గుర్తింపు నిబంధనలపై గుబులు
♦ ఇంజనీరింగ్ కాలేజీల గుర్తింపు నిబంధనల్లో ఏఐసీటీఈ మంజూరైన సంఖ్య మేరకు ఉండాల్సిందే
♦ ఫ్యాకల్టీ తక్కువుంటే సీట్లు తగ్గించుకోవాల్సిందే
♦ కొన్ని నిబంధనలకు మాత్రం సడలింపులు
♦ 10 ల్యాబ్‌లు అక్కర్లేదు.. 8 ఉన్నా చాలు
సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్ కాలేజీల్లో విద్యార్థుల వాస్తవ సంఖ్యతో సంబంధం లేకుండా కాలేజీకి మంజూరైన సంఖ్యకు అనుగుణంగా ఫ్యాకల్టీని నియమించుకోవాల్సిందేనని అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) స్పష్టం చేసింది. ప్రవేశాలు పొందిన విద్యార్థుల సంఖ్యకు తగ్గట్టుగా అధ్యాపకులను నియమించుకుంటామన్న కాలేజీల యాజమాన్యాల అభ్యర్థనను తిరస్కరించింది. అనుబంధ గుర్తిం పుక్రమంలో తమ అభ్యర్థనను పరిగణనలోకి తీసుకుంటామని జేఎన్టీయూహెచ్ మౌఖికం గా పేర్కొందని యాజమాన్యాలు అంటు న్నా, అధికారికంగా నిబంధనల్లో పొందుపరచకపోవడంతో వాటికి గుబులు తప్పడం లేదు.
ఒకట్రెండు రోజుల్లో రానున్న అనుబంధ గుర్తింపు నోటిఫికేషన్లో ఎలాంటి నిబంధనలుంటాయోనని ఆత్రుతగా ఎదురు చూస్తున్నాయి. 2017– 18 విద్యా సంవత్సరంలో ప్రవేశాలకు సాంకేతిక విద్యా సంస్థలు (పాలిటెక్నిక్, ఇంజనీరింగ్, ఎంబీఏ, ఎంసీఏ, ఫార్మసీ) గుర్తింపు కోసం దరఖాస్తు చేసుకునేందుకు జారీ చేసిన కొన్ని నిబంధనల్లో ఏఐసీటీఈ కఠినంగానే వ్యవహరించిందని యాజమాన్యాలంటున్నాయి. కాకపోతే పలు నిబంధనలను సులభతరం చేసిందని ఇంజనీరింగ్ కాలేజీ యాజమాన్యాల సంఘం ప్రధాన కార్యదర్శి సునీల్ పేర్కొన్నారు.
సీట్ల తగ్గింపూ సులభమే
వర్సిటీ ఎన్వోసీ లేకపోయినా సీట్లు తగ్గించుకునేలా ఏఐసీటీఈ వెసులుబాటు ఇచ్చింది. ఒక సెక్షన్లో 120 సీట్లుంటే వాటిలో 30 సీట్లను తగ్గించుకోవచ్చు. తర్వాతి ఏడాది కావాలంటే 120కి పెంచుకోవచ్చు. 60కి తగ్గించుకునేందుకూ ఎన్వోసీ అక్కర్లేదు. కాకపోతే 60కి తగ్గించుకున్నాక మళ్లీ 120 సీట్లు కావాలనుకు న్నా, ఇన్‌టేక్‌ను పెంచుకోవాలన్నా అక్రెడిటేషన్ తప్పనిసరి. ఎన్బీఏ అక్రెడిటేషన్ ఉన్న కోర్సుల్లోనే రెగ్యులర్, ఫస్ట్ షిఫ్ట్‌లో ఇన్‌టేక్‌ను పెంచుకోవచ్చు. ఇంటిగ్రేటెడ్, డ్యుయల్ డిగ్రీ కోర్సులను ప్రవేశపెట్టాలంటే అక్రెడిటేషన్ తప్పనిసరి. ఆ కోర్సులో ప్రవేశాలే వద్దనుకుంటే వర్సి టీ నుంచి ఎన్వోసీ కావాలి. సెకండ్ షిఫ్ట్ రద్దుకు, పీజీ డిప్లొమా ఇన్ మేనేజ్మెంట్ రద్దుకు అక్కర్లేదు.
పీహెచ్డీ ఫ్యాకల్టీ తప్పనిసరి
యూజీ, పీజీ కోర్సులకు పీహెచ్డీ అర్హత కలిగిన ప్రొఫెసర్ తప్పనిసరిగా ఉండాల్సిందే. పీజీకి ఒక ప్రొఫెసర్ తప్పనిసరి. 1:2:6 నిష్పత్తిలో అధ్యాపకులుండాలి. బీటెక్ ఇంజనీరింగ్‌కు 1:15, ఎంటెక్‌లో 1:12 నిష్పత్తిలో ఉండాలి. అనుమతించిన ఇన్‌టేక్ ప్రకారం ఒక ప్రొఫెసర్, ఇద్దరు అసోసియేట్ ప్రొఫెసర్లు, ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉండాలి. 80 శాతం మంది రెగ్యులర్ ఫ్యాకల్టీ ఉండాలి. వర్సిటీ మాత్రం 60 నుంచి 120 మంది విద్యార్థులకు ఒక యూజీ, పీజీ, పీహెచ్డీ తప్పనిసరని, తర్వాత ప్రతి 60 మం దికి ఒక పీహెచ్డీ ఫ్యాకల్టీ ఉండాలని పేర్కొం ది. అనుబంధ అధ్యాపకులు ఇప్పటిదాకా తాము పనిచేస్తున్న సంస్థ నుంచి ఎన్వోసీ తెస్తే నే మరోచోట పనిచేసే వీలుండేది. ఇక ఇప్పుడు రెండు, మూడుచోట్ల పనిచేయవచ్చు. బీటెక్ ఉండి, అనుభవముంటే చాలు. 10 ల్యాబ్‌ల నిబంధనను 8కి పరిమితం చేశారు. బీటెక్‌కు బోధిస్తున్న సిబ్బందిలో 50 శాతం మందిని పాలిటెక్నిక్ బోధనకూ వినియోగించుకోవచ్చు.
ఒక్క దరఖాస్తుతో అన్ని అనుమతులూ
యాజమాన్యాలు ఒక్క దరఖాస్తుతో అన్ని అనుమతులూ పొందేందుకు ఏఐసీటీఈ వీలు కల్పించింది. డిప్లొమా, డిగ్రీ, పీజీ డిగ్రీ, పీజీ డిప్లొమా కోర్సుల ప్రారంభానికి; కాలేజీని మరో ప్రాంతానికి మార్చుకునేందుకు; మూసివేసేందుకు; మహిళా కాలే జీ నుంచి కో ఎడ్గా, కో ఎడ్ నుంచి మహిళా కాలేజీగా మార్చుకునేందుకు; ఇంజనీరింగ్‌ను మూసేసి పాలిటెక్నిక్ కాలేజీగా, పాలిటెక్నిక్‌ను మూసేసి ఇంజనీరింగ్ కాలేజీగా మార్చుకునేందుకు; సొసైటీ పేరు, సభ్యుల మార్పు, విద్యా సంస్థ పేరు మార్పు, అనుబంధ గుర్తింపు విషయంలో మరో వర్సిటీ పరిధిలోకి వెళ్లేందుకు అవకాశం కల్పిం చింది. వీటకి వర్సిటీ ఎన్వోసీ ఉంటే చాలు.