technology system
-
ఇది డిజిటల్ చెల్లింపుల విప్లవం
డిజిటల్ చెల్లింపుల ఆవిష్కరణ భారత ఆర్థిక వ్యవస్థలో సమూల మార్పును తీసుకొచ్చింది. పెద్దనోట్ల రద్దు తర్వాత ఆర్థిక లావాదేవీలన్నింటినీ పరివర్తన చెందించిన గొప్ప విప్లవ ఆవిష్కరణే ఈ డిజిటల్ చెల్లింపుల వ్యవస్థ. దేశీయంగా మొదలైన ఈ సరికొత్త సాంకేతిక వ్యవస్థ కోట్లాదిమందిని సాంప్రదాయిక ఆర్థిక వ్యవస్థ చట్రం నుంచి బయటకు లాగడమే కాదు... దేశీయ వాణిజ్యాన్ని పునర్నిర్మించింది. మన ఆర్థిక వ్యవస్థకు సంబంధించి ఇది ఒక గేమ్ ఛేంజర్‌లా పనిచేసింది. ప్రజా జీవితంలో,బ్యాంకింగ్ రంగంలో, నగదు లావాదేవీల్లో సరికొత్త మార్పును తీసుకొచ్చిన భారతీయ డిజిటల్ చెల్లింపుల వ్యవస్థ ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలందుకుంటోంది. ఆధునిక ఆర్థిక వ్యవస్థకు భారతదేశం అందించిన అధునాతన సాంకేతిక విప్లవం– డిజిటల్ పేమెంట్ సిస్టమ్. భారత్ రూపొందించిన దేశీయ తక్షణ చెల్లింపుల వ్యవస్థ వాణిజ్య కార్యకలాపాలను పునర్ని ర్మించడమే కాదు, కోట్లాదిమంది ప్రజలను సాంప్రదాయిక ఆర్థిక వ్యవస్థ నుంచి బయటపడేసింది. కేంద్ర ప్రభుత్వం దృఢమైన ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంలో దీన్ని రూపొందించింది. ఇది రోజువారీ జీవితాన్ని సౌకర్యవంతం చేసింది. రుణాలు, పొదుపులు వంటి బ్యాంకింగ్ సేవలను మరింతగా విస్తరింపజేసింది. కోట్లాది మంది భారతీయులకు ప్రభుత్వ కార్యక్రమాలను మరింతగా అందు బాటులోకి తీసుకొచ్చింది. పన్నుల సేకరణను కూడా సులభతరం చేసింది. ప్రధాని నరేంద్రమోదీ జీ20 ఆర్థిక మంత్రులతో ముచ్చటిస్తూ, డిజిటల్ చెల్లింపుల వ్యవస్థ పాలనను మౌలికంగానే మార్చివేసిందని చెప్పారు. డిజిటల్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్‌ను అతి తక్కువ ఖర్చుతో ఏర్పర్చిన సాంకేతిక ఆవిష్కరణగా చూడవచ్చు. దీంతో మునుపెన్నడూ కనీవినీ ఎరగని స్థాయిలో అభివృద్ధి చెందిన దేశాలను సైతం ఎలా ప్రభావితం చేయవచ్చో భారత్ నిరూపించింది. భౌతిక మౌలిక వసతుల వ్యవస్థ వెనుకంజ వేస్తున్న పరిస్థితుల్లో కూడా ఇది ఆర్థిక పురోగతికి దోహదం చేస్తుంది. ప్రపంచంలోకెల్లా నిరుపేద దేశాలను కూడా పైకి లేపేటటు వంటి ఆలోచనల ఇంక్యుబేటర్‌గా భారత్ ఎగుమతి చేయాలనుకుంటున్న పబ్లిక్–ప్రైవేట్ మోడల్ ఇది. భారత్ ప్రారంభించిన ఈ గొప్ప ఆవిష్కరణ కేంద్ర భాగంలో ‘జేఏఎమ్’ త్రయం ఉన్నాయి. అవి: జన్ ధన్ ఖాతాలు, ఆధార్, మొబైల్. ఈ మూడు మూలస్తంభాలూ భారత ఆర్థిక పర్యావరణ వ్యవస్థను సమూలంగా విప్లవీకరించాయి. మొదటి స్తంభమైన ప్రధాన్ మంత్రి జన్ ధన్ యోజన ప్రతి వయోజన భారతీయుడికి ఒక బ్యాంక్ ఖాతాను గ్యారంటీగా అందించే ఆర్థిక కార్యక్రమం. 2022 నాటికి, ఈ పథకం కింద 46.25 కోట్ల బ్యాంక్ ఖాతాలను తెరిచారు. వీటిలో 56 శాతం మహిళల ఖాతాలు కాగా, 67 శాతం ఖాతాలు గ్రామీణ, అర్ధ పట్టణ ప్రాంతాల్లో తెరిచారు. ఈ ఖాతాల్లో రూ. 1,73,954 కోట్లు జమ అయ్యాయి. ఇక రెండో మూలస్తంభం: ఆధార్ పరివర్తిత ఐడెంటిటీ సేవలు. ఆధార్ ఐడీని రెండు అంశాల ప్రామాణీకరణ లేదా బయోమెట్రిక్ ద్వారా ఉపయోగించవచ్చు. ఆధార్ ప్రామాణీకరణ బ్యాంకులు, టెల్కో వంటి సంస్థలకు మూలాధారంగా మారింది. ఈరోజు దేశంలోని 99 శాతం వయోజనులు బయోమెట్రిక్ గుర్తింపు నంబర్‌ను కలిగి ఉన్నారు. ఇంతవరకు 1.3 బిలియన్ ఐడీలు జారీ అయ్యాయి. ఈ ఐడీలు బ్యాంక్ ఖాతాల రూపకల్పనను సరళతరం చేసి సత్వర చెల్లింపుల వ్యవస్థకు పునాదిగా మారాయి. ఇక మూడో మూలస్తంభం: మొబైల్. ఇది భారతీయ టెలికామ్ రంగంలో కీలకమైన డిజిటల్ ఆవిష్కరణ. 2016లో రిలయెన్స్ జియో టెలికామ్ రంగంలోకి దూసుకొచ్చిన తర్వాత డేటా ఖర్చు 95 శాతం వరకు పడిపోయింది. ప్రతి భారతీయుడికి ఇంటర్నెట్ను అతి తక్కువ ఖర్చుతో అందుబాటులోకి తెచ్చింది. ఈ–కామర్స్, ఫుడ్ డెలివరీ, ఓటీటీ కంటెంట్ వంటి సమాంతర వ్యవస్థలకు జీవం పోసింది. ఇంకా ముఖ్యమైనది ఏమిటంటే, అత్యంత మారుమూల ప్రాంతాల్లోని చిట్ట చివరి వ్యక్తికి కూడా డిజిటల్ చెల్లింపుల వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇంటర్నెట్ అందుబాటు, స్మార్ట్ ఫోన్ల వ్యాప్తిని టెలిఫోన్ కంపె నీలు వేగవంతం చేయడం; ఆధార్ ప్రామాణీకృత జన్ ధన్ ద్వారా భారతీయ చెల్లింపుల పర్యావరణ వ్యవస్థ సమూల మార్పునకు గురైంది. ఈ సమూల మార్పు బ్యాంక్ ఖాతాకు నగదు రహిత చెల్లింపులను అనుసంధానించే ‘ఏకీకృత చెల్లింపుల మధ్యవర్తి’ (యూపీఐ) భావనకు దారితీసింది. యూపీఐ ఒక ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్య (పీపీపీ) వ్యవస్థ. ఇది నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) నేతృత్వంలో పనిచేసే వేదిక. ఈ వేదిక వందలాది బ్యాంకులు, డజన్లకొద్దీ మొబైల్ పేమెంట్ యాప్స్ నుంచి సేవలను అందిస్తుంది. దీనికి ఎలాంటి ట్రాన్సాక్షన్ ఫీజులు ఉండవు. ఫిన్ టెక్, బ్యాంకులు, టెల్కోలు ఈ వేదికను స్వీకరించాయి. పైగా ‘మర్చంట్ పాయింట్ ఆఫ్ సేల్స్’ (పీఓఎస్) వద్ద క్యూఆర్ కోడ్ ప్లేస్మెంట్ల వల్ల యుపీఐ భావన మరింత పురోగమించింది. ఎన్పీసీఐ మేనేజింగ్ డైరెక్టర్ దిలీప్ అస్బె ప్రకారం – ఈ యేడాది జనవరిలో రెండు లక్షల కోట్ల రూపాయల విలువైన 800 కోట్ల లావాదేవీలు యూపీఐ ద్వారా జరిగాయి. ఈరోజు అన్ని రకాల చెల్లింపుల్లో 40 శాతం డిజిటల్‌గా జరుగుతున్నాయి. గత సంవత్సరం భారత్‌లో జరిగిన తక్షణ డిజిటల్ లావాదేవీల విలువ అమెరికా, బ్రిటన్, జర్మనీ, ఫ్రాన్స్ దేశాల మొత్తం డిజిటల్ లావాదేవీల కంటే ఎక్కువని కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఈ జనవరిలో వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో తెలిపారు. దేశంలోని 30 కోట్లమంది వ్యక్తులు, 5 కోట్లమంది వర్తకులు యూపీఐని ఉపయోగిస్తున్నారని దిలీప్ అస్బె తెలిపారు. అత్యంత చిన్న లావాదేవీలను కూడా డిజిటల్ చెల్లింపుల ద్వారా చేస్తున్నారు. 10 రూపాయల విలువ చేసే కప్పు పాలు లేదా రూ.200 విలువ చేసే సంచీడు తాజా కూరగాయలు వంటి లావాదేవీలు కూడా డిజిటల్ ద్వారానే జరుగుతున్నాయి. సుదీర్ఘకాలంగా నగదు చెల్లింపులు సాగు తున్న ఆర్థికవ్యవస్థలో ఇది గణనీయమైన మార్పు. నల్లధనం నిర్మూ లనకు తీసుకొచ్చిన పెద్ద నోట్ల రద్దు, కోవిడ్ మహమ్మారి కాలంలో సామాజిక దూరం పాటించడం వంటివి కూడా డిజిటల్ పేమెంట్ వ్యవస్థను మరింతగా ముందుకు నెట్టాయి. భారత ప్రభుత్వం గోప్యత, సృజనాత్మక ఆవిష్కరణ మధ్య సరైన సమతూకాన్ని తీసుకొచ్చిందని జీ20 షేర్పా అమితాబ్ కాంత్ వ్యాఖ్యా నించారు. డిజిటల్ చెల్లింపులను ఇంకా అమలు పర్చని రంగాల్లో కూడా, ఉదాహరణకు కేరళలోని మత్స్య పరిశ్రమలో ఐడెంటిటీ సంఖ్య, బ్యాంక్ ఖాతాలు, మొబైల్ ఫోన్ యాప్‌ల వంటి డిజిటల్ ప్రాథమిక పునాదులు సేవల సులభ పంపిణీకి వీలు కల్పిస్తున్నాయి. డిజిటల్ చెల్లింపుల వ్యవస్థ విజయం డిజిటల్ పేమెంట్ మౌలిక వసతుల దృఢత్వంపై మాత్రమే ఆధారపడలేదు... అది నగదు నుంచి డిజిటల్‌కు మారడానికి ప్రజల్లో తెచ్చిన ప్రవర్తనాపరమైన ప్రోత్సాహంపై కూడా ఆధారపడి ఉంది. టీ స్టాల్స్ వంటి వాటి వద్ద అమర్చిన పేమెంట్ యాప్స్ ద్వారా అందించిన చిన్న వాయిస్ బాక్సుల వంటి ఆసక్తికరమైన ఆవిష్క రణల్లో కూడా వీటి విజయం దాగి ఉంది. వీటి ద్వారా ప్రతి చిన్న లావాదేవీ తర్వాత అమ్మకందారులు ఫోన్ మెసేజ్‌లు తనిఖీ చేస్తూ బిజీగా ఉంటున్నారు. క్యూఆర్ కోడ్ ద్వారా ప్రతి పేమెంట్‌తో తక్షణం అందుకునే డబ్బు ఎంతో సిరి వంటి వాయిస్ ప్రకటిస్తుంది. నగదు లావాదేవీలను దీర్ఘకాలంగా ఉపయోగిస్తున్న వర్తకులలో ఏర్పడే అవిశ్వాసాన్ని తొలగించడంలో ఇది సాయపడుతుంది. ‘కౌంటర్‌పాయింట్’ ప్రకారం, భారత్‌లో 120 డాలర్ల సబ్ ఫోన్లకు మార్కెట్ వాటా రెండేళ్లకు ముందు 41 శాతం ఉండగా, 2022లో అది 26 శాతం పడిపోయింది. ఇదే కాలానికి 30 వేల రూపాయల (360 డాలర్లు) పైబడిన ధర కలిగిన ప్రీమియం ఫోన్ల వాటా రెట్టింపై 11 శాతానికి చేరుకుంది. ఫోన్లకోసం రుణాలు వంటి ఫైనాన్స్ ప్రొడక్ట్ ఆవిష్కరణలు ప్రీమియం ఫోన్లను చిన్న చిన్న పట్టణాలలోని సామాన్య ప్రజానీకానికి అందుబాటులోకి తీసుకొచ్చాయి. ఆధార్ ప్రామాణికత, మొబైల్ ఇంటర్నెట్ ఉపయోగంపై ఆధారపడిన సమీ కృత ఆర్థిక వ్యవస్థ కారణంగా ఇది సాధ్యమైంది. ఇవన్నీ దేశంలో వ్యాపారాన్ని, ఆంట్రప్రెన్యూర్షిప్ని, వినియోగ నమూనాలను విప్లవీకరించి భారతీయ డిజిటల్ చెల్లింపుల వ్యవస్థను గేమ్ ఛేంజర్‌గా చేయడమే కాకుండా, ప్రపంచానికే స్ఫూర్తిగా నిలిపాయి. – బీఎన్/‘పీఐబీ’ రీసెర్చ్ వింగ్ -
భారత టెక్నాలజీతో కోట్ల కొద్దీ ఆదా
న్యూఢిల్లీ: ఇతర దేశాలు బిలియన్ల కొద్దీ డాలర్లను ఆదా చేసుకునేందుకు డిజిటల్ చెల్లింపులు, కో–విన్, విశిష్ట గుర్తింపు సాంకేతికత వంటి భారతీయ టెక్నాలజీలు సహాయపడగలవని కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ చెప్పారు. అలాగే ఆయా దేశాలు డిజిటైజేషన్ ప్రక్రియను కూడా వేగవంతం చేసుకోవచ్చని ఆయన తెలిపారు. జీ20కి అధ్యక్షత వహిస్తున్న నేపథ్యంలో భారత్ .. తన వంతు బాధ్యతగా పలు దేశాలకు మన టెక్నాలజీ స్టాక్‌ను (ఉత్పత్తులు, సాధనాలు మొదలైనవి) ఆఫర్ చేసే ప్రణాళికలు ఉన్నాయని మంత్రి చెప్పారు. ఇండియా స్టాక్ డెవలపర్ కాన్ఫరెన్స్ జరగనున్న నేపథ్యంలో ఆయన ఈ విషయాలు వివరించారు. రూ. 1.28 లక్షల కోట్లకు ఎలక్ట్రానిక్స్ ఎగుమతులు వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఎలక్ట్రానిక్స్ ఎగుమతులు రూ. 1.28 లక్షల కోట్ల స్థాయికి చేరగలవని అంచనా వేస్తున్నట్లు మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ తెలిపారు. ఐటీ హార్డ్‌వేర్, విడిభాగాల తయారీదార్లు, హియరబుల్–వేరబుల్స్ ఉత్పత్తులకు కూడా కొత్తగా ఉత్పాదకత ఆధారిత ప్రోత్సాహక పథకాన్ని వర్తింపచేయడం ద్వారా ఎలక్ట్రానిక్స్ తయారీ వ్యవస్థ మరింత విస్తరించేందుకు కేంద్రం చర్యలు తీసుకుంటోందని ఒక ఇంటర్వ్యూలో ఆయన చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రానిక్స్ విభాగంలో మొబైల్ ఫోన్ సెగ్మెంట్ అత్యంత వేగంగా ఎదుగుతున్న విభాగంగా ఉండటంతో దానిపై మరింతగా దృష్టి పెడుతున్నట్లు వివరించారు. 2023–24లో మొబైల్ ఫోన్ల ఉత్పత్తి రూ. 1 లక్ష కోట్లకు చేరుతుందని ఆయన పేర్కొన్నారు. -
హైబ్రిడ్ విద్యా విధానమే ఉత్తమం: ప్రధాని మోదీ
న్యూఢిల్లీ: పాఠశాల విద్యార్థులు టెక్నాలజీకి విపరీతంగా అలవాటు పడకుండా హైబ్రిడ్ విద్యా విధానాన్ని అనుసరించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూచించారు. ఆన్లైన్, ఆఫ్‌లైన్ రెండు రకాల పద్ధతుల ద్వారా బోధన జరగాలన్నారు. జాతీయ విద్యా విధానం (ఎన్ఈపీ) అమలుపై ప్రధాని శనివారం అత్యున్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చాక ఆన్లైన్ విధానం ఎక్కువ కావడంతో పిల్లలు టెక్నాలజీకి ఎక్కువగా అలవాటు పడుతున్నారని ప్రధాని హెచ్చరించారు. సమానత్వం, సమగ్రత, అనుసంధానం, నాణ్యమైన విద్య వంటి లక్ష్యాలతో జాతీయ విద్యా విధానాన్ని రూపొందించి , అమలు చేస్తున్నట్టు మోదీ చెప్పారు. అంగన్వాడీ కేంద్రాల్లో డేటాబేస్‌లన్నింటినీ, పాఠశాలల్లోని రికార్డులతో అనుసంధించాలని చెప్పారు. ఈ పరిజ్ఞాన సహకారంతో పాఠశాలల్లోనే పిల్లలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించివచ్చునని ప్రధాని చెప్పినట్టుగా అధికారిక ప్రకటన వెల్లడించింది. డ్రాపవుట్ విద్యార్థుల్ని గుర్తించి బడి బాట పట్టించడానికి ఈ విధానం దృష్టి సారిస్తోందని ప్రధాని వివరించారు. -
రైళ్ల భద్రతకు యూరోపియన్ పరిజ్ఞానం
సాక్షి, హైదరాబాద్, తార్నాక: రైళ్లు ఢీకొనకుండా యూరప్ దేశాల్లో అమలులో ఉన్న సాంకేతిక వ్యవస్థను భారతీయ రైల్వేలో ప్రవేశపెట్టే దిశగా ఏర్పాట్లు జరుగుతున్నట్టు రైల్వే బోర్డు చైర్మన్ వినోద్‌కుమార్ యాదవ్ పేర్కొన్నారు. యూరోపియన్ ట్రెయిన్ కంట్రోల్ సిస్టం (యూటీసీఎస్)గా పిలుచుకునే ఈ సాంకేతికతను త్వరలో ప్రయోగాత్మకంగా పరిశీలించనున్నట్టు తెలిపారు. స్వర్ణ చతుర్భుజి కారిడార్‌లో త్వరలో 650 కి.మీ. మేర ఈ వ్యవస్థను ఏర్పాటు చేసి పనితీరు పరిశీలిస్తామని వెల్లడించారు. ఆదివారం జరిగిన ఇండియన్ రైల్వేస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సిగ్నల్ ఇంజనీరింగ్ అండ్ టెలీ కమ్యూనికేషన్ (ఇరిసెట్) 62వ వార్షికోత్సవానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన రైళ్ల భద్రతపై కీలక వివరాలు వెల్లడించారు. రైల్వే ఉద్యోగులకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించడంలో ఇరిసెట్ ప్రముఖ పాత్ర పోషిస్తుందన్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి మాట్లాడుతూ, సరైన ఫలితాలు సాధించాలంటే మంచి సాంకేతిక పరిజ్ఞానం, మంచి నైపుణ్యం అవసరమని, వాటిని సొంతం చేసుకునేందుకు ఇక్కడి శిక్షణార్థులు మెరుగ్గా రాణించాలని సూచించారు. దక్షిణమధ్య రైల్వే జనరల్ మేనేజర్ గజానన్ మాల్యా కూడా మాట్లాడారు. జ్ఞానదీప్ పేరుతో ఇరిసెట్ రూపొందించిన పత్రికను వినోద్‌కుమార్ ఆవిష్కరించారు. ఐఆర్ఐఎఫ్ఎం ప్రారంభం రైల్ వికాస్ నిగమ్ ఆధ్వర్యంలో రూ.85 కోట్ల వ్యయంతో మౌలాలిలో నిర్మించిన ఇండియన్ రైల్వేస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ (ఐఆర్ఐఎఫ్ఎం) నూతన క్యాంపస్‌ను వినోద్‌కుమార్ ప్రారంభించారు. రైల్వేలోని ఆర్థికపరమైన అంశాలను చూసే విభాగంలో జాతీయ స్థాయిలో ఉత్తమ శిక్షణ ఇచ్చేందుకు దీన్ని ప్రారంభించారు. -
తరంగాల టార్చ్‌లైట్
హౌ ఇట్ వర్క్స్? / రాడార్ అర్ధరాత్రి... దట్టమైన పొగమంచు... నగరం నడిబొడ్డున విమానాశ్రయం. ఉన్నదేమో చిన్నపాటి రన్‌వే. అయినా ప్రతిరోజూ విమానాలు సురక్షితంగా ల్యాండ్ అవుతున్నాయి. టేకాఫ్ అవుతున్నాయి కూడా. ఎలాగంటారు? ఆ... ఏముంది.. రన్‌వే పొడవునా లైట్లు పెట్టి ఉంచుతారుగా... వాటిని చూసి అంటారా. అక్కడే మీరు తప్పులో కాలేశారు. ఈ లైట్ల కంటే ఎక్కువ ఉపయోగపడే టెక్నాలజీ వ్యవస్థ రాడార్! రెండో ప్రపంచ యుద్ధ కాలంలో శత్రు విమానాల ఉనికిని తెలుసుకునే లక్ష్యంతో అందుబాటులోకి వచ్చినా... తరువాతి కాలంలో ఇవి అనేక రంగాల్లో సామాన్యులకూ ఉపయోగపడుతున్నాయి. ఈ రాడార్లు ఎలా పనిచేస్తాయో చూద్దాం. చీకట్లో మీరెక్కడికైనా వెళ్లాలంటే టార్చ్ ఉపయోగిస్తారు కదా... రాడార్ లేదా రేడియో డిటెక్షన్ అండ్ రేంజింగ్ వ్యవస్థ కూడా టార్చ్ లాంటిదే. కాకపోతే మామూలు టార్చ్.. వెలుతురు ఆధారంగా పనిచేస్తే.. రాడార్ రేడియో తరంగాలను వాడుకుంటుంది. విమానాశ్రయంలో ఉన్నా... నౌకలు, మొబైల్ ట్రక్కులు... ఇలా దేంట్లో ఉన్నప్పటికీ రాడార్లు ప్రధానంగా చేసే పని రేడియో తరంగాలను ప్రసారం చేయడం. దూరం నుంచి వచ్చే తరంగాలను స్వీకరించడం. ఇందుకోసం ఈ వ్యవస్థలో మాగ్నెట్రాన్ అనే పరికరం ఉంటుంది. ఇది తయారుచేసే సూక్ష్మ తరంగాలను ట్రాన్స్మిటర్ అన్నివైపులకు ప్రసారం చేస్తుంది. ఇవి సెకనుకు మూడు లక్షల కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తూంటాయి. ఏదైనా లోహపు వస్తువును ఢీకొన్నప్పుడు వీటిల్లో కొన్ని కాంతివేగంతో వ్యతిరేక మార్గంలో ప్రయాణిస్తాయి. రాడార్‌లోని యాంటెన్నాలు ఈ తరంగాలను స్వీకరిస్తాయి. యాంటెన్నాలు తరంగాలను ఎప్పుడు ప్రసారం చేయాలి? ఎప్పుడు స్వీకరించాలన్న అంశాన్ని డూప్లెక్సర్ అనే యంత్రం నిర్ణయిస్తుంది. వ్యవస్థలోని కంప్యూటర్ అనవసరమైన విషయాలను తొలగించి అందిన రేడియో తరంగాల్లో ముఖ్యమైన వాటిని మాత్రమే విశ్లేషించి ఆ వివరాలను రిసీవర్ యూనిట్ ద్వారా స్క్రీన్‌పై ప్రసారం చేస్తుంది. తరంగాలు ప్రసారమై, వెనక్కు వచ్చేందుకు పట్టిన సమయాన్ని బట్టి దూరాన్ని లెక్కిస్తారు. ఈ వివరాలు రాడార్‌లోని ఎలక్ట్రానిక్ డిస్ప్లేలో కనిస్తాయి. అనవసరమైన విషయాలను తొలగించి ఒకప్పుడు కేవలం శత్రు విమానాలను గుర్తించేందుకు మాత్రమే దీన్ని వాడినప్పటికీ ప్రస్తుతం రాడార్లను విమానాశ్రయాలతోపాటు కొన్ని నౌకాయానంలో, వాతావరణ అంచనాల తయారీలోనూ వాడుతున్నారు. -
ఒక్క కాల్‌తో కొలిక్కి..
ఖమ్మం హవేలి, న్యూస్‌లైన్: ప్రతి ఒక్కరికీ సొంతిల్లు అనేది ఓ కల. ఆ కలను సాకారం చేయాలనే ఉద్దేశంతో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ఇందిరమ్మ పథకం ద్వారా రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో ప్రతి కుటుంబం ఇల్లు నిర్మించుకునేలా అవకాశం కల్పించారు. వైఎస్ఆర్ మృతి అనంతరం రాష్ట్రవ్యాప్తంగా గృహ లబ్ధిదారులకు బిల్లుల విషయంలో పలు అవాంతరాలు వచ్చాయి. లబ్ధిదారులు అనేక అవస్థలు పడుతున్నారు. ఈ నేపథ్యంలో జిల్లాలో ఇందిరమ్మ లబ్ధిదారుల సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేక సాంకేతిక వ్యవస్థను ఏర్పాటు చేశారు. గృహనిర్మాణశాఖ జిల్లా ప్రాజెక్టు డైరక్టర్ వైద్యం భాస్కర్ ప్రత్యేక చొరవతో ఈ నూతన సాంకేతిక వ్యవస్థ అందుబాటులోకి వచ్చింది. జిల్లాలోని అన్ని మండలాల్లో లబ్ధిదారులు తమ ఇంటి వద్ద నుంచే సమస్యలు పరిష్కరించుకునే అవకాశం ఏర్పడింది. ఎంటెక్ (ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ) పూర్తిచేసిన భాస్కర్ తనకున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఈ నూతన ఆవిష్కరణకు తెరతీశారు. 80990 44858 సెల్ నంబర్‌కు జిల్లాలోని అన్ని మండలాల్లో లబ్ధిదారులు ఒక్క ఫోన్‌కాల్ చేసి తమ సమస్యను చెప్పవచ్చు. ఇళ్ల బిల్లులు రాకపోయినా, ఆలస్యం అయినా, పేరు, ఇంటిపేరు, బ్యాంకు ఖాతా నంబరు, ఐఎఫ్ఎస్సీ కోడ్, తదితర వివరాలు తప్పుగా ముద్రితమైనా.. ఇతర సమస్యలు ఏమైనా సరే చెప్పవచ్చు. వాయిస్ రికార్డు ద్వారా వచ్చిన ఈ సమస్యలను పీడీ, జిల్లాస్థాయిలో హౌసింగ్ విభాగం ముఖ్య అధికారులు సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటారు. నంబర్ పనిచేసే విధానం... రోజులో 24 గంటల పాటు పనిచేసే 80990 44858 నంబరుకు ఫోన్ చేసిన తరువాత అందులో ఇచ్చే సూచనల ప్రకారం అవసరమైనవారితో మాట్లాడవచ్చు. మీరు ఆఫీస్ మేనేజర్‌తో మాట్లాడాలంటే 1 నొక్కాలి. కొత్తగూడెం ఈఈ కార్యాలయానికి ఫోన్ చేయాలంటే 2. పాల్వంచ ఈఈ కారా్యాలయానికి ఫోన్ చేయాటంలే 3. భద్రాచలం ఈఈ కార్యాలయానికి ఫోన్ చేయాలంటే 4. ప్రాజెక్టు డెరైక్టర్ వైద్యం భాస్కర్‌తో మాట్లాడాలంటే 5 నొక్కాలి. మీ సమస్యను లబ్ధిదారుల కేర్ సెంటర్‌కు తెలపాలంటే 6 నొక్కాలి. మీ సమస్యను రికార్డు చేయాలనుకుంటే 7 నొక్కాలి. ఎగ్జిట్ కావాలనుకుంటే 8 నొక్కాలి. కాల్ మేనేజ్మెంట్ సిస్టమ్(సీఎంఎస్), బెనిఫిషరీ కేర్ మేనేజ్మెంట్ సిస్టమ్(బీసీఎంఎస్) అనే రెండు దశల్లో ఈ నూతన వ్యవస్థ ద్వారా సమస్యలు స్వీకరించి పరిష్కారానికి కృషి చేస్తారు. సీఎంఎస్ విధానంలో లబ్ధిదారులు ఫోన్ చేయగానే స్వాగతం పలుకుతుంది. సమస్యను వాయిస్ రికార్డు ద్వారా కూడా వినిపించవచ్చు. ఆప్షన్ ఎన్నుకుని తమకు కావల్సిన అధికారితో కూడా మాట్లాడవచ్చు. వాయిస్ మెసేజ్ ద్వారా వచ్చిన కాల్ బెనిఫిషరీ కాల్ మేనేజ్మెంట్ సాఫ్ట్వేర్ ద్వారా నిక్షిప్తమవుతుంది. ఆ తర్వాత సంబంధిత అధికారికి మెయిల్ ద్వారా అందుతుంది. ప్రతి సమస్యకు ఒక యూజర్ ఐడీ క్రియేట్ చేయబడి లబ్ధిదారుకు సంక్షిప్త రూపంలో వెంటనే ఎస్ఎంఎస్ వెళుతుంది. సమస్యలను సంబంధిత పర్యవేక్షకులు, ఏఈలకు పంపిస్తారు. సమస్య పరిష్కారం అయ్యేవరకు ఉన్నతాధికారుల పరిశీలనలో ఉంటుంది.