నేతలను అడ్డుకున్న జిల్లా సాధన సమితి
జనగామ: వరంగల్ జిల్లా జనగామ కేంద్రంగా ప్రత్యేక జిల్లా ప్రకటించాలని కోరుతూ మండలి చైర్మన్ స్వామిగౌడ్, ఎంపీ బూర నర్సయ్యగౌడ్‌ను జిల్లా సాధన సమితి నాయకులు శనివారం అడ్డుకున్నారు.
మండలంలోని చౌడారం, పెద్దపహాడ్, ఎర్రగొల్లపహాడ్ గ్రామాల్లో సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహాల ఆవిష్కరణ కోసం నేతలు జిల్లా పర్యటనకు వచ్చారు. విషయం తెలుసుకున్న జనగామ జిల్లా సాధన సమితి నాయకులు మంగలపల్లి రాజు ఇతర నాయకులు, కార్యకర్తలతో కలిసి వెళ్లి ఆర్టీసీ చౌరస్తాలో వారిని అడ్డుకున్నారు. జనగామ కేంద్రంగా ప్రత్యేక జిల్లా ఏర్పాటుకు హామీ ఇవ్వాలని పట్టుబట్టారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళతానని స్వామిగౌడ్ వారికి హామీ ఇవ్వడంతో శాంతించారు.