చదువు.. చదువు.. అని పోరుపెట్టే తల్లిదండ్రులు.. చిన్నచిన్న తప్పులకు విచక్షణ కోల్పోయి దండించే టీచర్లు.. ఇవి చాలవన్నట్టు ఇతర పనులు.. చివరకు గ్రామాల్లో వ్యక్తిగత మరుగుదొడ్లు ఎన్ని ఉన్నాయో.. తేల్చాల్సిన సర్వే బాధ్యతలు కూడా 9వ తరగతి పిల్లలపై మోపారు. ఇలా రోజురోజుకు విద్యార్థులపై భారం పెరిగిపోతుండడంతో.. ’అమ్మా.. నే స్కూల్‌కు వెళ్లను..’ అనే పరిస్థితి వస్తోంది. ఆ వివరాలు ఇలా..
పశ్చిమగోదావరి , భీమవరం: స్వచ్ఛ సర్వే పేరుతో వ్యక్తిగత మరుగుదొడ్ల వివరాలను జిల్లా పరిషత్ హైస్కూళ్లలోని 9వ తరగతి విద్యార్థులతో సేకరించాలని ఆదేశాలు జారీ చేయడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే స్కూళ్ల ఉపాధ్యాయులకు అనేక బోధనేతర పనులు, బయోమెట్రిక్ హాజరుతో వారిని పక్కదారి పట్టించింది. ఇక పిల్లలపై పడింది ఈ ప్రభుత్వం. ప్రతి పాఠశాలలోని 9వ తరగతి పిల్లలతో గ్రామాలు, పట్టణాల్లోని నివాసగృహాల్లో వ్యక్తిగత మరుగుదొడ్ల వివరాలు సేకరించాలని పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు ఆదేశాలు జారీచేయడం ఉపాధ్యాయుల్లో గందరగోళ పరిస్థితికి దారితీసింది. 2018 మార్చి నాటికి బహిరంగ మలమూత్ర విసర్జన రహిత రాష్ట్రంగా ప్రకటించాలనే లక్ష్యంతో ఈ సర్వే చేపట్టించారు.
దీనిలో భాగంగా పాఠశాలల్లోని 9వ తరగతి విద్యార్ధులను 5 నుంచి 10 మందితో కూడి బృందాలు విడదీసి వారికి విద్యార్థులు నివసించే పరిసర ప్రాంతాల్లోని గృహాల్లో మరుగుదొడ్ల లెక్కలు సేకరించాల్సి ఉంటుంది. దీనికి గాను విద్యార్థులకు రెండు ప్రొ ఫార్మాలను అందించి మొదటి ప్రొ ఫార్మాలో విద్యార్థి పేరు, గ్రూపు లీడరు పేరు, వ్యక్తిగత మరుగుదొడ్డి నిర్మించుకున్న లబ్ధిదారుని ఆధార్ నంబర్‌తో సహా వివరాలు సేకరించాలి. రెండో ప్రొ ఫార్మాలో మరుగుదొడ్డిని వినియోగిస్తున్నారా?లేదా?, శుభ్రంగా ఉంచుతున్నారా? మరుగుదొడ్డి నిర్మాణంలో ఉండే ఏ స్టేజ్‌లో ఉంది వంటి వివరాలను నమోదు చేయాల్సి ఉంటుంది.
పరీక్షల సమయంలో ప్రయివేటు పనులా?
నవంబర్‌లో విద్యార్థులకు పరీక్షలు నిర్వహించనున్న తరుణంలో మరుగుదొడ్ల సర్వేలంటే వీధుల్లో తిప్పితే చదువుపై ఏకాగ్రతను కోల్పోయే ప్రమాదం ఉందని ఉపాధ్యాయులే చెబుతున్నారు. అంతేగాకుండా విద్యార్థులు ఇళ్లకు వెళ్లి మరుగుదొడ్ల వివరాలను సేకరించడం వల్ల అనంతరం వచ్చే ఇబ్బందులను విద్యార్థులను బాధ్యులను చేసి రానున్న రోజుల్లో లబ్ధిదారులు గ్రామాల్లో విద్యార్థులపై దాడులు చేయడం లేదా వ్యక్తిగత కక్ష పెంచుకునే ప్రమాదం లేకపోలేదని చెబుతున్నారు.
సర్వేలో ఆరు లక్షల మంది విద్యార్థులు
జిల్లాలోని సుమారు 3,145 హైస్కూళ్లలో సుమారు 20,414 మంది ఉపాధ్యాయులు పనిచేస్తుండగా 9వ తరగతి విద్యార్థులు సుమారు ఆరు లక్షల మందికి పైగా ఉన్నట్టు అంచనా. వీరంతా జిల్లాలో 909 గ్రామాలు, 8 మునిసిపాల్టీలు, ఒక నగరపాలక సంస్థలో సర్వే చేయాల్సి ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment