సాక్షి, భూపాలపల్లి: ములుగు జిల్లా ఏర్పాటుకు అందరూ సమ్మతమే తెలిపారు. ఎటువంటి అభ్యంతరాలు రాలేదు. కొన్ని మండలాలను కలపాలని ప్రజలు ప్రభుత్వానికి సూచనలు చేశారు. ఇదిలా ఉంటే కొంత మంది భూపాలపల్లి జిల్లా కేంద్రాన్ని పరకాలలో ఏర్పాటు చేయాలని వినతుల్లో సూచించారు. ములుగు జిల్లా ఏర్పాటుకు సంబం«ధించి అభ్యంతరాలు, సూచనలకు ప్రభుత్వం ఇచ్చిన గడువు జనవరి 30తో ముగిసింది. ములుగు, ఏటూరునాగరం, మంగపేట, కన్నాయిగూడెం, ములుగు, తాడ్వాయి, గోవిందరావుపేట, వెంకటాపూర్(ము), వాజేడు, వెంకటాపూర్(నూ) మండలాలతో ములుగు జిల్లా ఏర్పాటుపై అభ్యంతరాలు, సూచనలు తెలపాలని ప్రభుత్వం డిసెంబర్ 31న నోటిఫికేషన్ జారీ చేసింది. దీనికి సంబంధించి జిల్లా ప్రజల నుంచి అభ్యంతరాలు ఏమీ రాలేదు. అయితే సూచనలు మాత్రం ఎక్కువ సంఖ్యలో వచ్చాయి. ముఖ్యంగా ప్రస్తుతం మహబూబాబాద్ జిల్లాలో ఉన్న కొత్తగూడ, గంగారం మండలాలను ములుగు జిల్లాలో చేర్చాలంటూ 10 వరకు వినతులు వచ్చాయి.
దూరభారమే కారణం..
ములుగు జిల్లా ఏర్పాటు అంశం తెరపైకి వచ్చినప్పటి నుంచి కొత్తగూడ, గంగారం మండలాలను కలపాలని స్థానిక ప్రజలుడిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం ములుగు అసెంబ్లీ నియోజకవర్గంలోనే ఉన్న ఈ రెండు మండలాలకు జిల్లా కేంద్రమైన మహబూబాబాద్ 80 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇంతకు ముందు ములుగు నుంచి కొత్తగూడ, గంగారం వెళ్లాలంటే మల్లంపల్లి మీదుగా వరంగల్ రూరల్‌లోని నర్సంపేట, ఖానాపూర్ మీదుగా సుమారు 60 కిలోమీటర్లు ప్రయాణించాల్సి ఉండేది. అయితే ప్రస్తుతం మలుగు జిల్లా పొట్లాపూర్ నుంచి కొత్తగూడ మండలం వరకు కొత్తగా రోడ్డు నిర్మిస్తున్నారు. దీంతో ములుగు నుంచి కొత్తగూడ, గంగారం మండలాల మధ్య దూరం 14 నుంచి 20 కిలోమీటర్లే ఉంటుంది. దీంతో మెజారిటీ ప్రజలు ములుగులో కలిసేందుకే మొగ్గు చూపుతున్నారు. ప్రస్తుతం ములుగు నియోజకవర్గంలో ఉండి భూపాలపల్లి పరిధి కిందకు వచ్చే పెద్దాపూర్, గుర్రంపేట, సుబ్బక్కపల్లి, రామనాయక్ తండా, బహుసింగ్‌పల్లి గ్రామాలను ములుగు జిల్లాలో ఉంచాలనే వినతులు వచ్చాయి.
మల్లంపల్లి మండలం ఊసే లేదు..
ములుగు జిల్లా గెజిట్‌లో మల్లంపల్లి మండల ఏర్పాటు ప్రస్తావన లేదు. అయితే రెవెన్యూ అధికారులు మాత్రం మల్లంపల్లి, రాంచంద్రాపూర్ రెవెన్యూ గ్రామాల నుంచి 10 గ్రామ పంచాయతీలతో మల్లంపల్లి మండలం ఏర్పాటు కోసం కలెక్టర్ కార్యాలయానికి నివేదిక అందించారు. వీటిలో రామచంద్రాపూర్ రెవెన్యూ గ్రామ పరిధిలోని కొడిశలకుంట, పందికుంట, ముద్దునూర్‌తండా, రామచంద్రాపూర్, గుర్తూర్‌తండా, శివతండాలతో పాటు మల్లంపల్లి రెవెన్యూ పంచాయతీ పరిధి మల్లంపల్లి, శ్రీనగర్, దేవనగర్, మహ్మద్‌గౌస్‌పల్లి ఉన్నాయి. అలాగే శాయంపేట మండలంలోని రాజుపల్లి ప్రజలు సైతం కొత్తగా ఏర్పడే మల్లంపల్లి మండలంలో తమను కలపాలని కోరారు.
పరకాలలో జిల్లా కేంద్రం ఏర్పాటుకు సూచనలు
పనిలో పనిగా ప్రస్తుత భూపాలపల్లి జిల్లా కేంద్రాన్ని పరకాలలో ఏర్పాటు చేయాలని 130 మందికి పైగా సూచించినట్లు తెలిసింది. ములుగు జిల్లా ఏర్పడుతున్న నేపథ్యంలో కొన్ని రోజుల నుంచి జిల్లా కేంద్రం పరకాలకు తరలించాలని కొంత మంది డిమాండ్ చేస్తున్నారు. అభ్యంతరాలు, సూచనల రూపంలో అవకాశం రావడంతో పలువురు ఈ విధంగా స్పందించారు. అయితే జిల్లా అధికారులు సైతం కొన్నాళ్ల నుంచి పరకాల, శాయంపేట మండలాలకు సంబంధించిన వివరాలను సేకరిస్తున్నట్లు సమాచారం. ములుగు జిల్లా గురించి స్పష్టత వచ్చిన తర్వాత పరకాల, శాయంపేట మండలాలను భూపాలపల్లిలో చేర్చాలా వద్దా అనేది తెలుస్తుంది.
ములుగు జిల్లా ఏర్పాటుకు అంతా ఓకే
Published Fri, Feb 1 2019 10:13 AM | Last Updated on Wed, Mar 6 2019 8:09 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment