భారత్‌లో స్టార్టప్‌ల విప్లవం | Skill Shortage a Risk for Indian IT Sector Growth: Nasscom | Sakshi
Sakshi News home page

భారత్‌లో స్టార్టప్‌ల విప్లవం

Published Thu, Feb 12 2015 1:20 AM | Last Updated on Sat, Sep 2 2017 9:09 PM

భారత్‌లో స్టార్టప్‌ల విప్లవం

భారత్‌లో స్టార్టప్‌ల విప్లవం

* ఐదేళ్లలో 1.85 లక్షల ఉద్యోగాలు
* పాల విప్లవంలా డిజిటల్ ఇండియా
* సాధ్యం చేయాలన్న ఐటీ, టెలికం మంత్రి రవి శంకర్ ప్రసాద్

ముంబై: టెక్నాలజీ స్టార్టప్‌లు భారత్‌లో ఐదేళ్లలో భారీగా రానున్నాయని నాస్కామ్ చైర్మన్ ఆర్. చంద్రశేఖరన్ చెప్పారు. దీంతో భారీ స్థాయిలో ఉద్యోగావకాశాలు లభిస్తాయని వివరించారు. 2020 నాటికి టెక్నాలజీ స్టార్టప్‌లు, ప్రోడక్ట్ కంపెనీల సంఖ్య 11,500 గా ఉంటుందని వివరించారు. ప్రస్తుతం 65 వేలుగా ఉన్న ఉద్యోగుల సంఖ్య అప్పటికల్లా రెండున్నర లక్షలకు చేరుతుందని పేర్కొన్నారు.

ఇక్కడ జరిగిన నాస్కామ్ వార్షిక నాయకత్వ సదస్సులో ఆయన మాట్లాడారు. ఇక కేంద్రం డిజిటల్ ఇండియా కార్యక్రమానికి ఐటీ రంగం ఇతోధికంగా తోడ్పడాలని ఆయన పిలుపునిచ్చారు. గత ఏడాది 800 కొత్త స్టార్టప్‌లు ప్రారంభమయ్యాయని, దీంతో మొత్తం స్టార్టప్‌ల సంఖ్య 3,100కు పెరిగాయని వివరించారు. 2010 నుంచి టెక్నాలజీ స్టార్టప్‌లు 230 కోట్ల డాలర్ల పెట్టుబడులను ఆకర్షించాయని వివరించారు.    

పాల విప్లవంలా డిజిటల్ ఇండియా
పాల విప్లవం గ్రామీణుల జీవితాలను మార్చిందని, అలాగే  డిజిటల్ ఇండియా కార్యక్రమం వల్ల గ్రామీణ ప్రజల జీవితాలు మరింతగా మారేలా చూడాలని కమ్యూనికేషన్ల మంత్రి రవిశంకర్  ప్రసాద్ బుధవారం పేర్కొన్నారు. వర్గీస్ కురియన్ ప్రారంభించిన పాల విప్లవం కారణంగా గ్రామీణులకు ప్రత్యామ్నాయ ఉపాధి లభించిందని ఆయన గుర్తు చేశారు. షెడ్యూల్ట్ కులంలోని అట్టడుగు వర్గం మహిళలు సైతం కంప్యూటర్ అక్షరాస్యులైనప్పుడు సాంకేతిక సమానత్వం సిద్ధిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఇక్కడ జరిగిన నాస్కామ్ వార్షిక నాయకత్వ సదస్లు ఆయన కూడా మాట్లాడారు.

ఇది సాధించడమే లక్ష్యంగా ఉండాలని, ఈ లక్ష్య సాధన కోసం ప్రయత్నాలు చేస్తున్నామని వివరించారు. చిన్న చిన్న పట్టణాల్లో కూడా కాల్ సెంటర్ల ఏర్పాటుకు ఉద్దేశించిన ప్రక్రియకు తుదిరూపునిస్తున్నామని పేర్కొన్నారు. కంపెనీ సామాజిక బాధ్యత కింద ఐటీ రంగ కంపెనీలు డిజిటల్ ఇండియాకు ఇతోధికంగా తోడ్పడాలని ఆయన కోరారు. మూడేళ్లలో ఏడు లక్షల కిమీ ఆప్టిక్ ఫైబర్ కేబుల్‌ను అందుబాటులోకి తేనున్నామని, ఫలితంగా రెండున్నర లక్షల గ్రామాలకు హై స్పీడ్ కనెక్టివిటీ లభిస్తుందని వివరించారు. సాంకేతికతలో ప్రజలకు మరింత సాధికారత లభిస్తుందని రవిశంకర్ వ్యాఖ్యానించారు.
 
35వేల క్యాంపస్ నియామకాలు: టీసీఎస్
టీసీఎస్ సంస్థ వచ్చే ఆర్థిక సంవత్సరంలో క్యాంపస్ రిక్రూట్‌మెంట్ల ద్వారా 35వేల మందికి ఉద్యోగాలు ఇవ్వనున్నది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 25వేల మందికి క్యాంపస్ రిక్రూట్‌మెంట్ల ద్వారా ఉద్యోగాలు ఇచ్చామని టీసీఎస్ సీఈఓ ఎండీ ఎన్. చంద్రశేఖర్ చెప్పారు, వచ్చే ఆర్థిక సంవత్సరంలో 35వేల మందికి కొలువులు ఇస్తామని గత ఏడాది అక్టోబర్‌లోనే టీసీఎస్ పేర్కొంది. అయితే పనితీరు బాగా లేదంటూ వెయ్యి మంది ఉద్యోగులను టీసీఎస్ తొలగించింది. దీంతో ఇంతమందికి ఉద్యోగాలు ఇస్తుందా లేదా అన్న సంశయాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో 35వేల మందికి క్యాంపస్ రిక్రూట్‌మెంట్ల ద్వారా ఉద్యోగాలివ్వాలన్న తమ హైరింగ్ ప్రణాళికలకే కట్టుబడి ఉన్నామని ఆయన స్పష్టం చేశారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement