రూ. కోట్ల ప్రజా ధనం పంచేసుకున్నఅధికారులు | Irregularities In Aided School Teachers Salaries In Vizianagaram | Sakshi
Sakshi News home page

రూ. కోట్ల ప్రజా ధనం పంచేసుకున్నఅధికారులు

Published Mon, Nov 11 2019 9:16 AM | Last Updated on Mon, Nov 11 2019 9:16 AM

Irregularities In Aided School Teachers Salaries In Vizianagaram - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

అక్కడ కంచే చేను మేసింది. ఖజానాకు స్వయంగా ఆ శాఖాధికారులే కన్నం వేశారు. ఇతర శాఖాధికారులతో చేతులు కలిపారు. తప్పుడు ధ్రువీకరణ పత్రాలతో అక్రమంగా నిధులు చెల్లించేశారు. దీనికి అప్పటి పాలక పెద్దలు పరోక్షంగా సహకారం అందించారు. ప్రతీ బిల్లుకూ ఫ్రీజింగ్‌ అంటూ కొర్రీలు పెట్టే సర్కారు వీటికి నిధులు ఇచ్చేయడం మాత్రం ఇప్పుడు చర్చనీయాంశమైంది. పార్వతీపురం ఎయిడెడ్‌ స్కూల్‌ టీచర్లుగా ఎంపికై... ప్రైవేటు ఉద్యోగాలు చేసుకుంటున్నా... జీతాలు చెల్లింపుపై జరుగుతున్న విచారణలో అనేక వాస్తవాలు బయటపడుతున్నాయి.

సాక్షి, విజయనగరం : ఉన్నత ఉద్యోగం.. దానికి తగ్గ జీతం, అంతకు మించి భత్యం, వసతులు..అన్నిటినీ మించి ఇంటా, బయటా గౌరవం. ఇవేవీ వారికి సంతృప్తినివ్వలేకపోయాయి. ఇంకా ఏదో లోటు వారిని వేధించింది. అత్యాశకు పోయి ప్రజా ధనాన్ని దోచేందుకు కుట్ర పన్నారు. అనుకున్నదే తడవుగా పథక రచన చేశారు. పోయేది జనం డబ్బే గనుక ప్రజాప్రతినిధులుగా చలామణీ అవుతున్నవారినీ కలుపుకున్నారు. కొందరు మధ్య వర్తులుగా మారారు. మరికొందరు అవసరమైన అస్త్రాలను, దస్త్రాలను తయారు చేశారు. వెనకాముందు చూడకుండా మరికొందరు సంతకాలు చేశారు. ఫింగర్‌ప్రింట్‌ను సైతం తెలియకుండానే వేసేశామంటూ ఇప్పుడు తప్పించుకునేందుకు దారులు వెదుకుతున్నారు. 

విజయనగరం ట్రెజరీలో ఆయనదే పెత్తనం 
విజయనగరం జిల్లాలో విజయనగరం, నెల్లమర్ల, చీపురుపల్లి, తెర్లాం, పార్వతీపురం, కురుపాం, సాలూరు, బొబ్బిలి, గజపతినగరం, ఎస్‌కోట, కొత్తవలస కేంద్రాలుగా 13 సబ్‌ ట్రెజరీలున్నాయి. ఇవన్నీ విజయనగరంలోని జిల్లా ట్రెజరీ ఆధీనంలో ఉంటాయి. ఇక్కడ ఓ అధికారి కనుసన్నల్లోనే మొత్తం జిల్లా ట్రెజరీ వ్యవస్థంతా నడుస్తోంది. ఆయనపై గత జూలైలో సీఎం కార్యాలయానికి ఫిర్యాదు వెళ్లింది. కానీ తూతూ మంత్రంగా కొన్ని విభాగాల నుంచి లెటర్లు తీసుకుని ఎలాంటి విచారణ లేకుండానే ఆ అధికారికి అనుకూలంగా సీఎం కార్యాలయానికి నివేదిక పంపించారు. విజయనగరం జిల్లాలోనే పుట్టి, పెరిగిన ఆ అధికారి 20 ఏళ్లకుపైగా విజయనగరంలోనే విధులు నిర్వర్తిస్తున్నారు. మధ్యలో కేవలం కొన్ని నెలలు మాత్రమే విశాఖ వెళ్లి వచ్చేశారు. పార్వతీపురం ఎయిడెడ్‌ స్కూళ్ల కుంభకోణం జరిగిన 2017లో ఆయనతో పాటు ఒక ఎస్‌టీఓ, ఒక అకౌంటెంట్‌ ద్వారా ఈ పదమూడు మంది టీచర్లు సమర్పించిన తప్పుడు బిల్లులకు చెల్లింపులు చేశారు. ఇప్పుడు ఆ ఎస్‌టీఓ, అకౌంటెంట్‌ బదిలీ అయి ఒకరు వేరే విభాగానికి, మరొకరు వేరే ప్రాంతానికి వెళ్లి పోయారు. ఇయన మాత్రం ఇంకా అదే కార్యాలయంలో కొనసాగుతున్నారు. 

పార్వతీపురం ట్రెజరీలో ఇష్టారాజ్యం 
ఇక పార్వతీపురం సబ్‌ ట్రెజరీలో ఒక అసిస్టెంట్‌ ట్రెజరీ ఆఫీసర్, సబ్‌ ట్రెజరీ ఆఫీసర్, నలుగురు సీనియర్‌ అకౌంటెంట్స్, ఒక జూనియర్‌ అకౌంటెంట్‌ ఉన్నారు. ఒక్కో అకౌంటెంట్‌కు కొన్ని ప్రభుత్వ శాఖల బిల్లులను పరిశీలించి, మంజూరు చేసే బాధ్యతలను అప్పగిస్తారు. గత ఆగస్టులోనే ఈ కార్యాలయ ఉద్యోగులపై అవినీతి ఆరోపణలు వచ్చాయి. అప్పట్లో డిప్యూటీ డైరెక్టర్‌ స్వయంగా వెళ్లి సిబ్బందిని హెచ్చరించారు. ఇద్దరు అకౌంటెంట్ల వద్దనే 60 శాతం విభాగాలుండగా మరో అకౌంటెంట్‌ వద్ద 30 శాతం, ఇంకొకరి వద్ద 10 శాతం విభాగాలున్నాయి. ఆయా విభాగాల నుంచి వచ్చే రాబడిని ఉన్నతాధికారులకు పంచిపెట్టే వారికి ఈ విధంగా ఎక్కువ విభాగాలను అప్పగించారట. 
ఈ విషయాన్ని గుర్తించిన డీడీ ఇలా ఎందుకు చేశారంటూ అధికారులను నిలదీశారు. ఈ కార్యాలయంలో బయోమెట్రిక్‌ మెషిన్‌ రెండు నెలలుగా పనిచేయడం లేదు. ఇదే అదనుగా కార్యాలయ సిబ్బంది ఇష్టానుసారం విధులకు వచ్చిపోతున్నా సరైన పర్యవేక్షణ లేకపోవడంతో ఎవరిపైనా చర్యలు లేవు. 

విద్యాశాఖ పర్యవేక్షణ ఏమైంది 
విద్యాశాఖ విషయానికి వస్తే.. విజయనగరం, బొబ్బిలిలో ఒక్కొక్కరు చొప్పున డిప్యూటీ డీఈఓలు ఉన్నారు. జిల్లాలో ప్రతి మండలానికి ఒక విద్యాశాఖాధికారి చొప్పున(ఎంఈఓ) ఉన్నారు. పాఠశాలలు పనిచేస్తున్నాయా లేదా, ఉపాధ్యాయులెవరెవరు విధులకు హాజరవుతున్నారనే విషయాలపై వీరికి పర్యవేక్షణ ఉంటుంది. కానీ ఈ పదమూడు మంది విషయంలో వీరి పర్యవేక్షణ ఏమైందనేది ఇప్పుడు తలెత్తుతున్న ప్రశ్న. ఎంఈఓ నుంచి డిప్యూటీ డీఈఓకి, అక్కడి నుంచి డీఈఓకి చేరిన నివేదికలను ఆయా అధికారులు పరిశీలించాలి. కానీ అదెక్కడా జరిగినట్టు లేదు. 

తప్పుడు రికార్డులు తయారీ 
నిజానికి ఎయిడెడ్‌ స్కూళ్లలో ఉపాధ్యాయులకు జీతా లు చెల్లించాలంటే జిల్లా విద్యాశాఖ ఉన్నతాధికారి ఫింగర్‌ప్రింట్‌ అవసరం. అది కూడా ఇక్కడ చాలా తేలికగా వేసేశారు. ఉద్యోగుల జీతభత్యాల వివరాలు నమోదు చేసే పుస్తకం (ఫ్‌లై లీఫ్‌)ను తనిఖీ చేసుంటే జరుగుతున్న మోసం ఆదిలోనే బయటపడి ఉండేది. కానీ ఆ పని ట్రెజరీ విభాగం చేయలేదు. కాంప్రహెన్సివ్‌ ఫైనాన్షియల్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టం (సీఎఫ్‌ఎం ఎస్‌) ద్వారా ఈ పదమూడు మంది ఉపాధ్యాయులు తప్పుడు బిల్లులను ట్రెజరీలో అందజేశారు. అయితే అంత పకడ్బందీగా బిల్లులు తయారు చేసేంత నైపుణ్యం ఆ ఉపాధ్యాయులకు ఉండదు. ఆ బిల్లులను కూడా ట్రెజరీ సిబ్బందే తయారు చేయాలి. అంటే ఉద్దేశ్యపూర్వకంగానే ఈ కుంభకోణాన్ని ట్రెజరీ, విద్యాశాఖ అధికారులు, సిబ్బంది కలిసి మూకుమ్మడిగా నడిపించారు.  

అప్పటి ప్రభుత్వ పెద్దలకు తెలియదా: 
పార్వతీపురం ఎయిడెడ్‌ స్కూల్‌లో విధులు నిర్వహించకుండానే టీచర్లు జీతాలు అక్రమంగా తీసుకున్న కంభకోణంలో ఎవరికీ తెలియదనుకుని దోపిడీదారులు భ్రమపడ్డారు. ఈ కుంభకోణంలో ట్రెజరీ ఉన్నతాధికారుల పాత్ర స్పష్టంగా కనిపిస్తోంది. వీరితో పాటు జిల్లా విద్యాశాఖ అధికారులు సైతం ఈ కుంభకోణంలో పాలుపంచుకోవడంతో ఉన్నతాధికారుల గుండెల్లో గుబులు పట్టుకుంది. ఈ నేపథ్యంలో ఖజానా, విద్యాశాఖలు సంయుక్తంగా జీతాల కుంభకోణాన్ని ఏ విధంగా నడిపించాయనే అంశాలను లోతుగా అధ్యయనం చేస్తే చాలా మంది పెద్దల ప్రమేయం ఉందని స్పష్టంగా తెలుస్తోంది. మొత్తం వ్యవహారం అప్పటి ప్రభుత్వ పెద్దల కనుసన్నల్లోనే జరగడంతో పాటు కొందరు నాయకులు, ఉద్యోగులు మధ్యవర్తులుగా వ్యహరించారని తెలుస్తోంది. ప్రజాధనాన్ని తినేసిన వారి నుంచి ఆ సొమ్మును రికవరీ చేయడంతో పాటు, ఈ కుంభకోణంతో సంబంధం ఉన్న టాప్‌ టు బాటమ్‌ ఉద్యోగులపై చర్యలు తీసుకుంటామని జిల్లా విద్యాశాఖాధికారిణి సాక్షాత్తూ ఉపముఖ్యమంత్రికి సభాముఖంగా చెప్పారు. మరి ఆ టాప్‌ టు బాటమ్‌లో ఉన్నవారే జరిగిన తప్పుపై విచారణ జరిపిస్తే ఏ విధంగా దొంగలను బయటకు తెస్తారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఏదిఏమైనా అక్రమ జీతాల చెల్లింపుల వ్యవహారం వెనుక అసలు దొంగలు తప్పించుకునేందుకు దారులు వెదికేపనిలో బిజీగా ఉన్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement