tears in his eyes
-
కొడుకు స్పీచ్.. ముఖేష్ అంబానీ కన్నీళ్లు! వీడియో వైరల్
Mukesh Ambani tears video : రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత, ప్రపంచ కుబేరుల్లో ఒకరైన ముఖేష్ అంబానీ చిన్నకుమారుడు అనంత్ అంబానీ-రాధికా మర్చంట్ల వివాహం త్వరలో జరుగనుంది. వివాహానికి ముందు ప్రీ వెడ్డింగ్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు, సెలబ్రిటీలు ఈ గ్రాండ్ ఈవెంట్‌కి విచ్చేశారు. ఈ సందర్భంగా కొడుకు మాటలకు ముఖేష్ అంబానీ భావోద్వేగానికి గురయ్యారు. ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో అనేక మంది అతిథుల సమక్షంలో పెళ్లికొడుకు అనంత్ అంబానీ ప్రసంగించారు. తల్లిదండ్రులు ముఖేష్ అంబానీ, నీతా అంబానీలకు కృతజ్ఞతలు తెలుపుతున్నప్పుడు ముఖేష్ అంబానీ భావోద్యేగానికి గురయ్యారు. కన్నీళ్లను ఆపుకోలేకపోయాడు. అనంత్ అంబానీ చేసిన భావోద్వేగ ప్రసంగంలో ముఖ్యంగా తాను అనారోగ్య సమస్యలతో పోరాడుతున్నప్పుడు తన తల్లిదండ్రులు అందించిన సపోర్ట్ గురించి అనంత్ అంబానీ చెబుతుండగా ముఖేష్ కళ్లలో నీళ్లు తిరిగాయి. సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ మారింది. థాంక్యూ అమ్మా.. నాన్న "ఇదంతా అమ్మ చేసిందే.. ఆమె నా కోసం చాలా కష్టపడింది. గత నాలుగు నెలలుగా ఆమె రోజుకు 18-19 గంటలు నా కోసం కష్టపడ్డారు. నేను అమ్మకు చాలా కృతజ్ఞుడను . అమ్మా, మీరు చేసిన ప్రతిదానికీ ధన్యవాదాలు" అని అనంత్ అంబానీ ప్రసంగంలో పేర్కొన్నారు. "మా నాన్న, అమ్మ ఎల్లప్పుడూ నాకు అండగా నిలిచారు. నేను ఏదైనా సాధించగలను అనే ఆత్మ విశ్వాసాన్ని నాకు కలిగించారు. మా నాన్న, అమ్మ నన్ను ఎంతగా అర్థం చేసుకున్నారో.. నేను వారికి ఎప్పటికీ కృతజ్ఞుడను" అని భావోద్వేగంతో చెప్పుకొచ్చారు. నా కొడుకులోనే చూసుకుంటున్నా కాగా అంతకుముందు వేడుకలకు విచ్చేసిన ప్రముఖ వ్యాపారవేత్తలు, కళాకారులు, క్రీడాకారులు, చలనచిత్ర ప్రముఖులు, ఇతర అతిథులందరినీ ఉద్దేశిస్తూ ముఖేష్ అంబానీ ప్రసంగించారు. కార్యక్రమానికి వచ్చినందుకు వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. తమ కుటుంబ అనుబంధం గురించి ప్రస్తావించారు. తన చిన్న కొడుకు అనంత్ అంబానీలోనే చనిపోయిన తన తండ్రి ధీరూభాయ్ అంబానీని చూసుకుంటున్నట్లు వెల్లడించారు. -
కంటతడి పెట్టిన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్
ఢిల్లీ: ఆమ్ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కంటతడి పెట్టారు. నగరంలో ఓ స్కూల్ ప్రారంభోత్సవానికి హాజరైన సీఎం కేజ్రీవాల్, తన మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాను గుర్తు చేసుకుంటూ భావోద్వేగానికి లోనయ్యారు. మనీశ్ సిసోడియా గారు ఇది మొదలుపెట్టారు. ఇవాళ ఆయన్ని ఎంతో మిస్ అవుతున్నా. విద్యా శాఖ మంత్రిగా ఆయన ఎనలేని సేవలు అందించారు. ప్రతీ చిన్నారికి మెరుగైన విద్య అందించాలన్నది ఆయన కల. అందు కోసం విద్యా ప్రమాణాలు మెరుగుపర్చడం, పాఠశాలలు మెరుగైన వసతులతో నిర్మించడం లాంటి ప్రయత్నాలు చేశారు. బహుశా అందుకేనేమో ఆయన్ని ఇవాళ జైలులో పెట్టారు అని మాట్లాడుతూ.. సీఎం కేజ్రీవాల్ కన్నీళ్లు పెట్టుకున్నారు. విద్యారంగంలో ఢిల్లీ ప్రభుత్వం తీసుకొచ్చిన విప్లవాత్మక మార్పులను అంతం చేయాలని వాళ్లు కోరుకుంటున్నారు. కానీ, అలా జరగనివ్వము అంటూ బీజేపీని ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలే చేశారాయన. వాళ్లు తప్పుడు ఆరోపణలు చేశారు. తప్పుడు కేసులు బనాయించి ఓ మంచి మనిషిని(మనీశ్ సిసోడియాను ఉద్దేశించి..) జైలుకు పంపించారు. ఆయన్ని ఎందుకు జైల్లో పెట్టాలి. ఎంతో మంది నేరస్తులు, దోపిడీ దారులు బయట స్వేచ్ఛగా తిరుగుతున్నారు ఈ దేశంలో. ఒకవేళ ఆయన గనుక మంచి చేసి ఉండకపోతే.. జైలుకు వెళ్లి ఉండేవారు కాదేమో. ఆయన చేసిన మంచి.. వాళ్లకు కంటగింపుగా మారింది అంటూ మండిపడ్డారు కేజ్రీవాల్. VIDEO | Delhi CM Arvind Kejriwal breaks into tears as he talks about former Deputy CM Manish Sisodia during the inauguration of an educational institute in the national capital. pic.twitter.com/fNLoQMYGN4 — Press Trust of India (@PTI_News) June 7, 2023 ఆయన ఈ సమాజానికి మంచి జరగాలని అనుకున్నాడు. ఆ ఆశయాలు మనం నెరవేర్చాల్సిన అవసరం ఉంది. త్వరలోనే ఆయన బయటకు వస్తారనే పూర్తి నమ్మకం నాకుంది. సత్యం ఏనాడూ ఓడిపోదు. సత్య మార్గంలో నడిచే వాళ్లకు దేవుడు కూడా తోడు ఉంటాడు. ఆయన బయటకు వచ్చేదాకా.. ఆ మంచిని రెట్టింపు ఉత్సాహంతో ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మనది అంటూ పేర్కొన్నారాయన. లిక్కర్ స్కాం కేసు తీవ్ర అభియోగాలు ఎదుర్కొంటున్న మనీశ్ సిసోడియాను విచారణకు పిలిచి.. అటు నుంచి అటే అరెస్ట్ చేసింది సీబీఐ. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి ఆయన జైల్లోనే ఉన్నారు. మధ్యలో మనీలాండరింగ్ ఆరోపణలపైనా ఈడీ సెపరేటుగా ఛార్జిషీట్ దాఖలు చేసింది కూడా. మరోవైపు ఢిల్లీ హైకోర్టులో ఆయన బెయిల్ దక్కకపోగా.. సుప్రీం కోర్టును ఆశ్రయించారాయన. ఇదీ చదవండి: అమిత్ షా నివాసం వద్ద నిరసనలు -
ఆయన్ని చూసి రణ్వీర్ సింగ్ కంటతడి.. దేవుడంటూ ఎమోషనల్
Ranveer Singh Breaks Down Tears After Met Govinda: బాలీవుడ్ హీరో రణ్వీర్ సింగ్ మాజీ క్రికెటర్ హర్యానా హరికేన్ కపిల్ దేవ్ పాత్రలో మెప్పించి ఆకట్టుకుంటున్న చిత్రం '83'. 1983 వన్డే ప్రపంచకప్ నేపథ్యంలో వచ్చిన ఈ చిత్రం అశేష ప్రేక్షాదరణ పొందుతుంది. ముఖ్యంగా కపిల్ దేవ్లా డిట్టు దింపేసినా రణ్వీర్ సింగ్ విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. ఇది ఇలా ఉంటే తాజాగా రణ్వీర్ సింగ్ కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఇటీవల కలర్స్ అందిస్తున్న 'ది బిగ్ పిక్చర్' రియాలిటీ షోను హోస్ట్ చేశాడు రణ్వీర్. ఈ షోకు హాజరైన ప్రముఖ నటుడు గోవిందాను చూసి ఉద్వేగానికి లోనయ్యాడు రణ్వీర్ సింగ్. తర్వాత రణ్వీర్ను ఓదార్చాడు గోవిందా. ఈ షోలో ప్రేక్షకులకు గోవిందాను పరిచయం చేస్తూ 'ఈ శుభ దినాన నా దేవుడే మిమ్మల్ని కలవడానికి వస్తున్నాడు. ది వన్ అండ్ ఓన్లీ , హీరో నెంబర్ వన్ గోవిందా' అంటూ స్టేజిపైకి ఆహ్వానించాడు. అనంతరం రణ్వీర్ సింగ్.. గోవిందా కాళ్లపై పడి సాష్టాంగ నమస్కారం చేశాడు. రణ్వీర్ సింగ్ అభిమానాన్ని చూసిన గోవిందా సంతోషపడ్డాడు. తర్వాత వీరిద్దరూ కలిసి ఇష్క్ హై సుహానా, యూపీ వాలా తుమ్కా వంటి గోవిందా హిట్ సాంగ్స్‌కు డ్యాన్స్ చేసి సందడి చేశారు. ఈ పోగ్రామ్‌లో గోవిందా భార్య సునీత, కుమార్తె టీనా, కుమారుడు యశ్వర్ధన్ అహుజా వీడియో కాల్ ద్వారా పాల్గొన్నారు. View this post on Instagram A post shared by ColorsTV (@colorstv) ఇదీ చదవండి: 83 చిత్రంపై రజనీ కాంత్ రియాక్షన్.. పొగడ్తలతో బౌండరీలు -
సభ్యుల తీరుపై వెంకయ్య కంటతడి
సాక్షి, న్యూఢిల్లీ: ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడు సభలో భావోద్వేగానికి లోనై కంటతడి పెట్టారు. సభలో సభ్యులు వ్యవహరించిన తీరుతో తాను నిద్రలేని రాత్రి గడిపినట్టు పేర్కొన్నారు. బుధవారం సభ ప్రారంభం కాగానే ముందురోజు మంగళవారం సభలో విపక్ష సభ్యులు వ్యవహరించిన తీరును ఖండిస్తూ ప్రకటన చేశారు. పార్లమెంటును ప్రజాస్వామ్య దేవాలయంగా, సభలో సెక్రటరీ జనరల్, ఇతర అధికారులు కూర్చునే టేబుల్ ఉండే చోటును గర్భగుడిగా అభివర్ణిస్తూ, అలాంటి ప్రదేశం పవిత్రతను నాశనం చేస్తున్నారంటూ తీవ్ర ఆవేదన వ్యక్తంచేశారు. ‘నిన్న ఈ పవిత్రతను నాశనం చేశారు. కొంతమంది సభ్యులు టేబుల్ మీద కూర్చున్నారు. మరికొందరు టేబుల్ పైకి ఎక్కారు. నా ఆవేదనను తెలియజేయడానికి, ఈ చర్యను ఖండించడానికి నాకు మాటలు లేవు..’ అని పేర్కొన్నారు. మంగళవారం జరిగిన సంఘటన వల్ల తాను నిద్ర లేని రాత్రి గడిపానని చెబుతూ చైర్మన్ భావోద్వేగానికి లోనై కంటతడి పెట్టారు. ‘వ్యవసాయ సమస్యలు, పరిష్కారాలు’ అంశం చర్చ జరుగుతున్నప్పుడు సభ్యులు తమ అభిప్రాయాలను తెలియజేయడానికి, ప్రత్యేకించి గత సంవత్సరం తెచ్చిన మూడు వ్యవసాయ బిల్లులను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్న వారికి సువర్ణావకాశం లభించిందని, కానీ చర్చ జరపకుండా సభ్యులు అంతరాయం సృష్టించారని ఆవేదన వ్యక్తంచేశారు. -
గరళకంఠుడిలా బాధననుభవిస్తున్నా!
