Tehreek-e-Taliban Pakistan
-
పాక్‌లో ఆత్మాహుతి దాడి.. 9 మంది జవాన్లు మృతి
పెషావర్: పాకిస్తాన్లో ఖైబర్ ఫంక్తున్వా ప్రావిన్స్ బన్ను జిల్లాలో గురువారం జరిగిన ఆత్మాహుతి దాడిలో తొమ్మిదిమంది సైనికులు మృతి చెందారు. నిషేధిత తెహ్రీక్–ఇ–తాలిబన్ పాకిస్తాన్(టీటీపీ)కి చెందిన ఉగ్రవాది బైక్‌పై వచ్చి భద్రతాబలగాలు ప్రయాణిస్తున్న వ్యాన్‌ను ఢీకొట్టాడు. భారీ పేలుడు సంభవించడంతో వ్యానులోని 9 మంది మరణించగా మరో అయిదుగురు గాయపడ్డారని సైన్యం తెలిపింది. దాడికి తామే కారణమంటూ టీటీపీ ప్రకటించుకుంది. పలు ఉగ్ర సంస్థలు కలిసి 2017లో టీటీపీగా ఏర్పాటయ్యాయి. అల్ ఖాయిదాతో సంబంధాలున్నట్లు అనుమానాలున్న టీటీపీ ఇటీవల తరచూ దాడులకు తెగబడుతోంది. జనవరిలో పెషావర్‌లోని ఓ మసీదులో జరిగిన ఆత్మాహుతి దాడిలో 101 మంది చనిపోగా మరో 200 మంది గాయపడ్డారు. -
పాకిస్తాన్‌కు కొత్త ముప్పు.. దేశంపై పట్టుకు టీటీపీ ప్లాన్.. దాని లక్ష్యాలేంటి ?
ఆర్థికంగా దివాలా తీశామని ఒకవైపు దేశ రక్షణ మంత్రే ప్రకటిస్తున్న పరిస్థితుల్లో తెహ్రిక్–ఇ–తాలిబన్ రూపంలో కొత్త ముప్పుని ఎదుర్కొంటోంది. అఫ్గాన్‌లో తాలిబన్లు అధికారం చేజిక్కించుకున్నప్పుడు సంబరాలు చేసుకున్న పాకిస్తాన్ ఇప్పుడు తాము బలిపశువుగా మారినందుకు ఎలా అడుగు లు వెయ్యాలో తెలీక బిత్తరపోతోంది. ఎవరీ తెహ్రిక్–ఇ–తాలిబన్లు, వారి లక్ష్యమేంటి ..? 2021, ఆగస్టు అఫ్గాన్‌లో తాలిబన్ ప్రభుత్వం ఏర్పాటైన సందర్భం... పాకిస్తాన్లో సంబరాలు జరిగాయి. తమ కనుసన్నల్లో మెలిగిన తాలిబన్లు అమెరికానే తరిమి కొట్టారని, అగ్రరాజ్యంపై ఇస్లాం ఘన విజయం సాధించిందంటూ నాయకులందరూ ప్రకటనలు గుప్పించారు. ఆ నాటి పాక్ ఐఎస్ఐ చీఫ్ ఫయాజ్ హమీద్ కాబూల్‌కు వెళ్లి తాలిబన్ల ప్రభుత్వ స్థాపనకు స్వయంగా ఏర్పాట్లు చేసి మరీ వచ్చారు. నెల రోజులయ్యేసరికి.. అఫ్గాన్‌లో అధికారంలోకొచ్చిన తాలిబన్ల అండతో తెహ్రిక్–ఇ–తాలిబన్ పాకిస్తాన్ (టీటీపీ) రెచ్చిపోవడం ప్రారంభించింది. పాకిస్తాన్ సార్వభౌమాధికారాన్నే ప్రశ్నిస్తూ దాడులకు దిగడం మొదలు పెట్టింది. 2021 ఆగస్టు నుంచి 2022 ఆగస్టు వరకు పాక్‌లో కనీసం 250 దాడులు జరిగాయని పాక్ ఇనిస్టిట్యూట్ ఫర్ పీస్ స్టడీస్ (పీఐపీఎస్) గణాంకాలు తేటతెల్లం చేస్తున్నాయి. అంతకు ముందు ఏడాదితో పోల్చి చూస్తే దాడుల సంఖ్య రెట్టింపు అయింది. ఈ దాడుల్లో 95శాతం బెలూచిస్తాన్, ఖైబర్ పఖ్తుఖ్వా(కె.పి)లో కీలక ప్రాంతాలు లక్ష్యంగా జరిగాయి. భద్రతా సిబ్బందిని లక్ష్యంగా చేసుకునే దాడులు జరుపుతున్నారు. ఈ ఏడాది జనవరిలో 100 మంది ప్రాణాలను బలితీసుకున్న పెషావర్ మసీదు దాడి ఘటన జరిగిన కొద్ది రోజులకే కరాచీలో పోలీసుల్ని లక్ష్యంగా చేసుకొని దాడులకు దిగడం ఆందోళన కలిగిస్తోంది. ఏమిటీ టీటీపీ తెహ్రిక్–ఇ–తాలిబన్ పాకిస్తాన్‌ను టీటీపీ అని పిలుస్తారు. అఫ్గానిస్తాన్‌లో తాలిబన్ల మద్దతుతో వీళ్లు తమ కార్యకలాపాలు నిర్వహిస్తారు. 2001లో అమెరికాపై ట్విన్ టవర్స్ దాడి తర్వాత అగ్రరాజ్యం చేసిన ఉగ్రవాదుల ఏరివేత కార్యక్రమానికి పాకిస్తాన్ అండగా నిలవడంతో తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేసిన వీరంతా ఒక గూటి కిందకి చేరారు. పాక్ విధానాలను వ్యతిరేకిస్తూ దక్షిణ వజిరిస్తాన్‌లో బైతుల్లా మెహసూద్ నేతృత్వంలో 2007లో తెహ్రిక్–ఇ–తాలిబన్ పాకిస్తాన్ (టీటీపీ) ఏర్పాటైంది. టీటీపీ ప్రస్తుత చీఫ్ నూర్ వలీ మెహసూద్ అఫ్గాన్ నుంచి పాక్‌లో హింసను రాజేస్తున్నాడు. అనుకున్నదొక్కటి అయినదొక్కటి.! అఫ్గానిస్తాన్‌లో తాలిబన్ల ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే పరిస్థితులన్నీ తమకు అనుకూలంగా మారిపోతాయని పాక్ ప్రభుత్వం భావించింది. రెండు దశాబ్దాల పాటు అఫ్గాన్‌లో మౌలిక సదుపాయాల కల్పనకు సాయం అందించి అంతర్జాతీయంగా మంచి పేరు సంపాదించుకున్న భారత్ ఓ పక్కకి వెళ్లిపోతుందని ఆనందపడింది. అయితే సరిహద్దు రూపంలో తాలిబన్లతో సమస్య మొదలైంది.డ్యూరాండ్ రేఖపై ఇరు దేశాల మధ్య విభేదాలు తలెత్తాయి. టీటీపీ తుపాకీలు వదిలి జన జీవన స్రవంతిలోకి రావాలని పాక్ సర్కార్ చేసిన ప్రయత్నాలు కొనసాగలేదు. సరిహద్దుల్లో ఉన్న గిరిజనుల్ని పాక్ చేతుల నుంచి విడిపించడమే తమ లక్ష్యమన్నట్టుగా టీటీపీ మారిపోయింది. అఫ్గానిస్తాన్ సరిహద్దుల నుంచి సైన్యాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేసింది. కొన్నాళ్లు కాల్పుల విరమణ ప్రకటించినప్పటికీ పాకిస్తాన్ కొత్త ఆర్మీ చీఫ్‌గా గత ఏడాది నవంబర్‌లో జనరల్ అసీమ్ మునీర్ బాధ్యతలు స్వీకరించగానే కాల్పుల విరమణను రద్దు చేసింది. అప్పట్నుంచి పాకిస్తాన్లో ఆత్మాహుతి దాడులు, ప్రభుత్వ అధికారుల కిడ్నాప్‌లు, బెదిరింపులు వంటివి చేయసాగింది. మరోవైపు పాక్ ప్రభుత్వం కూడా తాలిబన్లను అదుపు చేయడానికి దాడులకు దిగుతూ ఉండడంతో ఇరుపక్షాల మధ్య ఉద్రిక్తతలు పెరిగిపోతున్నాయి. ఇన్నాళ్లూ అఫ్గాన్‌లో మంచి తాలిబన్లు, పాక్‌లో ఉన్న టీటీపీ చెడ్డ తాలిబన్లు అని భావించిన పాక్‌కు ఇద్దరూ చేతులు కలపడంతో అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి అని నిట్టూరుస్తోంది. ఈ పరిణామాలన్నీ దేశంలో అంతర్యుద్ధానికి దారి తీయవచ్చుననే అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి. దివాలా తీశాం: పాక్ రక్షణ మంత్రి ఆర్థిక సంక్షోభంతో విలవిలలాడుతున్న పాకిస్తాన్ రేపో మాపో దివాలా తీస్తుందని అందరూ అనుకుంటున్న వేళ ఆ దేశ రక్షణ మంత్రి ఖవాజా అసీఫ్ బాంబు లాంటి నిజం చెప్పారు. ఇప్పటికే దేశం దివాలా తీసిందని అన్నారు. ఆదివారం సియాల్కోట్లో ఒక కార్యక్రమానికి హాజరైన ఆయన మాట్లాడుతూ ‘‘పాక్ దివాలా తీస్తుందన్న వార్తలు మీరు వినే ఉంటారు. వాస్తవానికి ఇప్పటికే దేశం దివాలా తీసింది. మనం ప్రస్తుతం దివాలా తీసిన దేశంలో బతుకుతున్నాం’’ అని కుండబద్దలు కొట్టినట్టుగా చెప్పారు. దేశంలో ఆర్థిక సమస్యల పరిష్కారానికి అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) ఏమీ చేయలేదని మనమే ఏదో ఒకటి చెయ్యాలన్నారు. పాకిస్తాన్లో చట్టం, రాజ్యాంగాన్ని అనుసరించడం లేదని, ఈ దుస్థితికి రాజకీయ నాయకులు, అధికార యంత్రాంగం, మన వ్యవస్థలు అన్నీ బాధ్యతవహించాలన్నారు. టీటీపీ లక్ష్యాలేంటి ? పాకిస్తాన్ మిలటరీ విధానాలను తీవ్రంగా వ్యతిరేంచిన ఈ సంస్థ దేశాన్ని తన నియంత్రణలోకి తెచ్చుకోవడానికి అన్ని రకాలుగా ప్రయత్నిస్తోంది. 2021లో అఫ్గాన్ నుంచి అమెరికా, నాటో దళాలు వెళ్లిపోయి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాక పాకిస్తాన్‌పై దృష్టి సారించింది. ఇస్లాం విస్తరణ తాలిబన్ల ప్రధాన ధ్యేయంగా మారింది. అఫ్గానిస్తాన్‌లో మాదిరిగా పాకిస్తాన్లో కూడా ప్రభుత్వాన్ని కూల్చివేసి ఇస్లామిక్ రాజ్యాన్ని స్థాపించి షరియా చట్టాలను కఠినంగా అమలు చేయాలని ఉవ్విళ్లూరుతోంది. పాకిస్తాన్ జైళ్లలో ఉన్న తమ వారిని బయటకు తీసుకురావాలని, అఫ్గాన్, పాక్ సరిహద్దుల్లోని గిరిజన ప్రాంతాల్లో పాకిస్తాన్ సైనికుల్ని వెనక్కి తీసుకువెళ్లేలా చర్యలు తీసుకోవాలంటూ పాక్ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తోంది. పాకిస్తాన్లో ఉగ్ర దాడులకు ఐసిస్ అవసరం లేదు. పాకిస్తానీ తాలిబన్లు చాలు. అఫ్గానిస్తాన్ తరహాలో ఏదో ఒకరోజు తాలిబన్లు పాకిస్తాన్‌ను స్వాధీనం చేసుకున్నా ఆశ్చర్యపడాల్సిన పని లేదు. – తస్లీమా నస్రీన్, బంగ్లాదేశ్ రచయిత్రి – సాక్షి, నేషనల్ డెస్క్ -
పాక్‌లో జిహాద్ పేరుతో నిధులు సేకరించొద్దు
లాహోర్: పాకిస్తాన్లో జిహాద్ పేరుతో నిధులను సేకరించేందుకు ప్రజలను ప్రేరేపించొద్దని, అలా ఎవరు చేసినా అది రాజద్రోహం కిందికి వస్తుందని లాహోర్ హైకోర్టు స్పష్టం చేసింది. ఏదైనా యుద్ధాన్ని ప్రకటిస్తే అందుకు అవసరమైన డబ్బులు సేకరించడం దేశానికి సంబంధించిన పని అని వెల్లడించింది. నిషేధిత ఉగ్రవాద సంస్థ కోసం నిధులు సేకరించినందుకు దోషులుగా తేలి ఐదేళ్లు శిక్ష పడిన ఇద్దరు ఉగ్రవాదుల అప్పీళ్లను తోసిపుచ్చుతూ ఇటీవల తీర్పు నిచ్చింది. ‘తెహ్రీకీ తాలిబాన్ నిషేధిత సంస్థ. దేశానికి ఎంతో నష్టం చేసింది. దేశ ముఖ్య నాయకులు లక్ష్యంగా పని చేసింది. దేశంలో ఉగ్రవాదం పెంచడానికి ప్రయత్నింది. ఆర్థికంగా మద్దతు లేనిదే ఇదంతా సాధ్యం కాదు’ అని వ్యాఖ్యానించింది. ఉగ్రవాద కార్యకలాపాలకు డబ్బులు అందించారంటూ ఈ నెలలో అరెస్టయిన ఇద్దరు తెహ్రీకి తాలిబాన్ పాకిస్తాన్ ఉగ్రవాదులకు యాంటీ టెర్రరిస్టు కోర్టు ఐదేళ్ల జైలు శిక్ష విధించింది. -
పాక్‌లో బలపడుతున్న ఉగ్రమూకలు
పాకిస్తాన్ ఉగ్రవాదులకు అడ్డా అనేది కొత్త విషయం కాదు. దశాబ్దాలుగా భారత్‌కు వ్యతిరేకంగా సీమాంతర ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తోంది. తీవ్రవాదులకు పాక్ సురక్షిత స్థావరంగా మారిందని అమెరికా సహా చాలాదేశాలు ఎంతోకాలంగా చెబుతూనే ఉన్నాయి. ఈ ఏడాది ఆగస్టులో అఫ్గానిస్తాన్‌లో తాలిబన్లు అధికారాన్ని హస్తగతం చేసుకోవడం... ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాదులకు నూతనోత్తేజాన్ని ఇచ్చింది. ఆఫ్గానిస్తాన్‌ను తీవ్రవాదలకు సురక్షిత స్థావరం కానివ్వకూడదని, వారికెలాంటి ఆర్థిక సహాయం అందకూడదని... తాలిబన్లతో కుదిరిన ఒప్పందంలో అమెరికా, నాటోదళాలు స్పష్టం చేశాయి. భారత్‌తో పాటు మిగతా దేశాలూ ఇదే కోరుతున్నాయి. అయితే అఫ్గాన్‌తో పాటు పొరుగున్న పాక్‌లో చోటు చేసుకుంటున్న పరిణామాలు... భారత్‌కు ఆందోళన కలిగించే విధంగా ఉన్నాయి. అతివాద ఇస్లామిక్ ఉద్యమాన్ని నడుపుతున్న తెహ్రీక్– ఇ– లబ్బాయిక్ పాకిస్తాన్ (టీఎల్పీ) ముందు ఈ నవంబరులో పాక్‌లోని ఇమ్రాన్‌ఖాన్ ప్రభుత్వం పూర్తిగా లొంగిపోయింది. మహ్మద్ ప్రవక్త గౌరవానికి ఎట్టి పరిస్థితుల్లో భంగం కలగనివ్వకూడదు, దైవదూషణకు పాల్పడే వారికి మరణశిక్ష విధిస్తున్న పాక్ చట్టాలను గట్టిగా బలపరచడం... ఈ రెండు టీఎల్పీ సిద్ధాంతాల్లో ముఖ్యమైనవి. 2015లో ఏర్పాటైంది. పంజాబ్ ఫ్రావిన్సులో దీనికి గట్టి పునాదులు, జనాదరణ ఉన్నాయి. దీన్ని రాజకీయ లబ్ధికి ఇమ్రాన్ ఖాన్, మిలటరీ ఉపయోగించుకున్నాయి. ఇమ్రాన్‌తో చేతులు కలిపిన అతివాదశక్తులు 2018 సార్వత్రిక ఎన్నికల్లో ఉదారవాద భావాలున్న నవాజ్ షరీఫ్‌ను గద్దెదింపడంలో సఫలమయ్యాయి. ప్రధాని పదవి చేపట్టిన ఇమ్రాన్... తర్వాత టీఎల్పీ నుంచి ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో టీఎల్పీని ఉగ్రవాద సంస్థగా ప్రకటించారు. అయితే అక్టోబరులో ఈ సంస్థ వేలాది మందితో ఇస్లామాబాద్ ముట్టడికి బయలుదేరడంతో తీవ్ర ఉద్రిక్తతలు తలెత్తాయి. 20 మంది పోలీసులు చనిపోయారు. సైన్యాన్ని దింపుతామని హెచ్చరికలు జారీచేసినా... తర్వాత తెరవెనుక ఏ శక్తులు పనిచేశాయో టీఎల్పీతో పాక్ ప్రభుత్వం రాజీ కుదుర్చుకుంది. ఉగ్రవాద సంస్థల జాబితా నుంచి టీఎల్పీని తొలగించింది. టీఎల్పీ చీఫ్ హఫీజ్ మొహమ్మద్ సాద్‌ను జైలు నుంచి విడుదల చేసింది. కేసులను ఎత్తివేయడానికి అంగీకరించింది. స్తంభింపజేసిన బ్యాంకు అకౌంట్లను పునరుద్ధరించింది. అతివాద భావాలున్న ఈ సంస్థ శ్రేణుల నుంచి జైషే మొహమ్మద్ (జేఈఎం), లష్కరే తోయిబా (ఎల్ఈటీ) లాంటి ఉగ్రసంస్థలు రిక్రూట్మెంట్లు చేసుకునే ప్రమాదం పొంచివుంది. పాక్‌లో అతివాద శక్తులు బలపడటం... భారత్‌కు ఆందోళన కలిగించే విషయమే. భావజాల వ్యాప్తితో ప్రమాదం తాలిబన్లు.. ప్రపంచం ఒత్తిడి మేరకు ఆఫ్గాన్కే పరిమితమైనా... వారి ప్రభుత్వంలో భాగమైన హక్కానీ నెట్వర్క్ అలా కాదు. భారత్‌లో సీమాంతర ఉగ్రవాదానికి పాల్పడుతున్న సంస్థలకు దీనినుంచి మద్దతు తప్పకుండా లభిస్తుంది. అలాగే మరో ఉగ్రసంస్థ ఐసిస్–కె కూడా కశ్మీర్‌ను విముక్తం చేయాలని ఆగస్టులో ప్రకటన చేసింది. ఇకపై ఉగ్రసంస్థలు కశ్మీర్‌పై దృష్టి సారిస్తాయి. తదుపరి లక్ష్యంగా చేసుకుంటాయి. తాలిబన్ల విజయంతో ఈ ఉగ్రసంస్థలు ద్విగుణీకృత ఉత్సాహంతో చొరబాటు యత్నాలు మొదలుపెట్టాయని రక్షణశాఖలోని విశ్వసనీయవర్గాల సమాచారం. భారత్‌లో అతివాద భావాజాలన్ని వ్యాప్తిచేయడానికి ఇవి ప్రయత్నిస్తాయి. పాక్ గూడఛార సంస్థ (ఐఎస్ఐ) అండతో పాక్ ఆక్రమిత కశ్మీర్లో ఉగ్ర కార్ఖానాలను నడుపుతున్న లష్కరే తోయిబా, జైషే మొహమ్మద్లతో పాటు ఐసిస్ కూడా రిక్రూట్మెంట్ల మీద దృష్టి సారిస్తాయి. గతంతో పోలిస్తే ఇంటర్నెట్ ఇప్పుడు బాగా విస్తృతమైంది. సోషల్ మీడియాలో పోస్టుల ఆధారంగా అతివాద భావాలున్న యువతను గుర్తించి .. వారితో టచ్‌లోకి వస్తాయి. ‘జిహాద్’ పవిత్ర కార్యమంటూ నూరిపోసి ఉగ్రవాదం వైపు మళ్లిస్తాయి. ఎన్ఐఏ ఇప్పటికే కశ్మీర్‌తో పాటు కేరళ తదితర ప్రాంతాల్లో రిక్రూట్మెంట్లపై ప్రత్యేక నిఘా పెట్టింది. గతంలో తాలిబన్లు అధికారంలో (1996–2021) ఉన్న ఐదేళ్లలో కశ్మీర్లో ఉగ్రదాడుల్లో 5,715 సాధారణ పౌరులు మరణించగా... తర్వాత 20 ఏళ్లలో (2001– 2021 అక్టోబరు వరకు) 3,194 మంది చనిపోయారు. తాలిబన్లు అధికారంలో ఉంటే కశ్మీర్ మిలిటెన్సీ పెరిగినట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. ఎడమ వైపు గ్రాఫ్‌లో ఆ వివరాలను చూడొచ్చు. కశ్మీర్లో అలజడికి యత్నాలు తాలిబన్లు అధికారం చేపట్టగానే.. ఉగ్రవాద సంస్థల నైతిక స్థైర్యం పెరిగిపోయింది. దీని ప్రభావం కశ్మీర్లో అక్టోబరు, నవంబరు నెలల్లో స్పష్టంగా కనిపించింది. సాధారణ ప్రజలను అకారణంగా పొట్టనబెట్టుకొని... భయోత్పాత వాతావరణాన్ని సృష్టించడానికి తీవ్రవాద సంస్థలు ప్రయత్నిస్తున్నాయి. స్కూలు టీచర్లు, శ్రీనగర్‌లో ప్రముఖ మెడికల్ షాపును నిర్వహించే కశ్మీర్ పండిట్‌ను, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన కూలీలను... ఇలా పలువురిని ఉగ్రమూకలు కాల్పిచంపాయి. ఈ ఏడాదిలో నవంబరు 15 నాటికి కశ్మీర్లో 40 మంది సాధరణ పౌరులు ఉగ్రదాడులకు బలయ్యారని కేంద్ర ప్రభుత్వం గతనెల 30న రాజ్యసభకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో తెలిపింది. ఇందులో ఎక్కువగా అక్టోబరు– నవంబరులోనే జరిగాయి. అప్రమత్తమైన కేంద్ర ప్రభుత్వం... నవంబరులో 5,500 మంది సాయుధ బలగాల(సీఆర్పీఎఫ్–3,000, బీఎస్ఎఫ్–2,500)ను అదనంగా జమ్మూ కశ్మీర్‌కు పంపింది. శీతాకాలంలో దట్టంగా మంచు కురుస్తుంది.. దూరాన ఉన్నవి ఏవీ కనపడని వాతావరణం ఉంటుంది కాబట్టి పాక్ ఆక్రమిత కశ్మీర్ నుంచి చొరబాటు యత్నాలూ పెరిగాయి. దీన్ని అడ్డుకోవడానికి నెలరోజుల పాటు భారత ఆర్మీ స్పెషల్ డ్రైవ్ చేపట్టింది. పలువురు చొరబాటుదారులను కాల్చి చంపింది. అలాగే ఉగ్రవాద సానుభూతిపరులు, మస్తిష్కాలను కలుషితం చేస్తూ కాలేజీల్లో యువతను ఉగ్రవాదం వైపు మళ్లించే వారినీ గుర్తించేందుకు జమ్మూ కశ్మీర్ పోలీసు యంత్రాంగ ప్రత్యేక చర్యలు చేపడుతోంది. ఆర్థిక మూలాలను దిగ్భందం చేస్తోంది. కన్సల్టెన్సీల పేరిట పాక్‌లో వైద్య కళాశాలల్లోని సీట్లను కశ్మీర్ విద్యార్థులకు వేర్పాటువాద సంస్థ హురియత్ కాన్ఫరెన్స్ నాయకులు అమ్ముతూ... వచ్చే నిధులను ఉగ్ర కార్యకలాపాలకు మళ్లిస్తున్నారని గుర్తించారు. ఆగస్టులో నలుగురు హురియత్ నేతలను అరెస్టు కూడా చేశారు. మొత్తానికి కశ్మీర్లో ఉగ్రవాదుల యాక్టివిటీ పెరిగింది. – నేషనల్ డెస్క్, సాక్షి -
ఇమ్రాన్‌పై ప్రశ్నల వర్షం.. పిల్లల ప్రాణాలు తీసేవారితో చర్చలా?
ఇస్లామాబాద్: పాకిస్తాన్ తాలిబన్ల పార్టీ అయిన తెహ్రీక్ ఇ తాలిబన్ పాకిస్తాన్(టీటీపీ)తో పాక్ కాల్పుల విరమణ ఒప్పందం చేసుకున్న ఒక్కరోజు తర్వాత ఆ సంస్థ చేసిన ఊచకోతపై ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ను ఆ దేశ సుప్రీంకోర్టు ప్రశ్నించింది. 2014లో ఆర్మీ ఆధ్వర్యంలో నడిచే స్కూలుపై ఈ ఉగ్రసంస్థ జరిపిన హేయమైన దాడిలో 150 మంది మరణించారు. ఈ ఘటనకు సంబంధించి ఇమ్రాన్ బుధవారం సుప్రీంకోర్టు విచారణకు హాజరయ్యారు. ఈ సందర్భంగా కోర్టు ఇమ్రాన్‌పై ప్రశ్నల వర్షం కురిపించింది. చిన్నారుల ప్రాణాలను బలి తీసుకున్న వారికి మీరు మోకరిల్లుతారా అని ప్రశ్నించింది. ‘మీరు అధికారంలో ఉన్నారు. ఏం చేస్తున్నారు ? ఆ దోషులతో తీరిగ్గా చర్చలు జరుపుతున్నారు’ అని సీజే అహ్మద్ ప్రధానిని నిలదీశారు. ఆనాడు తాము అధికారంలో లేమని, బాధిత కుటుంబాలకు నష్టపరిహారం కింద ఆర్థికసాయం చేశామని ఇమ్రాన్ బదులిచ్చారు. విద్యార్థుల తల్లిదండ్రుల గాయాలపై కారం రాసినట్టుగా ప్రధాని మాటలు ఉన్నాయంటూ ప్రధాన న్యాయమూర్తి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. -
ఆత్మాహుతి దాడిలో 20 మంది మృతి∙
పెషావర్: పాకిస్తాన్‌లోని పెషావర్‌లో జరిగిన ఆత్మాహుతి దాడిలో 20 మంది చనిపోయారు. పాక్‌లో 25న ఎన్నికల నేపథ్యంలో లౌకికవాద అవామీ నేషనల్ పార్టీ(ఏఎన్పీ) యకటూట్లో మంగళవారం అర్ధరాత్రి ర్యాలీ చేపట్టింది. ఈ సందర్భంగా ఓ వ్యక్తి ఏఎన్పీ అగ్రనేత హరూన్ బిలౌర్ వాహనం సమీపంలో తనను తాను పేల్చేసుకున్నాడు. ఈ ఘటనలో బిలౌర్సహా 20 మంది చనిపోయారు. 66 మంది తీవ్రంగా గాయపడ్డారు. బిలౌర్ పెషావర్‌లోని 78వ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. ఈ దాడికి తమదే బాధ్యతని తెహ్రీక్–ఇ– తాలిబన్ పాకిస్తాన్(టీటీపీ) ప్రకటించుకుంది. ముజాహిద్ అబ్దుల్ కరీం అనే ఉగ్రవాది హరూన్ వాహనం సమీపానికి వెళ్లి 8 కిలోల టీఎన్టీని పేల్చేసుకున్నాడు. -
'రెండేళ్ల తర్వాత నాకొడుకు గొంతువిన్నా'
లాహోర్: దాదాపు రెండు సంవత్సరాల తర్వాత తన కుమారుడి గొంతు విన్నానని పాకిస్థాన్ మాజీ ప్రధాని యూసఫ్ రజా గిలానీ ఆదివారం మీడియాకు తెలిపారు. ఒక కొత్త ఫోన్ నెంబర్ నుంచి తనకు ఫోన్ కాల్ వచ్చిందని, అందులో మాట్లాడింది తన కొడుకేనన్న విషయం గుర్తుపట్టానని చెప్పారు. గిలానీ కుమారుడు అలి హైదర్ ను 2013లో తెహ్రిక్ ఈ తాలిబాన్ ఉగ్రవాదులు కిడ్నాప్ చేశారు. అప్పటి నుంచి అతడు ఏమై పోయాడు ఎక్కడున్నాడన్న విషయం ఇంత వరకు తెలియరాలేదు. ఉన్నట్లుండి రెండేళ్ల తర్వాత హైదర్ నుంచి ఫోన్ రావడంతో గిలానీ ఆనందంతో ఉప్పొంగారు. తాను బాగానే ఉన్నానని, మీరు, మన కుటుంబ సభ్యులు ఎలా ఉన్నారని అడిగారని చెప్పారు. ఎనిమిది నిమిషాలపాటు తన కుమారుడితో మాట్లాడానని, అతడు సురక్షితంగా తిరిగొస్తాడన్న నమ్మకం తనకు ఉందని విశ్వాసం వ్యక్తం చేశారు. తన కుమారుడిని కిడ్నాప్ చేసిన ఉగ్రవాదులు తన వద్ద నుంచి ఏమి డిమాండ్ చేయడం లేదని, జైళ్లో ఉన్న తమ అగ్ర నేతలను మాత్రం విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారని గిలానీ చెప్పారు. అయితే, వారిలో కొందరని ఇప్పటికే వదిలేశారని, కానీ తాలిబన్లు మాత్రం తన కుమారుడిని వదిలిపెట్టకుండా మాట తప్పారని అన్నారు. సంకెళ్లతో బంధించి ఉన్నహైదర్కు చెందిన వీడియోను ఇటీవలె తాలిబన్లు పాక్ ప్రభుత్వానికి విడుదల చేశారు కూడా.