Teacher harassment
-
విద్యార్థుల దుస్తులు.. విద్యార్థినులతో విప్పించి.. ఫొటోలు తీసి.. కీచక టీచర్!
సాక్షి, ఖమ్మం: ప్రభుత్వ పాఠశాలలో పని చేస్తున్న ఉపాధ్యాయుడు విద్యార్ధుల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఘటన ఆలస్యంగా సోమవారం వెలుగులోకి వచ్చింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం ఊట్లపల్లి ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో బి.మోహన్‌రావు అనే ఉపాధ్యాయుడు.. రెండో తరగతి చదువుతున్న నలుగురు విద్యార్థులు ఎక్కాలు సరిగా చెప్పలేదంటూ వారి దుస్తులు విప్పించాడు. అందులో ఇద్దరి దుస్తులను నాలుగో తరగతి చదువుతున్న విద్యార్థినులతో విప్పించి అసభ్యంగా ప్రవర్తించాడని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. అంతేకాక తమను దుస్తులు లేకుండా సెల్ఫోన్లో ఫొటోలు తీసి బెదిరించాడని విద్యార్థులు తల్లిదండ్రులకు చెప్పడంతో వారు సదరు టీచర్‌ను ప్రశ్నించేందుకు సోమవారం పాఠశాలకు రాగా, ఆ ఉపాధ్యాయుడు విధులకు గైర్హాజరయ్యాడు. దాంతో పాఠశాలలో తల్లిదండ్రులు ఆందోళన చేశారు. ప్రభుత్వ ఉపాధ్యాయుడు మద్యం మత్తులో విధులకు హాజరవుతున్నాడని, ఇలాంటి టీచర్లతో విద్యార్థినులకు ఏం భద్రత ఉంటుందని ప్రశ్నించారు. అయితే శనివారం పాఠశాల హెచ్ఎం శిక్షణ కార్యక్రమానికి వెళ్లగా, ఓ టీచర్ సెలవు పెట్టారు. మరో ఉపాధ్యాయుడు మధ్యాహ్నమే వెళ్లిపోగా, మోహన్‌రావు ఒక్కడే స్కూళ్లో ఉన్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. తల్లిదండ్రుల ఆందోళన విషయం తెలుసుకున్న ఎస్సై పి.శ్రీకాంత్ అక్కడికి చేరుకుని వారిని శాంతింపజేశారు. అనంతరం తల్లిదండ్రులు ఉపాధ్యాయుడిపై పోలీసులకు, డీఈఓకు ఫిర్యాదు చేశారు. విద్యార్థులతో అనుచితంగా వ్యవహరించిన ఉపాధ్యాయుడిని సస్పెండ్ చేయాలని తల్లిదండ్రులు, గ్రామస్తులు కోరుతున్నారు. ఇవి చదవండి: ప్రేమించి పెళ్లి చేసుకున్న నవదంపతులపై దాడి! అల్లుడిని దారుణంగా.. -
క్లాస్‌రూమ్‌లో బరితెగించిన విద్యార్థులు.. మహిళా టీచర్‌తో అసభ్యకర ప్రవర్తన
క్లాస్‌రూమ్‌లోనే విద్యార్థులు బరితెగించి ప్రవర్తించారు. విద్యాబుద్ధులు నేర్పుతున్న మహిళా టీచర్నే లైంగిక వేధింపులకు గురిచేశారు. అంతటితో ఆగకుండా టీచర్‌ను అసభ్యకర వ్యాఖ్యలతో వేధిస్తూ రాక్షసానందం పొందుతూ ఈ ఘటనను వీడియో తీశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ షాకింగ్ ఘటన ఉత్తర ప్రదేశ్‌లో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. మీటర్‌లోని ఓ పాఠశాలలో ముగ్గురు మైనర్ విద్యార్థులు అనుచితంగా ప్రవర్తించారు. అయితే, అమన్, కైఫ్, అతాష్ అనే ముగ్గురు విద్యార్థులు తనను వేధిస్తున్నారని టీచర్ తన ఫిర్యాదులో పేర్కొంది. ఈ చర్యలో పాల్గొన్న అమన్ సోదరి పేరును కూడా ఆమె ప్రస్తావించింది. కాగా, మొదట టీచర్ వారి చేష్టలను, వ్యాఖ్యలను పట్టించుకోలేదు. ఇది తప్పు, చట్టవిరుద్ధమని చెబుతూ విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పే ప్రయత్నం చేసింది. అయినప్పటికీ వారు టీచర్ వ్యాఖ్యలను పట్టించుకోకుండానే క్లాస్ రూమ్‌లో ఆమెకు ఐ లవ్ యూ చెబుతూ, అసభ్యకర కామెంట్స్ చేశారు. ఈ క్రమంలో సహనం కోల్పోయిన టీచర్.. ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో, రంగంలోకి దిగిన పోలీసులు.. మైనర్ విద్యార్ధులపై కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై మీరట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కేశవ్ కుమార్ మాట్లాడుతూ.. విద్యార్థులు మైనర్లు కావడంతో పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టు వెల్లడించారు. ఇక, దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా, వీడియోలో విద్యార్థుల వెకిలిచేష్టల కారణంగా టీచర్ వారి నుండి దూరంగా వెళ్తున్నట్టు కనిపించింది. Breaking News: In UP's Meerut, inside the school, 3 student Atash, Kaif, Aman molested & said "I Love U" to the female teacher & made its video viral on social media. Shagufa a female accused also involved FIR filled under sec for obscene comments, threat to murder & IT act + pic.twitter.com/jb0pEcajAE — Ashwini Shrivastava (@AshwiniSahaya) November 27, 2022 -
మదర్సాలో 12 ఏళ్ల విద్యార్థినిపై టీచర్ వేధింపులు
ఇండోర్: మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ఓ మదర్సాలో 12 ఏళ్ల విద్యార్థినిపై 52 ఏళ్ల ఉపాధ్యాయుడు వేధింపులకు పాల్పడ్డాడు. నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు చందన్నగర్ స్టేషన్ ఇన్స్పెక్టర్ అభయ్ తెలిపారు. బాధితురాలి తండ్రి, చిన్నాన్నను కొట్టినందుకు ఉపాధ్యాయుడి ఇద్దరు కుమారులపై కేసు పెట్టినట్లు చెప్పారు. బాధితురాలి కుటుంబం ఫిర్యాదు ప్రకారం.. బాలిక గత నెలలో మదర్సాలో చేరింది. పాఠాలు చెప్పే నెపంతో ఉపాధ్యాయుడు ఆమెను అసభ్యంగా తాకేవాడు. ఈ విషయం తల్లిదండ్రులకు చెప్పింది. నిలదీసేందుకు వెళ్లిన బాలిక తండ్రి, చిన్నాన్నను నిందితుడి కుమారులు కొట్టారు. -
ఉపాధ్యాయుడి వేధింపులకు విద్యార్థిని బలి
పుల్లంపేట: ఉపాధ్యాయుడి వేధింపులు తాళలేక ఓ విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడింది. ఈ దారుణ ఘటన మంగళవారం వైఎస్సార్ జిల్లా పుల్లంపేటలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. వైఎస్సార్ జిల్లా రాజంపేట పట్టణంలో నివసించే కొండపల్లి కృష్ణమూర్తి, గౌరి దంపతులు తమ కుమార్తె లక్ష్మీప్రసన్నను పుల్లంపేటలోని ప్రభుత్వ ఆదర్శ పాఠశాలలో పదో తరగతిలో చేర్పించారు. అక్కడ సైన్సు ఉపాధ్యాయుడు శివ తనను చదువు విషయమై తరచూ వేధిస్తున్నాడని లక్ష్మీప్రసన్న పలుమార్లు తన తల్లిదండ్రుల దృష్టికి తీసుకెళ్లి, కన్నీరు పెట్టుకుంది. ఈ నేపథ్యంలో కుమార్తెను ఓదార్చేందుకు విద్యార్థిని తల్లి గౌరి మంగళవారం సాయంత్రం పాఠశాల వద్దకు వచ్చింది. సిబ్బంది అనుమతించకపోవడంతో వెలుపల వేచి ఉంది. పాఠశాల విడిచిపెట్టాక లక్ష్మీప్రసన్నను హస్టల్‌కు తీసుకెళ్లింది. దుస్తులు మార్చుకుంటానని గది లోపలికి వెళ్లిన లక్ష్మీప్రసన్న చున్నీతో ఫ్యాన్‌కు ఉరి వేసుకొని ప్రాణాలు విడిచింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. విద్యార్థిని ఆత్మహత్యపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
విద్యాశాఖకు అపఖ్యాతి
మాతృ దేవోభవ.. పితృ దేవోభవ.. ఆచార్య దేవోభవ.. ఇలా మన పెద్దలు తల్లిదండ్రుల తర్వాతి స్థానం గురువులకు ఇచ్చారు. కానీ ఆ స్థానానికి కొందరు మచ్చ తెచ్చేలా ప్రవర్తిస్తున్నారు. కూతుళ్లలా చూసుకోవాల్సిన విద్యార్థినులతో అసభ్యంగా, అనైతిక చర్యలకు పాల్పడుతూ విద్యాశాఖకు అపఖ్యాతి తెస్తున్నారు. తప్పు చేస్తున్నవారిపై చర్యలు లేకపోవడంతో ఇలాంటి ఘటనలకు అడ్డుకట్ట పడడం లేదు. సాక్షి, కామారెడ్డి: మన సంస్కృతిలో తల్లితండ్రుల తరువాతి స్థానం గురువుదే. గురువుకు ఎంతో గౌరవం ఇస్తారు. ఇంటి దగ్గర ఉన్నంత సేపే బిడ్డ ఆలనాపాలనా తల్లిదండ్రులు చూస్తారు. చదువు కోసం బడికి వెళ్లిన తరువాత భారమంతా ఉపాధ్యాయుడిపైనే వేస్తారు. గురువు అంటే అంత నమ్మకం. అలాంటి పవిత్రమైన వృత్తికి కొందరు కళంకం తెస్తున్నారు. భవిష్యత్‌కు భవ్యమైన పునాదులు వేసేందుకు పాఠాలు చెప్పాల్సిన ఓ ఉపాధ్యాయుడు విద్యార్థినికి ప్రేమ పాఠాలు చెప్పాడు. ఆమె కుటుంబ పరిస్థితిని ఆసరా చేసుకుని ఉన్నత చదువుల పేరుతో హైదరాబాద్‌కు తీసుకెళ్లి గర్భవతిని చేశాడు. ఈ వ్యవహారం వెలుగులోకి రావడంతో విద్యార్థిని తరపు వారి నుంచి ఇబ్బందులు తప్పవని గుర్తించిన సదరు ఉపాధ్యాయుడు ఆమె మెడలో తాళి కట్టాడు. అయితే అప్పటికే ఆ ఉపాధ్యాయుడికి భార్య, పిల్లలు ఉండడం గమనార్హం. సమాజంలో గౌరవప్రదంగా ఉండాల్సిన ఉపాధ్యాయుడు అనైతిక చర్యలకు పాల్పడి వృత్తికి కళంకం తెచ్చాడు. గతంలోనూ ఇలాంటి సంఘటనలు జరిగాయి. జిల్లాలోని సదాశివనగర్ మండలంలో ఓ ప్రధానోపాధ్యాయుడు విద్యార్థినులతో అసభ్యకరంగా వ్యవహరించిన కేసులో అరెస్టై జైలుకు వెళ్లి వచ్చాడు. కొంత కాలం సస్పెన్షన్ తర్వాత తిరిగి ఉద్యోగంలో చేరాడు. మరో ఉపాధ్యాయుడు ఉపాధ్యాయురాలితో అసభ్యకరంగా వ్యవహరించిన సంఘటనలో ఆమె కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. చిట్టీలు, రియల్ ఎస్టేట్ వ్యాపారం.. చదువు చెప్పి విద్యార్థులను తీర్చిదిద్దాల్సిన ఉపాధ్యాయులలో కొందరు తమ బాధ్యతలను విస్మరించి సొంత దందాలు చేసుకుంటున్నారన్న ఆరోపణలున్నాయి. పలువురు నిబంధనలకు విరుద్ధంగా చిట్టీల దందా కొనసాగిస్తున్నారు. ఇంకొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. కొంతమంది ఉపాధ్యాయులు విధులు ఎగ్గొట్టి సొంత వ్యాపారాలు చేసుకుంటున్నారన్న విమర్శలున్నాయి. చర్యలేవి? అనైతిక, అసాంఘిక చర్యలకు పాల్పడిన ఉపాధ్యాయుల విషయంలో సరైన చర్యలు లేకపోవడం మూలంగానే ఇలాంటివి పునరావృతమవుతున్నాయని పలువురు ఆరోపిస్తున్నారు. పాఠశాలలో విద్యార్థినులను లైంగికంగా వేధించిన ఉపాధ్యాయుడిని అరెస్టు చేసి జైలుకు పంపారు. తరువాత బెయిల్‌పై వచ్చి తిరిగి ఉద్యోగంలో చేరాడు. విద్యార్థినులతో అమానవీయంగా వ్యవహరించిన వ్యక్తి దర్జాగా తిరుగుతున్నాడు. మహిళా ఉపాధ్యాయుతో అసభ్యకరంగా వ్యవహరించిన ఉపాధ్యాయులపైనా చర్యల్లేవు. ఆరోపణ వచ్చినపుడు సస్పెండ్ చేయడం, తరువాత సస్పెన్షన్ ఎత్తేయడం పరిపాటిగా మారింది. సంఘాల మద్దతుతో.. తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేయాల్సిన ఉపాధ్యాయ సంఘాల నాయకులే అలాంటి వారికి అండగా నిలవడం ఉపాధ్యాయ సమాజానికి అపఖ్యాతిని తెచ్చిపెడుతోంది. వృత్తిపరంగా ఆరోపణలు, విమర్శలు వచ్చినపుడు ఏదో తమ సంఘానికి చెందిన వారని వారికి అండగా నిలిచారంటే అర్థం ఉంటుంది కానీ తమ కూతుళ్లలాంటి విద్యార్థినులతో అసభ్యకరంగా, అనైతికంగా వ్యవహరించి సభ్యసమాజం చీదరించుకునే స్థితికి దిగజారిన వ్యక్తులకు అండగా నిలవడం విమర్శలకు తావిస్తోంది. అనైతిక చర్యలతో ఉపాధ్యాయ లోకానికి చెడ్డపేరు తెస్తున్న వారి విషయంలో అనుకూలంగా వ్యవహరించే పద్ధతులు విడనాడితేనే గౌరవం నిలుస్తుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. తప్పు చేసిన వారిని సమర్థించడం ద్వారా వాళ్లు కూడా తప్పు చేసినవారవుతారనే భావన కలుగుతోంది. ఇప్పటికైనా ఉపాధ్యాయ సంఘాలు ఇలాంటి సంఘటనల విషయంలో బాధ్యులపై చర్యలకు పట్టుబట్టాల్సిన అవసరం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. -
ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్యాయత్నం
సాక్షి, రణస్థలం (శ్రీకాకుళం): ఆదర్శ పాఠశాల సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయిని తీరుతో మానసిక వేదనకు గురై ఇంటర్ ద్వితీయ సంవత్సరం విద్యార్థిని గిన్నె భార్గవి ఆత్మహత్యకు యత్నించింది. గత కొద్ది కాలంగా ఉపాధ్యాయిని కక్ష కట్టి ఎన్నో విధాలుగా వేధిస్తునట్లు తమ కుమార్తె అనేకసార్లు వాపోయినట్లు మండలంలోని గోసాం గ్రామానికి చెందిన గిన్నె అసిరినాయుడు (పాలు రెడ్డి) తెలిపారు. శనివారం ఆదర్శ పాఠశాల వసతి గృహంలో ప్రవేశం లేదని ఉపాధ్యాయిని కరాఖండిగా చెప్పడంతో భార్గవి మానసిక ఆందోళనకు గురైనట్లు తండ్రి తెలిపారు. శనివారం సాయంత్రం పురుగు మందు తాగి ఆసుపత్రి పాలైనట్టు పేర్కొన్నారు. హుటాహుటిన శ్రీకాకుళంలోని ఒక ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉంది. శనివారం జరిగిన ఈ ఘటన ఆదివారం వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేస్తామని తండ్రి చెప్పారు. అయితే తమకు ఇంకా ఫిర్యాదు అందలేదని జె.ఆర్.పురం ఎస్సై వి.బాలకృష్ణ తెలిపారు. ప్రిన్సిపాల్ వివరణ ఈ దుర్ఘటనపై ఆదర్శ పాఠశాల ప్రిన్సిపాల్ కె.మహేశ్వరరావును వివరణ కోరగా.. ఆదర్శపాఠశాల వసతి గృహం గత ఏడాది నవంబర్‌లో ప్రారంభమైందని, ఆమె ప్రథమ సంవత్సరం చివరిలో ఒక నెలరోజులపాటు అనారోగ్యం, వ్యక్తిగత సమస్యల వల్ల హాస్టల్‌కు రాలేదని, హాస్టల్లో ఉన్నప్పుడే ఒకసారి కడుపులో నొప్పి అని చెబితే ఆసుపత్రికి తరలించామని చెప్పారు. ప్రస్తుత ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం విద్యార్థుల నుంచి వసతి గృహంలో ప్రవేశాలకు శనివారం దరఖాస్తులు కోరామన్నారు. గతంలో అనారోగ్యం, వ్యక్తిగత సమస్యలు ఉన్నవారు దరఖాస్తు చేసుకోవద్దని హాస్టల్ మెయింటినెన్స్ చూస్తున్న సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయిని లక్ష్మికి చెప్పామని ప్రిన్సిపాల్ మహేశ్వరరావు తెలిపారు. -
టీచరే.. కాల్చింది!
బషీరాబాద్(తాండూరు) : నాలుగేళ్ల çపసిపాప బుగ్గలపై ఓ అంగన్వాడీ టీచర్ అగ్గిపుల్లలతో కాల్చిన అమానుష ఘటన సంచలనం రేపింది. అన్ని దిన పత్రికల్లో దీనికి సంబంధిన వార్తలు రావడాన్ని గమనించిన ప్రభుత్వం సీరియస్‌గా పరిగణించింది. సాయంత్రంలోపు విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని మహిళ, శిశు సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ జగదీశ్వర్ వికారాబాద్ డీడబ్ల్యూఓను ఆదేశించించారు. బాలికను కాల్చి హింసించిన అంగన్వాడీ టీచర్‌పై వెంటనే పోలీసు కేసు నమోదు చేయాలని సూచించారు. ఈ మేరకు సోమవారం ఉదయం బషీరాబాద్ మండలం కంసాన్పల్లి(బి)కి చేరుకున్న డీడబ్ల్యూఓ జ్యోత్స్న, తాండూరు సీడీపీఓ జగదాంబ, సూపర్ వైజర్లు నర్సమ్మ, దశమ్మతో కూడిన విచారణ బృందం సుమారు 8 గంటల పాటు విచారణ జరిపింది. ఇందులో అంగన్వాడీ టీచర్ సులోచన చేసిన దాష్టీకం బయటపడింది. విచారణ సమయంలో మొదట నెపాన్ని అంగన్వాడీ ఆయాపై నెట్టే ప్రయత్నం చేసిన ఆమె పన్నాగంబెడిసి కొట్టింది. తనను కాల్చింది టీచర్ సులోచనేనని బాధిత బాలిక వర్షిణి అధికారులు, గ్రామస్తుల సమక్షంలో చూపించడంతో ఒక్కసారిగా ఖంగుతింది. దీంతో పాపను అగ్గిపుల్లలతో కాల్చింది తానేనని అంగీకరించింది. పాప తండ్రి శ్యామప్ప తనబిడ్డను భయపెట్టమని చేతులు కట్టి తనకు శనివారం రోజు అప్పగించాడని, దీంతో ఆ పాపను భయపెట్టడానికే అలా చేయాల్సి వచ్చిందని చెప్పుకొచ్చింది. ఇది ఇంత పెద్ద లొల్లి అవుతుందని అనుకోలేదని తెలిపింది. చేసిన తప్పునకు క్షమాపణ కోరుతున్నానని అభ్యర్థించింది. మరోవైపు అంగన్వాడీ టీచర్ సులోచనకు డీడబ్ల్యూఓ జ్యోత్స్న మెమో జారీ చేశారు. అనంతరం బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌కు చేరుకొని ఫిర్యాదు చేశారు. ఎస్ఐ అందుబాటులో లేకపోవడంతో కేసు నమోదు కాలేదు. మరోవైపు ఈ ఘటనపై కలెక్టర్ ఎప్పటికప్పుడు ఆరా తీశారు. విచారణ నిష్పక్షపాతంగా జరపాలని అధికారులను ఆదేశించారు. సస్పెండ్ చేయాలి... నాలుగేళ్ల పాప పట్ల పైశాచికంగా ప్రవర్తించిన అంగన్వాడీ టీచర్ సులోచనను వెంటనే విధుల నుంచి తొలగించి, అరెస్టు చేయాలని బాలల హక్కుల పోరాట సమితి నాయకుడు సుదర్శన్, చైల్డ్‌లైన్ మండల ప్రతినిధి హన్మంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృత్తం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. అంగన్వాడీ టీచర్‌పై బాలిక వర్షిణి తల్లిదండ్రులు మహంతమ్మ, శ్యామప్ప ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ బిడ్డను హింసించడమే కాకుండా తామే చేయించామని ఆరోపించడంపై మండిపడ్డారు. తమకు న్యాయం జరిగే వరకూ పోరాటం చేస్తామని చెప్పారు. -
ఉపాధ్యాయుడి వేధింపులకు విద్యార్థిని బలి
మొయినాబాద్ (చేవెళ్ల): ప్రైవేటు పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయుడి వేధింపులతో మనస్తాపం చెందిన ఓ విద్యార్థిని ఒంటిపై కిరోసిన్ పోసుకుని, నిప్పంటించుకుని ఆత్మహత్యకు పాల్పడింది. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం చిలుకూరుకు చెందిన కుమ్మరి యాదయ్య, లక్ష్మి దంపతులకు ఇద్దరు కుమార్తెలు. పెద్ద కూతురు పూజిత ఇంటర్ చదువుతుండగా చిన్న కూతురు తేజస్విని (15) అదే గ్రామంలో శివసాయి ఇంటర్నేషన ల్ స్కూల్లో 9వ తరగతి చదువుతోంది. అదే స్కూల్లో వ్యాయామ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న బొల్లు ప్రశాంత్, తేజస్వినిని వేధిస్తున్నాడు. ఐదు రోజుల క్రితం ఆమెకు ప్రశాంత్ సెల్‌ఫోన్ ఇచ్చాడు. ఆమె ఫోన్ తిరిగి ఇచ్చేయడంతో మరింత వేధించసాగాడు. మనస్తాపా నికి గురై శనివారం కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. మంటలార్పే క్రమంలో తల్లిదం డ్రులకీ గాయాలయ్యాయి. తీవ్ర గాయాలతో తేజస్విని ఇంట్లోనే మృతి చెందింది. అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశాక... తేజస్విని మృతదేహానికి అంత్యక్రియలు చేయడానికి కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేశారు. పోలీసులకు విషయం తెలియడంతో సీఐ సునీత సిబ్బందితో ఘటనా స్థలానికి వెళ్లారు. కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. మృతదేహంతో ఆందోళన... తేజస్విని ఆత్మహత్యకు కారణమైన టీచర్, పాఠశాల యాజమాన్యంపై చర్య లు తీసుకోవాలని గ్రామస్తులు, బంధువులు పాఠశాల ఎదుట ఆందోళనకు దిగారు. పోస్టుమార్టం అనంతరం శనివారం సాయంత్రం మృతదేహాన్ని తీసుకొచ్చి పాఠశాల ఎదుట పెట్టి ఆందోళన చేశారు. మృతురాలి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. రాత్రి వరకు ఆందోళన కొనసాగింది. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిసింది. -
అమ్మా.. నే స్కూల్‌కు వెళ్లను..!
చదువు.. చదువు.. అని పోరుపెట్టే తల్లిదండ్రులు.. చిన్నచిన్న తప్పులకు విచక్షణ కోల్పోయి దండించే టీచర్లు.. ఇవి చాలవన్నట్టు ఇతర పనులు.. చివరకు గ్రామాల్లో వ్యక్తిగత మరుగుదొడ్లు ఎన్ని ఉన్నాయో.. తేల్చాల్సిన సర్వే బాధ్యతలు కూడా 9వ తరగతి పిల్లలపై మోపారు. ఇలా రోజురోజుకు విద్యార్థులపై భారం పెరిగిపోతుండడంతో.. ’అమ్మా.. నే స్కూల్‌కు వెళ్లను..’ అనే పరిస్థితి వస్తోంది. ఆ వివరాలు ఇలా.. పశ్చిమగోదావరి , భీమవరం: స్వచ్ఛ సర్వే పేరుతో వ్యక్తిగత మరుగుదొడ్ల వివరాలను జిల్లా పరిషత్ హైస్కూళ్లలోని 9వ తరగతి విద్యార్థులతో సేకరించాలని ఆదేశాలు జారీ చేయడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే స్కూళ్ల ఉపాధ్యాయులకు అనేక బోధనేతర పనులు, బయోమెట్రిక్ హాజరుతో వారిని పక్కదారి పట్టించింది. ఇక పిల్లలపై పడింది ఈ ప్రభుత్వం. ప్రతి పాఠశాలలోని 9వ తరగతి పిల్లలతో గ్రామాలు, పట్టణాల్లోని నివాసగృహాల్లో వ్యక్తిగత మరుగుదొడ్ల వివరాలు సేకరించాలని పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు ఆదేశాలు జారీచేయడం ఉపాధ్యాయుల్లో గందరగోళ పరిస్థితికి దారితీసింది. 2018 మార్చి నాటికి బహిరంగ మలమూత్ర విసర్జన రహిత రాష్ట్రంగా ప్రకటించాలనే లక్ష్యంతో ఈ సర్వే చేపట్టించారు. దీనిలో భాగంగా పాఠశాలల్లోని 9వ తరగతి విద్యార్ధులను 5 నుంచి 10 మందితో కూడి బృందాలు విడదీసి వారికి విద్యార్థులు నివసించే పరిసర ప్రాంతాల్లోని గృహాల్లో మరుగుదొడ్ల లెక్కలు సేకరించాల్సి ఉంటుంది. దీనికి గాను విద్యార్థులకు రెండు ప్రొ ఫార్మాలను అందించి మొదటి ప్రొ ఫార్మాలో విద్యార్థి పేరు, గ్రూపు లీడరు పేరు, వ్యక్తిగత మరుగుదొడ్డి నిర్మించుకున్న లబ్ధిదారుని ఆధార్ నంబర్‌తో సహా వివరాలు సేకరించాలి. రెండో ప్రొ ఫార్మాలో మరుగుదొడ్డిని వినియోగిస్తున్నారా?లేదా?, శుభ్రంగా ఉంచుతున్నారా? మరుగుదొడ్డి నిర్మాణంలో ఉండే ఏ స్టేజ్‌లో ఉంది వంటి వివరాలను నమోదు చేయాల్సి ఉంటుంది. పరీక్షల సమయంలో ప్రయివేటు పనులా? నవంబర్‌లో విద్యార్థులకు పరీక్షలు నిర్వహించనున్న తరుణంలో మరుగుదొడ్ల సర్వేలంటే వీధుల్లో తిప్పితే చదువుపై ఏకాగ్రతను కోల్పోయే ప్రమాదం ఉందని ఉపాధ్యాయులే చెబుతున్నారు. అంతేగాకుండా విద్యార్థులు ఇళ్లకు వెళ్లి మరుగుదొడ్ల వివరాలను సేకరించడం వల్ల అనంతరం వచ్చే ఇబ్బందులను విద్యార్థులను బాధ్యులను చేసి రానున్న రోజుల్లో లబ్ధిదారులు గ్రామాల్లో విద్యార్థులపై దాడులు చేయడం లేదా వ్యక్తిగత కక్ష పెంచుకునే ప్రమాదం లేకపోలేదని చెబుతున్నారు. సర్వేలో ఆరు లక్షల మంది విద్యార్థులు జిల్లాలోని సుమారు 3,145 హైస్కూళ్లలో సుమారు 20,414 మంది ఉపాధ్యాయులు పనిచేస్తుండగా 9వ తరగతి విద్యార్థులు సుమారు ఆరు లక్షల మందికి పైగా ఉన్నట్టు అంచనా. వీరంతా జిల్లాలో 909 గ్రామాలు, 8 మునిసిపాల్టీలు, ఒక నగరపాలక సంస్థలో సర్వే చేయాల్సి ఉంటుంది. -
టీచర్ వేధింపులతో విద్యార్థిని ఆత్మహత్య
బనగానపల్లి (కర్నూలు) : ఉపాధ్యాయుడి వేధింపులు తాళలేక ఆత్మహత్యాయత్నం చేసిన విద్యార్థిని చికిత్స పొందుతూ గురువారం మృతిచెందింది. ఈ సంఘటన కర్నూలు జిల్లా బనగానపల్లి మండలం పాతపాడు గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ఉషారాణి(13) స్థానిక ప్రైవేటు పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతోంది. కాగా గతేడాది నుంచి పాఠశాలలో హిందీ ఉపాధ్యాయుడిగా పని చేస్తున్న అబ్దుల్(25) తనను ప్రేమించమని వేధింపులకు దిగడంతో విద్యార్థిని విషయాన్ని పాఠశాల యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లింది. స్పందించిన యాజమాన్యం అబ్దుల్‌ను విధుల నుంచి తొలగించింది. అప్పటి నుంచి సదరు ఉపాధ్యాయుడు విద్యార్థిని పాఠశాలకు వెళ్తున్న సమయంలో రోడ్డు మీద కాపు కాసి వేధింపులకు గురి చేస్తుండటంతో.. మనస్తాపానికి గురైన బాలిక ఈ నెల 11న ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేసింది. దీంతో కుటుంబ సభ్యులు ఆమెను ఆస్పత్రికి తరలించారు. అప్పటి నుంచి కర్నూలు ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాలిక పరిస్థితి విషమించి గురువారం మధ్యాహ్నం మృతిచెందింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.