భార్య కోసం.. బైక్‌పై 1000 కిమీ | Jharkhand Man Ride 1000 km on Bike to Fulfil His Wife Dream | Sakshi
Sakshi News home page

భార్య కోసం.. బైక్‌పై 1000 కిలోమీటర్లు..

Published Thu, Sep 3 2020 3:14 PM | Last Updated on Thu, Sep 3 2020 5:08 PM

Jharkhand Man Ride 1000 km on Bike to Fulfil His Wife Dream - Sakshi

రాంచీ: భార్య తనకంటే విద్యాధికురాలు అయితే చాలా మంది మగవారికి నచ్చదు. ఇక పెళ్లాయ్యాక ఆడవారికి చదువుకునే వెసులుబాటు కల్పించే భర్తలు చాలా అరుదుగా ఉంటారు. ఈ నేపథ్యంలో పదో తరగతితోనే చదువు ఆపేసి.. వంట మనిషిగా పని చేస్తోన్న ఓ వ్యక్తి.. టీచర్‌ కావాలన్న తన భార్య కలను నెరవేర్చడం కోసం సుమారు 1000 కిలోమీటర్లు బైక్‌ మీద ప్రయాణం చేసిన అరుదైన ఘటన ప్రస్తుతం తెగ వైరలవుతోంది. వివారాలు.. జార్ఖండ్‌ గొడ్డా ప్రాంతానికి చెందిన ధనంజయ్‌ కుమార్‌ పదవ తరగతి పాస్‌ అవుట్‌. తర్వాత వంట మనిషిగా పని చేస్తున్నాడు. ధనంజయ్‌ భార్య సోని హెంబ్రామ్‌కు టీచర్‌ కావాలని ఆశ. ఇందుకు గాను మధ్యప్రదేశ్‌ బోర్డు అందించే ప్రాథమిక విద్య డిప్లోమా కోర్సులో చేరింది. ప్రస్తుతం సెకండియర్‌ చదువుతోంది. పరీక్షలు జరగుతున్నాయి. ఎగ్జామ్‌ సెంటర్‌ మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌. గొడ్డా నుంచి పరీక్ష కేంద్రానికి మధ్య దూరం 1100 కిలోమీటర్లు. గూగుల్‌ మ్యాప్‌, కొన్ని షార్ట్‌కట్‌ మార్గాల వల్ల దూరం 1000 కిలోమీటర్లకు తగ్గింది. (చదవండి: క్లాస్‌ టీచర్)

దాంతో పరీక్ష కేంద్రానికి చేరుకోవడం కోసం మూడు రోజుల పాటు బైక్‌ మీద 1000 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేశారు ఈ దంపతులు. ఈ సందర్భంగా ధనంజయ్‌ మాట్లాడుతూ.. ‘నా భార్య 2019లో మధ్యప్రదేశ్‌లో టీచర్‌ కోర్సులో చేరింది. జార్ఖండ్‌లో ఫీజు చాలా ఎక్కువగా ఉండటంతో ఇలా చేసింది. దాంతో తనకు గ్వాలియర్‌లో ఎగ్జామ్‌ సెంటర్‌ పడింది. అక్కడికి చేరుకోవడానికి ప్రస్తుతం రైళ్లు అందుబాటులో లేవు. సోని టీచర్‌ ఒకరు విద్యార్థులను గొడ్డా నుంచి గ్వాలియర్‌ తీసుకెళ్లడానికి కారు మాట్లాడారు. కానీ 30 వేల రూపాయలు చెల్లించాలని చెప్పారు. గత నాలుగు నెలలుగా నాకు ఉద్యోగం లేదు. దాంతో బైక్‌ మీద వెళ్లాలని నిర్ణయించుకున్నాం. ప్రస్తుతం నా భార్య ఆరోనెల గర్భవతి. ఆగస్టు 27 రాత్రి మా ప్రయాణం ప్రారంభమయ్యింది. బిహార్‌, లక్నోలోని ముజఫర్‌పూర్‌ మీదుగా ప్రయాణించి ఆగస్టు 30 సాయంత్రం గ్వాలియర్‌ చేరుకున్నాం. బంధువుల దగ్గర నుంచి 10 వేలు బదులు తీసుకుని పరీక్షకు వెళ్లడానికి బయలుదేరాం’ అని తెలిపాడు ధనంజయ్‌. (చదవండి: పంతులమ్మ ఆదాయం : అధికారులకు షాక్)

గ్వాలియర్‌లోని డీడీ నగర్ ప్రాంతంలో ఉండటానికి వారు 1,500 రూపాయలతో గది అద్దెకు తీసుకున్నారు. ధనంజయ్‌ మాట్లాడుతూ.. ‘మేము ఇప్పటికే 7,000 రూపాయలు ఖర్చు చేసాము. ఇప్పుడు 3 వేల రూపాయలు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఆరు నెలల గర్భవతి అయిన నా భార్య అనారోగ్యంతో బాధపడుతున్నంది. ఇప్పుడు, నేను తిరిగి వెళ్ళడానికి అవసరమయిన డబ్బు ఏర్పాటు చేయడానికి ప్రయత్నిస్తున్నాను’ అని తెలిపాడు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement