Telangana art
-
తెలంగాణ కళకు ప్రపంచ ఖ్యాతి
సాక్షి, హైదరాబాద్: ఫొటోలోని శిల్పాన్ని చూశారా.. సూర్యాపేట జిల్లా ఫణిగిరిలో జరిపిన తవ్వకాల్లో బయటపడ్డ అతి పురాతన శిల్పమిది. సున్నపురాయితో రూపొందించిన ఈ కళాఖండం మూడో శతాబ్దం నాటిదిగా నిపుణులు తేల్చారు. బుద్ధుడి జీవితగాథను సూక్ష్మంగా చెక్కిన నాలుగడుగుల ఎత్తైన ఈ శిల్పం.. ప్రతిష్టాత్మక అంతర్జాతీయ ప్రదర్శనకు ఎంపికైంది. దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 7 దశాబ్దాలైన నేపథ్యంలో ‘ఇండియా అండ్ ది వరల్డ్’పేరుతో లండన్‌లోని బ్రిటిష్ మ్యూజియం, ముంబై మహారాజా ఛత్రపతి శివాజీ మ్యూజియం, ఢిల్లీ నేషనల్ మ్యూజియం ఏర్పాటు చేస్తున్న అంతర్జాతీయ ప్రదర్శనలో చోటు దక్కించుకుంది. భారత్ సహా ఇతర దేశాల నుంచి 200 కళాఖండాలను ఈ ప్రదర్శనలో ఉంచనున్నారు. 3 ఘట్టాలుగా బుద్ధ చరిత్ర.. బుద్ధుని జీవితాన్ని 3 ప్రధాన ఘట్టాలుగా విభజించి రూపొందించిన అద్భుత శిల్పమిది. తన జీవితం రాజుగా ఉండటం కాదని రాచరిక జీవితానికి స్వస్తి పలికి సిద్ధార్థుడు అడవికెళ్లడం, బుద్ధుడిగా మారి బోధనలు విశ్వవ్యాప్తం చేయడం, స్వర్గానికి చేరుకోవటం.. ఇలా మూడు అంశాలను శిల్పంలో చెక్కారు. 2001లో ఫణిగిరి బౌద్ధారామం వద్ద జరిపిన తవ్వకాల్లో మూడో శతాబ్దం నాటి ఈ కళాఖండం వెలుగుచూసింది. అప్పట్లో అక్కడే ప్రదర్శనకు ఉంచగా, అంతర్జాతీయంగా రూ.కోట్లు విలువ చేసే ఈ శిల్పాన్ని స్మగ్లర్లు అపహరించారు. చోరీ అంశం రాష్ట్రపతి, ప్రధాని వరకు వెళ్లడంతో.. శిల్పాన్ని గుర్తించాలంటూ ఢిల్లీ నుంచి ఆదేశాలందాయి. దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నాటి ప్రభుత్వం (2004 నాటి సర్కారు) ఎట్టకేలకు శిల్పాన్ని గుర్తించి స్వాధీనం చేసుకుంది. హైదరాబాద్ స్టేట్ మ్యూజియంలో ప్రత్యేకంగా బుద్ధ గ్యాలరీ నిర్మిం చి అందులో బుద్ధుడి ధాతువు సహా ఈ శిల్పాన్ని, మరికొన్ని శిల్పాలను ప్రదర్శనకు ఉంచారు. అప్పట్లో దలైలామా దీన్ని ప్రారంభించారు. లండన్ మ్యూజియంలోనూ.. దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 7 దశాబ్దాలైన నేపథ్యంలో భారీ ప్రదర్శన ఏర్పాటు చేయాలని కేంద్రం నిర్ణయించింది. ఇందుకు లండన్‌లోని బ్రిటిష్ మ్యూజియం ముందుకు రాగా.. ప్రధాని మోదీ లండన్ పర్యటనలో దీనిపై నిర్ణయం జరిగింది. ముంబై మహారాజా ఛత్రపతి శివాజీ మ్యూజియం, ఢిల్లీ నేషనల్ మ్యూజియంలతో బ్రిటిష్ మ్యూజియం సంయుక్తంగా దీనికి రూపకల్పన చేసింది. ఈ రెండు మ్యూజియంలలో 3 నెలల చొప్పున నవంబర్ నుంచి ఏప్రిల్ వరకు ప్రదర్శన సాగుతుంది. ప్రధాని మోదీ ప్రారంభించే ఈ ప్రదర్శనలో మొత్తం 200 అంతర్జాతీయ కళాఖండాలను ప్రదర్శిస్తారు. తర్వాత కుదిరితే బ్రిటిష్ మ్యూజియంలో కొన్ని రోజులు ప్రదర్శించే యోచనలో ఉన్నారు. అది ఖరారైతే లండన్‌లోని బ్రిటిష్ మ్యూజియంకూ ఈ శిల్పం వెళ్లనుంది. కాగా, న్యాయ సలహా తీసుకున్న తర్వాత విగ్రహం తరలింపునకు తెలంగాణ ప్రభుత్వం అంగీకరించింది. రూ.2 కోట్లకు బీమా.. అత్యంత విలువైన ఈ బుద్ధ కళాఖండాన్ని మరో ప్రాంతానికి తరలిస్తున్నందున రూ.2 కోట్లకు బీమా చేశారు. స్మగ్లర్లు అపహరించే ప్రమాదం ఉన్నందున కట్టుదిట్టమైన భద్రత మధ్య విమానంలో బుధవారం ముంబై తరలిస్తున్నారు. గతంలో స్మగ్లర్లు అపహరించిన తరుణంలో శిల్పంలో కొంతభాగం విరగగా.. అప్పట్లో తాత్కాలికంగా మరమ్మతు చేశారు. తాజాగా ముంబై, కుదిరితే లండన్‌కు తీసుకెళ్లే యోచన ఉన్నందున ముంబై ఛత్రపతి శివాజీ మ్యూజియం నిపుణులు శాస్త్రీయ పద్ధతిలో మరమ్మతు చేశారు. రవాణాలో నష్టం జరగకుండా ప్రత్యేక పద్ధతిలో ప్యాక్ చేశారు. -
ఆకాశమంత.. భరత్ భూషణ్
తెలంగాణ ఆర్ట్ అండ్ లైఫ్‌ని ఫోకస్ చేసి.. ఆ షాడోలో ఓ జాడగా మిగిలిపోయిన ఛాయాగ్రహకుడు భరత్‌భూషణ్! మొండిగోడలు.. జాజిపూతలు.. ముత్యాల ముగ్గులు.. బంతి పూల బతుకమ్మలు ఆయన కెమెరా కన్ను చిత్రించిన జీవన దృశ్యాలు.. కళాత్మక కావ్యాలు! ఫొటోగ్రఫీని భూషణంగా చేసుకున్న భరత్ ఆ కళకే వన్నె తెచ్చాడు. ఈ కెమెరామన్ లెన్స్‌లో క్లిక్ అయిన ఓ లైఫ్ గురించి ఆయన మాటల్లోనే... నాకు రూరల్, ఆర్ట్ ఫొటోగ్రఫీ అంటే చాలా ఇష్టం. ఇష్యూబేస్డ్గా పనిచేశా. అలాంటిదే ఈ ఫోటో. 90వ దశకం తొలినాళ్లది. నల్లగొండ జిల్లా, సంస్థాన్ నారాయణపూర్ ఏరియాలో ఉన్న రాచకొండ గుట్టల్లో తీసింది ఈ ఫొటో. ఆ టైమ్‌లో అక్కడ ఆర్మీవాళ్ల ఫైరింగ్ జరుగుతుంటే ఆపేయమని ప్రొటెస్ట్ చేస్తున్నారు. దానికి సంబంధించి ఫొటో కోసమని అక్కడికి వెళ్లాను. అప్పటిదే ఈ ఫొటో..! అన్నల దారిలో.. విమలక్క, మల్లెపల్లి లక్ష్మయ్య, నేను.. ఇంకొంత మంది కలసి సంస్థాన్ నారాయణపూర్ బయలుదేరాం. అయితే విమలక్క, మల్లెపల్లి లక్ష్మయ్య వాళ్లు పనిమీద అక్కడే ఆగిపోవడంతో సంస్థాన్ నారాయణపూర్ సర్పంచ్ గులాంరసూల్తో రాచకొండ గుట్టలకు వెళ్దామనుకున్నాను. అయితే ఆయనకు అక్కడ పంచాయితీ ఉందని త్వరగా వెళ్లిపోయాడు. దాంతో నేను, సుప్రభాతం రిపోర్టర్ ఇద్దరం గులాం రసూల్ అనుచరులతో కలసి రాచకొండ గుట్టల బాట పట్టాను. నక్సలైట్ల ప్రాబల్యం ఉన్న ప్రాంతమది. ఇంకోవైపు ఆర్మీ ఫైరింగ్.. దాంతో చాలా జాగ్రత్తగా వెళ్లాల్సి వచ్చింది. క్యాండిడ్ షాట్ గుట్టల వరకే స్కూటర్.. అక్కడి నుంచి అంతా కాలినడకే. ఎప్పుడో ఉదయం పదకొండు గంటలకు బయలుదేరితే, మేం అనుకున్న చోటికి వెళ్లేసరికి దాదాపు సూర్యాస్తమయం అయింది. అక్కడికి చేరుకోగానే నాకు కనిపించిన సన్నివేశం ఇదే! వెంటనే కెమెరాలో బంధించాను. క్యాండిడ్ షాట్ (ఫొటో తీస్తున్నామనే విషయం వారికి తెలియకుండా) అన్నమాట. క్షణం ఆలస్యం.. భార్యాభర్తల పంచాయితీ అది. భార్య తన గోడేదో వెళ్లబోసుకుంటోంది. అక్కడున్న వారంతా ఆమె చెప్పేది శ్రద్ధగా వింటున్నారు. వాళ్లకు కొంచెం దూరంలోనే ఉన్న నన్ను ఏమాత్రం గుర్తించనంతగా లీనమయ్యారు. అందుకే ఈ ఫొటో అంత లైవ్లీగా వచ్చింది. ఎవరికీ కెమెరా కాన్షస్ లేదు. క్షణం ఆలస్యమైనా.. సూర్యాస్తమయం అయ్యేది. ఈ ఫొటోలో సంస్థాన్ నారాయణపూర్ సర్పంచ్ గులాంరసూల్ కూడా ఉన్నాడు. టెక్నికల్‌గా.. టెక్నికల్‌గా ఇది వన్ థర్డ్ కంపోజిషన్. నిజానికి ఏ ఫొటో అయినా పైన భాగం తక్కువుండి కింది భాగం ఎక్కువగా ఉంటుంది. కానీ ఈ ఫొటోలో ఆకాశమే ఎక్కువగా కనిపిస్తోంది. అప్పుడప్పుడే తగ్గిపోతున్న లైట్.. ఆకాశంలో నల్లటి మబ్బులు.. మధ్యమధ్యలో తెల్లని ప్యాచెస్.. ఫొటోకి జీవాన్నిస్తున్నాయి. లంబాడా లైఫ్ స్టయిల్.. చీకటి పడటంతో ఆ రాత్రికి అక్కడే ఉన్న తండాలో బస చేశాం. కరెంటు లేదు. చిమ్మచీకటి. తండావాసులు చూపించిన చోట నిద్రపోయాను. తెల్లవారుజామున నాలుగింటప్పుడనుకుంటా.. అన్నలొచ్చి లేపారు. ‘ఎవరు నువ్వు?’ అని అడిగారు. ఫలానా అని చెప్తే ‘సరే సరే’ అని వెళ్లిపోయారు. మళ్లీ పడుకొని లేచేసరికి లంబాడా లైఫ్ స్టయిల్ నా కెమెరాకు చాలా పని చెప్పింది. రోట్లో పచ్చడి నూరుతున్న ఆడవాళ్లు, చింత చెట్టు కింద నుంచి నీటి కుండలను నెత్తిన మోసుకొస్తున్న ఇంకొందరు.. నా ఫొటోగ్రఫీకి జీవం పోశారు. వేడివేడిగా జొన్నరొట్టెలు పెట్టారు. తినేసి తిరుగు ప్రయాణమయ్యాం. వన్ ఆఫ్ ది బెస్ట్స్.. అలా రాచకొండ గుట్టల్లో నేను తీసిన ఈ ఫొటోతో సహా మిగిలినవన్నీ నా కేరీర్లో వన్ ఆఫ్ ది బెస్ట్స్‌గా నిలిచాయి. ఈ ఫొటో చూసినప్పుడల్లా నాటి జ్ఞాపకాలను వెంటాడుతూనే ఉంటాయి! అదీ ఈ ఫోటో కథ!