సాక్షి, హైదరాబాద్: ఫొటోలోని శిల్పాన్ని చూశారా.. సూర్యాపేట జిల్లా ఫణిగిరిలో జరిపిన తవ్వకాల్లో బయటపడ్డ అతి పురాతన శిల్పమిది. సున్నపురాయితో రూపొందించిన ఈ కళాఖండం మూడో శతాబ్దం నాటిదిగా నిపుణులు తేల్చారు. బుద్ధుడి జీవితగాథను సూక్ష్మంగా చెక్కిన నాలుగడుగుల ఎత్తైన ఈ శిల్పం.. ప్రతిష్టాత్మక అంతర్జాతీయ ప్రదర్శనకు ఎంపికైంది. దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 7 దశాబ్దాలైన నేపథ్యంలో ‘ఇండియా అండ్ ది వరల్డ్’పేరుతో లండన్‌లోని బ్రిటిష్ మ్యూజియం, ముంబై మహారాజా ఛత్రపతి శివాజీ మ్యూజియం, ఢిల్లీ నేషనల్ మ్యూజియం ఏర్పాటు చేస్తున్న అంతర్జాతీయ ప్రదర్శనలో చోటు దక్కించుకుంది. భారత్ సహా ఇతర దేశాల నుంచి 200 కళాఖండాలను ఈ ప్రదర్శనలో ఉంచనున్నారు.
3 ఘట్టాలుగా బుద్ధ చరిత్ర..
బుద్ధుని జీవితాన్ని 3 ప్రధాన ఘట్టాలుగా విభజించి రూపొందించిన అద్భుత శిల్పమిది. తన జీవితం రాజుగా ఉండటం కాదని రాచరిక జీవితానికి స్వస్తి పలికి సిద్ధార్థుడు అడవికెళ్లడం, బుద్ధుడిగా మారి బోధనలు విశ్వవ్యాప్తం చేయడం, స్వర్గానికి చేరుకోవటం.. ఇలా మూడు అంశాలను శిల్పంలో చెక్కారు. 2001లో ఫణిగిరి బౌద్ధారామం వద్ద జరిపిన తవ్వకాల్లో మూడో శతాబ్దం నాటి ఈ కళాఖండం వెలుగుచూసింది. అప్పట్లో అక్కడే ప్రదర్శనకు ఉంచగా, అంతర్జాతీయంగా రూ.కోట్లు విలువ చేసే ఈ శిల్పాన్ని స్మగ్లర్లు అపహరించారు. చోరీ అంశం రాష్ట్రపతి, ప్రధాని వరకు వెళ్లడంతో.. శిల్పాన్ని గుర్తించాలంటూ ఢిల్లీ నుంచి ఆదేశాలందాయి. దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నాటి ప్రభుత్వం (2004 నాటి సర్కారు) ఎట్టకేలకు శిల్పాన్ని గుర్తించి స్వాధీనం చేసుకుంది. హైదరాబాద్ స్టేట్ మ్యూజియంలో ప్రత్యేకంగా బుద్ధ గ్యాలరీ నిర్మిం చి అందులో బుద్ధుడి ధాతువు సహా ఈ శిల్పాన్ని, మరికొన్ని శిల్పాలను ప్రదర్శనకు ఉంచారు. అప్పట్లో దలైలామా దీన్ని ప్రారంభించారు.
లండన్ మ్యూజియంలోనూ..
దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 7 దశాబ్దాలైన నేపథ్యంలో భారీ ప్రదర్శన ఏర్పాటు చేయాలని కేంద్రం నిర్ణయించింది. ఇందుకు లండన్‌లోని బ్రిటిష్ మ్యూజియం ముందుకు రాగా.. ప్రధాని మోదీ లండన్ పర్యటనలో దీనిపై నిర్ణయం జరిగింది. ముంబై మహారాజా ఛత్రపతి శివాజీ మ్యూజియం, ఢిల్లీ నేషనల్ మ్యూజియంలతో బ్రిటిష్ మ్యూజియం సంయుక్తంగా దీనికి రూపకల్పన చేసింది. ఈ రెండు మ్యూజియంలలో 3 నెలల చొప్పున నవంబర్ నుంచి ఏప్రిల్ వరకు ప్రదర్శన సాగుతుంది. ప్రధాని మోదీ ప్రారంభించే ఈ ప్రదర్శనలో మొత్తం 200 అంతర్జాతీయ కళాఖండాలను ప్రదర్శిస్తారు. తర్వాత కుదిరితే బ్రిటిష్ మ్యూజియంలో కొన్ని రోజులు ప్రదర్శించే యోచనలో ఉన్నారు. అది ఖరారైతే లండన్‌లోని బ్రిటిష్ మ్యూజియంకూ ఈ శిల్పం వెళ్లనుంది. కాగా, న్యాయ సలహా తీసుకున్న తర్వాత విగ్రహం తరలింపునకు తెలంగాణ ప్రభుత్వం అంగీకరించింది.
రూ.2 కోట్లకు బీమా..
అత్యంత విలువైన ఈ బుద్ధ కళాఖండాన్ని మరో ప్రాంతానికి తరలిస్తున్నందున రూ.2 కోట్లకు బీమా చేశారు. స్మగ్లర్లు అపహరించే ప్రమాదం ఉన్నందున కట్టుదిట్టమైన భద్రత మధ్య విమానంలో బుధవారం ముంబై తరలిస్తున్నారు. గతంలో స్మగ్లర్లు అపహరించిన తరుణంలో శిల్పంలో కొంతభాగం విరగగా.. అప్పట్లో తాత్కాలికంగా మరమ్మతు చేశారు. తాజాగా ముంబై, కుదిరితే లండన్‌కు తీసుకెళ్లే యోచన ఉన్నందున ముంబై ఛత్రపతి శివాజీ మ్యూజియం నిపుణులు శాస్త్రీయ పద్ధతిలో మరమ్మతు చేశారు. రవాణాలో నష్టం జరగకుండా ప్రత్యేక పద్ధతిలో ప్యాక్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment