Teacher Course
-
ఎడ్‌సెట్‌లో మహిళల హవా
సాక్షి, హైదరాబాద్: ఉపాధ్యాయ కోర్సుల్లో ప్రవేశానికి సంబంధించిన ఎడ్‌సెట్‌లో 98.53 శాతం మంది అర్హత సాధించారు. వీరిలో మహిళలే ఎక్కువగా ఉన్నారు. ఉస్మానియా వర్సిటీ గత నెలలో ఎడ్‌సెట్ నిర్వహించింది. ఈ పరీక్ష ఫలితాలను ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్. లింబాద్రి శుక్రవారం విడుదల చేశారు. ఎడ్‌సెట్‌కు 42,399 మంది దరఖాస్తు చేసుకోగా, 34,185 మంది పరీక్షకు హాజరయ్యారు. వీరిలో 33,683 మంది అర్హత సాధించారు. పురుషులు 7,737 మంది పరీక్ష రాస్తే, 7,700 మంది అర్హత సాధించారు. మహిళలు 26,448 మంది రాస్తే 25,983 మంది ఎడ్‌సెట్ అర్హత పొందారు. గతేడాదితో 70 శాతం అర్హత సాధిస్తే... ఈసారి 98.53 శాతం ఉత్తీర్ణత నమోదైందని ఎడ్‌సెట్ కన్వీనర్ రామ కృష్ణ తెలిపారు. -
భార్య కోసం.. బైక్‌పై 1000 కిమీ
రాంచీ: భార్య తనకంటే విద్యాధికురాలు అయితే చాలా మంది మగవారికి నచ్చదు. ఇక పెళ్లాయ్యాక ఆడవారికి చదువుకునే వెసులుబాటు కల్పించే భర్తలు చాలా అరుదుగా ఉంటారు. ఈ నేపథ్యంలో పదో తరగతితోనే చదువు ఆపేసి.. వంట మనిషిగా పని చేస్తోన్న ఓ వ్యక్తి.. టీచర్ కావాలన్న తన భార్య కలను నెరవేర్చడం కోసం సుమారు 1000 కిలోమీటర్లు బైక్ మీద ప్రయాణం చేసిన అరుదైన ఘటన ప్రస్తుతం తెగ వైరలవుతోంది. వివారాలు.. జార్ఖండ్ గొడ్డా ప్రాంతానికి చెందిన ధనంజయ్ కుమార్ పదవ తరగతి పాస్ అవుట్. తర్వాత వంట మనిషిగా పని చేస్తున్నాడు. ధనంజయ్ భార్య సోని హెంబ్రామ్‌కు టీచర్ కావాలని ఆశ. ఇందుకు గాను మధ్యప్రదేశ్ బోర్డు అందించే ప్రాథమిక విద్య డిప్లోమా కోర్సులో చేరింది. ప్రస్తుతం సెకండియర్ చదువుతోంది. పరీక్షలు జరగుతున్నాయి. ఎగ్జామ్ సెంటర్ మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్. గొడ్డా నుంచి పరీక్ష కేంద్రానికి మధ్య దూరం 1100 కిలోమీటర్లు. గూగుల్ మ్యాప్, కొన్ని షార్ట్‌కట్ మార్గాల వల్ల దూరం 1000 కిలోమీటర్లకు తగ్గింది. (చదవండి: క్లాస్ టీచర్) దాంతో పరీక్ష కేంద్రానికి చేరుకోవడం కోసం మూడు రోజుల పాటు బైక్ మీద 1000 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేశారు ఈ దంపతులు. ఈ సందర్భంగా ధనంజయ్ మాట్లాడుతూ.. ‘నా భార్య 2019లో మధ్యప్రదేశ్‌లో టీచర్ కోర్సులో చేరింది. జార్ఖండ్‌లో ఫీజు చాలా ఎక్కువగా ఉండటంతో ఇలా చేసింది. దాంతో తనకు గ్వాలియర్‌లో ఎగ్జామ్ సెంటర్ పడింది. అక్కడికి చేరుకోవడానికి ప్రస్తుతం రైళ్లు అందుబాటులో లేవు. సోని టీచర్ ఒకరు విద్యార్థులను గొడ్డా నుంచి గ్వాలియర్ తీసుకెళ్లడానికి కారు మాట్లాడారు. కానీ 30 వేల రూపాయలు చెల్లించాలని చెప్పారు. గత నాలుగు నెలలుగా నాకు ఉద్యోగం లేదు. దాంతో బైక్ మీద వెళ్లాలని నిర్ణయించుకున్నాం. ప్రస్తుతం నా భార్య ఆరోనెల గర్భవతి. ఆగస్టు 27 రాత్రి మా ప్రయాణం ప్రారంభమయ్యింది. బిహార్, లక్నోలోని ముజఫర్‌పూర్ మీదుగా ప్రయాణించి ఆగస్టు 30 సాయంత్రం గ్వాలియర్ చేరుకున్నాం. బంధువుల దగ్గర నుంచి 10 వేలు బదులు తీసుకుని పరీక్షకు వెళ్లడానికి బయలుదేరాం’ అని తెలిపాడు ధనంజయ్. (చదవండి: పంతులమ్మ ఆదాయం : అధికారులకు షాక్) గ్వాలియర్‌లోని డీడీ నగర్ ప్రాంతంలో ఉండటానికి వారు 1,500 రూపాయలతో గది అద్దెకు తీసుకున్నారు. ధనంజయ్ మాట్లాడుతూ.. ‘మేము ఇప్పటికే 7,000 రూపాయలు ఖర్చు చేసాము. ఇప్పుడు 3 వేల రూపాయలు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఆరు నెలల గర్భవతి అయిన నా భార్య అనారోగ్యంతో బాధపడుతున్నంది. ఇప్పుడు, నేను తిరిగి వెళ్ళడానికి అవసరమయిన డబ్బు ఏర్పాటు చేయడానికి ప్రయత్నిస్తున్నాను’ అని తెలిపాడు. -
టీచర్ ‘చదువులకు’ వెనకాడుతున్నారు
2012లో ఉమ్మడి రాష్ట్రంలో టీచర్ నియామకాలను చేపట్టిన ప్రభుత్వం ఐదేళ్ల తరువాత 2017లో చర్యలు తీసుకుంది. భర్తీ ఇంకా పూర్తి కాలేదు. భర్తీలో జాప్యం, ప్రైవేట్‌లో వచ్చే వేతనాలు తక్కువగా ఉండటం టీచర్ కోర్సులపై ప్రభావం చూపుతోంది. సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో ఉపాధ్యాయ విద్యా కోర్సులకు డిమాండ్ తగ్గిపోతోంది. విద్యారంగంలో ఉద్యోగ అవకాశాలు తగ్గిపోవడం, ప్రైవేటు విద్యా సంస్థల్లో ఇచ్చేవేతనాలు చాలక ఉపాధ్యాయ విద్యను అభ్యసించేందుకు విద్యార్థులు వెనుకంజ వేస్తున్నారు. గతంలో టీచర్ కావాలన్న ఆశతో భారీ ఎత్తున ఉపా ధ్యాయ కోర్సులను అభ్యసించగా క్రమంగా డిప్లొమా ఇన్ ఎలి మెంటరీ ఎడ్యు కేషన్ (డీఎడ్), బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ (బీఎడ్) వంటి కోర్సుల్లో చేరేందుకు విద్యార్థులు వెనుకాడుతున్నారు. ఈ ఐదేళ్లలో ఆయా కోర్సుల్లో చేరే విద్యార్థుల సంఖ్య బాగా తగ్గిపోయింది. డీఎడ్‌లో గతంలో 11 వేలకుపైగా విద్యార్థులు చేరితే ఇప్పుడు ఆ సంఖ్య 5 వేలకు పడిపోయింది. అలాగే బీఎడ్‌లోనూ గతంలో 16 వేల మందికిపైగా విద్యార్థులు చేరితే వారి సంఖ్య 12 వేలకు తగ్గిపోయింది. దీంతో ఈ సంవత్సరంలో పదుల సంఖ్యలో విద్యాసంస్థలు మూతపడ్డాయి. తగ్గిపోయిన అవకాశాలు.. ఉపాధ్యాయ విద్యలో 2010 నుంచి ప్రభుత్వ, ప్రైవేటు రంగంలో ఉద్యోగ అవకాశాలు తగ్గిపోయాయి. ఓవైపు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య ఏటేటా తగ్గిపోతోంది. దీంతో ఆ ప్రభావం నియామకాలపైనా పడుతోంది. ఫలితంగా 2012లో ఉమ్మడి రాష్ట్రంలో ఉపాధ్యాయ నియామకాలను చేపట్టిన ప్రభుత్వం ఐదేళ్ల తరువాత 2017లో ఉపాధ్యాయ నియామకాలకు చర్యలు చేపట్టింది. ఆ నోటిఫికేషన్ ద్వారా 8,972 పోస్టులను భర్తీ చేస్తోంది. ఆ ప్రక్రియ ఇంకా పూర్తి కావాల్సి ఉంది. మళ్లీ ఎప్పుడు నోటిఫికేషన్ వస్తుందో తెలియని పరిస్థితి నెలకొంది. ప్రైవేటు రంగంలో ఇచ్చే వేతనాలు తక్కువగా ఉంటుండటంతో ప్రైవేటు స్కూళ్లలో ఉద్యోగాలు చేసేందుకు అభ్యర్థులు ఆసక్తి చూపడం లేదు. డీఎడ్‌కు భారీ దెబ్బ... బీఎడ్‌లో చేరే విద్యార్థుల సంఖ్యతో పోల్చితే డీఎడ్‌లో చేరే విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గిపోతోంది. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాలు అభ్యర్థులను గందరగోళంలో పడేస్తున్నాయి. ఒకప్పుడు డీఎడ్‌తోపాటు బీఎడ్ చేసిన వారు కూడా సెకండరీ గ్రేడ్ టీచర్ (ఎస్జీటీ) పోస్టులకు అర్హులే. అయితే 2010లో కొత్త నిబంధనల ప్రకారం బీఎడ్ చేసిన వారు కేవలం స్కూల్ అసిస్టెంట్‌గానే వెళ్లాలని, ఎస్జీటీ పోస్టులకు అనర్హులని జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి (ఎన్సీటీఈ) నిబంధనలు తీసుకువచ్చింది. దీంతో అప్పటి నుంచి బీఎడ్‌కు డిమాండ్ తగ్గిపోతూ వచ్చింది. అయితే గతేడాది సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కేంద్రం మరో నిబంధనను అమల్లోకి తెచ్చింది. బీఎడ్ చేసిన వారు ఉద్యోగం వచ్చాక చైల్డ్ సైకాలజీలో ఆరు నెలల ఇండక్షన్ ట్రైనింగ్ చేస్తే సరిపోతుందని పేర్కొంది. దీంతో డీఎడ్‌లో చేరే వారి సంఖ్య మరింతగా తగ్గిపోయింది. పైగా ఇంటర్ తరువాత రెండేళ్ల డీఎడ్ చేసేందుకు ఎవరూ ఇష్టపడటం లేదు. డిగ్రీ పూర్తయ్యాక ఉపాధ్యాయ వృత్తిలోకి రావాలనుకుంటే బీఎడ్ చేయవచ్చన్న ఆలోచన విద్యార్థుల్లో పెరిగిపోయింది. ఒకవేళ డీఎడ్ రెండేళ్లు చేసినా స్కూల్ అసిస్టెంట్ కావాలంటే మళ్లీ మూడేళ్లు డిగ్రీ చేయాలి. దాంతోపాటు మరో రెండేళ్లు బీఎడ్ చేయాల్సి వస్తోంది. వాటి కంటే ఇంటర్ తరువాత డిగ్రీ పూర్తి చేసి ఆ తరువాత బీఎడ్ చేస్తే సరిపోతుందన్న ఆలోచనలకు విద్యార్థులు వస్తున్నారు. దీంతో డీఎడ్వైపు పెద్దగా ఆసక్తి కనబరచడంలేదు. మూసివేతకు యాజమాన్యాల దరఖాస్తులు... రాష్ట్రంలో బీఎడ్, డీఎడ్ కాలేజీలను నడుపలేమంటూ యాజమాన్యాలు చేతులెత్తేస్తున్నాయి. గత ఐదేళ్లలో బీఎడ్, డీఎడ్ కాలేజీల సంఖ్య తగ్గిపోయింది. 2015–16 విద్యా సంవత్సరంలో రాష్ట్రంలో 225 బీఎడ్ కాలేజీలు ఉండగా ప్రస్తుతం వాటి సంఖ్య 208కి తగ్గిపోయింది. ఇందులో ఈ విద్యా సంవత్సరంలో 7–8 కాలేజీలు మూతపడ్డాయి. ఇక డీఎడ్ కాలేజీలు 210 ఉండగా ప్రస్తుతం అవి 140కి తగ్గిపోయినట్లు అధికారులు చెబుతున్నారు. ఇందులో గత విద్యా సంవత్సరంలో 30 కాలేజీలు మూతపడగా ఈ విద్యా సంవత్సరంలో 40 డీఎడ్ కాలేజీలు మూసివేత కోసం ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నాయి. దీంతో ఆ మేరకు కాలేజీలు తగ్గిపోయాయి. -
17 నుంచి డీసెట్
రాయవరం/రాజమహేంద్రవరం రూరల్ : ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయ కోర్సు (డీఎడ్) శిక్షణ కళాశాలల్లో ప్రవేశానికి అర్హత పరీక్ష ‘డీసెట్-2016’ నిర్వహణకు జిల్లా యంత్రాంగం సర్వసన్నద్ధమైంది. ఈ నెల 17 నుంచి 19వ తేదీ వరకూ మూడు రోజులపాటు రెండు విడతలుగా ఈ పరీక్షలు జరగనున్నాయి. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకూ తొలి విడత, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకూ రెండో విడత పరీక్ష నిర్వహిస్తారు. జిల్లాలో 11,783 మంది పరీక్షకు హాజరు కానున్నారని బొమ్మూరులోని జిల్లా విద్యాశిక్షణ సంస్థ ప్రిన్సిపాల్ డాక్టర్ ఏఎం జయశ్రీ తెలిపారు. గణితం 4,159 మంది, భౌతికశాస్త్రం 1,158 మంది, జీవశాస్త్రం 2,608 మంది, సాంఘిక శాస్త్రం 3,858 మంది దరఖాస్తు చేసుకున్నారని వివరించారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా కంప్యూటర్ ఆధారిత పరీక్ష(సీబీటీ)గా ఆన్లైన్ విధానంలో ఈ పరీక్ష నిర్వహిస్తున్నారు. కంప్యూటర్ పరిజ్ఞానంపై అంతగా అవగాహన లేకపోవడంతో గ్రామీణ అభ్యర్థుల్లో కాస్త గందరగోళం నెలకొందని చెబుతున్నారు. అభ్యర్థులకు సూచనలు హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోగానే దాని నంబర్, పరీక్ష తేదీ, సమయం, పరీక్షా కేంద్రం చిరునామా పరిశీలించుకోవాలి.పేరు సరిగ్గా ఉందో లేదో చూసుకోవాలి. హాల్‌టికెట్‌పై సూచనలు చదవాలి.ముందుగా కేటాయించిన తేదీ, సమయంలో మాత్రమే పరీక్ష కేంద్రాల్లోకి అభ్యర్థులను అనుమతిస్తారు. ఉదయం పరీక్షకు హాజరయ్యేవారు 9 గంటలకు, మధ్యాహ్నం హాజరయ్యేవారు 1.30 గంటలకు విధిగా పరీక్షా కేంద్రంలో రిపోర్టు చేయాలి. ఆలస్యంగా వస్తే అనుమతించరు. అభ్యర్థులందరూ తప్పనిసరిగా డీఈఈసీఈటీ.