎస్‌యూ బ్యాంకుల విలీనంపై దృష్టి: కాగా ప్రభుత్వ రంగ (పీఎస్‌యూ) బ్యాంకుల విలీనానికి సంబంధించి ఎదురవుతున్న సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం దృష్టి సారిస్తోందని ఆర్థిక సర్వీసుల విభాగం కార్యదర్శి జీఎస్ సంధూ చెప్పారు. ఈ ఏడాదిలోనే కొంత పురోగతి ఉంటుందన్నారు. దీని వల్ల బ్యాంకింగ్ రంగం మరింత పటిష్టమవుతుందని తెలిపారు.