ధనవంతులూ వలసబాట UAE is first destination for emigrating investors | Sakshi
Sakshi News home page

ధనవంతులూ వలసబాట

Published Mon, Nov 21 2022 5:21 AM

UAE is first destination for emigrating investors - Sakshi

(ఎం. విశ్వనాథరెడ్డి, సాక్షి ప్రతినిధి): పొట్ట చేతబట్టుకుని బతుకుదెరువు వెతుక్కుంటూ పేదలు వలస వెళ్లడం మనం ఎప్పుడూ చూసేదే. వ్యాపార అవకాశాలను, సౌకర్యాలను, పన్ను రాయితీలను వెతుక్కుంటూ కోటీశ్వరులు కూడా వలసబాట పట్టడం కూడా ఎప్పుడూ ఉన్నదే. సాధారణంగా పేదలు దేశంలోనే ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతానికి వలస వెళ్తారు. ధనవంతులు అందుకు భిన్నంగా వ్యాపార అవకాశాలు పుష్కలంగా ఉన్న దేశాలకు వెళ్తారు. కానీ, పత్రికల్లో పేదల వలసలే పతాక శీర్షికలవుతాయి.

పెద్దల వలసల గురించి వార్తలు పెద్దగా కనిపించవు. కరోనా మహమ్మారి విసిరిన సవాళ్లకు బెదిరి.. మన దేశంలో కోట్ల మంది పేదలు వలసబాట పట్టారు. కానీ, కోటీశ్వరులు మాత్రం కరోనా సమయంలో వలస బాటపట్టలేదు. ఉన్న దేశం నుంచి కదల్లేదు. కరోనా శాంతించిన వెంటనే అవకాశాలు వెతుక్కుంటూ రెట్టింపు సంఖ్యలో ప్రపంచవ్యాప్తంగా తమకు అనుకూలంగా ఉన్న దేశాలకు వలస వెళ్లడం ప్రారంభించారు. 2022లో 88వేల మంది హై నెట్‌వర్త్‌ ఇండివిడ్యువల్స్‌ (10 లక్షల డాలర్ల సంపద కలిగి ఉన్న వ్యక్తులు) తమ మాతృదేశాన్ని వదిలి మరో దేశానికి వలస వెళ్తారని ‘హెన్లీ గ్లోబల్‌ సిటిజన్‌ రిపోర్ట్‌’ అంచనా వేసింది.

ధనవంతుల వలసలు పెరుగుతాయే తప్ప కనుచూపు మేరలో తగ్గే అవకాశంలేదని చెప్పింది. ధనవంతులంతా ఏ దేశం నుంచి ఏ దేశం వెళ్తున్నారనే విషయం ఆసక్తికరం. యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (యూఏఈ) ఎక్కువమందిని ఆకర్షిస్తోంది. ఆ దేశం అనుసరిస్తున్న టైలర్‌మేడ్‌ వలస విధానాలు ప్రపంచవ్యాప్తంగా ప్రతిభావంతులను, ధనవంతులను ఆకర్షించడానికి కారణంగా నిలుస్తున్నాయి.

రెండోస్థానంలో ఉన్న ఆస్ట్రేలియాలో చౌకగా వైద్యం అందుబాటులో ఉండటం, వారసత్వ పన్ను లేకపోవడం, మంచి ఆర్థికవ్యవస్థ కావడం.. ధనవంతులను ఆకర్షిస్తున్న కారణాలని నిపుణులు చెబుతున్నారు. గత రెండు దశాబ్దాల్లో వివిధ దేశాల నుంచి 80 వేల మంది కోటీశ్వరులు ఆస్ట్రేలియాకు వలస వెళ్లారని నివేదిక పేర్కొంది.

రష్యా, ఉక్రెయిన్‌ నుంచి అధికంగా.. 
ఇక రష్యా, ఉక్రెయిన్‌ యుద్ధం వల్ల ఆ రెండు దేశాల నుంచి కోటీశ్వరులు పెద్ద సంఖ్యలో వలస వెళ్తున్నారు. ఉక్రెయిన్‌లోని కోటీశ్వరుల్లో 42 శాతం మంది వలస బాట పడతారని అంచనా వేస్తున్నారు. అలాగే, రష్యాలో 15 శాతం మంది కోటీశ్వరులు దేశం విడిచిపెట్టి వెళ్తారని అంచనా. మిగతా అన్ని దేశాలు రెండు శాతం, అంతకంటే తక్కువ మంది కోటీశ్వరులు వలస వెళ్లొచ్చని భావిస్తున్నారు. భారత్‌ నుంచి వలస వెళ్తారని అంచనా వేస్తున్న 8 వేల మంది, దేశంలోని మొత్తం కోటీశ్వరుల్లో 2 శాతం అని నివేదిక పేర్కొంది.  

ధనవంతులను ఆకర్షిస్తున్న యూఏఈ 
యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ ప్రపంచంలోని అన్ని దేశాల ధనవంతులను ఆకర్షిస్తోంది. దీని కోసం..

► వీసా నిబంధనలను సరళతరం చేసింది.  
► 5.44 లక్షల యూఎస్‌ డాలర్ల విలువైన ఆస్తి కొనుగోలు చేసే వారికి 10 సంవత్సరాల గోల్డెన్‌ వీసా ఇస్తున్నారు.  
► 2.72 లక్షల డాలర్లు యూఏసీ స్టార్టప్‌ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టేవారికీ గోల్డెన్‌ వీసాకు అర్హత ఉంటుంది.  
► ప్రపంచంలో ఎక్కడైనా తమ స్టార్టప్‌ కంపెనీని 1.9 మిలియన్‌ డాలర్లకు 
విక్రయించిన వారికి కూడా గోల్డెన్‌ వీసా తీసుకోవడానికి అర్హత కల్పిస్తూ యూఏఈ నిబంధనలను సడలించింది. 

► కంపెనీలు ఏర్పాటు చేసుకోవడానికే కాకుండా, ప్రతిభావంతులైన సిబ్బందిని ప్రపంచం నలుమూలల నుంచి తెచ్చుకోవడానికి కూడా యూఏఈ అవకాశం కల్పిస్తోంది.  
► ఇక ఔత్సాహిక పారిశ్రామికవేత్తలనే కాకుండా, శాస్త్రవేత్తలు, ప్రొఫెషనల్స్, వివిధ రంగాల్లో అత్యంత ప్రతిభావంతులకు ఆహ్వానం పలుకుతోంది.  

Advertisement
 
Advertisement

తప్పక చదవండి

 
Advertisement