ఆటోలో యువతిని ముద్దాడిన సాఫ్ట్వేర్ ఉద్యోగి
హైదరాబాద్: కొంటె పని చేసిన ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ కటకటాలపాలయ్యాడు. ఆటోలో చేసిన ఆకతాయి పని అతడిని అవస్థలపాలు చేసింది. తప్పుడు పని చేసి పారిపోవాలనుకున్న అతని పన్నాగం ఫెయిలయి అన్‌పాపులర్ అయ్యాడు. కూకట్‌పల్లిలోని నిజాంపేటలో చోటు చేసుకున్న ఈ ఘటన వివరాలిలావున్నాయి. పేరుపొందిన ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్న శ్రీనివాస్ అనే యువకుడు ఆటోలో వెళ్తున్న యువతులను టీజ్ చేశాడు. అయ్యగారు అక్కడితో ఆగలేదు.
నెమ్మదిగా వెళుతున్న ఆటో దగ్గరకు వెళ్లి అందులో ప్రయాణిస్తున్న ఓ యువతిని అమాంతంగా ముద్దుపెట్టుకుని పారిపోబోయాడు. దీన్ని గమనించిన స్థానికులు శ్రీనివాస్‌ను పట్టుకుని దేహశుద్ధి చేశారు. ముద్దుబాబుకు బుద్ధొచ్చేలా బాది తర్వాత పోలీసులకు అప్పగించారు. కూకట్పల్లి పోలీసులు అతడిపై కేసు నమోదు చేశారు. ఇదే ప్రాంతానికి చెందిన కొందరు యువతుల పట్ల ఈ శ్రీనివాస్ అలియాస్ వైరస్ అసభ్యంగా ప్రవర్తించినట్టు చెబుతున్నారు. ఎన్నిసార్లు ఎంతో మంది ఎన్నో విధాలుగా హెచ్చరించినా అతడి బుద్ధి మారలేదు. చివరకు ముద్దుబాబు జైలుపాలయ్యాడు.