ఈజీజీ.జీవోవీ.ఇన్, డీఈఎస్ఈ.ఏపీ.జీవోవీ.ఇన్ వైబ్‌సెట్లలో కంప్యూటర్ ఆధారిత పరీక్షకు సంబంధించి ఉంచిన నమూనా పరీక్ష పేపరును ప్రాక్టీస్ చేయాలి. పరీక్షా సమయంలో.. హాల్ టికెట్లో ఇచ్చిన పాస్‌వర్డ్‌తో కేటాయించిన కంప్యూటర్లో లాగిన్ అవాలి. మానిటర్‌పై తమ వివరాలు సరిచూసుకుని ‘ఐ కన్ఫర్మ’ లేదా ‘ఐ డినై’పై క్లిక్ చేయాలి. పరీక్షకు సంబంధించిన అన్ని సూచనలూ క్షుణ్ణంగా చదివి అవగాహన చేసుకోవాలి. తనకు ‘కేటాయించిన కంప్యూటర్ సరైన స్థితిలో ఉన్నది. సూచనలు చదివి అవగాహన చేసుకున్నాను’ అనే బాక్స్‌పై క్లిక్ చేయాలి. సూచనలు చదివిన తరువాత ‘ఐయామ్ రెడీ టు బిగిన్’ బటన్ క్లిక్ చేయాలి. ప్రశ్నలకు ఇచ్చిన 4 సమాధానాల్లో సరైన దానిని ఎంచుకోవడానికి ‘మౌస్’ మాత్రమే వినియోగించాలి. ఆన్లైన్ పరీక్ష పత్రాన్ని చూపించే స్క్రీన్ కుడిచేతిపై భాగంలో మిగిలి ఉన్న సమయం కనిపిస్తుంది. అభ్యర్థులు సమాధానాలు నమోదు చేసే ప్రక్రియ ఆధారంగా ప్రశ్నా సంఖ్యలు వివిధ రంగులు, ఆకృతుల్లో ఉంటాయి. ఎరుపు : సమాధానం రాయని ప్రశ్నలకు తెలుపు చదరం : ప్రయత్నించని ప్రశ్నలకు ఆకుపచ్చ పంచభుజి : ప్రయత్నించిన ప్రశ్నలకు వెలైట్ : సమీక్ష కోసం గుర్తించిన ప్రశ్నలకు వెలైట్ సర్కిల్ విత్ ఎ గ్రీన్ టిక్ : సమాధానం రాసి, తర్వాత సమీక్ష చేయడానికి అభ్యర్థి గుర్తించిన ప్రశ్నలు ఒక ప్రశ్నకు అభ్యర్థి సమాధానాన్ని గుర్తించిన తరువాత సమాధానాన్ని ‘సేవ్’ చేసి తరువాతి ప్రశ్నకు వెళ్లడానికి ‘సేవ్ అండ్ నెక్ట్స్’ బటన్ నొక్కాలి. తరువాతి ప్రశ్నకు వెళ్లడానికి ముందు ఆ బటన్ క్లిక్ చేశారో లేదో గమనించాలి. ఒక ప్రశ్నకు సమాధానాన్ని గుర్తించిన తర్వాత మళ్లీ సరి చేసుకోవడానికి, మార్చుకొనడానికి ‘క్లియర్ రెస్పాన్స’ ఆప్షన్ కనిపిస్తుంది. మానిటర్ కుడివైపున సమాధానం రాసిన ప్రశ్నలు, సమాధానం రాయని ప్రశ్నలు, సమీక్షకు గుర్తించిన ప్రశ్నలకు ‘రెడీ టు రిఫరెన్స’ కనిపిస్తుంది. సమాధానం ఎంపిక చేసే సమీక్ష కోసం గుర్తించిన ప్రశ్నలను సమాధానం రాసిన ప్రశ్నలుగా భావిస్తారు. ప్రశ్న, సమాధానాలు పెద్ద అక్షరాలుగా కనబడకపోతే ఇన్విజిలేటర్ దృష్టికి తీసుకు వెళ్లాలి. పరీక్ష జరిగే సమయంలో ఎప్పుడైనా సూచనలు చూసుకోవడానికి ‘ఇన్స్ట్రక్షన్స’ బటన్‌పై క్లిక్ చేయాలి. పరీక్ష పూర్తయ్యే సమయంలో ‘సబ్మిట్’ బటన్ క్లిక్ చేయాలి. ఏదైనా కారణంతో లాగ్ అవుట్ అయితే, అప్పటివరకూ రాసిన సమాధానాలు సేవ్ అవుతాయి. తిరిగి ఆగిపోయినవద్ద నుంచి పరీక్ష ప్రారంభమవుతుంది.