Teachers suspended
-
యాసిడ్ ఘటనలో ఇద్దరిపై వేటు
చిత్తూరు , తిరుపతి రూరల్: చెర్లోపల్లె జెడ్పీ హైస్కూల్ తరగతి గదిలో యాసిడ్ బాటిల్స్ పగిలి ఐదుగురు విద్యార్థులు గాయపడిన ఘటనకు సంబంధించి విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఇద్దరు టీచర్లను సస్పెండ్ చేస్తూ మంగళవారం సాయంత్రం చిత్తూరు డీఈఓ పాండురంగస్వామి ఉత్తర్వులు జారీ చేశారు. డిజిటల్ క్లాస్ రూమ్‌లోనే సైన్స్ ల్యాబ్‌ను నిర్వహించడమే ఈ ఘటనకు ప్రధాన కారణంగా నిర్ధారించారు. ప్రమాదకరమైన యాసిడ్ బాటిల్స్‌ను నిర్లక్ష్యంగా వదిలేసిన సైన్స్ టీచర్, ఘటన సమయంలో విద్యార్థుల పర్యవేక్షణను విస్మరించిన క్లాస్ టీచర్‌ను సస్పెండ్ చేశారు. రెండో రోజు విచారణ యాసిడ్ పడి విద్యార్థులు గాయపడిన ఘటనపై రెండో రోజు మంగళవారం ఎంఈఓ ప్రేమలత, స్కూల్ హెచ్ఎం సుజని, ఉపాధ్యాయులను తిరుపతి సబ్ కలెక్టర్ మహేష్‌కుమార్ తన కార్యాలయంలో విచారణ చేశారు. యాసిడ్ ఘటనకు దారితీసిన కారణాలేమిటో వారిని వేర్వేరుగా అడిగి తెలుసుకున్నారు. ఆపై కలెక్టర్‌కు నివేదిక సమర్పించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న యాసిడ్ బాధిత విద్యార్థులను ఎమ్మెల్సీ యండపల్లి శ్రీనివాసులురెడ్డి, చిత్తూరు డీఈఓ పాండురంగస్వామి పరామర్శించారు. వైద్యులతో వారి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో అడిగి తెలుసుకున్నారు. అనంతరం చెర్లోపల్లె స్కూల్లో ఘటనకు సంబంధించి క్లాస్ రూమ్‌ను వారు పరిశీలించారు. -
స్టూడెంట్స్‌కు అసభ్యకర మెసెజ్‌లు..!
సాక్షి, క్రైమ్ : మైనర్ స్టూడెంట్స్‌కు అసభ్యకరమైన మెసెజ్‌లు పంపినందుకు టీచర్లను సస్పెండ్ చేసిన ఘటన జమ్మూ కాశ్మీర్లో శుక్రవారం చోటుచేసుకుంది. వివరాలు.. కుప్వారా జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న స్టూడెంట్స్‌కు ఉపాధ్యాయులు అసభ్యకరమైన సందేశాలను ఫోన్ ద్వారా పంపించారు. ఇది తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు ప్రధాన విద్యాధికారి మహ్మద్ షఫీకి ఫిర్యాదు చేశారు. వెంటనే ఆ ఉపాధ్యాయులిద్దరినీ సస్పెండ్ చేశారు. అంతేకాకుండా జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం అంతర్గత విచారణ కోసం ఇద్దరు సభ్యులతో కూడిన కమిటీని కూడా నియమించింది. పోలీసులు సుమోటోగా కేసును స్వీకరించి, కేసు నమోదు చేసుకుని, ఫాస్ట్ ట్రాక్ ద్వారా విచారణను వేగవంతం చేయనున్నట్లు హంద్వారా సీనియర్ పోలీస్అధికారి జీలాని వనీ తెలిపారు. ఎనిమిది రోజుల క్రితమే ఇలాంటి ఘటన ఒకటి చోటుచేసుకుంది. పదకొండో తరగతి చదువుతున్న ఓ బాలికను, ఉపాధ్యాయుడు అత్యాచారం చేసి, అబార్షన్ చేయించడం కోసం ప్రయత్నించగా పట్టుబడ్డాడు. -
షార్ సెంట్రల్ స్కూల్ లో లైంగిక వేధింపులు
సూళ్లూరుపేట: నెల్లూరు జిల్లా షార్ సెంట్రల్ స్కూల్ లో లైంగిక వేధింపులు వెలుగులోకి వచ్చాయి. విద్యార్థినులను, సిబ్బందిని వేధిస్తున్న ముగ్గురు ఉపాధ్యాయులను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. వివరాలు.. కేంద్రీయ పాఠశాలలో పదో తరగతి చదువుతున్న విద్యార్థినిల పట్ల కొందరు ఉపాధ్యాయులు అసభ్యంగా ప్రవర్తించారు. పరీక్షల సందర్భంగా వేధింపులు ఎక్కువవడంతో విద్యార్థినులు ఈ విషయాన్ని తల్లిదండ్రుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో వారు పాఠశాలలోని లలితకుమారి కమిటీకి ఉపాధ్యాయుల తీరుపై ఫిర్యాదు చేశారు. కమిటీ విచారణ చేపట్టి గర్భోజి, షణ్ముఖ సుందరం, కృష్ణప్రసాద్ అనే ముగ్గురు ఉపాధ్యయులు బాలికలను లైంగికంగా వేధిస్తున్నారని గుర్తించారు. షార్ కంట్రోలర్ దేవిరాజారెడ్డి ఆ ముగ్గురు ఉపాధ్యాయులను విధుల నుంచి సస్పెండ్ చేస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీచేశారు. -
ముగ్గురు టీచర్లు సస్పెండయ్యారు
కోల్‌కతా: విద్యార్థులపై లైంగిక వేధింపులకు పాల్పడిన 'సత్యజిత్ రే ఇన్ స్టిట్యూట్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్'కు చెందిన ముగ్గురు టీచర్లను సస్పెండ్ చేశారు. విద్యార్థుల ఫిర్యాదుమేరకు తక్షణ చర్యలుగా వారిపై సస్పెండ్ వేటు వేశారు. 'ఇన్ స్టిట్యూట్ అంతర్గత ఫిర్యాదుల కమిటీ ఆ ముగ్గురు టీచర్లపై నమోదైన ఆరోపణలపై విచారణ జరుపుతోంది. దీనిపై ఇప్పుడే మేం ఎలాంటి వ్యాఖ్యలు చేయబోం' అని ఇన్ స్టిట్యూట్ రిజిస్ట్రార్ అనింద్యా ఆచార్య చెప్పారు. సినిమా విభాగానికి సంబంధించి మంచి నైపుణ్యం, మెళకువలు నేర్పించడంలో సత్యజిత్ రే ఫిల్మ్ ఇన్ స్టిట్యూట్ పేరు గాంచిన విషయం తెలిసిందే. ఇటీవల లైంగిక వేధింపులకు సంబంధించిన ఫిర్యాదులు ఎక్కువవుతున్నాయి. -
విద్యాశాఖలో కలకలం
ఆదిలాబాద్ టౌన్, న్యూస్‌లైన్ : పదో తరగతి ఇన్విజిలేటర్లపై కలెక్టర్ అహ్మద్‌బాబు కొరడా ఝుళిపించారు. పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని ఆదేశించినా విద్యాశాఖ తీరు మారకపోవడంతో వేటు వేశారు. ఇన్విజిలేటర్లు నిర్లక్ష్యంగా, అలసత్వంగా వ్యవహరించడంతో ఇప్పటివరకు 27 మంది విద్యార్థులు మాస్‌కాపీయింగ్‌కు పాల్పడుతూ డిబార్ అయ్యారు. మొదటి రోజు 9, రెండో రోజూ ఐదుగురు, మూడో రోజూ 13 మంది డిబార్ అయ్యారు. ఈ మేరకు మాస్ కాపీయింగ్‌కు ప్రోత్సహించిన ఇన్విజిలేటర్ల వివరాలు, కేంద్రాలను డీఈవో వద్ద తీసుకుని 24 మంది ఇన్విజిలేటర్లను సస్పెండ్ చేస్తూ ఆదివారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో ఒక్కసారిగా విద్యాశాఖ ఉలిక్కిపడింది. దీంతో మిగతా ఇన్విజిలేరట్లు, సీఎస్‌లు, డీవోలు భయాందోళనకు గురవుతున్నారు. వీరితోపాటు ఆయా పరీక్ష కేంద్రాల చీఫ్ సూపరింటెండెంట్లుగా వ్యవహరించిన 18 మందిపై చర్యలు తీసుకోవాలని విద్యాశాఖ ఆర్జేడీకి, ఐటీడీఏ పీవోకు, సాంఘీక సంక్షేమ శాఖ డీడీకి ఉత్తర్వులు పంపారు. వీరిపై కూడా సస్పెషన్ వేటు పడే అవకాశాలు లేకపోలేదు. జంకుతున్న ఉపాధ్యాయులు పదో తరగతి ఇన్విజిలేషన్ చేయడానికి ఉపాధ్యాయులు జంకుతున్నారు. పశ్చిమ ప్రాంతంలో జోరుగా మాస్ కాపీయింగ్ జరుగుతున్నట్లు సమాచారం. ఈ ప్రాంతాల్లోని కొంత మంది సీఎస్, డీవోలు మామూళ్లకు ఆశపడి పరీక్ష కేంద్రాల్లో జోరుగా మాస్ కాపీయిం గ్ను ప్రోత్సహిస్తున్నట్లు ఆరోపణలు గుప్పుమంటున్నాయి. ఈ విషయంతో ఆ ప్రాంతంలో ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి. మొదటి రెండు పరీక్షలకే 24 మంది ఉపాధ్యాయులు సస్పెండ్ కావడంతో మిగతా పరీక్షల పరిస్థితి ఎలా ఉం టుందో అని ఆందోళన చెందుతున్నారు. అధికారులు పరీక్షలు పకడ్బందీగా నిర్వహించి, కష్టపడి చదివిన విద్యార్థులకు న్యాయం చేయాల్సిన అవసరం ఉంది. సస్పెండ్ చేయడం సరికాదు.. - రవీంద్ర, ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు జిల్లాలో మాస్ కాపీయింగ్‌కు ప్రోత్సహించారని ఇన్విజిలేషన్ నిర్వహిస్తున్న ఉపాధ్యాయులను సస్పెండ్ చేయడం సరికాదు. వారికి షోకాజ్ నోటీసులు ఇస్తే సరిపోయేది. ఇలాంటి చర్యల వల్ల ఉపాధ్యాయుల మనోధైర్యం దెబ్బ తింటుంది. మానసిక ఒత్తిళ్లకు గురయ్యే అవకాశం ఉంది. కలెక్టర్ ఆదేశాల మేరకే ఉపాధ్యాయులు పకడ్బందీగా నిర్వహిస్తున్నారు. కానీ అధికారులు సస్పెన్షన్ విషయంలో మరోసారి ఆలోచించాలి.