మాతృ దేవోభవ.. పితృ దేవోభవ.. ఆచార్య దేవోభవ.. ఇలా మన పెద్దలు తల్లిదండ్రుల తర్వాతి స్థానం గురువులకు ఇచ్చారు. కానీ ఆ స్థానానికి కొందరు మచ్చ తెచ్చేలా ప్రవర్తిస్తున్నారు. కూతుళ్లలా చూసుకోవాల్సిన విద్యార్థినులతో అసభ్యంగా, అనైతిక చర్యలకు పాల్పడుతూ విద్యాశాఖకు అపఖ్యాతి తెస్తున్నారు. తప్పు చేస్తున్నవారిపై చర్యలు లేకపోవడంతో ఇలాంటి ఘటనలకు అడ్డుకట్ట పడడం లేదు.
సాక్షి, కామారెడ్డి: మన సంస్కృతిలో తల్లితండ్రుల తరువాతి స్థానం గురువుదే. గురువుకు ఎంతో గౌరవం ఇస్తారు. ఇంటి దగ్గర ఉన్నంత సేపే బిడ్డ ఆలనాపాలనా తల్లిదండ్రులు చూస్తారు. చదువు కోసం బడికి వెళ్లిన తరువాత భారమంతా ఉపాధ్యాయుడిపైనే వేస్తారు. గురువు అంటే అంత నమ్మకం. అలాంటి పవిత్రమైన వృత్తికి కొందరు కళంకం తెస్తున్నారు. భవిష్యత్‌కు భవ్యమైన పునాదులు వేసేందుకు పాఠాలు చెప్పాల్సిన ఓ ఉపాధ్యాయుడు విద్యార్థినికి ప్రేమ పాఠాలు చెప్పాడు. ఆమె కుటుంబ పరిస్థితిని ఆసరా చేసుకుని ఉన్నత చదువుల పేరుతో హైదరాబాద్‌కు తీసుకెళ్లి గర్భవతిని చేశాడు.
ఈ వ్యవహారం వెలుగులోకి రావడంతో విద్యార్థిని తరపు వారి నుంచి ఇబ్బందులు తప్పవని గుర్తించిన సదరు ఉపాధ్యాయుడు ఆమె మెడలో తాళి కట్టాడు. అయితే అప్పటికే ఆ ఉపాధ్యాయుడికి భార్య, పిల్లలు ఉండడం గమనార్హం. సమాజంలో గౌరవప్రదంగా ఉండాల్సిన ఉపాధ్యాయుడు అనైతిక చర్యలకు పాల్పడి వృత్తికి కళంకం తెచ్చాడు. గతంలోనూ ఇలాంటి సంఘటనలు జరిగాయి. జిల్లాలోని సదాశివనగర్ మండలంలో ఓ ప్రధానోపాధ్యాయుడు విద్యార్థినులతో అసభ్యకరంగా వ్యవహరించిన కేసులో అరెస్టై జైలుకు వెళ్లి వచ్చాడు. కొంత కాలం సస్పెన్షన్ తర్వాత తిరిగి ఉద్యోగంలో చేరాడు. మరో ఉపాధ్యాయుడు ఉపాధ్యాయురాలితో అసభ్యకరంగా వ్యవహరించిన సంఘటనలో ఆమె కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
చిట్టీలు, రియల్ ఎస్టేట్ వ్యాపారం..
చదువు చెప్పి విద్యార్థులను తీర్చిదిద్దాల్సిన ఉపాధ్యాయులలో కొందరు తమ బాధ్యతలను విస్మరించి సొంత దందాలు చేసుకుంటున్నారన్న ఆరోపణలున్నాయి. పలువురు నిబంధనలకు విరుద్ధంగా చిట్టీల దందా కొనసాగిస్తున్నారు. ఇంకొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. కొంతమంది ఉపాధ్యాయులు విధులు ఎగ్గొట్టి సొంత వ్యాపారాలు చేసుకుంటున్నారన్న విమర్శలున్నాయి.
చర్యలేవి?
అనైతిక, అసాంఘిక చర్యలకు పాల్పడిన ఉపాధ్యాయుల విషయంలో సరైన చర్యలు లేకపోవడం మూలంగానే ఇలాంటివి పునరావృతమవుతున్నాయని పలువురు ఆరోపిస్తున్నారు. పాఠశాలలో విద్యార్థినులను లైంగికంగా వేధించిన ఉపాధ్యాయుడిని అరెస్టు చేసి జైలుకు పంపారు. తరువాత బెయిల్‌పై వచ్చి తిరిగి ఉద్యోగంలో చేరాడు. విద్యార్థినులతో అమానవీయంగా వ్యవహరించిన వ్యక్తి దర్జాగా తిరుగుతున్నాడు. మహిళా ఉపాధ్యాయుతో అసభ్యకరంగా వ్యవహరించిన ఉపాధ్యాయులపైనా చర్యల్లేవు. ఆరోపణ వచ్చినపుడు సస్పెండ్ చేయడం, తరువాత సస్పెన్షన్ ఎత్తేయడం పరిపాటిగా మారింది.
సంఘాల మద్దతుతో..
తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేయాల్సిన ఉపాధ్యాయ సంఘాల నాయకులే అలాంటి వారికి అండగా నిలవడం ఉపాధ్యాయ సమాజానికి అపఖ్యాతిని తెచ్చిపెడుతోంది. వృత్తిపరంగా ఆరోపణలు, విమర్శలు వచ్చినపుడు ఏదో తమ సంఘానికి చెందిన వారని వారికి అండగా నిలిచారంటే అర్థం ఉంటుంది కానీ తమ కూతుళ్లలాంటి విద్యార్థినులతో అసభ్యకరంగా, అనైతికంగా వ్యవహరించి సభ్యసమాజం చీదరించుకునే స్థితికి దిగజారిన వ్యక్తులకు అండగా నిలవడం విమర్శలకు తావిస్తోంది.
అనైతిక చర్యలతో ఉపాధ్యాయ లోకానికి చెడ్డపేరు తెస్తున్న వారి విషయంలో అనుకూలంగా వ్యవహరించే పద్ధతులు విడనాడితేనే గౌరవం నిలుస్తుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. తప్పు చేసిన వారిని సమర్థించడం ద్వారా వాళ్లు కూడా తప్పు చేసినవారవుతారనే భావన కలుగుతోంది. ఇప్పటికైనా ఉపాధ్యాయ సంఘాలు ఇలాంటి సంఘటనల విషయంలో బాధ్యులపై చర్యలకు పట్టుబట్టాల్సిన అవసరం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment