ములుగులో ఘోర రోడ్డు ప్రమాదం: ఆరుగురు దుర్మరణం | Road Accident In Mulugu District, 4 Persons Killed In Spot | Sakshi
Sakshi News home page

ములుగులో ఘోర రోడ్డు ప్రమాదం: ఆరుగురు దుర్మరణం

Published Sat, Mar 5 2022 10:13 AM | Last Updated on Sun, Mar 6 2022 4:21 AM

Road Accident In Mulugu District, 4 Persons Killed In Spot - Sakshi

మంగపేట/ములుగు రూరల్‌: కుటుంబీకులంతా కలిసి అన్నారం షరీఫ్‌ దర్గాకు దైవ దర్శనానికి వెళ్లారు. దర్గాను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఆటోలో తిరుగు ప్రయాణమయ్యారు. ఇంతలోనే మృత్యువు డీసీఎం రూపంలో వచ్చి ఆటోను ఢీకొట్టింది. దీంతో నలుగురు అక్కడిక్కడే మృతిచెందారు. మరో ఇద్దరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. ఇంకో ఇద్దరు చికిత్స పొందుతున్నారు. ఈ విషాద ఘటన శనివారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో ములుగు జిల్లా ఇంచర్ల శివారు ఎర్రిగట్టమ్మ వద్ద హరితా హోటల్‌ సమీపంలో జరిగింది. మృతులందరూ గ్రామంలోని ఒకే కాలనీ ఎదురెదురు, పక్కింటివారు కావడంతో కాలనీలో విషాదం అలుముకుంది. 

ఆటో మాట్లాడుకొని.. అన్నారం షరీఫ్‌కు.. 
ములుగు జిల్లా మంగపేట మండలం కోమటిపల్లిలోని కేసీఆర్‌ కాలనీకి చెందిన బొల్లెబోయిన రసూల్‌ తన కుటుంబంతో వరంగల్‌ జిల్లా పర్వతగిరి మండలంలోని అన్నారం షరీఫ్‌ దర్గా వెళ్లడానికి అదే కాలనీకి చెందిన తునికి జానీ ఆటోను కిరాయికి మాట్లాడుకున్నాడు. రసూల్‌ దంపతులతో పాటు పిల్లలు అజయ్, వెన్నెల, అతని తల్లి వసంత, ఏటూ రు నాగారం మండలం రామన్నగూడేనికి చెందిన తన పిన్ని గాదం కౌసల్యతో పాటు ఎదురింటి చెలమల్ల కిరణ్, డ్రైవర్‌ జానీతో కలిపి 8 మంది ఆటోలో శుక్రవారం సాయంత్రం దర్గాకు వెళ్లారు.

మొక్కులు తీర్చుకు ని రాత్రి ఇంటికి వస్తుండగా మార్గ మధ్యలో ఇంచర్ల సమీపంలో ఆటోను పశువుల లోడుతో వస్తున్న డీసీఎం వ్యాన్‌ ఢీకొట్టింది. దీంతో ఆటో నుజ్జునుజ్జయింది. ఆటో డ్రైవర్‌ జానీ (23), కిరణ్‌ (15), కౌసల్య (60), అజయ్‌ (11) అక్కడికక్కడే మృతిచెందారు. తీవ్రంగా గాయపడిన రసూల్, అతని భార్య పద్మ, కుమార్తె వెన్నెల, తల్లి వసంతను పోలీసులు ఎంజీఎంకు తరలించారు. వైద్యం పొందుతూ వెన్నెల (09), వసంత (65) మృతిచెందగా తీవ్రంగా గాయపడిన రసూల్, పద్మ దంపతులు చికిత్స పొందుతున్నారు. ఆటోలో ఇరుక్కున్న వారిని బయటకు తీస్తున్న క్రమంలో తీవ్ర గాయాల బాధను తట్టుకోలేక వాళ్లు రోదించిన తీరు అక్కడున్న వారిని కలిచివేసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.  

నిద్రలోనే మృత్యుఒడిలోకి  
బాగా రాత్రి కావడం.. అందరూ నిద్రలోకి జారుకుంటుండటంతో పద్మ మధ్య మధ్యలో డ్రైవర్‌తో మాట్లాడింది. ‘నిద్ర వస్తున్నట్లుంది. మార్గమధ్యలో ఎక్కడైనా ఆగి నిద్రపోదాం, ఉదయం తిరిగి వెళ్దాం’అని చెప్పినట్లు ప్రమాదం జరిగాక వసంత తనతో వీడియోలో మాట్లాడిన వారికి రోదిస్తూ చెప్పింది. సంఘటన జరిగిన తీరును బట్టి ఆటోలోని వారు నిద్రలోనే ప్రాణాలు విడిచినట్లు తెలుస్తోంది. నుజ్జునుజ్జయిన ఆటో, రక్తం, చెల్లా చెదురుగా పడి ఉన్న దేవుడి ప్రసాదాలతో సంఘటనా స్థలం భీతావహంగా కనిపించింది.  

రసూల్‌ కుటుంబంలో తీరని విషాదం 
ఒకే కుటుంబలో నలుగురిని కోల్పోయిన రసూల్, పద్మ దంపతులకు సెంటు భూమీ లేదు. రసూల్‌ ట్రాక్టర్‌ డ్రైవర్‌గా పనిచేస్తుండగా భార్య పద్య రోజువారి కూలీ పనులకు వెళ్తూ కొడుకు అజయ్, కుమార్తె వెన్నెలను చదివించుకుంటున్నారు. ప్రస్తుతం ప్రభుత్వ డబుల్‌ బెడ్రూం ఇంట్లో తల్లి వసంతతో కలిసి ఉంటున్నారు. 

స్నేహితుడితో వెళ్లి శవమై వచ్చావా బిడ్డా 
రసూల్‌ కుమారుడు అజయ్, వారి ఇంటి ఎదుటి ఇంట్లో ఉండే కిరణ్‌ చిన్నప్పటి నుంచి మంచి మిత్రులు. అజయ్‌ కుటుంబీకులతో అన్నారం వెలుతుండటంతో కిరణ్‌ కూడా వెళ్లాడు. కిరణ్‌ మృతదేహం శనివారం సాయం త్రం ఇంటికి చేరగా.. ‘స్నేహితుడితో దేవుడి దర్శనానికి వెళ్లి శవమై తిరిగొచ్చావా బిడ్డా’అంటూ కిరణ్‌ తల్లిదండ్రులు రోదించిన తీరు స్థానికులను కలిచివేసింది. ఆటో డ్రైవర్‌ జానీ కూడా కొద్దినెలల క్రితమే ఆటో కొని నడుపుతున్నాడు. అంతకుముందు ట్రాక్టర్‌ డ్రైవర్‌గా పనిచేసేవాడు. ఇంటికి పెద్దదిక్కును కోల్పోయామని అతని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement