తరంగాల టార్చ్‌లైట్
హౌ ఇట్ వర్క్స్? / రాడార్
అర్ధరాత్రి... దట్టమైన పొగమంచు... నగరం నడిబొడ్డున విమానాశ్రయం. ఉన్నదేమో చిన్నపాటి రన్‌వే. అయినా ప్రతిరోజూ విమానాలు సురక్షితంగా ల్యాండ్ అవుతున్నాయి. టేకాఫ్ అవుతున్నాయి కూడా. ఎలాగంటారు? ఆ... ఏముంది.. రన్‌వే పొడవునా లైట్లు పెట్టి ఉంచుతారుగా... వాటిని చూసి అంటారా. అక్కడే మీరు తప్పులో కాలేశారు. ఈ లైట్ల కంటే ఎక్కువ ఉపయోగపడే టెక్నాలజీ వ్యవస్థ రాడార్! రెండో ప్రపంచ యుద్ధ కాలంలో శత్రు విమానాల ఉనికిని తెలుసుకునే లక్ష్యంతో అందుబాటులోకి వచ్చినా... తరువాతి కాలంలో ఇవి అనేక రంగాల్లో సామాన్యులకూ ఉపయోగపడుతున్నాయి. ఈ రాడార్లు ఎలా పనిచేస్తాయో చూద్దాం.
చీకట్లో మీరెక్కడికైనా వెళ్లాలంటే టార్చ్ ఉపయోగిస్తారు కదా... రాడార్ లేదా రేడియో డిటెక్షన్ అండ్ రేంజింగ్ వ్యవస్థ కూడా టార్చ్ లాంటిదే. కాకపోతే మామూలు టార్చ్.. వెలుతురు ఆధారంగా పనిచేస్తే.. రాడార్ రేడియో తరంగాలను వాడుకుంటుంది. విమానాశ్రయంలో ఉన్నా... నౌకలు, మొబైల్ ట్రక్కులు... ఇలా దేంట్లో ఉన్నప్పటికీ రాడార్లు ప్రధానంగా చేసే పని రేడియో తరంగాలను ప్రసారం చేయడం. దూరం నుంచి వచ్చే తరంగాలను స్వీకరించడం. ఇందుకోసం ఈ వ్యవస్థలో మాగ్నెట్రాన్ అనే పరికరం ఉంటుంది. ఇది తయారుచేసే సూక్ష్మ తరంగాలను ట్రాన్స్‌మిటర్ అన్నివైపులకు ప్రసారం చేస్తుంది. ఇవి సెకనుకు మూడు లక్షల కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తూంటాయి. ఏదైనా లోహపు వస్తువును ఢీకొన్నప్పుడు వీటిల్లో కొన్ని కాంతివేగంతో వ్యతిరేక మార్గంలో ప్రయాణిస్తాయి. రాడార్‌లోని యాంటెన్నాలు ఈ తరంగాలను స్వీకరిస్తాయి. యాంటెన్నాలు తరంగాలను ఎప్పుడు ప్రసారం చేయాలి? ఎప్పుడు స్వీకరించాలన్న అంశాన్ని డూప్లెక్సర్ అనే యంత్రం నిర్ణయిస్తుంది. వ్యవస్థలోని కంప్యూటర్ అనవసరమైన విషయాలను తొలగించి అందిన రేడియో తరంగాల్లో ముఖ్యమైన వాటిని మాత్రమే విశ్లేషించి ఆ వివరాలను రిసీవర్ యూనిట్ ద్వారా స్క్రీన్‌పై ప్రసారం చేస్తుంది. తరంగాలు ప్రసారమై, వెనక్కు వచ్చేందుకు పట్టిన సమయాన్ని బట్టి దూరాన్ని లెక్కిస్తారు. ఈ వివరాలు రాడార్‌లోని ఎలక్ట్రానిక్ డిస్‌ప్లేలో కనిస్తాయి. అనవసరమైన విషయాలను తొలగించి ఒకప్పుడు కేవలం శత్రు విమానాలను గుర్తించేందుకు మాత్రమే దీన్ని వాడినప్పటికీ ప్రస్తుతం రాడార్లను విమానాశ్రయాలతోపాటు కొన్ని నౌకాయానంలో, వాతావరణ అంచనాల తయారీలోనూ వాడుతున్నారు.