ఆకాశమంత.. భరత్ భూషణ్
తెలంగాణ ఆర్ట్ అండ్ లైఫ్‌ని ఫోకస్ చేసి.. ఆ షాడోలో ఓ జాడగా మిగిలిపోయిన ఛాయాగ్రహకుడు భరత్‌భూషణ్! మొండిగోడలు.. జాజిపూతలు.. ముత్యాల ముగ్గులు.. బంతి పూల బతుకమ్మలు ఆయన కెమెరా కన్ను చిత్రించిన జీవన దృశ్యాలు.. కళాత్మక కావ్యాలు! ఫొటోగ్రఫీని భూషణంగా చేసుకున్న భరత్ ఆ కళకే వన్నె తెచ్చాడు. ఈ కెమెరామన్ లెన్స్‌లో క్లిక్ అయిన ఓ లైఫ్ గురించి ఆయన మాటల్లోనే...
నాకు రూరల్, ఆర్ట్ ఫొటోగ్రఫీ అంటే చాలా ఇష్టం. ఇష్యూబేస్డ్‌గా పనిచేశా. అలాంటిదే ఈ ఫోటో. 90వ దశకం తొలినాళ్లది. నల్లగొండ జిల్లా, సంస్థాన్ నారాయణపూర్ ఏరియాలో ఉన్న రాచకొండ గుట్టల్లో తీసింది ఈ ఫొటో. ఆ టైమ్‌లో అక్కడ ఆర్మీవాళ్ల ఫైరింగ్ జరుగుతుంటే ఆపేయమని ప్రొటెస్ట్ చేస్తున్నారు. దానికి సంబంధించి ఫొటో కోసమని అక్కడికి వెళ్లాను. అప్పటిదే ఈ ఫొటో..!
అన్నల దారిలో..
విమలక్క, మల్లెపల్లి లక్ష్మయ్య, నేను.. ఇంకొంత మంది కలసి సంస్థాన్ నారాయణపూర్ బయలుదేరాం. అయితే విమలక్క, మల్లెపల్లి లక్ష్మయ్య వాళ్లు పనిమీద అక్కడే ఆగిపోవడంతో సంస్థాన్ నారాయణపూర్ సర్పంచ్ గులాంరసూల్‌తో రాచకొండ గుట్టలకు వెళ్దామనుకున్నాను. అయితే ఆయనకు అక్కడ
పంచాయితీ ఉందని త్వరగా వెళ్లిపోయాడు. దాంతో నేను, సుప్రభాతం రిపోర్టర్ ఇద్దరం గులాం రసూల్ అనుచరులతో కలసి రాచకొండ గుట్టల బాట పట్టాను. నక్సలైట్ల ప్రాబల్యం ఉన్న ప్రాంతమది. ఇంకోవైపు ఆర్మీ ఫైరింగ్.. దాంతో చాలా జాగ్రత్తగా వెళ్లాల్సి వచ్చింది.
క్యాండిడ్ షాట్
గుట్టల వరకే స్కూటర్.. అక్కడి నుంచి అంతా కాలినడకే. ఎప్పుడో ఉదయం పదకొండు గంటలకు బయలుదేరితే, మేం అనుకున్న చోటికి వెళ్లేసరికి దాదాపు సూర్యాస్తమయం అయింది. అక్కడికి చేరుకోగానే నాకు కనిపించిన సన్నివేశం ఇదే! వెంటనే కెమెరాలో బంధించాను. క్యాండిడ్ షాట్ (ఫొటో తీస్తున్నామనే విషయం వారికి తెలియకుండా) అన్నమాట.
క్షణం ఆలస్యం..
భార్యాభర్తల పంచాయితీ అది. భార్య తన గోడేదో వెళ్లబోసుకుంటోంది. అక్కడున్న వారంతా ఆమె చెప్పేది శ్రద్ధగా వింటున్నారు. వాళ్లకు కొంచెం దూరంలోనే ఉన్న నన్ను
ఏమాత్రం గుర్తించనంతగా
లీనమయ్యారు. అందుకే ఈ ఫొటో అంత లైవ్లీగా వచ్చింది. ఎవరికీ కెమెరా కాన్షస్ లేదు. క్షణం ఆలస్యమైనా.. సూర్యాస్తమయం అయ్యేది. ఈ ఫొటోలో సంస్థాన్ నారాయణపూర్ సర్పంచ్ గులాంరసూల్ కూడా ఉన్నాడు.
టెక్నికల్‌గా..
టెక్నికల్‌గా ఇది వన్ థర్డ్ కంపోజిషన్. నిజానికి ఏ ఫొటో అయినా పైన భాగం తక్కువుండి కింది భాగం ఎక్కువగా ఉంటుంది. కానీ ఈ ఫొటోలో ఆకాశమే ఎక్కువగా కనిపిస్తోంది. అప్పుడప్పుడే తగ్గిపోతున్న లైట్.. ఆకాశంలో నల్లటి మబ్బులు.. మధ్యమధ్యలో తెల్లని ప్యాచెస్.. ఫొటోకి జీవాన్నిస్తున్నాయి.
లంబాడా లైఫ్ స్టయిల్..
చీకటి పడటంతో ఆ రాత్రికి అక్కడే ఉన్న తండాలో బస చేశాం. కరెంటు లేదు. చిమ్మచీకటి. తండావాసులు చూపించిన చోట నిద్రపోయాను. తెల్లవారుజామున నాలుగింటప్పుడనుకుంటా.. అన్నలొచ్చి లేపారు. ‘ఎవరు నువ్వు?’ అని అడిగారు. ఫలానా అని చెప్తే ‘సరే సరే’ అని వెళ్లిపోయారు. మళ్లీ పడుకొని లేచేసరికి లంబాడా లైఫ్ స్టయిల్ నా కెమెరాకు చాలా పని చెప్పింది. రోట్లో పచ్చడి నూరుతున్న ఆడవాళ్లు, చింత చెట్టు కింద నుంచి నీటి కుండలను నెత్తిన మోసుకొస్తున్న ఇంకొందరు.. నా ఫొటోగ్రఫీకి జీవం పోశారు. వేడివేడిగా జొన్నరొట్టెలు పెట్టారు. తినేసి తిరుగు ప్రయాణమయ్యాం.
వన్ ఆఫ్ ది బెస్ట్స్..
అలా రాచకొండ గుట్టల్లో నేను తీసిన ఈ ఫొటోతో సహా మిగిలినవన్నీ నా కేరీర్‌లో వన్ ఆఫ్ ది బెస్ట్స్‌గా నిలిచాయి. ఈ ఫొటో చూసినప్పుడల్లా నాటి జ్ఞాపకాలను వెంటాడుతూనే ఉంటాయి! అదీ ఈ ఫోటో కథ!