సాక్షి,వెంకటాపురం(వరంగల్): పసిప్రాయంలోనే తల్లి.. తర్వాత తండ్రి.. ఇప్పుడు అన్న.. ఇలా అల్లారుముద్దుగా చూసుకోవాల్సిన వారంతా ఒక్కొక్కరిగా దూరమవుతుంటే ఆమె ఏడ్చిన తీరు వర్ణణాతీతం. పాలుతాగే వయస్సులో అనారోగ్యంతో తల్లి.. బడికి వెళ్లే వయస్సులో తండ్రి ఆత్మహత్య.. అండగా ఉంటాడనుకున్న అన్న రోడ్డు ప్రమాదంలో అకాల మరణంతో దిక్కుతోచని స్థితిలో వృద్ధాప్యంలో ఉన్న అమ్మమ్మ, తాతయ్యల వద్దకు చేరింది మండల కేంద్రానికి చెందిన మెట్టు కావేరి..
మెట్టు కవిత–సాంబయ్య దంపతులకు 2003లో కుమారుడు రాజ్‌కుమార్, 2005లో కావేరి జన్మించింది. కావేరికి 8నెలల వయస్సు ఉన్నపుడే తల్లి కవిత అనారోగ్యంతో మృతిచెందింది. బడికి వెళ్లే వయస్సులో 2013లో తండ్రి సాంబయ్య ఆర్థిక ఇబ్బందులతో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. దీనితో రాజ్‌కుమార్, కావేరిలు అమ్మమ్మ, తాతయ్య అయిన మంద సమ్మక్క, రాంచెంద్రుల వద్ద ఉంటూ చదువుకుంటున్నారు. ఆర్థిక స్థోమత లేకపోవడంతో రాజ్‌కుమార్ పదో తరగతి తర్వాత చదువు మానేసి, ఏడాది కాలంగా ఓ ప్రైవేటు కంపెనీలో సూపర్‌వైజర్‌గా పనిచేస్తున్నాడు. ( చదవండి: ఉదయం పూలు అమ్ముతూ.. రాత్రి అయితే వేషం మార్చి.. )
కావేరి ప్రభుత్వ జూనియార్ కళాశాలలో ఇంటర్ ప్రథమ సంవత్సరం చదువుతుంది. ఈక్రమంలో ఈనెల 24న దుగ్గొండి మండలంలోని చంద్రయ్యపల్లిలో శుభకార్యాక్రమానికి హాజరయ్యేందుకు రాజ్‌కుమార్ ద్విచక్రవాహనంపై వెళ్తుంగా జరిగిన ప్రమాదంలో మృతిచెందాడు. తల్లిదండ్రులను చిన్నతనంలోనే కోల్పోయిన కావేరి అండగా ఉంటాడనుకున్న అన్న అకాలమరణంతో అనాథగా మారింది. సోదరుడి అంత్యక్రియలు తానే స్వయంగా నిర్వహించిన దృశ్యం చూసి కంటతడి పెట్టనివారుండరు. అయితే వృద్ధాప్యంలో ఉన్న అమ్మమ్మ, తాతయ్యలతో ఉన్న కావేరిని ఆదుకునేందుకు దాతలు సహకరించాలని స్థానికులు కోరుతున్నారు. (చదవండి: వీడు మామూలోడు కాదు.. నాలుగు పెళ్లిళ్లు.. జల్సాలు.. చివరికి )
వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు
మండల కేంద్రంలో అందరికీ సుపరిచితుడిగా ఉంటూ.. ఎవరు ఏ పనిచెప్పినా ఓపికతో చేస్తూ అందరితో కలివిడిగా ఉంటే రాజ్‌కుమార్ చెల్లెలికి ఆర్థికంగా చేయూతనందించేందుకు మండల కేంద్రంలోని కొంతమంది యువకులు ‘రాజ్‌కుమార్ సహాయనిధి’ అనే వాట్సాప్ గ్రూపును ఏర్పాటు చేశారు. తద్వారా వచ్చిన విరాళాలు కావేరి ఉన్నత చదువులకు, మరికొంత కావేరి భవిష్యత్ అవసరాలకు బ్యాంకులో ఫిక్స్‌డ్ డిపాజిట్ చేసేందుకు నిర్ణయించారు. ఇదిలా ఉండగా.. సహాయనిధి గ్రూపు ద్వారా ఇప్పటివరకు రూ.60వేలు జమ అయినట్లు పేర్కొన్నారు. కావేరికి సహకారం అందించాలనుకున్న దాతలు 96400 66420, 97044 33991, 98484 39390 నెంబర్లకు ఫోన్ పే లేదా గూగూల్ పే చేయాలని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment