2011లో నాటి రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ చేతుల మీదుగా అర్జున అవార్డు అందుకుంటున్న తేజస్విని
న్యూఢిల్లీ: కరోనా వైరస్ బారిన పడి భర్తను కోల్పోయిన భారత మహిళల కబడ్డీ జట్టు మాజీ సభ్యురాలు వి. తేజస్విని బాయికి కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ రెండు లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందించింది. పండిత్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ్ జాతీయ సంక్షేమ నిధి ద్వారా తేజస్వినికి సహాయం అందించారు. కర్ణాటకకు చెందిన తేజస్విని, ఆమె భర్త నవీన్ ఈనెల ఒకటిన కరోనా బారిన పడ్డారు. తేజస్విని ఇంటివద్దే కోలుకోగా... ఆమె భర్త నవీన్ (30 ఏళ్లు) ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈనెల 11వ తేదీన తుదిశ్వాస విడిచాడు. నవీన్ తండ్రి కూడా కరోనా వైరస్‌తోనే మృతి చెందారు. 2011లో కేంద్ర ప్రభుత్వం నుంచి ‘అర్జున అవార్డు’ పొందిన తేజస్విని 2010 గ్వాంగ్‌జూ, 2014 ఇంచియోన్ ఆసియా క్రీడల్లో స్వర్ణ పతకాలు గెలిచిన భారత మహిళల కబడ్డీ జట్టులో కీలక సభ్యురాలిగా వ్యవహరించింది. తేజస్వినికి ఐదు నెలల పాప ఉంది. ఆర్థిక సాయంగా లభించిన మొత్తాన్ని పాప భవిష్యత్తు కోసం ఉపయోగిస్తానని తేజస్విని పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment