ఎకానమీ మెరుగుపడితే...
న్యూఢిల్లీ: దేశ ఆర్థిక వ్యవస్థ మెరుగుపడిన తర్వాత ఆదాయ పన్ను పరంగా మరిన్ని రాయితీలు కల్పిస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తెలిపారు. గత ప్రభుత్వం అధిక పన్నుల విధానం అనుసరించడం వల్లే ద్రవ్యోల్బణం ఎగిసిందని చెప్పారు. తాము ఆ విధానాన్ని కొనసాగించాలని భావించడం లేదని శనివారం ఒక చానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. కింది స్థాయి నుంచి అధికాదాయ వర్గాల దాకా 3విభాగాల పన్ను చెల్లింపుదారులకు ఏకంగా రూ. 50,000 మేర ఊరటనిచ్చిన ఏకైక ప్రభుత్వం తమదేనన్నారు.
‘మా దగ్గర మరిన్ని నిధులు ఉంటే ఊరట చర్యలు కూడా మరిన్ని ప్రకటించి ఉండేవాళ్లం. ఒకవేళ రేపు ఎప్పుడైనా ప్రభుత్వం దగ్గర మరిన్ని నిధులు ఉంటే, ఆదాయ పన్నుపరమైన రాయితీలు మరింత పెంచుతాం’ అని చెప్పారు. పన్ను చెల్లింపుదారుల కొనుగోలు సామర్థ్యం పెరగడంతో పాటు పొదుపు చేసే అలవాటు పెరిగితే.. ఎకానమీ అధిక వృద్ధి సాధ్యపడుతుందన్నారు. రక్షణ రంగంలో 49 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను (ఎఫ్‌డీఐ) అనుమతించడాన్ని జైట్లీ సమర్థించుకున్నారు.
దిగుమతుల మీద ఆధారపడటంతో పోలిస్తే విదేశీ నిధులు, టెక్నాలజీతో భారతీయుల ఆధీనంలోని దేశీ కంపెనీలు రక్షణ పరికరాలు తయారు చేయటం వైపే తాను మొగ్గు చూపుతానని చెప్పారు. సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ విగ్రహం ప్రాజెక్టుకు రూ. 200 కోట్ల కేటాయింపును కూడా సమర్థించుకున్నారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత రెండున్నరేళ్లలో ఏకంగా 550 రాజ్యాలను భారత్‌లో విలీనం చేసిన ఘనత పటేల్‌ది కాగా.. ఒక్కగానొక్క జమ్మూ కాశ్మీర్ వివాదాన్ని కూడా జవహర్‌లాల్ నెహ్రూ పరిష్కరించలేకపోయారని, ఇప్పుడు కూడా ఆ వివాదం కొనసాగుతూనే ఉందని..
నెహ్రూ-గాంధీ వారసులపై ఆయన పరోక్షంగా విమర్శలు గుప్పించారు. జీఎస్‌టీ అమలుపై స్పందిస్తూ.. రాష్ట్రాలకు ఉన్న అభ్యంతరాలను పరిష్కరించాక అమల్లోకి తెస్తామన్నారు.
పీఎస్‌యూ బ్యాంకుల విలీనంపై దృష్టి: కాగా ప్రభుత్వ రంగ (పీఎస్‌యూ) బ్యాంకుల విలీనానికి సంబంధించి ఎదురవుతున్న సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం దృష్టి సారిస్తోందని ఆర్థిక సర్వీసుల విభాగం కార్యదర్శి జీఎస్ సంధూ చెప్పారు. ఈ ఏడాదిలోనే కొంత పురోగతి ఉంటుందన్నారు. దీని వల్ల బ్యాంకింగ్ రంగం మరింత పటిష్టమవుతుందని తెలిపారు.