British Museum
-
టిప్పు సింహాసనం.. మేడిన్ వైజాగ్
సాక్షి, విశాఖపట్నం: టిప్పుసుల్తాన్ ఠీవిని పెంచిన సింహాసనం.. రాణుల మనసు దోచుకున్న కళాత్మక అద్దం..వజ్రాలు, మాణిక్యాలు పొదిగిన బాకు..ఒకటా రెండా.. ఎన్నో అద్భుత కళాఖండాలకు రూపమిచ్చింది విశాఖ నగరం. ఈ అందాల నగరం.. ఒకప్పుడు అద్భుతమైన హస్తకళలకు కేరాఫ్ అడ్రస్‌గా భాసిల్లింది. రెండు శతాబ్దాల క్రితం ఇక్కడ అపురూప వస్తువులు ఆవిష్కృతమయ్యాయి. ఎన్నో గొప్ప కళాఖండాలు విశాఖ చరిత్రను ఇప్పుడు గుర్తుచేస్తున్నాయి. ఆ వైభవాన్ని చాటిచెప్పే పలు కళాఖండాలు బ్రిటన్‌లోని విక్టోరియా అండ్ ఆల్బెర్ట్ మ్యూజియంలో ఇప్పటికీ దర్శనం ఇస్తున్నాయి. విశాఖపట్నం ఒకప్పుడు వైజాగ్‌పటంగా సుప్రసిద్ధం. 200 ఏళ్ల క్రితం ఇక్కడ కళాకారులు రూపొందించిన వస్తువుల కోసం రాజులు సైతం పోటీపడేవారు. ముఖ్యంగా.. ఏనుగు దంతం, గంధపు చెక్కలు, బంగారం, వెండితో చేసిన ఫర్నిచర్ అంటే ఎక్కువ మక్కువ చూపేవారు. మూడేళ్ల క్రితం బ్రిటిష్ మ్యూజియంలో నిర్వహించిన కళాఖండాల ప్రదర్శనలో విశాఖలోని డాల్ఫిన్ నోస్ పర్వతం ఆకృతి ఉన్న దంతపు బొమ్మ కనిపించడంతో.. దానిని అనుసరించి చరిత్రకారులు చేసిన పరిశోధనల్లో ఎన్నో అద్భుత కళాఖండాలు విశాఖకు చెందినవేనన్న విషయాలు వెల్లడైంది. వాటిలో కొన్నింటిని పరిశీలిస్తే... అందానికే అందం.. ఈ అద్దం.. విశాఖ హస్తకళాకారులు రూపొందించిన డ్రెస్సింగ్ టేబుల్.. రాణుల మనసు దోచుకుంది. గంధపు చెక్కలు, దంతాలు, వెండితో తయారైన ఈ మౌంట్ స్వింగింగ్ అద్దం 1790లో తయారైంది. ముగ్గురు మహరాణులు దీన్ని వాడిన తర్వాత దీనిని ప్రస్తుతం విక్టోరియా అండ్ ఆల్బర్ట్ మ్యూజియంలో ఉంచారు. వజ్రాల బాకు.. వాహ్వా.. బ్రిటిష్ మ్యూజియం రికార్డుల ప్రకారం ఈ అద్భుతమైన బాకుని 18వ శతాబ్దంలో విశాఖ కళాకారులు తయారు చేశారు. డబుల్ ఎడ్జ్ బ్లేడ్‌తో పిడికిలి గార్డుతో దీన్ని తీర్చిదిద్దారు. ఈ బాకు హ్యాండిల్లో చిన్న చిన్న వజ్రాలతో పాటు మాణిక్యాలు పొదిగారు. ప్రస్తుతం ఇది బ్రిటిష్ మ్యూజియంలో తళుక్కుమంటోంది. టిప్పుసుల్తాన్ సింహాసనం... దేశంలోని రాజులందరికంటే తన వద్ద మంచి సింహాసనం ఉండాలని టిప్పుసుల్తాన్ ఆకాంక్షించాడు. వెంటనే.. వైజాగ్పటంలోని కళాకారులకు ఆర్డర్ ఇచ్చాడు. ఆ సింహాసనం 1770 సంవత్సరంలో ఇది రూపుదిద్దుకుంది. ఈ సింహాసనం వైభవం చూసి బ్రిటిష్ రాణి షార్లెట్ మంత్రముగ్దురాలైంది. దీంతో.. టిప్పు సుల్తాన్ సింహాసనాన్ని రాణికి బహుమతిగా ఇచ్చాడు. ఆ బహుమతి ఇస్తున్నట్లు వెండి ఫలకంపై రాసి ఉంచారు. అప్పట్లోనే దాన్ని లండన్ తరలించారు. ప్రత్యేక పూలబుట్టలు.. ఇది ప్రత్యేకమైన పూలబుట్ట. 1855లో వాల్తేరులోని సెడాచలం (ఇప్పటి సింహాచలం) ప్రాంతంలోని చేతివృత్తుల వారు ఎద్దుకొమ్ముతో దీనిని తయారు చేశారు. పైన మూత, హ్యాండిల్‌ను ముళ్లపంది వెంట్రుకలతో రూపొందించారు. ప్రస్తుతం ఈ విభిన్న కళాకృతి విక్టోరియా అండ్ ఆల్బర్ట్ మ్యూజియంలో ఉంది. అద్భుతమైన కళాకారులుండేవారు.. చరిత్రను పరిశీలిస్తే.. వైజాగ్‌పటం హస్త కళాకారులకు నిలయంగా ఉండేదని తెలుస్తోంది. ముఖ్యంగా.. ఇక్కడి శిల్పులు, స్వర్ణకారులు తీర్చిదిద్దిన అనేక వస్తు సంపద వివిధ దేశాల్లోని ప్రముఖ మ్యూజియంలలో ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నాయి. ముఖ్యంగా జయశ్రీ హతంగాడి అనే వంశం వైజాగ్‌పటం హస్తకళలకు ప్రసిద్ధిగా ఉండేది. ఆకుటుంబం తయారు చేసిన వస్తువులకు ఎక్కువ డిమాండ్ ఉండేది. క్రమంగా ఇక్కడ హస్తకళల వైభవం మరుగున పడిపోయింది. – ఎడ్వర్డ్ పాల్, చరిత్రకారుడు -
తెలంగాణ కళకు ప్రపంచ ఖ్యాతి
సాక్షి, హైదరాబాద్: ఫొటోలోని శిల్పాన్ని చూశారా.. సూర్యాపేట జిల్లా ఫణిగిరిలో జరిపిన తవ్వకాల్లో బయటపడ్డ అతి పురాతన శిల్పమిది. సున్నపురాయితో రూపొందించిన ఈ కళాఖండం మూడో శతాబ్దం నాటిదిగా నిపుణులు తేల్చారు. బుద్ధుడి జీవితగాథను సూక్ష్మంగా చెక్కిన నాలుగడుగుల ఎత్తైన ఈ శిల్పం.. ప్రతిష్టాత్మక అంతర్జాతీయ ప్రదర్శనకు ఎంపికైంది. దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 7 దశాబ్దాలైన నేపథ్యంలో ‘ఇండియా అండ్ ది వరల్డ్’పేరుతో లండన్‌లోని బ్రిటిష్ మ్యూజియం, ముంబై మహారాజా ఛత్రపతి శివాజీ మ్యూజియం, ఢిల్లీ నేషనల్ మ్యూజియం ఏర్పాటు చేస్తున్న అంతర్జాతీయ ప్రదర్శనలో చోటు దక్కించుకుంది. భారత్ సహా ఇతర దేశాల నుంచి 200 కళాఖండాలను ఈ ప్రదర్శనలో ఉంచనున్నారు. 3 ఘట్టాలుగా బుద్ధ చరిత్ర.. బుద్ధుని జీవితాన్ని 3 ప్రధాన ఘట్టాలుగా విభజించి రూపొందించిన అద్భుత శిల్పమిది. తన జీవితం రాజుగా ఉండటం కాదని రాచరిక జీవితానికి స్వస్తి పలికి సిద్ధార్థుడు అడవికెళ్లడం, బుద్ధుడిగా మారి బోధనలు విశ్వవ్యాప్తం చేయడం, స్వర్గానికి చేరుకోవటం.. ఇలా మూడు అంశాలను శిల్పంలో చెక్కారు. 2001లో ఫణిగిరి బౌద్ధారామం వద్ద జరిపిన తవ్వకాల్లో మూడో శతాబ్దం నాటి ఈ కళాఖండం వెలుగుచూసింది. అప్పట్లో అక్కడే ప్రదర్శనకు ఉంచగా, అంతర్జాతీయంగా రూ.కోట్లు విలువ చేసే ఈ శిల్పాన్ని స్మగ్లర్లు అపహరించారు. చోరీ అంశం రాష్ట్రపతి, ప్రధాని వరకు వెళ్లడంతో.. శిల్పాన్ని గుర్తించాలంటూ ఢిల్లీ నుంచి ఆదేశాలందాయి. దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నాటి ప్రభుత్వం (2004 నాటి సర్కారు) ఎట్టకేలకు శిల్పాన్ని గుర్తించి స్వాధీనం చేసుకుంది. హైదరాబాద్ స్టేట్ మ్యూజియంలో ప్రత్యేకంగా బుద్ధ గ్యాలరీ నిర్మిం చి అందులో బుద్ధుడి ధాతువు సహా ఈ శిల్పాన్ని, మరికొన్ని శిల్పాలను ప్రదర్శనకు ఉంచారు. అప్పట్లో దలైలామా దీన్ని ప్రారంభించారు. లండన్ మ్యూజియంలోనూ.. దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 7 దశాబ్దాలైన నేపథ్యంలో భారీ ప్రదర్శన ఏర్పాటు చేయాలని కేంద్రం నిర్ణయించింది. ఇందుకు లండన్‌లోని బ్రిటిష్ మ్యూజియం ముందుకు రాగా.. ప్రధాని మోదీ లండన్ పర్యటనలో దీనిపై నిర్ణయం జరిగింది. ముంబై మహారాజా ఛత్రపతి శివాజీ మ్యూజియం, ఢిల్లీ నేషనల్ మ్యూజియంలతో బ్రిటిష్ మ్యూజియం సంయుక్తంగా దీనికి రూపకల్పన చేసింది. ఈ రెండు మ్యూజియంలలో 3 నెలల చొప్పున నవంబర్ నుంచి ఏప్రిల్ వరకు ప్రదర్శన సాగుతుంది. ప్రధాని మోదీ ప్రారంభించే ఈ ప్రదర్శనలో మొత్తం 200 అంతర్జాతీయ కళాఖండాలను ప్రదర్శిస్తారు. తర్వాత కుదిరితే బ్రిటిష్ మ్యూజియంలో కొన్ని రోజులు ప్రదర్శించే యోచనలో ఉన్నారు. అది ఖరారైతే లండన్‌లోని బ్రిటిష్ మ్యూజియంకూ ఈ శిల్పం వెళ్లనుంది. కాగా, న్యాయ సలహా తీసుకున్న తర్వాత విగ్రహం తరలింపునకు తెలంగాణ ప్రభుత్వం అంగీకరించింది. రూ.2 కోట్లకు బీమా.. అత్యంత విలువైన ఈ బుద్ధ కళాఖండాన్ని మరో ప్రాంతానికి తరలిస్తున్నందున రూ.2 కోట్లకు బీమా చేశారు. స్మగ్లర్లు అపహరించే ప్రమాదం ఉన్నందున కట్టుదిట్టమైన భద్రత మధ్య విమానంలో బుధవారం ముంబై తరలిస్తున్నారు. గతంలో స్మగ్లర్లు అపహరించిన తరుణంలో శిల్పంలో కొంతభాగం విరగగా.. అప్పట్లో తాత్కాలికంగా మరమ్మతు చేశారు. తాజాగా ముంబై, కుదిరితే లండన్‌కు తీసుకెళ్లే యోచన ఉన్నందున ముంబై ఛత్రపతి శివాజీ మ్యూజియం నిపుణులు శాస్త్రీయ పద్ధతిలో మరమ్మతు చేశారు. రవాణాలో నష్టం జరగకుండా ప్రత్యేక పద్ధతిలో ప్యాక్ చేశారు. -
'బ్రిటీష్ మ్యూజియం నుంచి కళాఖండాలు తెప్పిస్తాం'
గుంటూరు: బ్రిటీష్ మ్యూజియంలో ఉన్న ఇక్కడి కళాఖండాలను రప్పించేందుకు కృషిచేస్తామని కేంద్ర పట్టణాభివృద్ధి, పార్లమెంటరీ వ్యవహారాలశాఖల మంత్రి వెంకయ్యనాయుడు తెలిపారు. అమరావతిలో హృదయ్ ప్రాజక్టుకు శనివారం ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం కేంద్ర మంత్రి మీడియాతో మాట్లాడారు. చరిత్ర, సంస్కృతి గుర్తుంచుకుంటే మనిషి మనుగడ సాధ్యమవుతుందని ఆయన స్పష్టంచేశారు. ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతికి శతాబ్దాల చరిత్ర ఉందని, సాక్షాత్తూ గౌతమ బుద్ధుడు నడయాడిన ప్రదేశం అమరావతి అని కేంద్ర మంత్రి వెంకయ్య పేర్కొన్నారు. రూ.70 కోట్లతో పర్యాటక, ఆధ్యాత్మిక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తామన్నారు. ఆంధ్రజాతికి అమరావతితో విడదీయరాని సంబంధం ఉందని ఆయన వ్యాఖ్యానించారు. ఏపీ రాజధానికి అమరావతి కంటే సముచితమైన పేరు ఇంకొకటి ఉండదన్నారు. ధాన్యకటకంగా ప్రసిద్ధిగాంచిన ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని.. దేశంలో వారసత్వ నగరాలు ఏర్పాటు చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారని ఈ సందర్భంగా పేర్కొన్నారు. -
అక్కడ...నాటకానికి అద్భుత ఆదరణ!
నూటపది సంవత్సరాలకు పైగా నాటకరంగ వికాసానికి కృషి చేస్తోంది ఇంగ్లండ్‌కు చెందిన ‘రాయల్ అకాడెమీ ఆఫ్ డ్రమటిక్ ఆర్ట్స్’ (RADA) విద్యార్థుల మార్పిడి కార్యక్రమంలో భాగంగా ఈ సంస్థ ఏటా ఒక విద్యార్థిని మన దేశానికి పంపిస్తుంది. మన దేశం నుంచి ఒక విద్యార్థిని తమ దేశానికి ఆహ్వానిస్తుంది. ఈ కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో పీహెచ్డీ చేస్తోన్న ‘నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా’ పోస్ట్‌గ్రాడ్యుయేట్ శివ తూము ఈ సంవత్సరం ‘రాడా’ ఆహ్వానానికి ఎంపికయ్యారు. ఇటీవల లండన్‌లో పర్యటించి వచ్చిన శివ తూముతో జరిపిన ఇంటర్వ్యూలో ముఖ్యాంశాలు... కొత్తవిషయాలు తెలుసుకున్నాను... నగరానికి నడిబొడ్డున బ్రిటిష్ మ్యూజియం పక్కనే విడిది. నడచి వెళ్లి చాలా విశేషాలు చూసేందుకు అనువైన ప్లేస్. ‘రాడా’ టెక్నికల్ డెరైక్టర్ నీల్ ఫ్రేజర్‌కు నన్ను పరిచయం చేశారు. ఫ్రేజర్ నా పర్యటన ఫలవంతం కావడానికి సహకరించారు. షేక్స్పియర్ సమకాలీన ‘గ్లోబ్’ థియేటర్ చూశాను. బ్రిటిష్ మ్యూజియం, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ సందర్శించాను. థియేటర్ రంగంలో సాంకేతిక విషయాలను గమనించడం నా పర్యటన లక్ష్యం. రంగాలంకరణ- సౌండ్ -లైటింగ్-దర్శకత్వం తదితర అంశాల్లో పనిచేసిన నేను టెక్నికల్ అంశాలను తెలుసుకునేందుకు ఈ పర్యటనలో ప్రాధాన్యతనిచ్చాను. అక్కడి నాటకాల్లో స్టేజ్ మేనేజర్ ముఖ్యమైన వ్యక్తి. డిప్యూటీ స్టేజ్ మేనేజర్, ప్రాపర్టీ ఇన్చార్జ్, సెట్ ఇంచార్జ్, లైటింగ్ డిజైనర్, లైటింగ్ ఆపరేటర్, సౌండ్ డిజైనర్, సౌండ్ ఆపరేటర్లు స్టేజ్ మేనేజర్ టీమ్‌లో పనిచేస్తారు. స్క్రిప్ట్‌ను చదవడం, రిహార్సల్స్ దశ నుంచి తుది ప్రదర్శన వరకూ ఎవరి విధివిధానాలు వారికి స్పష్టంగా ఉంటాయి. ప్రదర్శనలో ప్రమాదాలకు ఆస్కారం లేకుండా హెల్మెట్, షాక్ ప్రూఫ్ షూస్ ధరిస్తారు. ప్రేక్షకుల దృష్టిలో పడకుండా నల్లటి దుస్తులు ధరిస్తారు. ప్రత్యేక నిపుణులు ఉంటారు... అక్కడ విజయవంతంగా ప్రదర్శింపబడుతోన్న మూడు నాటకాలు : మార్టిన్ షెర్మన్ రచన ‘వెన్ షి డాన్స్‌డ్’ సారాకేన్ రచన ‘ఫెడ్రియాస్ లవ్’ విలియం కాంగ్రెవ్ రచన ‘లవ్ ఫర్ లవ్’ చూశాను. స్టేజ్ నిర్వహణ, టైమ్ షెడ్యూల్ తదితర అంశాల్లో వారికి స్పష్టత ఉంది. ‘అందరూ అన్నీ చేయడం’ అనే దశలను చాలాకాలం క్రితం దాటారు. మనకు వైద్యంలో స్పెషలిస్ట్లున్నట్లుగా వారికి థియేటర్ ఆర్ట్స్‌లో ఒక్కో అంశానికి ఒక్కో ప్రత్యేక నిపుణులుంటారు. సెట్లు సెకనుల్లో మారిపోతాయి. పెద్దపెద్ద సెట్లను అమర్చేందుకు, తొలగించేందుకు దాదాపు 150 మంది ట్రైన్డ్ పర్సన్స్ చకచకా పనిచేస్తుంటారు. మ్యూజికల్స్ చూశాను... నటీనటులు పాడుతోండగా లైవ్ మ్యూజిక్ పర్ఫామ్ చేసే ప్రదర్శనలను మ్యూజికల్స్ అంటారు. ‘మెర్రీలీ వి రోల్డ్ ఎలాంగ్’ ఐదు సంవత్సరాలుగా ప్రదర్శిస్తున్నారు. 23 పౌండ్లు టికెట్. ‘పాంథమ్ ఆఫ్ ఒపేరా’, ‘విమెన్ ఇన్ బ్లాక్’ మ్యూజికల్స్ 27 సంవత్సరాలుగా ప్రదర్శిస్తున్నారు. ఈ హారర్ నాటకం చూసి భయపడకూడదు అని నిర్ణయించుకుని ఏ మేరకు భయపడలేదో తెలుసుకునేందుకు మళ్లీమళ్లీ వచ్చే ప్రేక్షకులుండడం గమనార్హం. ‘మౌస్ ట్రాప్’ అరవయ్యేళ్లుగా ప్రదర్శిస్తున్నారు. మ్యూజికల్స్ టికెట్ ధర మనలెక్కలో దాదాపు రెండువేల నుంచి పదివేల రూపాయలు. లండన్‌లో వీధినాటకాలకూ మంచి ఆదరణ ఉంది. వివిధ చారిత్రక వ్యక్తుల వేషాలతో శిల్పంలా నిలుచుంటారు. సంగీతం పాడుతుంటారు. మ్యాజిక్‌లు చేస్తుంటారు. మంచి జీవితం గడపడానికి వీలైన ఆదరణను సామాన్యుల నుంచి పొందుతుంటారు. నాటకాన్ని లైవ్ టెలికాస్ట్ చేశారు... అకాడెమీ (ఆస్కార్), కేన్స్, ఎమ్మీ, గోల్డెన్ గ్లోబ్ అవార్డులు స్వంతం చేసుకున్న ప్రముఖ హాలివుడ్ నటి హెలెన్ మిర్రెన్ తరచూ నాటకాల్లో నటిస్తారు. ఎలిజెబెత్ రాణి-ప్రధానమంత్రి భేటీ తదితర సెటైర్కల్ అంశాలతో పీటర్ మోర్గాన్ నటించిన ‘ద ఆడియన్స్’ అనే నాటకంలో ఆమె నటించారు. ఆ నాటకాన్ని డిజిటల్ ఫామ్‌లో మల్టిప్లెక్స్లాంటి థియేటర్లలో లైవ్ టెలికాస్ట్ చేశారు, పది పౌండ్ల టికెట్‌తో. థియేటర్లన్నీ కిటకిటలాడాయి. ఒక హాలీవుడ్ సినిమా రిలీజైన రోజే చూశాను. 20కి ఎక్కువ 30కి తక్కువ సంఖ్యలో ప్రేక్షకులున్నారు. ఇంగ్లండ్ నాటకరంగం హాలీవుడ్ నటులను కూడా టెంప్ట్ చేసే స్థితిలో ఉందని ఈ రెండు సంఘటనల ద్వారా గ్రహించాను. భారీ పారితోషకాలు! హాలీవుడ్ నటీనటులు సాంకేతిక నిపుణులకు తగిన భారీ పారితోషకాలు ఇవ్వగల స్థాయిలో అక్కడ థియేటర్ ఇండస్ట్రీ ఉంది. మనకు ఫిలిం ఇండస్ట్రీ ఉంది. థియేటర్ ఇండస్ట్రీని ఊహించగలమా! నాటకాలు అనే నిచ్చెన ఎక్కి సినిమా అనే పరమపదసోపానపటంలో ‘పండిపోవడం’ అనే రీతిలో మనమున్నాం! ప్రభుత్వ ప్రోత్సాహకాలను ఆశించడం, నాటకాభిమానుల నుంచి చందాలు వసూలు చేయడం మన నాటకరంగానికి తప్పనిసరి అవుతోంది. మన థియేటర్ ఎవరి దయాదాక్షిణ్యాలూ అవసరం లేని స్థాయికి రావాలని, అందుకు తగిన ‘ఇండస్ట్రీ’ ఏర్పడాలని ఆశిద్దాం. - పున్నా కృష్ణమూర్తి