రెండోసారి మండలి ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన గుత్తా సుఖేందర్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: ఎగువ సభ ప్రతిష్టను, ఔన్నత్యాన్ని పెంచే విధంగా మనమంతా కృషి చేద్దామని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సభ్యులకు సూచించారు. తన బాధ్యత తాను నిష్పక్షపాతంగా నిర్వహిస్తానని చెప్పారు. సీనియర్ సభ్యులతో పాటు జూనియర్ సభ్యులు సభా సంప్రదాయాలపై అవగాహన పెంచుకుంటూ అందరం కలిసి ముందుకు సాగుదామని అన్నారు. సోమవారం కౌన్సిల్ చైర్మన్‌గా ఏకగ్రీవంగా ఎన్నికైన గుత్తా పదవీ బాధ్యతలు స్వీకరించారు. మంత్రులు ప్రశాంత్ రెడ్డి, కేటీఆర్, మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్, సత్యవతి రాథోడ్, శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్సీలు టి.జీవన్‌రెడ్డి, అలుగుబెల్లి నర్సిరెడ్డి ఆయన్ను చైర్మన్ సీటు వద్దకు తీసుకెళ్లారు.
సీటులో ఆసీనులైన గుత్తాకు మంత్రులు పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సుఖేందర్‌రెడ్డి మాట్లాడారు. చట్టసభల నిర్వహణలో తెలంగాణ తలమానికంగా నిలుస్తోందని, సభా సంప్రదాయాల విషయంలో ఆదర్శంగా ఉందని తెలిపారు. గతంలో 21 నెలల పాటు కౌన్సిల్ చైర్మన్‌గా బాధ్యతలను నిర్వహించిన సందర్భంగా సభ గౌరవ మర్యాదలు కాపాడే ప్రయత్నం చేశామన్నారు. ఎగువసభ అధ్యక్ష బాధ్యతలు తనకు మరోసారి అప్పగించిన సీఎం కేసీఆర్‌కు, ఎన్నుకున్న సభ్యులకు ధన్యవాదాలు తెలియజేశారు.
అత్యుత్తమ పదవుల్లో రైతు బిడ్డలే: మంత్రి కేటీఆర్
‘తెలంగాణ సీఎం కేసీఆర్, శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మీరు (గుత్తా సుఖేందర్ రెడ్డి).. అంతా రైతు బిడ్డలే కావడం విశేషం. రైతు బిడ్డలే అత్యున్నతమైన రాజ్యాంగ పదవుల్లో ఉండ టం ఈ రాష్ట్ర అదృష్టం. ఈ రాష్ట్ర రైతాంగం పక్షాన కూడా మీకు హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను..’అంటూ రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. కౌన్సిల్లో టీఆర్ఎస్ సభ్యులు 35, 36 మంది ఉన్నారని, అందువల్ల దామాషా ప్రకారం తమకు ఎక్కువ అవకాశాలివ్వాలని కోరారు. కాంగ్రెస్ ఎమ్మెల్సీ టి.జీవన్‌రెడ్డి ఒక్కరే ఉన్నా యువకుడిలా ఉత్సాహంగా మాట్లాడుతున్నారని, తాము మధ్యవయసు వారి మాదిరిగా నడుచుకోవాల్సి వస్తోందని అన్నారు.
‘నల్లగొండ జిల్లాలో ఫ్లోరోసిస్ సమస్య పరిష్కారం కోసం కృష్ణా జలాలను ఇంటింటికీ అందించాలని సుఖేందర్‌రెడ్డి గతంలో సూచించారు. ప్రస్తుతం మిషన్ భగీరథ పథకంతో ఫ్లోరోసిస్ నుంచి విముక్తి పొందాం..’అని కేటీఆర్ చెప్పారు. రైతు సమన్వయ సమితి తొలి చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించి సమర్థవంతంగా నిర్వహిం చారని గుర్తు చేశారు. మంత్రులు హరీశ్‌రావు, మల్లారెడ్డి, జి.జగదీశ్‌రెడ్డి, సభ్యులు కడియం శ్రీహరి, కల్వకుంట్ల కవిత, వాణీదేవి, ఉళ్ళోళ్ల గంగాధర్‌గౌడ్, ఎల్.రమణ, ఫారుఖ్ హుస్సేన్, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎమ్మెస్ ప్రభాకర్‌రావు, సయ్యద్ అమీనుల్ జాఫ్రీ, కాలేపల్లి జనార్ధనరెడ్డి కూడా అభినందనలు తెలియజేశారు.
చదవండి: తెలంగాణ అసెంబ్లీ లైవ్ అప్డేట్స్