సాక్షి బెంగళూరు: కర్ణాటకలో జేడీఎస్–కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వంలో లుకలుకలు బయటపడుతున్నాయి. సీఎం స్థానంలో తను సంతోషంగా లేనని.. గరళకంఠుడిలా బాధను దిగమింగుతూ పనిచేస్తున్నానని కుమారస్వామి కన్నీటిపర్యంతం అయ్యారు. బెంగళూరులో జేడీఎస్ కార్యకర్తలు ఏర్పాటుచేసిన సన్మానసభలో కుమారస్వామి ఉద్వేగాన్ని తట్టుకోలేకపోయారు. ‘మీ సోదరుడినైన నేను సీఎం కావడంతో మీరందరూ సంతోషంగా ఉన్నారు. కానీ నేనే బాధగా పనిచేస్తున్నా. లోక కల్యాణార్థం గరళాన్ని మింగిన విషకంఠుడిలా నిత్యం బాధను దిగమింగుకుంటున్నా’ అని ఉద్వేగానికి గురైన కుమారస్వామి ఉబికి వస్తున్న కన్నీటిని ఆపుకుంటూ పేర్కొన్నారు. ఎన్నికలకు ముందు.. తనకు అవకాశమిస్తే పేదలు, రైతుల సమస్యలు తీరుస్తానని, పేదల అనుకూల ప్రభుత్వాన్ని ఏర్పాటుచేస్తానని కోరానన్నారు. రాష్ట్రవ్యాప్తంగా తిరిగినపుడు ప్రజలు ఎంతో ప్రేమను చూపించారని.. అయితే తమ పార్టీ అభ్యర్థులకు ఓటేయడం మరిచిపోయారన్నారు. అయితే ప్రజలు తనను విశ్వసించలేదన్నారు. కన్నీటిని ఆపుకుంటున్న కుమారస్వామిని చూసి జేడీఎస్ కార్యకర్తలు ‘మేం మీతోనే ఉన్నా’మంటూ నినదించారు. సామాన్యులను మోసం చేస్తూ.. కుమారస్వామి ఉద్వేగ భరిత ప్రసంగాన్ని విపక్ష బీజేపీ ఓ నాటకంగా కొట్టిపడేసింది. సీఎం ఓ మంచి నటుడని.. సామాన్యులను పిచ్చోళ్లను చేసేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారని విమర్శించింది. అటు కాంగ్రెస్ కూడా కుమారస్వామి వ్యాఖ్యలను ఖండించింది. కాంగ్రెస్–జేడీఎస్ సర్కారు సజావుగానే సాగుతోందని, ఐదేళ్లపాటు అధికారంలో ఉంటుందని జేడీఎస్ ప్రతినిధి డానిష్ అలీ తెలిపారు. కుమారస్వామి కాస్తంత ఉద్వేగానికి గురయ్యారన్నారు. కాగా, ప్రధానమంత్రి అభ్యర్థిగా రాహుల్ గాంధీ నాయకత్వంపై తనకెలాంటి అభ్యంతరం లేదని జేడీఎస్ అధినేత దేవెగౌడ చెప్పారు. -
మూడేళ్ల తర్వాత ఏడ్చాడు!
న్యూఢిల్లీ: ప్రముఖ బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన తల్లి నర్గీస్ కేన్సర్‌తో చనిపోయినప్పుడు అస్సలు కన్నీరు పెట్టుకోలేదట. మూడేళ్ల అనంతరం ఆమె చివరి కోరికను ఆడియో టేప్‌లో విన్న దత్ నాలుగు రోజుల పాటు ఏడుస్తూనే ఉన్నారట. డ్రగ్స్‌కు బానిస కావడం, ఓ ఇంట్లో రాత్రి కాల్పులు జరిపి అరెస్ట్ కావడం, ముంబై అల్లర్ల సందర్భంగా ఆయుధాలు సేకరించడం సహా సంజయ్ జీవితంలో జరిగిన అనేక నిజ సంఘటనలతో ‘సంజయ్‌దత్ – ది క్రేజీ అన్‌టోల్డ్ స్టోరీ ఆఫ్ బాలీవుడ్స్ బ్యాడ్ బాయ్’ పుస్తకాన్ని యాసీర్ ఉస్మాన్ ఆసక్తికరంగా రాశారు. సంజయ్ చిత్రం రాకీ విడుదలకు ముందు 1981, మే3న నర్గీస్ కేన్సర్‌తో చనిపోయారు.డ్రగ్స్‌కు తీవ్రంగా బానిసైన సంజయ్‌ను ఆయన తండ్రి సునీల్ దత్ చికిత్స కోసం అమెరికాలోని ఓ పునరావాస కేంద్రంలో చేర్పించారు. నర్గీస్ చివరిరోజుల్లో సంజయ్ కోసం మాట్లాడిన ఆడియో టేపుల్ని సునీల్ కుమారుడికి పంపారు. ‘సంజూ.. అన్నింటికంటే ముందు నువ్వు వినయంగా ఉండాలి. నీ సత్ప్రవర్తనను మార్చుకోకు. ఎవ్వరి మెప్పు కోసం ప్రయత్నించవద్దు. ఎల్లప్పుడూ వినయంగా ఉండటంతో పాటు పెద్దలను గౌరవించు. ఇవే నిన్ను ఉన్నతస్థానానికి తీసుకెళ్తాయి. నువ్వు చేపట్టే పనుల్లో ఇవే నీకు శక్తినిస్తాయి’ అని నర్గీస్ అందులో చెప్పారు. -
‘ఉబర్ సీఈవో కంటతడి.. ఆ మహిళకు సారీ’
న్యూయార్క్: ఉబర్ సీఈవో కంటతడి పెట్టారు. తన కంపెనీలో పనిచేస్తున్న ఉద్యోగులకు జరిగిన అవమానంపట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ, క్షమాపణలు చెబుతూ కాసేపు ఏడ్చేశారు. తన కంపెనీలో ఇలాంటి సంస్కృతికి అవకాశం ఏర్పడటంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. అది కూడా మొత్తం కంపెనీ కీలక ఉద్యోగులు, కిందిస్థాయి ఉద్యోగులు మీడియా కొలువై ఉన్న బహిరంగ కార్యక్రమంలో. ఉబర్ కంపెనీలో సాఫ్ట్వేర్ డెవలపర్‌గా చేస్తున్న సుసాన్ పోలర్ అనే మహిళ తనపై లైంగిక వేధింపులు జరిగాయని, మానవ వనరుల విభాగం నుంచి ఈ వేధింపులు మొదలయ్యాయని, ఇలా ఏడాదికాలం జరిగినా తనకు ఏమాత్రం అండగా ఉండకుండా వేధింపులకు పాల్పడినా ఆ మేనేజర్‌ను రక్షించుకునే ప్రయత్నం చేసిందని గతవారం తన బ్లాగ్‌లో పేర్కొంది. మంగళవారం కంపెనీ ఉద్యోగులతో శాన్ఫ్రాన్సిస్కోలో సమావేశం అయిని ఉబర్ సీఈవో ట్రావిస్ కలానిక్ తన కంపెనీలో తలెత్తిన కల్చరల్ పెయిలింగ్స్కు క్షమాపణ చెబుతున్నట్లు తెలిపారు. దాదాపు గంటపాటు జరిగిన ఈ సమావేశంలో ఉబర్ సీఈవో కంటతడి పెట్టారు. ఫిర్యాదులను లెక్కచేయకుండా హెచ్ఆర్ వ్యవహరించడంపట్ల ఆందోళన వ్యక్తం చేశారు. పనిచేసే చోట వివక్షకు తావివ్వడాన్ని కూడా ఆయన తప్పుబట్టారు. ‘ట్రావిస్ చాలా నిజాయితీగా ఆయన కంపెనీ చేసిన పొరపాట్ల గురించి మాట్లాడారు. 48గంటల్లోగా తన కంపెనీని మరింత ఉన్నతంగా మార్చేందుకు కావాల్సిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. కేవలం ఉబర్‌ను మంచిసంస్థగా తీర్చిదిద్దడమే కాదు.. మొత్తం ఉబర్ కంపెనీలో పనిచేస్తున్న మహిళా ఉద్యోగులందరికీ ఇబ్బందులు కలిగించని చర్యలు తీసుకోవాలి. ఇందుకోసం సమయం వృధా అనే ఆలోచనే రానివ్వకూడదు’ అని ట్రావిస్ చెప్పినట్లు ఆ కంపెనీ హెచ్ఆర్ హఫింగ్టన్ తెలిపారు.