యండపల్లికే పట్టం
► పట్టభద్రుల ఎమ్మెల్సీగా యండపల్లి శ్రీనివాసులురెడ్డి ఎన్నిక
► ప్రత్యర్థి టీడీపీ అభ్యర్థిపై ఘన విజయం
► వైఎస్సార్సీపీ మద్దతుతో పీడీఎఫ్ అభ్యర్థుల జయకేతనం
► చతికిల పడిన టీడీపీ
సాక్షి, చిత్తూరు: రాయలసీమ తూర్పు విభాగం చిత్తూరు, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు, ప్రకాశం జిల్లాల నియోజకవర్గ పట్టభద్రుల ఎమ్మెల్సీగా మరోమారు యండపల్లి శ్రీనివాసులకే విద్యావంతులు పట్టం కట్టారు. ఆయన ప్రత్యర్థి టీడీపీ అభ్యర్థి వేమిరెడ్డి పట్టాభిరావిురెడ్డిపై ఘనవిజయాన్ని సాధించారు. వరుసగా రెండోసారి పట్టభద్రుల ఎమ్మెల్సీగా యండపల్లి విజయకేతనం ఎగుర వేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పీడీఎఫ్‌కు మద్దతు పలకడంతో ఉపాధ్యాయుల, పట్టభద్రుల స్థానాలను సునాయాసంగా కైవసం చేసుకున్నారు. పట్టభద్రులు, ఉపాధ్యాయులు ఇచ్చిన తీర్పుతో అధికార టీడీపీ చతికిల పడింది. దీంతో ఉపాధ్యాయులు, పట్టభద్రులు, వైఎస్సార్సీపీ శ్రేణుల్లో ఆనందోత్సాహాలు వెల్లివెరిశాయి.
తూర్పు రాయలసీమ విభాగంలో వరుసగా మూడోసారి కూడా టీడీపీకి ఘోర పరా జయం ఎదురుకావడంతో ఆ పార్టీ వర్గీయుల్లో భవిష్యత్‌పై అంతర్మథనం మొదలైంది. పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి మొత్తం 1,47,907 ఓట్లు పోలయ్యాయి. ఇందులో చెల్లని ఓట్లు 14,551 కాగా మిగిలిన 1,33,202 ఓట్లను అధికారులు పరి గణనలోకి తీసుకున్నారు. ఈ ఓట్ల లెక్కింపులో మొదటి ప్రాధాన్యత కింద 50 శాతానికి పైబడి ఒక్క ఓటుతో మెజారిటీ సాధించాలంటే 66,602 కోటా ఓట్లు ఒకే అభ్యర్థికి రావాల్సి ఉంది. అయితే మొదటి ప్రాధాన్యత రౌండ్లో యండపల్లి శ్రీని వాసులురెడ్డికి 64,089 ఓట్లు రాగా, పట్టాభిరావిురెడ్డికి 60,898 ఓట్లు వచ్చాయి. దీంతో మొదటి ప్రాధాన్యత కోటా ఓట్ల మెజారిటీకి గాను యండపల్లికి 2,513 ఓట్లు తక్కువగా వచ్చాయి. దీంతో అధికారులు ఎలిమినేషన్ పద్ధతిలో రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపును చేపట్టారు. ఈ ప్రక్రియలో మొత్తం 13 మంది అభ్యర్థులు ఎలిమినేషన్ తరువాత యండపలికి మెజారిటీ దక్కింది. దీంతో సమీప ప్రత్యర్థి పట్టాభిరామిరెడ్డిపై 3,232 ఓట్ల ఆధిక్యంతో గెలిచారు.