Teachers salaries
-
తుస్సుమన్న బాబు, పవన్ హామీ.. టీచర్లలో ఆందోళన!
సాక్షి, విజయవాడ: ఏపీలో కూటమి నేతల మాటల కోటలు దాటుతున్నాయి. చంద్రబాబు(chandrababu) పాలనలో చెప్పేదొకటి.. చేసేదొకటి అని మరోసారి రుజువైంది. నెలలో ఐదో తేదీ వచ్చినా ఏపీలో ప్రభుత్వ టీచర్లకు ఇంకా జీతాలు అందని పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో, ప్రభుత్వ తీరుపై టీచర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ఏపీ(Andhra Pradesh)లో ప్రభుత్వ టీచర్లకు ఇంకా జీతాలు అందలేదు. నెలలో ఐదో తేదీ వచ్చినా టీచర్లకు జీతాలను ప్రభుత్వం చెల్లించలేదు. ప్రతీనెలా ఒకటో తేదీనే జీతాలు ఇస్తామని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ (pawan Kalyan) మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే, కూటమి సర్కార్ ఏర్పడిన తర్వాత మొదటి నెలకే ఒకటో తేదీన జీతాల చెల్లింపులకు ప్రభుత్వం పరిమితమైంది. కేవలం ఒకే ఒక నెలలో మాత్రమే ఒకటో తేదీన జీతాలు చెల్లించినట్టు ఉద్యోగులు చెబుతున్నారు.ఇక.. చంద్రబాబు, పవన్ ఇచ్చిన హామీ కనీసం మూడు నెలలు కూడా అమలు చేయని వైనం నెలకొంది. సంక్రాంతి(sankranthi) నెలలో జీతాల కోసం ఏపీలో టీచర్ల ఎదురు చూపులు చూసే పరిస్థితి నెలకొంది. మరోవైపు.. ప్రభుత్వం ఐదు వేల కోట్లు అప్పు తెచ్చినా కూడా టీచర్లకు జీతాలు చెల్లించకపోవడం గమనార్హం. ఈ నేపథ్యంలో చంద్రబాబు ప్రభుత్వం తీరుపై టీచర్లు మండిపడుతున్నారు. ఉపాధ్యాయులతోపాటు పలు శాఖల్లోని ఉద్యోగులకు ఈ నెల ఒకటో తేదీన వేతనాలు అందలేదు. రెండో తేదీ కొంత మంది ఉద్యోగులకు వేతనాలను ప్రభుత్వం జమ చేయగా, ఐదో తేదీకి కూడా ఉపాధ్యాయులు ఎవరికీ జీతాలు అందలేదు. జీతాల కోసం ప్రతి నెలా ఎదురుచూపులు తప్పడం లేదని ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. గత నెల కూడా ఉపాధ్యాయులకు ఒకటో తేదీన వేతనాలు జమచేయలేదు. ప్రతి నెలా 6, 7 తేదీల వరకు జీతాల కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయని ఉపాధ్యాయ సంఘాలు మండిపడుతున్నాయి. -
ఎస్సీ గురుకుల ఉపాధ్యాయుల వేతనాలు పెంపు
సాక్షి, అమరావతి: ఎస్సీ గురుకులాల్లో పనిచేస్తున్న 1,791 మంది పార్ట్ టైమ్ టీచర్ల వేతనాలను పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసినట్టు రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగు నాగార్జున వెల్లడించారు. టీచర్లతో పాటు వ్యాయామ ఉపాధ్యాయులు, హెల్త్ సూపర్ వైజర్ల వేతనాలు కూడా పెంచినట్టు తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఆయన మీడియాకు ఓ ప్రకటన విడుదల చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ అంబేడ్కర్ ఎస్సీ గురుకులాల్లో పనిచేస్తున్న జూనియర్ లెక్చరర్లు, పీజీటీలు, టీజీటీలు, పీఈటీలు, హెల్త్ సూపర్ వైజర్ల వేతనాలు పెంచాలంటూ ఉపాధ్యాయులు చేసిన విజ్ఞప్తి మేరకు బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ సమావేశంలో చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు. గతంలో జూనియర్ లెక్చరర్ల(జేఎల్)వేతనం రూ.18 వేలు ఉండగా.. దీనిని రూ.24,150కు పెంచినట్టు తెలిపారు. పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ల(పీజీటీ) వేతనం రూ.16,100 నుంచి రూ.24,150కు, ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ల(టీజీటీ) వేతనం రూ.14,800 నుంచి రూ.19,350కు, వ్యాయామ ఉపాధ్యాయుల (పీఇటీ) వేతనం రూ.10,900 ఉండగా.. దానిని రూ.16,350కు పెంచినట్టు చెప్పారు. వీరితో పాటు హెల్త్ సూపర్ వైజర్, స్టాఫ్ నర్స్‌ల వేతనం రూ.12,900 ఉండగా దాన్ని రూ.19,350కు పెంచామన్నారు. కాగా, తమ కష్టాలను గుర్తించి తమ వేతనాలను పెంచినందుకు గురుకుల విద్యాలయాల సంస్థ ఉద్యోగుల జేఏసీ నేతలు, టీచర్లు మంత్రి మేరుగు నాగార్జునను శుక్రవారం సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా జేఏసీ చైర్మన్ నాగభూషణం మాట్లాడుతూ తాము కోరిన వెంటనే న్యాయం చేశారని కొనియాడారు. -
రూ. కోట్ల ప్రజా ధనం పంచేసుకున్నఅధికారులు
అక్కడ కంచే చేను మేసింది. ఖజానాకు స్వయంగా ఆ శాఖాధికారులే కన్నం వేశారు. ఇతర శాఖాధికారులతో చేతులు కలిపారు. తప్పుడు ధ్రువీకరణ పత్రాలతో అక్రమంగా నిధులు చెల్లించేశారు. దీనికి అప్పటి పాలక పెద్దలు పరోక్షంగా సహకారం అందించారు. ప్రతీ బిల్లుకూ ఫ్రీజింగ్ అంటూ కొర్రీలు పెట్టే సర్కారు వీటికి నిధులు ఇచ్చేయడం మాత్రం ఇప్పుడు చర్చనీయాంశమైంది. పార్వతీపురం ఎయిడెడ్ స్కూల్ టీచర్లుగా ఎంపికై... ప్రైవేటు ఉద్యోగాలు చేసుకుంటున్నా... జీతాలు చెల్లింపుపై జరుగుతున్న విచారణలో అనేక వాస్తవాలు బయటపడుతున్నాయి. సాక్షి, విజయనగరం : ఉన్నత ఉద్యోగం.. దానికి తగ్గ జీతం, అంతకు మించి భత్యం, వసతులు..అన్నిటినీ మించి ఇంటా, బయటా గౌరవం. ఇవేవీ వారికి సంతృప్తినివ్వలేకపోయాయి. ఇంకా ఏదో లోటు వారిని వేధించింది. అత్యాశకు పోయి ప్రజా ధనాన్ని దోచేందుకు కుట్ర పన్నారు. అనుకున్నదే తడవుగా పథక రచన చేశారు. పోయేది జనం డబ్బే గనుక ప్రజాప్రతినిధులుగా చలామణీ అవుతున్నవారినీ కలుపుకున్నారు. కొందరు మధ్య వర్తులుగా మారారు. మరికొందరు అవసరమైన అస్త్రాలను, దస్త్రాలను తయారు చేశారు. వెనకాముందు చూడకుండా మరికొందరు సంతకాలు చేశారు. ఫింగర్‌ప్రింట్‌ను సైతం తెలియకుండానే వేసేశామంటూ ఇప్పుడు తప్పించుకునేందుకు దారులు వెదుకుతున్నారు. విజయనగరం ట్రెజరీలో ఆయనదే పెత్తనం విజయనగరం జిల్లాలో విజయనగరం, నెల్లమర్ల, చీపురుపల్లి, తెర్లాం, పార్వతీపురం, కురుపాం, సాలూరు, బొబ్బిలి, గజపతినగరం, ఎస్‌కోట, కొత్తవలస కేంద్రాలుగా 13 సబ్ ట్రెజరీలున్నాయి. ఇవన్నీ విజయనగరంలోని జిల్లా ట్రెజరీ ఆధీనంలో ఉంటాయి. ఇక్కడ ఓ అధికారి కనుసన్నల్లోనే మొత్తం జిల్లా ట్రెజరీ వ్యవస్థంతా నడుస్తోంది. ఆయనపై గత జూలైలో సీఎం కార్యాలయానికి ఫిర్యాదు వెళ్లింది. కానీ తూతూ మంత్రంగా కొన్ని విభాగాల నుంచి లెటర్లు తీసుకుని ఎలాంటి విచారణ లేకుండానే ఆ అధికారికి అనుకూలంగా సీఎం కార్యాలయానికి నివేదిక పంపించారు. విజయనగరం జిల్లాలోనే పుట్టి, పెరిగిన ఆ అధికారి 20 ఏళ్లకుపైగా విజయనగరంలోనే విధులు నిర్వర్తిస్తున్నారు. మధ్యలో కేవలం కొన్ని నెలలు మాత్రమే విశాఖ వెళ్లి వచ్చేశారు. పార్వతీపురం ఎయిడెడ్ స్కూళ్ల కుంభకోణం జరిగిన 2017లో ఆయనతో పాటు ఒక ఎస్టీఓ, ఒక అకౌంటెంట్ ద్వారా ఈ పదమూడు మంది టీచర్లు సమర్పించిన తప్పుడు బిల్లులకు చెల్లింపులు చేశారు. ఇప్పుడు ఆ ఎస్టీఓ, అకౌంటెంట్ బదిలీ అయి ఒకరు వేరే విభాగానికి, మరొకరు వేరే ప్రాంతానికి వెళ్లి పోయారు. ఇయన మాత్రం ఇంకా అదే కార్యాలయంలో కొనసాగుతున్నారు. పార్వతీపురం ట్రెజరీలో ఇష్టారాజ్యం ఇక పార్వతీపురం సబ్ ట్రెజరీలో ఒక అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్, సబ్ ట్రెజరీ ఆఫీసర్, నలుగురు సీనియర్ అకౌంటెంట్స్, ఒక జూనియర్ అకౌంటెంట్ ఉన్నారు. ఒక్కో అకౌంటెంట్‌కు కొన్ని ప్రభుత్వ శాఖల బిల్లులను పరిశీలించి, మంజూరు చేసే బాధ్యతలను అప్పగిస్తారు. గత ఆగస్టులోనే ఈ కార్యాలయ ఉద్యోగులపై అవినీతి ఆరోపణలు వచ్చాయి. అప్పట్లో డిప్యూటీ డైరెక్టర్ స్వయంగా వెళ్లి సిబ్బందిని హెచ్చరించారు. ఇద్దరు అకౌంటెంట్ల వద్దనే 60 శాతం విభాగాలుండగా మరో అకౌంటెంట్ వద్ద 30 శాతం, ఇంకొకరి వద్ద 10 శాతం విభాగాలున్నాయి. ఆయా విభాగాల నుంచి వచ్చే రాబడిని ఉన్నతాధికారులకు పంచిపెట్టే వారికి ఈ విధంగా ఎక్కువ విభాగాలను అప్పగించారట. ఈ విషయాన్ని గుర్తించిన డీడీ ఇలా ఎందుకు చేశారంటూ అధికారులను నిలదీశారు. ఈ కార్యాలయంలో బయోమెట్రిక్ మెషిన్ రెండు నెలలుగా పనిచేయడం లేదు. ఇదే అదనుగా కార్యాలయ సిబ్బంది ఇష్టానుసారం విధులకు వచ్చిపోతున్నా సరైన పర్యవేక్షణ లేకపోవడంతో ఎవరిపైనా చర్యలు లేవు. విద్యాశాఖ పర్యవేక్షణ ఏమైంది విద్యాశాఖ విషయానికి వస్తే.. విజయనగరం, బొబ్బిలిలో ఒక్కొక్కరు చొప్పున డిప్యూటీ డీఈఓలు ఉన్నారు. జిల్లాలో ప్రతి మండలానికి ఒక విద్యాశాఖాధికారి చొప్పున(ఎంఈఓ) ఉన్నారు. పాఠశాలలు పనిచేస్తున్నాయా లేదా, ఉపాధ్యాయులెవరెవరు విధులకు హాజరవుతున్నారనే విషయాలపై వీరికి పర్యవేక్షణ ఉంటుంది. కానీ ఈ పదమూడు మంది విషయంలో వీరి పర్యవేక్షణ ఏమైందనేది ఇప్పుడు తలెత్తుతున్న ప్రశ్న. ఎంఈఓ నుంచి డిప్యూటీ డీఈఓకి, అక్కడి నుంచి డీఈఓకి చేరిన నివేదికలను ఆయా అధికారులు పరిశీలించాలి. కానీ అదెక్కడా జరిగినట్టు లేదు. తప్పుడు రికార్డులు తయారీ నిజానికి ఎయిడెడ్ స్కూళ్లలో ఉపాధ్యాయులకు జీతా లు చెల్లించాలంటే జిల్లా విద్యాశాఖ ఉన్నతాధికారి ఫింగర్‌ప్రింట్ అవసరం. అది కూడా ఇక్కడ చాలా తేలికగా వేసేశారు. ఉద్యోగుల జీతభత్యాల వివరాలు నమోదు చేసే పుస్తకం (ఫ్లై లీఫ్)ను తనిఖీ చేసుంటే జరుగుతున్న మోసం ఆదిలోనే బయటపడి ఉండేది. కానీ ఆ పని ట్రెజరీ విభాగం చేయలేదు. కాంప్రహెన్సివ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ సిస్టం (సీఎఫ్ఎం ఎస్) ద్వారా ఈ పదమూడు మంది ఉపాధ్యాయులు తప్పుడు బిల్లులను ట్రెజరీలో అందజేశారు. అయితే అంత పకడ్బందీగా బిల్లులు తయారు చేసేంత నైపుణ్యం ఆ ఉపాధ్యాయులకు ఉండదు. ఆ బిల్లులను కూడా ట్రెజరీ సిబ్బందే తయారు చేయాలి. అంటే ఉద్దేశ్యపూర్వకంగానే ఈ కుంభకోణాన్ని ట్రెజరీ, విద్యాశాఖ అధికారులు, సిబ్బంది కలిసి మూకుమ్మడిగా నడిపించారు. అప్పటి ప్రభుత్వ పెద్దలకు తెలియదా: పార్వతీపురం ఎయిడెడ్ స్కూల్లో విధులు నిర్వహించకుండానే టీచర్లు జీతాలు అక్రమంగా తీసుకున్న కంభకోణంలో ఎవరికీ తెలియదనుకుని దోపిడీదారులు భ్రమపడ్డారు. ఈ కుంభకోణంలో ట్రెజరీ ఉన్నతాధికారుల పాత్ర స్పష్టంగా కనిపిస్తోంది. వీరితో పాటు జిల్లా విద్యాశాఖ అధికారులు సైతం ఈ కుంభకోణంలో పాలుపంచుకోవడంతో ఉన్నతాధికారుల గుండెల్లో గుబులు పట్టుకుంది. ఈ నేపథ్యంలో ఖజానా, విద్యాశాఖలు సంయుక్తంగా జీతాల కుంభకోణాన్ని ఏ విధంగా నడిపించాయనే అంశాలను లోతుగా అధ్యయనం చేస్తే చాలా మంది పెద్దల ప్రమేయం ఉందని స్పష్టంగా తెలుస్తోంది. మొత్తం వ్యవహారం అప్పటి ప్రభుత్వ పెద్దల కనుసన్నల్లోనే జరగడంతో పాటు కొందరు నాయకులు, ఉద్యోగులు మధ్యవర్తులుగా వ్యహరించారని తెలుస్తోంది. ప్రజాధనాన్ని తినేసిన వారి నుంచి ఆ సొమ్మును రికవరీ చేయడంతో పాటు, ఈ కుంభకోణంతో సంబంధం ఉన్న టాప్ టు బాటమ్ ఉద్యోగులపై చర్యలు తీసుకుంటామని జిల్లా విద్యాశాఖాధికారిణి సాక్షాత్తూ ఉపముఖ్యమంత్రికి సభాముఖంగా చెప్పారు. మరి ఆ టాప్ టు బాటమ్‌లో ఉన్నవారే జరిగిన తప్పుపై విచారణ జరిపిస్తే ఏ విధంగా దొంగలను బయటకు తెస్తారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఏదిఏమైనా అక్రమ జీతాల చెల్లింపుల వ్యవహారం వెనుక అసలు దొంగలు తప్పించుకునేందుకు దారులు వెదికేపనిలో బిజీగా ఉన్నారు. -
కొత్త టీచర్ల వేతనాలకు రూ.430 కోట్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ, డైట్ లెక్చరర్ పోస్టులను భర్తీ చేస్తే ఏటా రూ.430.78 కోట్లు వెచ్చించాల్సి ఉంటుందని ఆర్థిక శాఖ లెక్కలు వేసింది. గతంలో రాష్ట్ర కేబినెట్ ఆమోదించిన పోస్టులకు ప్రభుత్వం ఎంత మొత్తాన్ని వేతనాల రూపంలో వెచ్చించాలనే దానిపై అధికారులు ఈ మేరకు లెక్కలు తేల్చారు. పదో పీఆర్సీ ప్రకారం ఈ మొత్తం వెచ్చించాల్సి ఉంటుందని, భవిష్యత్తులో ఈ మొత్తం మరింత పెరుగుతుందని పేర్కొన్నారు. ప్రస్తుతం పాఠశాలలు, టీచర్ల హేతుబద్ధీకరణ చేపట్టేందుకు కసరత్తు చేస్తున్న నేపథ్యంలో పోస్టులు తగ్గుతాయా, పెరుగుతాయా, అనే దానిపై అధికారులు సమాలోచనలు జరుపుతున్నారు. పాఠశాలల్లో ప్రస్తుత పరిస్థితుల ప్రకారం టీచర్ పోస్టుల భర్తీని తగ్గించుకోవడం కష్టమేనని విద్యా శాఖ భావిస్తోంది. ఆర్థిక శాఖ మాత్రం భర్తీ చేయాల్సిన టీచర్ పోస్టుల సంఖ్యను హేతుబద్ధీకరణ ద్వారా వీలైనంత తగ్గిస్తే మేలని పేర్కొంటున్నట్లు విద్యా శాఖ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్ జారీ చేస్తామని, 2017 జూన్ నాటికల్లా పాఠశాలల్లో కొత్త టీచర్లను నియమిస్తామని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఇప్పటికే పలుమార్లు వెల్లడించారు. ఈ నేపథ్యంలో పోస్టులను భర్తీ చేస్తే ఏటా వెచ్చించాల్సిన రూ.430 కోట్లు చెల్లించేలా వచ్చే బడ్జెట్లో పొందుపరచాల్సి ఉంటుందని అధికారులు పేర్కొంటున్నారు. అంత మొత్తాన్ని భరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందా, అనే దానిపై అధికారులు సందేహిస్తున్నా.. కడియం శ్రీహరి మాత్రం టీచర్ల భర్తీని కచ్చితంగా చేపడతామని చెబుతున్నారు. ఖాళీగా ఉన్న 12,142 పోస్టులను జూన్ నాటికి భర్తీ చేసి, స్కూళ్లకు పంపించాలంటే డిసెంబర్, లేదా జనవరిలో నోటిఫికేషన్ జారీ చేస్తేనే సాధ్యమవుతుంది. మరోవైపు ఈనెల 30న విద్యా శాఖ డీఈవోలతో కీలక సమా వేశం నిర్వహించనుంది. టీచర్లు, పాఠశాలల హేతుబద్ధీకరణ చేపట్టిన తర్వాత ఎన్ని పోస్టు లను డెరైక్టు రిక్రూట్మెంట్ కింద భర్తీ చేయా ల్సి ఉంటుందనే దానిపై తుది లెక్కలను తేల్చనుంది. ఆ తర్వాతే పోస్టుల భర్తీ ప్రక్రియను ప్రారంభించే అవకాశం ఉంది. అత్యధికంగా తెలుగు మీడియంలోనే.. ప్రస్తుతం అత్యధికంగా తెలుగు మీడియంలోనే ఖాళీలున్నారుు. తెలుగు మీడియం స్కూళ్లలో 10,114 పోస్టులను భర్తీ చేయాల్సి ఉంది. ఇందుకు ఏటా రూ.347 కోట్లు వెచ్చించాలని ఆర్థిక శాఖ లెక్కలు వేసింది. మోడల్ స్కూళ్లలో ఖాళీగా ఉన్న 717 పోస్టులను భర్తీ చేయాలని, అందుకు ఏటా రూ.37 కోట్లు అవసరమని పేర్కొంది. ఉర్దూ మీడియంలో 1,215 పోస్టులు ఖాళీగా ఉన్నాయని, వాటికి ఏటా రూ.41.38 కోట్లు వెచ్చించాల్సి ఉంటుందని తెలిపింది. డెరైక్టు రిక్రూట్మెంట్ కింద రాష్ట్రంలోని డైట్, సీటీఈ, ఐఏఎస్‌ఈలలో 96 పోస్టులను భర్తీ చేయడం ద్వారా ఏటా రూ.5.4 కోట్లు వెచ్చించాలని పేర్కొంది. -
గురుకులాల్లోని పార్ట్‌టైం టీచర్ల వేతనాలు రెట్టింపు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని వివిధ సంక్షేమ శాఖల ఆధ్వర్యంలోని గురుకుల పాఠశాలలు, కళాశాల పార్ట్‌టైం ఉద్యోగుల వేతనాలు రెట్టింపయ్యాయి. సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సొసైటీతోపాటు మహాత్మా జ్యోతిరావు ఫూలే బీసీ గురుకులాల సొసైటీ పరిధిలోని గురుకులాల్లో పనిచేస్తున్న 7 కేటగిరీలకు చెందిన 935 మంది పార్ట్‌టైం ఉద్యోగుల వేతనాలను పెంచుతూ సర్కార్ నిర్ణయం తీసుకుంది. గురుకుల టీచర్ల సమస్యలపై ఎస్సీ అభివృద్ధిశాఖ మంత్రి జి. జగదీశ్‌రెడ్డితో చర్చల అనంతరం ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు జాయింట్ స్టాఫ్ సొసైటీ నేతలు కె. వెంకటరెడ్డి, ఎ.వి. రంగారెడ్డి, అర్జున, ప్రమోద్‌కుమార్ తెలిపా రు. సర్కారు నిర్ణయంపై హర్షం వ్యక్తం చేశారు. -
ఒక్కరి కోసం!
3 నెలలుగా 59 మంది ఉపాధ్యాయుల జీతాలు నిలిపివేత ఓ ఎస్జీటీ అక్రమ పదోన్నతే కారణమన్న ట్రెజరీ అధికారులు విచారణకు ఇంటలిజెన్స్ బృందం రంగ ప్రవేశం నెల్లూరు, సిటీ : కేవలం ఒక్క ఉపాధ్యాయుడి కారణంగా 59 మంది ఉపాధ్యాయులకు గత మూడు నెలల నుంచి జీతాలు చెల్లించకుండా నెల్లూరు నగర పాలక సంస్థ అధికారులు జాప్యం చేస్తున్నారు. దీంతో అన్ని ఉపాధ్యాయ సంఘాలు కార్పొరేషన్ కార్యాలయం ఎదుట ఆందోళణ చేసేందుకు సిద్ధమవుతున్నాయి. నెల్లూరు నగర పాలక సంస్థ పరిధిలోని 15 మున్సిపల్ పాఠశాలల్లో ఈ ఏడాది జూన్ నెలలో డీఎస్సీ–2014 ద్వారా 59 మంది ఉపాధ్యాయులు నియామకమయ్యారు. వీరు విధుల్లో చేరి మూడు నెలలు గడుస్తున్నా జీతాలు చెల్లింపులు మాత్రం జరగలేదు. నగరపాలక వైవీఎం పాఠశాలలో ఎస్జీటీగా విధులు నిర్వహిస్తున్న ఓ(ఫిజికల్ సైన్స్) ఉపాధ్యాయుడి కారణంగా 59 మంది జీతాలు నిలిచిపోవడం గమనార్హం. అసలు ఏమి జరిగిందంటే నగరపాలక సంస్థ పరిధిలోని వైవీఎం పాఠశాలలో ఎస్జీటీగా విధులు నిర్వహిస్తున్న ఓ ఉపాధ్యాయుడిని 2015లో అక్రమ పదోన్నతిపై స్కూల్‌అసిస్టెంట్‌గా అప్పటి కమిషనర్ నియమించారు. క్యాడర్ స్టెంత్ పరిశీలించకుండా ఫిజికల్ సైన్స్ ఉపాధ్యాయుడిగా నియమించారు. ప్రతి విషయంలో మీనమేషాలు లెక్కించే అధికారులు ఈ అక్రమ పదోన్నతిలో మాత్రం హుటాహుటిన ముందూ వెనకా చూడకుండా పదోన్నతి కల్పించారు. అయితే ఇటీవల డీఎస్సీ–2014 ద్వారా చంద్రకళ అనే మహిళా ఉపాధ్యాయురాలు ఫిజికల్ సైన్స్ పోస్ట్‌కు నియామకమైంది. కార్పొరేషన్ పరిధిలోని పాఠశాలల్లో ఫిజికల్ సైన్స్ పోస్ట్‌లు 27 ఉన్నాయి. అయితే ఓ ఉపాధ్యాయుడి అక్రమ పదోన్నతి కారణంగా 28 మందికి జీతాలు చెల్లించాల్సి వచ్చింది. దీంతో కార్పొరేషన్ అధికారులు 28 మంది ఫిజికల్సైన్స్ ఉపాధ్యాయులకు జీతాలు చెల్లించాలని ట్రైజరీ డిపార్ట్మెంట్ను కోరారు. అయితే నిబంధనల ప్రకారం 27 పోస్ట్‌లు ఉంటే 28 ఏ విధంగా జీతాలు చెల్లించాలని కార్పొరేషన్ అధికారులు పంపిన ఫైల్‌ను వెనక్కు పంపారు. దీంతో గత మూడు నెలల నుంచి 59 మంది జీతాలు నిలిచిపోయాయి. అక్రమ పదోన్నతి వెనుక ఓ ఎమ్మెల్సీ అక్రమ పదోన్నతి పొందిన ఆ ఉపాధ్యాయుని వెనుక ఓ ఎమ్మెల్సీ ఉన్నట్లు సమాచారం. ఆయనకు సన్నిహితంగా ఉండే వ్యక్తి కావడంతో అక్రమ పదోన్నతికి అధికారులపై ఒత్తిడి తీసుకొచ్చారని ఉపాధ్యాయ సంఘాలు మండిపడుతున్నాయి. అధికారులు చేసిన ఘోరమైన తప్పిదాన్ని కప్పిపుచ్చుకునేందుకు ఎస్టీ(గణితం) బ్యాక్ లాగ్ పోస్ట్ ఖాళీగా ఉండడంతో ఆ ఉపాధ్యాయుడిని గణితం ఉపాధ్యాయుడిగా నియమించేందుకు ప్రస్తుతం అధికారులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. నిబంధనల ప్రకారం ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన ఉపాధ్యాయుడి కోసం ఆ పోస్ట్‌ను ఖాళీగా ఉంచారు. అయితే అధికారులు గణిత ఉపాధ్యాయుడి పోస్ట్‌లో నియమించి, అక్రమ పదోన్నతిని సక్రమం చేసేందుకు సిద్ధమయ్యారని తెలుస్తోంది. అయితే ఓ బలమైన ఉపాధ్యాయ సంఘం మాత్రం ఆ ఉపాధ్యాయుడికి బాసటగా నిలుస్తున్నట్లు సమాచారం. విచారణ చేపట్టిన ఇంటిలిజెన్స్ బృందం అక్రమ పోస్టింగ్‌కు సంబంధించి ఇప్పటికే ఇంటిలిజెన్స్ బృందం కూడా విచారణ చేపట్టినట్లు విశ్వసనీయ సమాచారం. కార్పొరేషన్ అధికారులను, పలువురు ఉపాధ్యాయులను ఇంటిలిజెన్స్ బృందం ప్రశ్నించారు. అక్రమ పదోన్నతి రద్దు చేయాలి అక్రమ పదోన్నతిని రద్దు చేసి, 59 ఉపాధ్యాయులకు వెంటనే వేతనం చెల్లించాలి. కార్పొరేషన్ అధికారులు అక్రమాలను ప్రోత్సహించకుండా చట్టబద్ధంగా వ్యవహరించాలి. త్వరగా అక్రమ పదోన్నతిని రద్దు చేయకపోతే ఆందోళణ చేసేందుకు వెనుకాడబోం. –ఎన్.మోహన్‌దాస, ఏపీటీఎఫ్ రాష్ట్ర కౌన్సిలర్ -
ఒక్కో విద్యార్థిపై రూ.37,538
- ప్రభుత్వ బడుల్లో సర్కారు ఏటా వెచ్చిస్తున్న మొత్తమిదీ! - అయినా చేకూరని ప్రయోజనం - టీచర్ల వేతనాలకు రూ.7,711 కోట్లు - ఏటేటా పడిపోతున్న విద్యార్థుల సంఖ్య - అదే సమయంలో ప్రైవేటులో చేరుతున్న విద్యార్థులు - డిస్క్రిప్టివ్ విధానంలో టీచర్ నియామక పరీక్ష వైపు అధికారుల చూపు - ఇంటర్వ్యూలు పెడితేనే బాగుంటుందన్న యోచన సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల్లో 24,12,084 మంది విద్యార్థులు.. 1.23 లక్షల మంది ఉపాధ్యాయులు.. ఏటా రూ.9 వేల కోట్లకు పైగా బడ్జెట్.. ఈ లెక్కన ఒక్కో విద్యార్థిపై ఏటా వెచ్చిస్తున్న మొత్తం రూ. 37,538! అయినా ప్రభుత్వ పాఠశాలల్లో ఆశించిన ఫలితాలు రావడం లేదు. విద్యార్థులకు చదువు ఫలాలు దక్కడం లేదు. ఎయిడెడ్ , రెసిడెన్షియల్ పాఠశాలలు మినహా మిగతా ప్రభుత్వ స్కూళ్లలో చదివే విద్యార్థుల్లో 46 శాతం మంది తెలుగులో కూడా సరిగ్గా చదవలేకపోతున్నారు. సుశిక్షితులైన టీచర్లు ఉన్నా ప్రైవేటు పోటీని అధిగమించలేని పరిస్థితి నెలకొంది. 2015-16 లెక్కల ప్రకారం ఉపాధ్యాయుల వేతనాల కోసం రూ.7,711 కోట్లు ప్రణాళికేతర వ్యయం కింద వెచ్చిస్తున్నా ప్రభుత్వ పాఠశాలల్లో సమస్యలు తప్పడం లేదు. ఉపాధ్యాయుల వేతనంగానే ఒక్కో విద్యార్థిపై ప్రభుత్వం ఏటా రూ.31,969 ఖర్చు చేస్తోంది. ఇక వివిధ పథకాల కింద రూ.1,343 కోట్లు వెచ్చిస్తోంది. ఇందులో ఒక్కో విద్యార్థిపై రూ.5,570 ఖర్చు చేస్తోంది. ఇలా మొత్తంగా ఒక్క విద్యార్థిపైనే ఏటా రూ. 37,538 వెచ్చిస్తున్నా ఆశించిన ఫలితాలు సాధించలేకపోతున్నామని విద్యాశాఖ నివేదికలే స్పష్టం చేస్తున్నాయి. పడిపోతున్న ప్రమాణాలు.. తగ్గుతున్న విద్యార్థులు రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల సంఖ్య ఏటా తగ్గుతోంది. 2011-12 విద్యా సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలల్లో 30,76,352 మంది విద్యార్థులు ఉంటే.. అది 2015-16 విద్యా సంవత్సరం నాటికి 27,92,514కు పడిపోయింది. అంటే 2,83,838 మంది తగ్గిపోయారు. అదే సమయంలో ప్రైవేటు స్కూళ్లలో విద్యార్థుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. 2011లో ప్రైవేటు పాఠశాలల్లో 30,64,343 మంది విద్యార్థులు ఉండగా 2015-16 విద్యా సంవత్సరం వచ్చే సరికి అది 32,70,799కి పెరిగింది. అంటే 2 లక్షలకు పైగా విద్యార్థులు ప్రైవేటు స్కూళ్లకు వెళ్లారు. మిగితా వారు డ్రాపౌట్స్‌గా మిగిలిపోయారు. ఇక ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులుంటే టీచర్లు లేరు.. టీచర్లు ఉంటే విద్యార్థుల్లేరు. విద్యాశాఖ లెక్కల ప్రకారం.. రాష్ట్రంలో ఒక్క విద్యార్థి కూడా లేని ప్రభుత్వ పాఠశాలలు 407 ఉన్నాయి. గతేడాది లెక్కల ప్రకారం 456 స్కూళ్లలో విద్యార్థుల్లేకపోయినా టీచర్లు ఉన్నారు. 180 స్కూళ్లలో పది మందిలోపే పిల్లలున్నా నలుగురు చొప్పున ఉపాధ్యాయులున్నారు. టీచర్లు ఉండి 25 మంది లోపే విద్యార్థులు ఉన్న స్కూళ్లు 300 వరకు ఉన్నాయి. ఇక పిల్లలు ఉండీ.. టీచర్లు ఉన్న చోట కూడా సరైన బోధన అందడం లేదు. ఇంటర్వ్యూలపైనా దృష్టి ఉపాధ్యాయుల నియామకాలపైనా ప్రత్యేక దృష్టి సారించాలని ప్రభుత్వం నిర్ణయించింది. టీచర్ల నియామక విధానంలో మార్పులు తేవాలని భావిస్తోంది. ఆబ్జెక్టివ్ విధానంలో కాకుండా డిస్క్రిప్టివ్ విధానంలో ఉపాధ్యాయ నియామక పరీక్ష నిర్వహించాలని యోచిస్తోంది. ఇంటర్వ్యూ విధానం కూడా పెట్టాలని భావిస్తోంది. తద్వారా పోస్టులకు ఎంపికయ్యే వారిలో బోధన, అభ్యాసన పట్ల వారికున్న ఆసక్తి, కమ్యూనికేషన్ స్కిల్స్, భావోద్వేగాలు, ప్రజ్ఞ, తరగతి బోధన నైపుణ్యం, ప్రదర్శన వంటివి తెలుసుకోవచ్చని, అందుకే ఈ సంస్కరణలు అవసరమని విద్యాశాఖ భావిస్తోంది. అక్షరాస్యతలో 32వ స్థానం దేశవ్యాప్తంగా అక్షరాస్యతలో తెలంగాణ 32వ స్థానంలో ఉంటే.. ఏపీ 30వ స్థానంలో ఉంది. జాతీయ స్థాయిలో పురుషుల అక్షరాస్యత 80.90 శాతం ఉంటే రాష్ట్రంలో 75.04 శాతంగా ఉంది. మహిళల విషయానికొస్తే జాతీయ స్థాయిలో 64.60 శాతం ఉండగా రాష్ట్రంలో 57.99 శాతంగా ఉంది. అసలు లోపం ఎక్కడ? ప్రస్తుతం స్కూళ్లకు టీచర్లు వస్తున్నారా? లేదా? పాఠశాలలు సక్రమంగా పని చేస్తున్నాయా లేదా చూసే వారు లేరు. క్షేత్రస్థాయి పర్యవేక్షకులైన మండల విద్యాధికారి (ఎంఈఓ) పోస్టులు 462 ఉన్నా.. వాటిల్లో 420 పోస్టులు ఖాళీగానే ఉన్నాయి. ఉప విద్యాధికారి (డిప్యూటీ ఈఓ) పోస్టులు 67 ఉంటే అందులోనూ 59 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దీంతో పాఠశాలలను పర్యవేక్షించే వారు లేక క్షేత్ర స్థాయిలో విద్యా వ్యవస్థ పూర్తిగా గాడి తప్పింది. వీటికితోడు ప్రభుత్వ పాఠశాలలపై తల్లిదండ్రుల్లో నమ్మకం సన్నగిల్లింది. దీంతో ఆర్థిక స్తోమత లేని వారంతా మధ్యలోనే బడి మానేస్తున్నారు. మరికొందరు ఇంగ్లిషు మీడియంపై ఆసక్తితో ప్రభుత్వ స్కూళ్లకు విద్యార్థులను పంపించడం లేదు.