Tejaswini bai
-
భారత కబడ్డీ మాజీ ప్లేయర్ తేజస్వినికి క్రీడా శాఖ సాయం
న్యూఢిల్లీ: కరోనా వైరస్ బారిన పడి భర్తను కోల్పోయిన భారత మహిళల కబడ్డీ జట్టు మాజీ సభ్యురాలు వి. తేజస్విని బాయికి కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ రెండు లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందించింది. పండిత్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ్ జాతీయ సంక్షేమ నిధి ద్వారా తేజస్వినికి సహాయం అందించారు. కర్ణాటకకు చెందిన తేజస్విని, ఆమె భర్త నవీన్ ఈనెల ఒకటిన కరోనా బారిన పడ్డారు. తేజస్విని ఇంటివద్దే కోలుకోగా... ఆమె భర్త నవీన్ (30 ఏళ్లు) ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈనెల 11వ తేదీన తుదిశ్వాస విడిచాడు. నవీన్ తండ్రి కూడా కరోనా వైరస్‌తోనే మృతి చెందారు. 2011లో కేంద్ర ప్రభుత్వం నుంచి ‘అర్జున అవార్డు’ పొందిన తేజస్విని 2010 గ్వాంగ్జూ, 2014 ఇంచియోన్ ఆసియా క్రీడల్లో స్వర్ణ పతకాలు గెలిచిన భారత మహిళల కబడ్డీ జట్టులో కీలక సభ్యురాలిగా వ్యవహరించింది. తేజస్వినికి ఐదు నెలల పాప ఉంది. ఆర్థిక సాయంగా లభించిన మొత్తాన్ని పాప భవిష్యత్తు కోసం ఉపయోగిస్తానని తేజస్విని పేర్కొంది. -
మహిళలకూ కబడ్డీ లీగ్
నేటి నుంచి ప్రారంభం ముంబై: ప్రొ కబడ్డీ లీగ్ తరహాలో నేటి (మంగళవారం) నుంచి మహిళల కబడ్డీ చాలెంజ్ ప్రారంభం కానుంది. ఇందులో మూడు జట్లు పాల్గొంటున్నాయి. ఫైర్ బర్డ్స్‌కు మమతా పూజారి, ఐస్ డివాస్‌కు అభిలాష మాత్రే, స్టార్మ్ క్వీన్స్‌కు తేజస్విని బాయ్ కెప్టెన్లుగా వ్యవహరిస్తారు. ప్రొ కబడ్డీ లీగ్ జరిగే వేదికల్లోనే ఈ మ్యాచ్‌లు కూడా జరుగుతాయి. పోటీ 30 నిమిషాలపాటు సాగుతుంది. ముంబై, న్యూఢిల్లీ, హైదరాబాద్, బెంగళూరు, కోల్‌కతా, జైపూర్, పుణేలలో మ్యాచ్‌లు జరుగుతాయి. జూలై 31న ప్రొ కబడ్డీ లీగ్ ఫైనల్‌తో పాటే ఈ పోటీల తుది పోరు కూడా జరుగుతుంది. మ్యాచ్‌లు స్టార్‌స్పోర్ట్స్-2లో ప్రత్యక్ష ప్రసారం కానున్నాయి.