'పేకాట క్లబ్ అనే మాట వినపడకూడదు'
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ఫ్రెండ్లీ పోలీస్ వ్యవస్థ ఏర్పడాలని ఆ రాష్ట్ర సీఎం కేసీఆర్ ఆకాంక్షించారు. గురువారం నగరంలోని ట్యాంక్ బండ్‌పై హైదరాబాద్ సేఫ్ అండ్ స్మార్ట్ సిటీలో భాగంగా.. మొదటి విడతలో పోలీస్‌శాఖకు 300 బైక్‌లు, 100 ఇన్నోవాలను పోలీసు శాఖకు తెలంగాణ సీఎం కేసీఆర్ అందజేశారు. అనంతర కేసీఆర్ మాట్లాడుతూ... హైదరాబాద్ నగరం అంతట మూడు నెలల్లో సీసీ కెమెరా నిఘా ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. అధునాతన సౌకర్యాలతో పోలీస్ హెడ్ క్వార్టర్స్ నిర్మిస్తామన్నారు.
అంతర్జాతీయ స్థాయిలో హైదరాబాద్ పోలీసింగ్ వ్యవస్థను రూపుదిద్దుతామన్నారు. హైదరాబాద్‌లో పేకాట క్లబ్ అనే మాట వినపడకూడదని... అందుకు తగు విధంగా చర్యలు తీసుకుంటామని కేసీఆర్ చెప్పారు. వాహనాలను రికార్డు స్థాయిలో సమకూర్చిన పోలీసులకు ఆయన ఈ సందర్బంగా అభినందనలు తెలిపారు.
స్టేషన్ పరిధితో సంబంధం లేకుండా సర్వీస్ చేయాలని పోలీసులకు కేసీఆర్ హితబోధ చేశారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర హోం శాఖ మంత్రి నాయిని నర్శింహరెడ్డితోపాటు తెలంగాణ డీజీపీ అనురాగ్ శర్మ, హైదరాబాద్, సైబరాబాద్ పోలీసు కమిషనర్లు మహేందర్ రెడ్డి, సీవీ ఆనంద్లతోపాటు ఇతర ఉన్నతాధికారులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
నాయని నర్సింహరెడ్డి మాట్లాడుతూ.... పోలీస్ వ్యవస్థపై ప్రజలలో ఉన్న అపోహలను పారదోలాలని హోం మంత్రి నాయిని నర్శింహారెడ్డి హైదరాబాద్, సైబరాబాద్ నగరాల పోలీసులకు సూచించారు. అలాగే జంట నగరాలలో నేర నిరోధక వ్యవస్థ నిర్మూలనకు కృషి చేయాలని హితవు పలికారు.