టిప్పు సింహాసనం.. మేడిన్‌ వైజాగ్‌ | Many great works of art are now reminiscent of the history of Visakha | Sakshi
Sakshi News home page

టిప్పు సింహాసనం.. మేడిన్‌ వైజాగ్‌

Published Sun, Nov 1 2020 4:19 AM | Last Updated on Fri, Nov 20 2020 10:20 AM

Many great works of art are now reminiscent of the history of Visakha - Sakshi

సాక్షి, విశాఖపట్నం: టిప్పుసుల్తాన్‌ ఠీవిని పెంచిన సింహాసనం.. రాణుల మనసు దోచుకున్న కళాత్మక అద్దం..వజ్రాలు, మాణిక్యాలు పొదిగిన బాకు..ఒకటా రెండా.. ఎన్నో అద్భుత కళాఖండాలకు రూపమిచ్చింది విశాఖ నగరం.

ఈ అందాల నగరం.. ఒకప్పుడు అద్భుతమైన హస్తకళలకు కేరాఫ్‌ అడ్రస్‌గా భాసిల్లింది. రెండు శతాబ్దాల క్రితం ఇక్కడ అపురూప వస్తువులు ఆవిష్కృతమయ్యాయి. ఎన్నో గొప్ప కళాఖండాలు విశాఖ చరిత్రను ఇప్పుడు గుర్తుచేస్తున్నాయి. ఆ వైభవాన్ని చాటిచెప్పే పలు కళాఖండాలు బ్రిటన్‌లోని విక్టోరియా అండ్‌ ఆల్బెర్ట్‌ మ్యూజియంలో ఇప్పటికీ దర్శనం ఇస్తున్నాయి. విశాఖపట్నం ఒకప్పుడు వైజాగ్‌పటంగా సుప్రసిద్ధం. 200 ఏళ్ల క్రితం ఇక్కడ కళాకారులు రూపొందించిన వస్తువుల కోసం రాజులు సైతం పోటీపడేవారు. ముఖ్యంగా.. ఏనుగు దంతం, గంధపు చెక్కలు, బంగారం, వెండితో చేసిన ఫర్నిచర్‌ అంటే ఎక్కువ మక్కువ చూపేవారు. మూడేళ్ల క్రితం బ్రిటిష్‌ మ్యూజియంలో నిర్వహించిన కళాఖండాల ప్రదర్శనలో విశాఖలోని డాల్ఫిన్‌ నోస్‌ పర్వతం ఆకృతి ఉన్న దంతపు బొమ్మ కనిపించడంతో.. దానిని అనుసరించి చరిత్రకారులు చేసిన పరిశోధనల్లో ఎన్నో అద్భుత కళాఖండాలు విశాఖకు చెందినవేనన్న విషయాలు వెల్లడైంది. వాటిలో కొన్నింటిని పరిశీలిస్తే...

అందానికే అందం.. ఈ అద్దం.. 
విశాఖ హస్తకళాకారులు రూపొందించిన డ్రెస్సింగ్‌ టేబుల్‌.. రాణుల మనసు దోచుకుంది. గంధపు చెక్కలు, దంతాలు, వెండితో తయారైన ఈ మౌంట్‌ స్వింగింగ్‌ అద్దం 1790లో తయారైంది. ముగ్గురు మహరాణులు దీన్ని వాడిన తర్వాత దీనిని ప్రస్తుతం విక్టోరియా అండ్‌ ఆల్బర్ట్‌ మ్యూజియంలో ఉంచారు.

వజ్రాల బాకు.. వాహ్‌వా..  
బ్రిటిష్‌ మ్యూజియం రికార్డుల ప్రకారం ఈ అద్భుతమైన బాకుని 18వ శతాబ్దంలో విశాఖ కళాకారులు తయారు చేశారు. డబుల్‌ ఎడ్జ్‌ బ్లేడ్‌తో పిడికిలి గార్డుతో దీన్ని తీర్చిదిద్దారు. ఈ బాకు హ్యాండిల్‌లో చిన్న చిన్న వజ్రాలతో పాటు మాణిక్యాలు పొదిగారు. ప్రస్తుతం ఇది బ్రిటిష్‌ మ్యూజియంలో తళుక్కుమంటోంది.

టిప్పుసుల్తాన్‌ సింహాసనం...
దేశంలోని రాజులందరికంటే తన వద్ద మంచి సింహాసనం ఉండాలని టిప్పుసుల్తాన్‌ ఆకాంక్షించాడు. వెంటనే.. వైజాగ్‌పటంలోని కళాకారులకు ఆర్డర్‌ ఇచ్చాడు. ఆ సింహాసనం 1770 సంవత్సరంలో ఇది రూపుదిద్దుకుంది. ఈ సింహాసనం వైభవం చూసి బ్రిటిష్‌ రాణి షార్లెట్‌ మంత్రముగ్దురాలైంది. దీంతో.. టిప్పు సుల్తాన్‌ సింహాసనాన్ని రాణికి బహుమతిగా ఇచ్చాడు. ఆ బహుమతి ఇస్తున్నట్లు వెండి ఫలకంపై రాసి ఉంచారు. అప్పట్లోనే దాన్ని లండన్‌ తరలించారు.

ప్రత్యేక పూలబుట్టలు.. 
ఇది ప్రత్యేకమైన పూలబుట్ట. 1855లో వాల్తేరులోని సెడాచలం (ఇప్పటి సింహాచలం) ప్రాంతంలోని చేతివృత్తుల వారు ఎద్దుకొమ్ముతో దీనిని తయారు చేశారు. పైన మూత, హ్యాండిల్‌ను ముళ్లపంది వెంట్రుకలతో రూపొందించారు. ప్రస్తుతం ఈ విభిన్న కళాకృతి విక్టోరియా అండ్‌ ఆల్బర్ట్‌ మ్యూజియంలో ఉంది.

అద్భుతమైన కళాకారులుండేవారు..
చరిత్రను పరిశీలిస్తే.. వైజాగ్‌పటం హస్త కళాకారులకు నిలయంగా ఉండేదని తెలుస్తోంది. ముఖ్యంగా.. ఇక్కడి శిల్పులు, స్వర్ణకారులు తీర్చిదిద్దిన అనేక వస్తు సంపద వివిధ దేశాల్లోని ప్రముఖ మ్యూజియంలలో ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నాయి.  ముఖ్యంగా జయశ్రీ హతంగాడి అనే వంశం వైజాగ్‌పటం హస్తకళలకు ప్రసిద్ధిగా ఉండేది. ఆకుటుంబం తయారు చేసిన వస్తువులకు ఎక్కువ డిమాండ్‌ ఉండేది. క్రమంగా ఇక్కడ హస్తకళల వైభవం మరుగున పడిపోయింది.    
– ఎడ్వర్డ్‌ పాల్, చరిత్రకారుడు  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement