విద్యుత్ కాంతుల్లో వెలుగుతున్న ఆలయం
వేములవాడ: కోరిన కోర్కెలు తీర్చే కొండంత దేవుడు ఎములాడ రాజన్న. నిత్యం పంచాక్షరి మంత్రంతో రాజన్న కోవెల ప్రతిధ్వనిస్తుంది. హరిహర క్షేత్రంగా వెలుగొందుతూనే... హిందూ ముస్లింలు నిత్యం దర్శించుకునే విధంగా ఆలయంలో దర్గా ఉంది. దీంతో వేములవాడ మతసామరస్యానికి ప్రతీకగా నిలుస్తోంది. యేటా అంగరంగ వైభవంగా నిర్వమించే మహాశివరాత్రి వేడుకలు ఈనెల 12 నుంచి 14 వరకు మూడు రోజులు ఘనంగా జరగనున్నాయి. లక్షలాదిగా తరలివచ్చే భక్తుల సౌకర్యాల కోసం రూ. 1.20 కోట్లతో ఆలయ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
వీటితోపాటు రాష్ట్ర సాంస్కృతిశాఖ ఆధ్వర్యంలో రూ.50 లక్షలు వెచ్చించి శివార్చన కార్యక్రమాలు చేపడుతున్నారు. రాజన్న గుడి చెరువు ఖాళీ స్థలంలో నితంరతం సాంస్క ృతిక కార్యక్రమాలు జరగనున్నాయి. రంగురంగుల విద్యుత్ దీపాల వెలుగులో రాజన్న క్షేత్రం దేదీప్యమానంగా వెలుగొందుతోంది. భక్తుల కోసం చలవ పందిళ్లు వేశారు. పార్కింగ్ కోసం 9 చోట్ల ప్రత్యేక స్థలం కేటాయించారు. మహిళా భక్తుల కోసం రేకులతో తయారు చేసిన తాత్కాళిక మరుగుదొడ్లు ఏర్పాటు చేశారు. దాహార్తిని తీర్చేందుకు నీటి ప్యాకెట్లు, మజ్జిగ ప్యాకెట్లు, కూల్ వాటర్ అందుబాటులో ఉంచారు. అత్యవసర పరిస్థితుల్లో వైద్య సేవలందించేందుకు ఆరుచోట్ల వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు. రాజన్న గుడికి సమీపంలో తాత్కాళిక బస్టాండు ఏర్పాటు చేశారు. బస్సులు దిగిన వెంటనే కాలినడకన రాజన్న సన్నిధికి చేరుకునేలా రోడ్డు మార్గం వేశారు. వేములవాడకు చేరుకునే అన్ని రోడ్లను చదును చేశారు. ఆదివారం సాయంత్రం నుంచే భక్తుల రాక ప్రారంభమైంది.
అందరిచూపు రాజన్న వైపు...
మహాశివరాత్రి జాతర సోమవారం నుంచి ప్రారంభం కానుంది దీంతో అందరి చూపు వేములవాడ రాజన్నవైపు మళ్లింది. ప్రతి ఒక్కరూ రాజన్నను దర్శించుకుని తరించేందుకు ప్రణాళికలు రూపొందించుకుంటున్నారు. కుటుంబ సభ్యులతో కలసి కొందరు, బంధువులు, మిత్రులతో కలసి కొందరు వేములవాడకు వచ్చేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు.
హైదరాబాద్ టు వేములవాడ
రాష్ట్ర రాజధాని నుంచి వేములవాడకు చేరుకోవాలంటే బస్సుమార్గం, లేదా ప్రైవేట్ వాహనాలు, సొంత వాహనాల్లో రోడ్డు మార్గంలో వచ్చేందుకు చాలా మంది ఇష్టపడతారు. హైదరాబాద్, సికింద్రాబాద్ నగరాల నుంచి నేరుగా రాజీవ్‌రహదారి నుంచి సిద్దిపేట వరకు చేరుకుని, అక్కడ్నుంచి సిరిసిల్ల మీదుగా వేములవాడకు చేరుకోవచ్చు. ఇందుకు బస్సులు ప్రతీ అరగంటకు ఒకటి చొప్పున సీబీఎస్, జేబీఎస్ బస్టాండులలో అందుబాటులో ఉన్నాయి. సిటీ నుంచి 160 కిలో మీటర్లలో వేములవాడ రోడ్డు మార్గం ఉంది. బస్సులో వస్తే నాలుగు గంటల నుంచి ఐదు గంటల సమయం, ప్రైవేట్ వాహనాల్లో అయితే మూడు నుంచి మూడున్నర గంటల సమయంలో వేములవాడకు చేరుకోవచ్చు.
వరంగల్ నుంచి..
రాజన్నను దర్శించుకునేందుకు వరంగల్, ఖమ్మం పాత జిల్లాల నుంచి వచ్చే భక్తులు వరంగల్ నుంచి హుజూరాబాద్, కరీంనగర్ మీదుగా వేములవాడకు చేరుకోవచ్చు. రోడ్డు మార్గం గుండా 110 కిలో మీటర్లు ఉంటుంది. బస్సులో మూడు గంటల సమయం, ప్రైవేట్ వాహనాల్లో అయితే రెండున్నర గంటల సమయంలో చేరుకునే అవకాశాలు ఉన్నాయి. బస్సుల్లో వచ్చే భక్తులు రాజన్న గుడి చెరువు కట్టకింద దిగి కేవలం కాలినడకన రాజన్న గుడికి చేరుకోవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment