telangana cultural department
-
మరో మూడేళ్లు సాంస్కృతిక సారథిగా రసమయి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్మన్గా మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ను నియమిస్తూ మంగళవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. చైర్మన్ పదవిలో మరో మూడేళ్ల పాటు కొనసాగనున్నారు. తనను సాంస్కృతిక సారథి చైర్మన్గా పునర్నియామకం చేయడంపై రసమయి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్బంగా హైదరాబాద్లోని ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ను రసమయి కలిశారు. ఉత్తర్వుల పత్రాన్ని రసమయికి సీఎం అందించారు. అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ.. ఉద్యమంలో కష్టపడి పనిచేసిన సాంస్కృతిక కళాకారులను రాష్ట్రం సాధించుకున్న తర్వాత కాపాడుకోవాలని ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పారు. ఆ క్రమంలోనే కళాకారులకు ఉద్యోగాలిచ్చినట్లు తెలిపారు. కోర్టు ఆదేశాల మేరకు అందరికీ సాంస్కృతిక సారథిలో అవకాశం కల్పిస్తూ ప్రభుత్వం చేపట్టిన ప్రక్రియ ఇటీవలే పూర్తయిందని సీఎం పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో సాంస్కృతిక కళాకారుల పాత్ర మరువలేనిదనీ గుర్తుచేశారు. స్వయం పాలనలో రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న ప్రజా సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకుపోవడంలో సాంస్కృతిక సారథి కళాకారుల పాత్ర గొప్పదని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి పథకాల సమాచారాన్ని మారుమూల ప్రాంతాలకు చేరేలా సాంస్కృతిక సారథి చైర్మన్ రసమయి కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో మంత్రులు తన్నీరు హరీశ్ రావు, గంగుల కమలాకర్, శ్రీనివాస్ గౌడ్, నిరంజన్ రెడ్డి, ప్రణాళికా సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్, ఎమ్మెల్యే జీవన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఎములాడ రాజన్న ముస్తాబు
వేములవాడ: కోరిన కోర్కెలు తీర్చే కొండంత దేవుడు ఎములాడ రాజన్న. నిత్యం పంచాక్షరి మంత్రంతో రాజన్న కోవెల ప్రతిధ్వనిస్తుంది. హరిహర క్షేత్రంగా వెలుగొందుతూనే... హిందూ ముస్లింలు నిత్యం దర్శించుకునే విధంగా ఆలయంలో దర్గా ఉంది. దీంతో వేములవాడ మతసామరస్యానికి ప్రతీకగా నిలుస్తోంది. యేటా అంగరంగ వైభవంగా నిర్వమించే మహాశివరాత్రి వేడుకలు ఈనెల 12 నుంచి 14 వరకు మూడు రోజులు ఘనంగా జరగనున్నాయి. లక్షలాదిగా తరలివచ్చే భక్తుల సౌకర్యాల కోసం రూ. 1.20 కోట్లతో ఆలయ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. వీటితోపాటు రాష్ట్ర సాంస్కృతిశాఖ ఆధ్వర్యంలో రూ.50 లక్షలు వెచ్చించి శివార్చన కార్యక్రమాలు చేపడుతున్నారు. రాజన్న గుడి చెరువు ఖాళీ స్థలంలో నితంరతం సాంస్క ృతిక కార్యక్రమాలు జరగనున్నాయి. రంగురంగుల విద్యుత్ దీపాల వెలుగులో రాజన్న క్షేత్రం దేదీప్యమానంగా వెలుగొందుతోంది. భక్తుల కోసం చలవ పందిళ్లు వేశారు. పార్కింగ్ కోసం 9 చోట్ల ప్రత్యేక స్థలం కేటాయించారు. మహిళా భక్తుల కోసం రేకులతో తయారు చేసిన తాత్కాళిక మరుగుదొడ్లు ఏర్పాటు చేశారు. దాహార్తిని తీర్చేందుకు నీటి ప్యాకెట్లు, మజ్జిగ ప్యాకెట్లు, కూల్ వాటర్ అందుబాటులో ఉంచారు. అత్యవసర పరిస్థితుల్లో వైద్య సేవలందించేందుకు ఆరుచోట్ల వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు. రాజన్న గుడికి సమీపంలో తాత్కాళిక బస్టాండు ఏర్పాటు చేశారు. బస్సులు దిగిన వెంటనే కాలినడకన రాజన్న సన్నిధికి చేరుకునేలా రోడ్డు మార్గం వేశారు. వేములవాడకు చేరుకునే అన్ని రోడ్లను చదును చేశారు. ఆదివారం సాయంత్రం నుంచే భక్తుల రాక ప్రారంభమైంది. అందరిచూపు రాజన్న వైపు... మహాశివరాత్రి జాతర సోమవారం నుంచి ప్రారంభం కానుంది దీంతో అందరి చూపు వేములవాడ రాజన్నవైపు మళ్లింది. ప్రతి ఒక్కరూ రాజన్నను దర్శించుకుని తరించేందుకు ప్రణాళికలు రూపొందించుకుంటున్నారు. కుటుంబ సభ్యులతో కలసి కొందరు, బంధువులు, మిత్రులతో కలసి కొందరు వేములవాడకు వచ్చేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. హైదరాబాద్ టు వేములవాడ రాష్ట్ర రాజధాని నుంచి వేములవాడకు చేరుకోవాలంటే బస్సుమార్గం, లేదా ప్రైవేట్ వాహనాలు, సొంత వాహనాల్లో రోడ్డు మార్గంలో వచ్చేందుకు చాలా మంది ఇష్టపడతారు. హైదరాబాద్, సికింద్రాబాద్ నగరాల నుంచి నేరుగా రాజీవ్రహదారి నుంచి సిద్దిపేట వరకు చేరుకుని, అక్కడ్నుంచి సిరిసిల్ల మీదుగా వేములవాడకు చేరుకోవచ్చు. ఇందుకు బస్సులు ప్రతీ అరగంటకు ఒకటి చొప్పున సీబీఎస్, జేబీఎస్ బస్టాండులలో అందుబాటులో ఉన్నాయి. సిటీ నుంచి 160 కిలో మీటర్లలో వేములవాడ రోడ్డు మార్గం ఉంది. బస్సులో వస్తే నాలుగు గంటల నుంచి ఐదు గంటల సమయం, ప్రైవేట్ వాహనాల్లో అయితే మూడు నుంచి మూడున్నర గంటల సమయంలో వేములవాడకు చేరుకోవచ్చు. వరంగల్ నుంచి.. రాజన్నను దర్శించుకునేందుకు వరంగల్, ఖమ్మం పాత జిల్లాల నుంచి వచ్చే భక్తులు వరంగల్ నుంచి హుజూరాబాద్, కరీంనగర్ మీదుగా వేములవాడకు చేరుకోవచ్చు. రోడ్డు మార్గం గుండా 110 కిలో మీటర్లు ఉంటుంది. బస్సులో మూడు గంటల సమయం, ప్రైవేట్ వాహనాల్లో అయితే రెండున్నర గంటల సమయంలో చేరుకునే అవకాశాలు ఉన్నాయి. బస్సుల్లో వచ్చే భక్తులు రాజన్న గుడి చెరువు కట్టకింద దిగి కేవలం కాలినడకన రాజన్న గుడికి చేరుకోవచ్చు. -
రేపు కళాభవన్లో జానపద జాతర
మహబూబ్నగర్ న్యూటౌన్: రాష్ట్ర సాంస్కృతిక శాఖ, జానపద కళాకారుల సంఘాలు, తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారుల సమన్వయంతో జానపద జాతర–2016 ఉత్సవాలను ఈ నెల 28న జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ కళాభవనన్లో నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ డాక్టర్ టీకే శ్రీదేవి ఒక ప్రకటనలో తెలిపారు. జానపద కళలను ప్రజలకు తెలియజెప్పడంతో పాటు కళాకారులను ప్రోత్సహించేందుకు రాష్ట్ర సాంస్కృతిక శాఖ గత సంవత్సరంలాగే ఈ సారి కూడా జానపద జాతర ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. సుమారు 25 కళా బృందాలు జిల్లాలోని అన్ని ప్రాంతాలకు చెందిన కళారూపాలతో ఈ ప్రదర్శన నిర్వహించనున్నట్లు తెలిపారు. -
సాంస్కృతిక శాఖ సంచాలకునిగా హరికృష్ణ!
సాక్షి,హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక శాఖ సంచాలకులుగా మామిడి హరికృష్ణ నియమితులుకానున్నట్లు సమాచారం. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక శాఖ సంచాలకులుగా ఉన్న రాళ్లబండి కవితాప్రసాద్ తిరిగి సాంఘిక సంక్షేమ శాఖకు బదిలీ కానున్నారు. ఒకటి రెండు రోజుల్లో ఈ మేరకు ఉత్తర్వులు రానున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన స్థానంలో మామిడి హరికృష్ణను నియమించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. హరికృష్ణ ప్రస్తుతం కో- ఆపరేటివ్ డిపార్ట్మెంట్లో డిప్యూటీ డెరైక్టర్గా పనిచేస్తున్నారు. వ్యక్తిగత కారణాలతోనే తాను సాంఘిక సంక్షేమ శాఖకు తిరిగి వెళ్తున్నట్లు కవితాప్రసాద్ బుధవారం ‘సాక్షి’కి తెలిపారు.