ఒక్కో విద్యార్థిపై రూ.37,538 | Rs 37, 538 for every student in govt schools | Sakshi
Sakshi News home page

ఒక్కో విద్యార్థిపై రూ.37,538

Published Tue, Mar 29 2016 2:34 AM | Last Updated on Sun, Sep 3 2017 8:44 PM

ఒక్కో విద్యార్థిపై రూ.37,538

ఒక్కో విద్యార్థిపై రూ.37,538

- ప్రభుత్వ బడుల్లో సర్కారు ఏటా వెచ్చిస్తున్న మొత్తమిదీ!
- అయినా చేకూరని ప్రయోజనం
- టీచర్ల వేతనాలకు రూ.7,711 కోట్లు
- ఏటేటా పడిపోతున్న విద్యార్థుల సంఖ్య
- అదే సమయంలో ప్రైవేటులో చేరుతున్న విద్యార్థులు
- డిస్క్రిప్టివ్ విధానంలో టీచర్ నియామక పరీక్ష వైపు అధికారుల చూపు
- ఇంటర్వ్యూలు పెడితేనే బాగుంటుందన్న యోచన 
 
 సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల్లో 24,12,084 మంది విద్యార్థులు.. 1.23 లక్షల మంది ఉపాధ్యాయులు.. ఏటా రూ.9 వేల కోట్లకు పైగా బడ్జెట్.. ఈ లెక్కన ఒక్కో విద్యార్థిపై ఏటా వెచ్చిస్తున్న మొత్తం రూ. 37,538! అయినా ప్రభుత్వ పాఠశాలల్లో ఆశించిన ఫలితాలు రావడం లేదు. విద్యార్థులకు చదువు ఫలాలు దక్కడం లేదు. ఎయిడెడ్ , రెసిడెన్షియల్ పాఠశాలలు మినహా మిగతా ప్రభుత్వ స్కూళ్లలో చదివే విద్యార్థుల్లో 46 శాతం మంది తెలుగులో కూడా సరిగ్గా చదవలేకపోతున్నారు.
 
 సుశిక్షితులైన టీచర్లు ఉన్నా ప్రైవేటు పోటీని అధిగమించలేని పరిస్థితి నెలకొంది. 2015-16 లెక్కల ప్రకారం ఉపాధ్యాయుల వేతనాల కోసం రూ.7,711 కోట్లు ప్రణాళికేతర వ్యయం కింద వెచ్చిస్తున్నా ప్రభుత్వ పాఠశాలల్లో సమస్యలు తప్పడం లేదు. ఉపాధ్యాయుల వేతనంగానే ఒక్కో విద్యార్థిపై ప్రభుత్వం ఏటా రూ.31,969 ఖర్చు చేస్తోంది. ఇక వివిధ పథకాల కింద రూ.1,343 కోట్లు వెచ్చిస్తోంది. ఇందులో ఒక్కో విద్యార్థిపై రూ.5,570 ఖర్చు చేస్తోంది. ఇలా మొత్తంగా ఒక్క విద్యార్థిపైనే ఏటా రూ. 37,538 వెచ్చిస్తున్నా ఆశించిన ఫలితాలు సాధించలేకపోతున్నామని విద్యాశాఖ నివేదికలే స్పష్టం చేస్తున్నాయి.
 
 పడిపోతున్న ప్రమాణాలు.. తగ్గుతున్న విద్యార్థులు
 రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల సంఖ్య ఏటా తగ్గుతోంది. 2011-12 విద్యా సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలల్లో 30,76,352 మంది విద్యార్థులు ఉంటే.. అది 2015-16 విద్యా సంవత్సరం నాటికి 27,92,514కు పడిపోయింది. అంటే 2,83,838 మంది తగ్గిపోయారు. అదే సమయంలో ప్రైవేటు స్కూళ్లలో విద్యార్థుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. 2011లో ప్రైవేటు పాఠశాలల్లో 30,64,343 మంది విద్యార్థులు ఉండగా 2015-16 విద్యా సంవత్సరం వచ్చే సరికి అది 32,70,799కి పెరిగింది. 
 
 అంటే 2 లక్షలకు పైగా విద్యార్థులు ప్రైవేటు స్కూళ్లకు వెళ్లారు. మిగితా వారు డ్రాపౌట్స్‌గా మిగిలిపోయారు. ఇక ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులుంటే టీచర్లు లేరు.. టీచర్లు ఉంటే విద్యార్థుల్లేరు. విద్యాశాఖ లెక్కల ప్రకారం.. రాష్ట్రంలో ఒక్క విద్యార్థి కూడా లేని ప్రభుత్వ పాఠశాలలు 407 ఉన్నాయి. గతేడాది లెక్కల ప్రకారం 456 స్కూళ్లలో విద్యార్థుల్లేకపోయినా టీచర్లు ఉన్నారు. 180 స్కూళ్లలో పది మందిలోపే పిల్లలున్నా నలుగురు చొప్పున ఉపాధ్యాయులున్నారు. టీచర్లు ఉండి 25 మంది లోపే విద్యార్థులు ఉన్న స్కూళ్లు 300 వరకు ఉన్నాయి. ఇక పిల్లలు ఉండీ.. టీచర్లు ఉన్న చోట కూడా సరైన బోధన అందడం లేదు. 
 
 ఇంటర్వ్యూలపైనా దృష్టి
 ఉపాధ్యాయుల నియామకాలపైనా ప్రత్యేక దృష్టి సారించాలని ప్రభుత్వం నిర్ణయించింది. టీచర్ల నియామక విధానంలో మార్పులు తేవాలని భావిస్తోంది. ఆబ్జెక్టివ్ విధానంలో కాకుండా డిస్క్రిప్టివ్ విధానంలో ఉపాధ్యాయ నియామక పరీక్ష నిర్వహించాలని యోచిస్తోంది. ఇంటర్వ్యూ విధానం కూడా పెట్టాలని భావిస్తోంది. తద్వారా పోస్టులకు ఎంపికయ్యే వారిలో బోధన, అభ్యాసన పట్ల వారికున్న ఆసక్తి, కమ్యూనికేషన్ స్కిల్స్, భావోద్వేగాలు, ప్రజ్ఞ, తరగతి బోధన నైపుణ్యం, ప్రదర్శన వంటివి తెలుసుకోవచ్చని, అందుకే ఈ సంస్కరణలు అవసరమని విద్యాశాఖ భావిస్తోంది.
 
 అక్షరాస్యతలో 32వ స్థానం
దేశవ్యాప్తంగా అక్షరాస్యతలో తెలంగాణ 32వ స్థానంలో ఉంటే.. ఏపీ 30వ స్థానంలో ఉంది. జాతీయ స్థాయిలో పురుషుల అక్షరాస్యత 80.90 శాతం ఉంటే రాష్ట్రంలో 75.04 శాతంగా ఉంది. మహిళల విషయానికొస్తే జాతీయ స్థాయిలో 64.60 శాతం ఉండగా రాష్ట్రంలో 57.99 శాతంగా ఉంది. 
 
అసలు లోపం ఎక్కడ?
 ప్రస్తుతం స్కూళ్లకు టీచర్లు వస్తున్నారా? లేదా? పాఠశాలలు సక్రమంగా పని చేస్తున్నాయా లేదా చూసే వారు లేరు. క్షేత్రస్థాయి పర్యవేక్షకులైన మండల విద్యాధికారి (ఎంఈఓ) పోస్టులు 462 ఉన్నా.. వాటిల్లో 420 పోస్టులు ఖాళీగానే ఉన్నాయి. ఉప విద్యాధికారి (డిప్యూటీ ఈఓ) పోస్టులు 67 ఉంటే అందులోనూ 59 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దీంతో పాఠశాలలను పర్యవేక్షించే వారు లేక  క్షేత్ర స్థాయిలో విద్యా వ్యవస్థ పూర్తిగా గాడి తప్పింది. వీటికితోడు ప్రభుత్వ పాఠశాలలపై తల్లిదండ్రుల్లో నమ్మకం సన్నగిల్లింది. దీంతో ఆర్థిక స్తోమత లేని వారంతా మధ్యలోనే బడి మానేస్తున్నారు. మరికొందరు ఇంగ్లిషు మీడియంపై ఆసక్తితో ప్రభుత్వ స్కూళ్లకు విద్యార్థులను పంపించడం లేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement