విజయవాడలోని ఓ దుకాణంలో బీరు కేసులు
సాక్షి, అమరావతి బ్యూరో : సాధారణంగా ఎండాకాలంలో బీరుకు గిరాకీ ఉంటుంది. ఆ సమయంలో బీరు తయారీ సంస్థలు, డిపోలు దుకాణదారులకు సమృద్ధిగా సరఫరా చేయలేరు. ఈ డిమాండ్‌ను గుర్తించిన కొందరు వ్యాపారులు గతంలో అనధికారికంగా అధిక ధరలకు అమ్మిన సంఘటనలు ఉన్నాయి. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని మద్యం దుకాణదారులు ముందస్తు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి నెలలో బీరు అమ్మకాలు చాలా తక్కువ స్థాయిలో ఉంటాయి. డిపోలు, తయారీ సంస్థలు.. బీరు అమ్మకాలపై ఆయా నెలల్లో రాయితీలు ఇస్తుంటాయి. ఈ ఏడాది కూడా ఈ రాయితీలు ఇచ్చాయి. దీంతో అమ్మకాలు లేకున్నా భారీస్థాయిలో 3.02 లక్షల కేసుల బీరును ఫిబ్రవరి నెలలో మద్యం దుకాణదారులు కొనుగోలు చేశారు. దీంతో ప్రస్తుతం డిపోల్లో బీరు నిల్వలు అడుగంటాయి. బ్రాందీ, విస్కీ తదితర రకాల అమ్మకాలు కూడా పెరిగాయి.
బ్రాందీ, విస్కీ కొంటేనే బీర్..
బీరు కావాలంటూ దుకాణదారుల నుంచి డిమాండ్ రావడంతో డిపోలు కొత్త నిబంధనలను తెరమీదకు తెచ్చినట్లు సమాచారం. ఇతర రకాలు కొనుగోలు చేస్తేనే బీరు ఇస్తామనడంతో మద్యం దుకాణదారుల బ్రాందీ, విస్కీ కేసులను కొనుగోలు చేశారు. గత ఏడాది ఫిబ్రవరి నెలలో 2.91 లక్షల కేసుల లిక్కర్‌ను కొనుగోలు చేయగా.. ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో 3.57 లక్షల కేసులు కొనుగోళ్లు జరిగాయి. ఇది గత ఏడాదితో పోలిస్తే 23 శాతం అధికంగా ఉండటం గమనార్హం. అలాగే బీర్లు అయితే గతేడాది ఫిబ్రవరిలో 1.79 లక్షల కేసుల కొనుగోలు చేయగా.. ఈ ఏడాది ఏకంగా 68 శాతం పెరిగి 3.02 లక్షల కేసులు కొనుగోలు చేయడం జరిగింది.
ఫిబ్రవరిలో మద్యం కొనుగోళ్లు ఇలా..
నెల/ఏడాది | మద్యం (ఐఎంఎల్) | బీర్లు |
02/2018 |
2,19,065 |
1,79,794 |
02/2019 |
3,57,520 |
3,02,065 |
బెల్టు షాపులదే హవా..
జిల్లాలో మద్యం దుకాణాలు 339, బార్ అండ్ రెస్టారెంట్లు 141, స్టార్ హోటళ్లు 18 ఉన్నాయి.మద్యం దుకాణాల్లో అమ్మే ప్రతి సీసాపై సమగ్ర వివరాలు ఉంటాయి. ముందస్తుగా భారీ స్థాయిలో కొనుగోళ్లు చేసి నిల్వ చేసిన మద్యం తర్వాత నెలలో అమ్మితే ఆబ్కారీశాఖ తనిఖీల్లో దొరికిపోయే అవకాశం ఉంటుంది. దీనిని గుర్తించి బెల్టు షాపుల్లో అమ్ముతున్నారు. కృష్ణా జిల్లా పరిధిలో చాలా మద్యం దుకాణాలకు అనుసంధానంగా బెల్టు షాపులు ఉన్నాయి. వీటిని అనుమతి పొందిన మద్యం దుకాణదారులే అనధికారికంగా నిర్వహిస్తున్నారు. వీటిల్లో ధర అధికంగా ఉండటంతోపాటు గడువు తీరిన, అదనపు పన్ను కట్టని మద్యం అమ్మకాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం జిల్లా పరిధిలో ఆబ్కారీశాఖలో సిబ్బంది కొరత తీవ్రంగా ఉంది. దీంతో గొలుసు దుకాణాలపై నిఘా పెట్టే పరిస్థితి లేదని తెలుస్తోంది.
ప్రభుత్వ ఆదాయానికి భారీ గండి..
దుకాణాలు, బార్‌లు ప్రతి నెలా లక్ష్యానికి మించి జరిపే అమ్మకాలపై అదనంగా 20శాతం పన్ను కట్టాల్సి ఉంటుంది. అదనపు పన్ను కట్టి జరిపే అమ్మకాలపైనా మద్యం దుకాణదారులకు భారీ స్థాయిలోనే లాభం వస్తుంది. దీనికి సంతృప్తి చెందకుండా దుకాణదారులు ఇతర మార్గాల్లోను ఆదాయం ఆర్జించాలని చూస్తున్నారు. అదనపు పన్ను భారం నుంచి తప్పించుకునేందుకు అమ్మకాలు లేని నెలల్లో సైతం భారీస్థాయిలో కొనుగోళ్లు జరిపి.. మద్యం నిల్వలను పెట్టుకుంటున్నారు. ఆయా నెలల్లో 20 శాతం అదనపు పన్ను లేకుండా ఈ ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది.
అమ్మకాలపై నిఘా ఉంది..
జిల్లాలో చాలామంది దుకాణదారులు, బారుల యాజమాన్యాలు బీరును భారీస్థాయిలో కొనుగోలు చేస్తున్నట్లు తెలిసింది. దుకాణాలు చేసే క్రయ, విక్రయాలపై దృష్టిపెట్టాం. ఏ దుకాణదారుడు ఎంత కొనుగోలు చేస్తున్నాడు? దానిని ఎక్కడ నిల్వ ఉంచుతున్నాడు? రోజువారీ ఎంత అమ్మకాలు చేస్తున్నాడు? తదితర సమాచారంపై ఆకస్మిక దాడులు చేస్తాం. కొనుగోలు అమ్మకాల్లో వ్యత్యాసాలు ఉంటే కఠిన చర్యలు తీసుకుంటాం. బెల్టుషాపులపై నిఘా పెడతాం.
–మురళీధర్, డీసీ, కృష్ణా జిల్లా
Comments
Please login to add a commentAdd a comment