అక్కడ...నాటకానికి అద్భుత ఆదరణ! | The hugely popular ... drama! | Sakshi
Sakshi News home page

అక్కడ...నాటకానికి అద్భుత ఆదరణ!

Published Sun, Aug 25 2013 11:16 PM | Last Updated on Fri, Sep 1 2017 10:07 PM

అక్కడ...నాటకానికి అద్భుత ఆదరణ!

అక్కడ...నాటకానికి అద్భుత ఆదరణ!

నూటపది సంవత్సరాలకు పైగా నాటకరంగ వికాసానికి కృషి చేస్తోంది ఇంగ్లండ్‌కు చెందిన ‘రాయల్ అకాడెమీ ఆఫ్ డ్రమటిక్ ఆర్ట్స్’ (RADA)  విద్యార్థుల మార్పిడి కార్యక్రమంలో భాగంగా ఈ సంస్థ ఏటా  ఒక విద్యార్థిని మన దేశానికి పంపిస్తుంది. మన దేశం నుంచి ఒక విద్యార్థిని తమ దేశానికి ఆహ్వానిస్తుంది. ఈ కార్యక్రమంలో భాగంగా  హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో పీహెచ్‌డీ చేస్తోన్న ‘నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా’  పోస్ట్‌గ్రాడ్యుయేట్ శివ తూము ఈ సంవత్సరం ‘రాడా’ ఆహ్వానానికి ఎంపికయ్యారు. ఇటీవల లండన్‌లో పర్యటించి వచ్చిన శివ తూముతో జరిపిన ఇంటర్వ్యూలో ముఖ్యాంశాలు...
 
  కొత్తవిషయాలు తెలుసుకున్నాను...


 నగరానికి నడిబొడ్డున బ్రిటిష్ మ్యూజియం పక్కనే విడిది. నడచి వెళ్లి చాలా విశేషాలు చూసేందుకు అనువైన ప్లేస్. ‘రాడా’ టెక్నికల్ డెరైక్టర్ నీల్ ఫ్రేజర్‌కు నన్ను పరిచయం చేశారు. ఫ్రేజర్ నా పర్యటన ఫలవంతం కావడానికి సహకరించారు. షేక్‌స్పియర్ సమకాలీన ‘గ్లోబ్’ థియేటర్ చూశాను. బ్రిటిష్ మ్యూజియం, ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ సందర్శించాను.
 
 థియేటర్ రంగంలో సాంకేతిక విషయాలను గమనించడం నా పర్యటన లక్ష్యం. రంగాలంకరణ- సౌండ్ -లైటింగ్-దర్శకత్వం తదితర అంశాల్లో పనిచేసిన నేను టెక్నికల్ అంశాలను తెలుసుకునేందుకు ఈ పర్యటనలో ప్రాధాన్యతనిచ్చాను. అక్కడి నాటకాల్లో స్టేజ్ మేనేజర్ ముఖ్యమైన వ్యక్తి. డిప్యూటీ స్టేజ్ మేనేజర్, ప్రాపర్టీ ఇన్‌చార్జ్, సెట్ ఇంచార్జ్, లైటింగ్ డిజైనర్, లైటింగ్ ఆపరేటర్, సౌండ్ డిజైనర్, సౌండ్ ఆపరేటర్‌లు స్టేజ్ మేనేజర్ టీమ్‌లో పనిచేస్తారు. స్క్రిప్ట్‌ను చదవడం, రిహార్సల్స్ దశ నుంచి తుది ప్రదర్శన వరకూ ఎవరి విధివిధానాలు వారికి స్పష్టంగా ఉంటాయి. ప్రదర్శనలో ప్రమాదాలకు ఆస్కారం లేకుండా హెల్మెట్, షాక్ ప్రూఫ్ షూస్ ధరిస్తారు. ప్రేక్షకుల దృష్టిలో పడకుండా నల్లటి దుస్తులు ధరిస్తారు.
 
 ప్రత్యేక నిపుణులు ఉంటారు...


 అక్కడ విజయవంతంగా ప్రదర్శింపబడుతోన్న మూడు నాటకాలు : మార్టిన్ షెర్మన్ రచన ‘వెన్ షి డాన్స్‌డ్’ సారాకేన్ రచన ‘ఫెడ్రియాస్ లవ్’ విలియం కాంగ్రెవ్ రచన ‘లవ్ ఫర్ లవ్’ చూశాను. స్టేజ్ నిర్వహణ, టైమ్ షెడ్యూల్ తదితర అంశాల్లో వారికి స్పష్టత ఉంది. ‘అందరూ అన్నీ చేయడం’ అనే దశలను చాలాకాలం క్రితం దాటారు. మనకు వైద్యంలో స్పెషలిస్ట్‌లున్నట్లుగా వారికి థియేటర్ ఆర్ట్స్‌లో ఒక్కో అంశానికి ఒక్కో ప్రత్యేక నిపుణులుంటారు. సెట్లు సెకనుల్లో మారిపోతాయి. పెద్దపెద్ద సెట్లను అమర్చేందుకు, తొలగించేందుకు దాదాపు 150 మంది ట్రైన్డ్ పర్సన్స్ చకచకా పనిచేస్తుంటారు.
 
 మ్యూజికల్స్ చూశాను...


 నటీనటులు పాడుతోండగా లైవ్ మ్యూజిక్ పర్‌ఫామ్ చేసే ప్రదర్శనలను మ్యూజికల్స్ అంటారు. ‘మెర్రీలీ వి రోల్డ్ ఎలాంగ్’ ఐదు సంవత్సరాలుగా ప్రదర్శిస్తున్నారు. 23 పౌండ్లు టికెట్. ‘పాంథమ్ ఆఫ్ ఒపేరా’, ‘విమెన్ ఇన్ బ్లాక్’ మ్యూజికల్స్ 27 సంవత్సరాలుగా ప్రదర్శిస్తున్నారు. ఈ హారర్ నాటకం చూసి భయపడకూడదు అని నిర్ణయించుకుని ఏ మేరకు భయపడలేదో తెలుసుకునేందుకు మళ్లీమళ్లీ వచ్చే ప్రేక్షకులుండడం గమనార్హం. ‘మౌస్ ట్రాప్’ అరవయ్యేళ్లుగా ప్రదర్శిస్తున్నారు. మ్యూజికల్స్ టికెట్ ధర మనలెక్కలో దాదాపు రెండువేల నుంచి పదివేల రూపాయలు. లండన్‌లో వీధినాటకాలకూ మంచి ఆదరణ ఉంది.  వివిధ చారిత్రక వ్యక్తుల వేషాలతో శిల్పంలా నిలుచుంటారు. సంగీతం పాడుతుంటారు. మ్యాజిక్‌లు చేస్తుంటారు. మంచి జీవితం గడపడానికి వీలైన ఆదరణను సామాన్యుల నుంచి పొందుతుంటారు.
 
 నాటకాన్ని లైవ్ టెలికాస్ట్ చేశారు...


  అకాడెమీ (ఆస్కార్), కేన్స్, ఎమ్మీ, గోల్డెన్ గ్లోబ్ అవార్డులు స్వంతం చేసుకున్న ప్రముఖ హాలివుడ్ నటి హెలెన్ మిర్రెన్ తరచూ నాటకాల్లో నటిస్తారు. ఎలిజెబెత్ రాణి-ప్రధానమంత్రి భేటీ తదితర సెటైర్‌కల్ అంశాలతో పీటర్ మోర్గాన్ నటించిన ‘ద ఆడియన్స్’ అనే నాటకంలో ఆమె నటించారు. ఆ నాటకాన్ని డిజిటల్ ఫామ్‌లో మల్టిప్లెక్స్‌లాంటి థియేటర్లలో లైవ్ టెలికాస్ట్ చేశారు, పది పౌండ్ల టికెట్‌తో. థియేటర్లన్నీ కిటకిటలాడాయి. ఒక హాలీవుడ్ సినిమా రిలీజైన రోజే చూశాను. 20కి ఎక్కువ 30కి తక్కువ సంఖ్యలో ప్రేక్షకులున్నారు. ఇంగ్లండ్ నాటకరంగం హాలీవుడ్ నటులను కూడా టెంప్ట్ చేసే స్థితిలో ఉందని ఈ రెండు సంఘటనల ద్వారా గ్రహించాను.
 
 భారీ పారితోషకాలు!


 హాలీవుడ్ నటీనటులు సాంకేతిక నిపుణులకు తగిన భారీ పారితోషకాలు ఇవ్వగల స్థాయిలో అక్కడ థియేటర్ ఇండస్ట్రీ ఉంది. మనకు ఫిలిం ఇండస్ట్రీ ఉంది. థియేటర్ ఇండస్ట్రీని ఊహించగలమా! నాటకాలు అనే నిచ్చెన ఎక్కి సినిమా అనే పరమపదసోపానపటంలో ‘పండిపోవడం’ అనే రీతిలో మనమున్నాం! ప్రభుత్వ ప్రోత్సాహకాలను ఆశించడం, నాటకాభిమానుల నుంచి చందాలు వసూలు చేయడం మన నాటకరంగానికి తప్పనిసరి అవుతోంది. మన థియేటర్ ఎవరి దయాదాక్షిణ్యాలూ అవసరం లేని స్థాయికి రావాలని, అందుకు తగిన ‘ఇండస్ట్రీ’  ఏర్పడాలని ఆశిద్దాం.
 
 - పున్నా కృష్ణమూర్తి
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement