ఇన్వెస్టెర్రర్ 2.0
విదేశీ ఇన్వెస్టర్లకు పన్ను విషయంలో ఊరట లభించగలదన్న అంచనాలు ఆవిరవ్వడంతో శుక్రవారం స్టాక్ మార్కెట్ భారీగా నష్టపోయింది. బీఎస్ఈ సెన్సెక్స్ 38,500 పాయింట్లు, ఎన్ఎస్ఈ నిఫ్టీ 11,500 పాయింట్ల దిగువకు పతనమయ్యాయి. అంతంతమాత్రంగానే ఉన్న కంపెనీల ఆర్థిక ఫలితాలు, వినియోగం మందగించడం, నైరుతి రుతు పవనాల విస్తరణ ఆశించిన స్థాయిలో లేకపోవడం ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. వరుసగా మూడు రోజుల పాటు నష్టపోతూ వచ్చిన డాలర్‌తో రూపాయి మారకం విలువ పుంజుకున్నా, అమెరికా ఫెడరల్ రిజర్వ్ రేట్ల కోత విషయమై సానుకూల సంకేతాలివ్వడంతో ప్రపంచ మార్కెట్లు పెరిగినా, మన మార్కెట్ పతన బాటలోనే పయనించింది.
బీఎస్ఈ సెన్సెక్స్ 560 పాయింట్లు పతనమై 38,337 పాయింట్ల వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ 178 పాయింట్లు నష్టపోయి 11,419 పాయింట్ల వద్ద ముగిశాయి. ఈ ఏడాది సెన్సెక్స్, నిఫ్టీలకు ఇవే రెండో అత్యధిక రోజువారీ నష్టాలు. ఈ రెండు సూచీలు రెండు నెలల కనిష్టానికి పడిపోయాయి. బడ్జెట్ రోజు సెన్సెక్స్ ఈ ఏడాదిలో అత్యధికంగా 793 పాయింట్లు నష్టపోయింది. విద్యుత్తు, కన్సూమర్ డ్యూరబుల్స్ సూచీలు మినహా మిగిలిన అన్ని బీఎస్ఈ రంగాల సూచీలు క్షీణించాయి. వాహన, బ్యాంకింగ్ రంగ షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తాయి. ఇక వారం పరంగా చూస్తే, సెన్సెక్స్ 399 పాయింట్లు, నిఫ్టీ 133 పాయింట్లు చొప్పున నష్టపోయాయి.
లాభాల్లో ఆరంభమైనా...
ఈ నెలాఖరులో జరిగే సమావేశంలో అమెరికా ఫెడరల్ రిజర్వ్ అంచనాలను మించి రేట్లను తగ్గించే అవకాశాలున్నాయని ఫెడరల్ రిజర్వ్ కీలక అధికారి ఒకరు వ్యాఖ్యానించడంతో ఆసియా మార్కెట్లు జోరుగా పెరిగాయి. ఈ దన్నుతో మన మార్కెట్ కూడా మంచి లాభాలతో ఆరంభమైంది. అయితే ఆ తర్వాత వెంటనే సెన్సెక్స్, నిఫ్టీలు నష్టాల్లోకి జారిపోయాయి. ఒక దశలో 161 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్, మరో దశలో 626 పాయింట్లు పతనమైంది. మొత్తం మీద రోజంతా 787 పాయింట్ల రేంజ్లో కదలాడింది. ఇక నిఫ్టీ ఇంట్రాడేలో 43 పాయింట్లు పెరిగి, ఆ తర్వాత 198 పాయింట్లు పతనమైంది. ఆసియా, యూరప్ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. డాలర్‌తో రూపాయి మారకం 5 పైసలు లాభపడి 68.92 వద్ద ముగిసింది. ఇక ముడిచమురు ధరలు 1.7 శాతం ఎగిశాయి.
మరిన్ని విశేషాలు....
► మొత్తం 31 సెన్సెక్స్ షేర్లలో నాలుగు షేర్లు–ఎన్టీపీసీ, పవర్‌గ్రిడ్, టీసీఎస్, ఓఎన్జీసీలు మాత్రమే లాభపడ్డాయి. మిగిలిన 27 షేర్లు నష్టాల్లో ముగిశాయి.
► 500కు పైగా షేర్లు ఏడాది కనిష్ట స్థాయిలకు పడిపోయాయి. మారుతీ సుజుకీ, యస్ బ్యాంక్, గెయిల్ ఇండియా, మహీంద్రా, ఐషర్ మోటార్స్, అరబిందో ఫార్మా, ఫోర్స్ మోటార్స్, వొడాఫోన్ ఐడియా తదితర షేర్లు ఈ జాబితాలో ఉన్నాయి.
► స్టాక్ మార్కెట్ భారీగా నష్టపోయినా, హెచ్డీఎఫ్సీ ఏఎమ్‌సీ షేర్ ఆల్‌టైమ్ హై, 2,370ను తాకింది. చివరకు 7%(రూ.147)లాభంతో రూ.2,317 వద్ద ముగిసింది. కంపెనీ ఆర్థిక ఫలితాలు బాగా ఉండటంతో గత నాలుగు రోజుల్లో ఈ షేర్ 20 శాతానికి పైగా ఎగసింది.
పతనానికి కారణాలు
► పన్ను విషయమై తగ్గేది లేదు...
సంపన్నులపై విధించిన పన్ను(విదేశీ ఇన్వెస్టర్లకు ఈ పన్ను వర్తిస్తుంది) కారణంగా విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు తరలిపోతాయనే వాదనను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కొట్టిపడేశారు. గురువారం ఆర్థిక బిల్లుపై చర్చ సందర్భంగా ఆమె ఈ పన్ను విషయమై పునరాలోచన లేదని తెగేసి చెప్పారు. ఎఫ్‌పీఐలు కంపెనీగా వ్యవహరిస్తే, ఈ పన్ను పోటు ఉండదని ఆమె పేర్కొన్నారు. ఎఫ్‌పీఐలకు పన్ను విషయంలో ఊరట లభించకపోవడంతో అమ్మకాలు వెల్లువెత్తాయి.
► అమ్మకాల్లో తగ్గని ఎఫ్‌పీఐలు
ఆర్థిక ఫలితాలు అంతంతమాత్రంగానే ఉండటం, పన్ను పోటు కారణంగా విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాల విషయంలో వెనక్కి తగ్గడం లేదు. శుక్రవారంతో కలుపుకొని వరుసగా 14వ రోజూ నికర అమ్మకాలు జరిపారు. ఒక్క గురువారం రోజే రూ.1,405 కోట్ల విలువైన షేర్లను అమ్మేశారు. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి జూన్ వరకూ నికర కొనుగోళ్లు జరిపిన ఎఫ్‌పీఐలు ఈ నెలలో ఇప్పటిదాకా రూ.7,000 కోట్ల మేర విక్రయాలు జరిపారు.
► జోష్‌నివ్వని ఆర్థిక ఫలితాలు...
ఇప్పటివరకూ వెల్లడైన కంపెనీల ఆర్థిక ఫలితాలు ఇన్వెస్టర్లలో జోష్ని నింపలేకపోయాయి. ఒక్క ఇన్ఫోసిస్, ఇండస్ఇండ్ బ్యాంక్ మినహా ఇతర కంపెనీల ఫలితాలు అంతంతమాత్రంగానే ఉన్నాయి. యస్‌బ్యాంక్, ఫెడరల్ బ్యాంక్, మైండ్‌ట్రీ, విప్రో, డీసీబీ బ్యాంక్ ఫలితాలు నిరాశపరిచాయి. ఫలితాలు ఓ మోస్తరుగా ఉంటాయన్న అంచనాలను కూడా కొన్ని కంపెనీలు అందుకోలేకపోవడం ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను దెబ్బతీస్తోంది.
► వర్షాలు.. అంతంతే....
ఈసారి నైరుతి రుతుపవనాలు నిరాశపరిచాయి. సాధారణ వర్షపాతం కంటే 16 శాతం తక్కువగా వర్షాలు కురవడంతో వర్షాధార వ్యవసాయ దేశమైన మన దేశంలో ఆర్థిక పరిస్థితులు అంతంతమాత్రంగానే ఉండగలవన్న ఆందోళన నెలకొన్నది.
► జీడీపీ అంచనాలు తగ్గించిన ఏడీబీ
భారత దేశ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జీడీపీ అంచనాలను ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ తగ్గించడం ప్రతికూల ప్రభావం చూపించింది.
2 రోజుల్లో రూ. 3.79 లక్షల కోట్లు ఆవిరి
గత రెండు రోజుల నష్టాల కారణంగా ఇన్వెస్టర్ల సంపద రూ.3.79 లక్షల కోట్లు ఆవిరైంది. ఇన్వెస్టర్ల సంపదగా పరిగణించే బీఎస్ఈలో లిస్డైన మొత్తం కంపెనీల మార్కెట్ క్యాప్ విలువ రూ.3.79 లక్షల కోట్లు హరించుకుపోయి రూ.145.35 లక్షల కోట్లకు పడిపోయింది.
శుభవార్తల కోసం మన స్టాక్ మార్కెట్ మొహం వాచిపోయి ఉంది. కంపెనీల డిఫాల్ట్‌లు కొనసాగుతుండటం, పన్నులు అధికంగా ఉండటం, కంపెనీల ఆర్థిక ఫలితాలు బలహీనంగా ఉండటం, ఆర్థిక వ్యవస్థ అంతంతమాత్రంగానే ఉండటం.. ఇవన్నీ ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌పై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి.
– జగన్నాథమ్ తునుగుంట్ల, సెంట్రమ్ బ్రోకింగ్ అనలిస్ట్