technology startups
-
డీప్ టెక్ స్టార్టప్స్‌లోకి మరిన్ని పెట్టుబడులు రావాలి
బెంగళూరు: దేశీ డీప్ టెక్నాలజీ స్టార్టప్ సంస్థలు వేగంగా ఎదిగేందుకు వాటికి ప్రారంభ దశలో మరింత ఎక్కువగా పెట్టుబడులు అందాల్సిన అవసరం ఉందని ఐటీ సంస్థల సమాఖ్య నాస్కామ్ ప్రెసిడెంట్ దేవయాని ఘోష్ చెప్పారు. ప్రస్తుతం టెక్నాలజీ రంగంలోకి వచ్చే పెట్టుబడుల్లో కేవలం 11 శాతం మాత్రమే డీప్ టెక్ స్టార్టప్‌లకు లభిస్తున్నాయని తెలిపారు. చైనా, అమెరికా వంటి దేశాలు తమ డీప్ టెక్ స్టార్టప్ వ్యవస్థను పటిష్టం చేసుకోవడానికి ప్రాధాన్యం ఇస్తుండగా, దేశీయంగానూ వీటి నిధుల అవసరాలపై మరింత దృష్టి పెట్టాల్సి ఉందన్నారు. పరిశ్రమలు, అంతర్గత వాణిజ్య విభాగం (డీపీఐఐటీ) నిర్వహించిన స్టార్టప్‌లు, ఎంట్రప్రెన్యూర్షిప్ వర్క్‌షాప్‌లో పాల్గొన్న సందర్భంగా ఆమె ఈ విషయాలు చెప్పారు. దేశీయంగా 25,000 పైచిలుకు టెక్ స్టార్టప్‌లు ఉండగా.. వీటిలో డీప్‌టెక్‌కు సంబంధించినవి 12 శాతం (3,000) మాత్రమే ఉన్నాయని తెలిపారు. కృత్రిమ మేథ (ఏఐ), రోబోటిక్స్, బ్లాక్‌చెయిన్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐవోటీ), డ్రోన్లు మొదలైన టెక్నాలజీపై డీప్ టెక్ సంస్థలు పని చేస్తుంటాయి. ఇలాంటి సంస్థల పరిశోధనలు, కొత్త ఆవిష్కరణలపై సమయం వెచ్చించాల్సి ఉంటుంది కాబట్టి వాటి ఉత్పత్తులు మార్కెట్లోకి రావడానికి ఎక్కువ సమయం పడుతుందన్న విషయాన్ని ఇన్వెస్టర్లు, నియంత్రణ సంస్థలు గుర్తించాలని దేవయాని ఘోష్ చెప్పారు. ప్రతిభావంతులు చాలా మందే ఉంటున్నప్పటికీ .. వారిని అందుకోవడం సమస్యగా మారిన నేపథ్యంలో సింగపూర్ వంటి దేశాల్లో మిలిటరీ సర్వీసును తప్పనిసరి చేసిన విధంగా ’స్టార్టప్ సర్వీసు’ను కూడా ప్రవేశపెట్టే అంశాన్ని పరిశీలించవచ్చని తెలిపారు. తద్వారా మూడు, నాలుగో సంవత్సరంలోని ఇంజినీరింగ్ విద్యార్థులు ఏడాది పాటు ఏదైనా టెక్ స్టార్టప్స్‌లోకి వెళ్లి పనిచేయొచ్చని పేర్కొన్నారు. ఆ రకంగా ప్రతిభావంతుల తోడ్పాటుతో ఆయా అంకుర సంస్థలు, పెద్ద కంపెనీలతో పోటీపడవచ్చన్నారు. అవ్రా మెడికల్ రోబోటిక్స్‌లో ఎస్ఎస్ఐకి వాటాలు న్యూఢిల్లీ: దేశీ మెడ్‌టెక్ స్టార్టప్ కంపెనీ ఎస్ఎస్ ఇన్నోవేషన్ తాజాగా అమెరికాకు చెందిన నాస్డాక్ లిస్టెడ్ కంపెనీ అవ్రా మెడికల్ రోబోటిక్స్‌లో నియంత్రణ వాటాలను కొనుగోలు చేసింది. దీనితో తమకు అంతర్జాతీయ మార్కెట్లలో కూడా ప్రవేశించేందుకు అవకాశం లభించినట్లవుతుందని సంస్థ వ్యవస్థాపకుడు, చైర్మన్ సుధీర్ పి. శ్రీవాస్తవ తెలిపారు. ’ఎస్ఎస్ఐ మంత్ర’ రూపంలో ఇప్పటికే తాము మేడిన్ ఇండియా సర్జికల్ రోబో వ్యవస్థను ప్రవేశపెట్టామని ఆయన చెప్పారు. అవ్రాతో భాగస్వామ్యం .. రోబోటిక్ సర్జరీలకు సంబంధించి వైద్య సేవల్లో కొత్త మార్పులు తేగలదని శ్రీవాస్తవ వివరించారు. -
టెక్ స్టార్టప్స్‌లో ఫేస్బుక్ పెట్టుబడులు
న్యూఢిల్లీ: సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్.. దేశీ టెక్నాలజీ స్టార్టప్స్‌లో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు వ్యూహాలను రచిస్తోంది. తాజాగా సోషల్ కామర్స్ ప్లాట్‌ఫాం ‘మీషో’లో తన తొలి పెట్టుబడిని పెట్టిన ఈ సంస్థ.. మరిన్ని స్టార్టప్స్‌లో పెట్టుబడుల పరంపరను కొనసాగించేందుకు సిద్ధమైంది. శుక్రవారం కేరళలో జరిగిన ఆసియాలోని అతిపెద్ద స్టార్టప్స్ సమావేశంలో మాట్లాడిన భారత కార్యకలాపాల మేనేజింగ్ డైరెక్టర్, వైస్ ప్రెసిడెంట్ అజిత్ మోహన్, టెక్నాలజీ సంబంధిత అంకుర సంస్థల్లో ఇన్వెస్ట్ చేసేందుకు సుముఖంగా ఉన్నామని ప్రకటించారు. -
భారత్‌లో స్టార్టప్‌ల విప్లవం
* ఐదేళ్లలో 1.85 లక్షల ఉద్యోగాలు * పాల విప్లవంలా డిజిటల్ ఇండియా * సాధ్యం చేయాలన్న ఐటీ, టెలికం మంత్రి రవి శంకర్ ప్రసాద్ ముంబై: టెక్నాలజీ స్టార్టప్‌లు భారత్‌లో ఐదేళ్లలో భారీగా రానున్నాయని నాస్కామ్ చైర్మన్ ఆర్. చంద్రశేఖరన్ చెప్పారు. దీంతో భారీ స్థాయిలో ఉద్యోగావకాశాలు లభిస్తాయని వివరించారు. 2020 నాటికి టెక్నాలజీ స్టార్టప్‌లు, ప్రోడక్ట్ కంపెనీల సంఖ్య 11,500 గా ఉంటుందని వివరించారు. ప్రస్తుతం 65 వేలుగా ఉన్న ఉద్యోగుల సంఖ్య అప్పటికల్లా రెండున్నర లక్షలకు చేరుతుందని పేర్కొన్నారు. ఇక్కడ జరిగిన నాస్కామ్ వార్షిక నాయకత్వ సదస్సులో ఆయన మాట్లాడారు. ఇక కేంద్రం డిజిటల్ ఇండియా కార్యక్రమానికి ఐటీ రంగం ఇతోధికంగా తోడ్పడాలని ఆయన పిలుపునిచ్చారు. గత ఏడాది 800 కొత్త స్టార్టప్‌లు ప్రారంభమయ్యాయని, దీంతో మొత్తం స్టార్టప్‌ల సంఖ్య 3,100కు పెరిగాయని వివరించారు. 2010 నుంచి టెక్నాలజీ స్టార్టప్‌లు 230 కోట్ల డాలర్ల పెట్టుబడులను ఆకర్షించాయని వివరించారు. పాల విప్లవంలా డిజిటల్ ఇండియా పాల విప్లవం గ్రామీణుల జీవితాలను మార్చిందని, అలాగే డిజిటల్ ఇండియా కార్యక్రమం వల్ల గ్రామీణ ప్రజల జీవితాలు మరింతగా మారేలా చూడాలని కమ్యూనికేషన్ల మంత్రి రవిశంకర్ ప్రసాద్ బుధవారం పేర్కొన్నారు. వర్గీస్ కురియన్ ప్రారంభించిన పాల విప్లవం కారణంగా గ్రామీణులకు ప్రత్యామ్నాయ ఉపాధి లభించిందని ఆయన గుర్తు చేశారు. షెడ్యూల్ట్ కులంలోని అట్టడుగు వర్గం మహిళలు సైతం కంప్యూటర్ అక్షరాస్యులైనప్పుడు సాంకేతిక సమానత్వం సిద్ధిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఇక్కడ జరిగిన నాస్కామ్ వార్షిక నాయకత్వ సదస్లు ఆయన కూడా మాట్లాడారు. ఇది సాధించడమే లక్ష్యంగా ఉండాలని, ఈ లక్ష్య సాధన కోసం ప్రయత్నాలు చేస్తున్నామని వివరించారు. చిన్న చిన్న పట్టణాల్లో కూడా కాల్ సెంటర్ల ఏర్పాటుకు ఉద్దేశించిన ప్రక్రియకు తుదిరూపునిస్తున్నామని పేర్కొన్నారు. కంపెనీ సామాజిక బాధ్యత కింద ఐటీ రంగ కంపెనీలు డిజిటల్ ఇండియాకు ఇతోధికంగా తోడ్పడాలని ఆయన కోరారు. మూడేళ్లలో ఏడు లక్షల కిమీ ఆప్టిక్ ఫైబర్ కేబుల్‌ను అందుబాటులోకి తేనున్నామని, ఫలితంగా రెండున్నర లక్షల గ్రామాలకు హై స్పీడ్ కనెక్టివిటీ లభిస్తుందని వివరించారు. సాంకేతికతలో ప్రజలకు మరింత సాధికారత లభిస్తుందని రవిశంకర్ వ్యాఖ్యానించారు. 35వేల క్యాంపస్ నియామకాలు: టీసీఎస్ టీసీఎస్ సంస్థ వచ్చే ఆర్థిక సంవత్సరంలో క్యాంపస్ రిక్రూట్మెంట్ల ద్వారా 35వేల మందికి ఉద్యోగాలు ఇవ్వనున్నది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 25వేల మందికి క్యాంపస్ రిక్రూట్మెంట్ల ద్వారా ఉద్యోగాలు ఇచ్చామని టీసీఎస్ సీఈఓ ఎండీ ఎన్. చంద్రశేఖర్ చెప్పారు, వచ్చే ఆర్థిక సంవత్సరంలో 35వేల మందికి కొలువులు ఇస్తామని గత ఏడాది అక్టోబర్‌లోనే టీసీఎస్ పేర్కొంది. అయితే పనితీరు బాగా లేదంటూ వెయ్యి మంది ఉద్యోగులను టీసీఎస్ తొలగించింది. దీంతో ఇంతమందికి ఉద్యోగాలు ఇస్తుందా లేదా అన్న సంశయాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో 35వేల మందికి క్యాంపస్ రిక్రూట్మెంట్ల ద్వారా ఉద్యోగాలివ్వాలన్న తమ హైరింగ్ ప్రణాళికలకే కట్టుబడి ఉన్నామని ఆయన స్పష్టం చేశారు.