టీపీసీసీ కార్యవర్గంలో తాత్సారం
సీనియర్ల మధ్య కుదరని సమన్వయం
ఎదురుచూస్తున్న ఆశావహులు
హైదరాబాద్: టీపీసీసీ పూర్తిస్థాయి కార్యవర్గానికి మోక్షం లభించడం లేదు. పార్టీ ముఖ్య నాయకుల మధ్య సమన్వయం, కార్యవర్గ జాబితాపై ఏకాభిప్రాయం కుదరకపోవడం వల్లనే కార్యవర్గానికి బ్రేకులు పడుతున్నాయని నేతలు చెబుతున్నారు. టీపీసీసీకి జంబో కార్యవర్గం లేకుండా జాబితా రూపొందిస్తున్నట్లు అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టివిక్రమార్క గతంలోనే ప్రకటించారు. పార్టీకోసం పూర్తికాలం పనిచేయడానికి సిద్ధంగా ఉన్నవారిని, తక్కువ వయసున్నవారిని టీపీసీసీలోకి తీసుకుంటామని వారు చెప్పారు. ప్రధానకార్యదర్శులు, ఉపాధ్యక్షులు, కార్యదర్శులు మొత్తం కలిపి 30 మందికి మించకుండా జాబితా రూపొందిస్తున్నామని చెప్పి ఆరునెలలు దాటింది. అయినా కార్యవర్గ జాబితాను ప్రకటించలేకపోవడం పార్టీలోని అంతర్గత కుమ్ములాటలకు, టీపీసీసీ ముఖ్యనేతల అశక్తతకు తార్కాణమని ఆ పార్టీ నేతలే వ్యాఖ్యానిస్తున్నారు. టీపీసీసీలో తమ అనుచరవర్గానికి చోటు ఉండాల్సిందేనంటూ సీనియర్ నేతలు భీష్మించుకుని కూర్చున్నట్టు తెలుస్తోంది.
ఏఐసీసీ పెద్దల నుంచి కొందరు, రాష్ట్రంలోని సీనియర్ నేతల ఒత్తిడితో కొందరు పదవుల కోసం ప్రయత్నించడం వల్ల ఈ జాబితా ప్రకటించడానికి ఆలస్యం జరుగుతున్నట్లు తెలుస్తోంది. కార్యవర్గ ఖరారుకే ఆరునెలలు దాటితే ఇంకా ఉద్యమాలు, పోరాటాలు ఏం చేస్తారని టీపీసీసీ ముఖ్యులపై కొందరు నేతలు వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. టీపీసీసీలో చోటు కోసం ఆశలుపెట్టుకున్న నేతలు ఈ జాబితా కోసం ఎదురుచూస్తూనే ఉన్నారు.