రేపు సెంట్రల్, హార్బర్ మార్గాల్లో మెగాబ్లాక్
సాక్షి, ముంబై: రైల్వే ట్రాక్స్, సిగ్నల్స్, ఇతర సాంకేతిక పరికరాల నిర్వహణ పనుల నిమిత్తం ఆదివారం సెంట్రల్, హార్బర్ మార్గంలో మెగాబ్లాక్ ప్రకటించారు. దీని కారణంగా కొన్ని రైళ్లను దారిమళ్లించగా మరికొన్నింటిని రద్దు చేసినట్లు రైల్వే వర్గాలు వెల్లడించాయి. అందులో భాగంగా సెంట్రల్ రైల్వే మార్గంలో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు ఠాణే-కల్యాణ్ స్టేషన్ల మధ్య డౌన్ ఫాస్ట్ మార్గంలో మెగాబ్లాక్ ఉంటుంది. దీంతో ఠాణే నుంచి కల్యాణ్ దిశగా వెళ్లే లోకల్ రైళ్లు, దూరప్రాంతాల ఎక్స్‌ప్రెస్ రైళ్లన్నీ స్లో మార్గంలో నడుస్తాయి.
అదేవిధంగా హార్బర్ మార్గంలో ఛత్రపతి శివాజీ టర్మినస్ (సీఎస్టీ)-కుర్లా స్టేషన్ల మధ్య డౌన్ మార్గంలో, వడాల రోడ్-బాంద్రా మధ్య అప్, డౌన్ మార్గంలో ఉదయం 11.10 గంటల నుంచి మధ్యాహ్నం 3.10 గంటల వరకు మెగాబ్లాక్ పనులు జరుగుతాయి. ఈ సమయంలో కొన్ని లోకల్ రైళ్ల ట్రిప్పులను రద్దు చేయనున్నట్లు వెల్లడించారు. రైళ్ల రాకపోకల తాజా వివరాలు ఎప్పటికప్పుడు ఆయా స్టేషన్లలో మైక్‌లో ఎప్పటికప్పుడు ప్రకటిస్తారని, ఆ ప్రకారమే తమ ప్రయాణాన్ని కొనసాగించాలని అధికారులు సూచించారు.