telangana nava nirmana yatra
-
ఐదు రోజులు...101 కిలోమీటర్లు...
తాండూరు: రాష్ట్ర మాజీ హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి తనయుడు, యువజన కాంగ్రెస్ నేత పట్లోళ్ల కార్తీక్‌రెడ్డి జిల్లాలో చేపట్టిన తెలంగాణ నవ నిర్మాణ పాదయాత్ర ఆదివారం ముగిసింది. ఈ నెల 8న రాజేంద్రనగర్ మండల పరిధిలోని ఆరె మైసమ్మ దేవాలయం నుంచి కార్తీక్‌రెడ్డి ప్రారంభించిన పాదయాత్ర మొయినాబాద్, చేవెళ్ల, మన్నెగుడ, వికారాబాద్ మీదుగా తాండూరు వరకు సాగింది. తెలంగాణ ప్రజల ఆకాంక్ష మేరకు ప్రత్యేక రాష్ట్రాన్ని ప్రకటించినందుకు కేంద్రానికి, ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీకి కృతజ్ఞతలు తెలిపేందుకు ఐదు రోజుల పాటు సుమారు 101 కిలోమీటర్ల దూరం సాగిన పాదయాత్ర ఆదివారం తాండూరులోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో నిర్వహించిన బహిరంగ సభతో ముగిసింది. శనివారం రాత్రి వికారాబాద్ నుంచి పెద్దేముల్ మండలం మన్సాన్పల్లి వరకు పాదయాత్ర చేపట్టిన కార్తీక్‌రెడ్డి రాత్రికి అక్కడే బస చేశారు. ఆదివారం ఉదయం మన్సాన్పల్లి నుంచి దుగ్గాపూర్, మంబాపూర్, కందనెల్లి, ఖాంజాపూర్ల మీదుగా తాండూరు పట్టణం వరకు సుమారు 18 కి.మీ. పాదయాత్ర చేసి, ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కార్తీక్‌రెడ్డి పాల్గొన్నారు. పాదయాత్రలో తాండూరుకు చెందిన పలువురు వైద్యులు, మద్ధతుదారులు కార్తీక్‌రెడ్డిని కలిసి సంఘీభావం ప్రకటించారు. పట్టణంలో పాదయాత్రకు పార్టీ శ్రేణుల నుంచి ఘన స్వాగతం లభించింది. ముగింపు సభకు వికారాబాద్, చేవెళ్ల, మొయినాబాద్, పరిగి, తాండూరు,పెద్దేముల్, యాలాల, బషీరాబాద్ తదితర ప్రాంతాల నుంచి కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. -
కాంగ్రెస్‌లో ‘నవ’ కదలిక!
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి : ఎన్నికలు సమీపిస్తున్న వేళ మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తనయుడు కార్తీక్‌రెడ్డి చేపట్టిన ‘తెలంగాణ నవ నిర్మాణ పాదయాత్ర’.. నిస్తేజంగా ఉన్న కాంగ్రె స్ శ్రేణుల్లో కదలిక తెచ్చింది. తెలంగాణ ఉద్యమం..అనంతర పరిణామాల కారణంగా కొన్నాళ్లుగా ఎలాంటి కార్యక్రమాలు లేక.. స్తబ్ధుగా ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాదయాత్రలో ఉత్సాహంగా పాల్గొనడం కన్పించింది. అయితే తెలంగాణ ప్రకటనను సానుకూలంగా మలుచుకోవడంలో విఫలమైన అధినాయకత్వం.. కార్తీక్ చేపట్టిన యాత్రకు వెన్నంటి నిలువలేకపోయింది. ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి మినహా ఇతర ఎమ్మెల్యేలెవరూ కార్యక్రమానికి రాలేదు. జిల్లాలో సబితకు వైరివర్గంగా వ్యవహరిస్తున్న మంత్రి ప్రసాద్‌కుమార్, కేఎల్లార్ డుమ్మాకొట్టగా, ఇతర ఎమ్మెల్యేలు పలు సాకులతో మొదటి రోజు యాత్రకు దూరంగా ఉన్నారు. సిట్టింగ్ ఎంపీ, కేంద్ర మంత్రి జైపాల్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న చేవెళ్లలో తలపెట్టిన యాత్రలో పాలుపంచుకుంటే రాజకీయంగా ఇబ్బందులు తప్పవనే ఉద్దేశంతోనే ముఖ్యనేతలు డుమ్మా కొట్టినట్లు తెలుస్తోంది. కార్తీక్ యాత్రను వ్యతిరేకిస్తున్న జైపాల్.. ఈ కార్యక్రమంలో పాల్గొనకూడదని సంకేతాలిచ్చారు. ఈ క్రమంలోనే పాదయాత్రలో పాల్గొనే అంశంపై ఒకింత సందిగ్ధత నెలకొంది. అయితే, కార్తీక్‌రెడ్డి పార్టీపరంగానే యాత్ర నిర్వహిస్తున్నందున పార్టీ శ్రేణులు సహకరించాలని పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ పిలుపునిచ్చారు. దీంతో దిగువ శ్రేణి నాయకులు ఉత్సాహంగా ‘తెలంగాణ నవ నిర్మాణ యాత్ర’కు కదిలారు. కాగా, జైపాల్‌రెడ్డి మాత్రం తనకు రాజకీయంగా తలనొప్పులు సృష్టించేలా పాదయాత్ర చేపట్టారని, దీంట్లో భాగస్వాములు కావద్దని హెచ్చరించడంతో పలువురు ఎమ్మెల్యేలు వెనక్కి తగ్గారని తెలుస్తోంది. తొలిరోజు గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన తాండూరు, చేవెళ్ల అభ్యర్థులు రమేశ్, యాదయ్య హాజరుకాగా, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే తనయుడు రవికుమార్ యాదవ్ సంఘీభావం పలికారు. రాజేంద్రనగర్ ఇన్చార్జి జ్ఞానేశ్వర్ ముదిరాజ్ కూడా ముఖం చాటేశారు. ఇదిలావుండగా, పాదయాత్రపై ఎలాంటి విభేదాల్లేవని, గైర్హాజరైన నేతలు ఐదు రోజులపాటు సాగే యాత్రలో ఏదో ఒక రోజు పాలుపంచుకుంటామని తమకు చెప్పారని సబిత వర్గీయులు చెబుతున్నారు. కాగా తెలంగాణ నవ నిర్మాణ యాత్రకు భారీగా జనసమీకరణ చేశారు. రాజకీయ భవిష్యత్తుకు తొలి అడుగుగా భావిస్తున్న యాత్రను జయప్రదం చేసేందుకు సబిత శిబిరం సర్వశక్తులొడ్డింది. ఈ క్రమంలో జిల్లా వ్యాప్తంగా జనాన్ని పాదయాత్ర ప్రారంభోత్సవ సభకు తరలించారు. -
నేటి నుంచి కార్తీక్ పాదయాత్ర
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తనయుడు, కాంగ్రెస్ యువనేత పట్లోళ కార్తీక్‌రెడ్డి తలపెట్టిన ‘తెలంగాణ నవ నిర్మాణ యాత్ర’ బుధవారం రాజేంద్రనగర్ మండలం ఆరె మైసమ్మ దేవాలయం నుంచి ప్రారంభం కానుంది.ప్రత్యేక రాష్ట్రాన్ని ప్రకటించిన కేంద్రానికి కృతజ్ఞతలు చెబుతూ సాగే పాదయాత్ర ఐదు రోజులపాటు జిల్లాలో కొనసాగనుంది. మొయినాబాద్, చేవెళ్ల, మన్నెగూడ, వికారాబాద్ మీదుగా సాగి 12న తాండూరులో ముగిసే ఈ యాత్రను జయప్రదం చేసేందుకు సబిత వర్గం భారీగా ఏర్పాట్లు చేసింది. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో చేవెళ్ల పార్లమెంటరీ స్థానం నుంచి బరిలో దిగేందుకు ఉత్సాహం చూపుతున్న కార్తీక్.. పాదయాత్ర ద్వారా బలాన్ని నిరూపించుకునేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ప్రత్యక్ష రాజకీయాల్లో తొలి అడుగుగా చెప్పుకునే ఈ యాత్రను వ్యతిరేకవర్గం అంతర్గతంగా వ్యతిరేకిస్తున్నప్పటికీ, వ్యక్తిగత ఎజెండాకు తావులేకుండా పార్టీ బలోపేతానికే పాదయాత్ర చేపడుతున్నట్లు కార్తీక్‌రెడ్డి చెబుతున్నారు. కొత్త ఊపు.. పీసీసీ కూడా యాత్రకు గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడం.. పంచాయతీరాజ్ మంత్రి జానారెడ్డి పాదయాత్ర ప్రారంభానికి రానుండడంతో పార్టీ శ్రేణుల్లో కొత్త ఊపు వచ్చింది. తెలంగాణ ఇచ్చింది మేమే.. పునర్నిర్మించేదీ మేమే అనే నినాదంతో ప్రజల్లోకి వెళ్లాలనే ఉద్దేశంతో చేపట్టిన ఈ పాదయాత్ర 101 కిలోమీటర్ల మేర కొనసాగనుంది. రోజూ సగటున 20-22 కి.మీ మేర సాగేలా యాత్రను రూపొందించిన పార్టీ యంత్రాం గం..ప్రతి రోజూ ఒక బహిరంగ సభను నిర్వహించేలా ప్లాన్ చేసింది. -
8 నుంచి కార్తీక్ పాదయాత్ర
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తనయుడు కార్తీక్‌రెడ్డి పాదయాత్రకు శ్రీకారం చుడుతున్నారు. ‘తెలంగాణ నవ నిర్మాణ యాత్ర’ పేర 101 కిలోమీటర్ల పాదయాత్ర చేపడుతున్నారు. ఈ మేరకు శనివారం తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పాదయాత్ర ముఖ్యోద్దేశాన్ని కార్తీక్‌రెడ్డి వెల్లడించా రు. ఈ నెల 8 నుంచి 12వ తేదీ వరకు యాత్ర కొనసాగుతుందని, రోజూ సగటున 20-22 కి.మీ. మేర పాదయాత్ర చేయనున్నట్లు చెప్పారు. ఆరె మైసమ్మ దేవాలయం నుంచి మొదలయ్యే యాత్రను పంచాయతీరాజ్‌శాఖ మంత్రి జానారెడ్డి ప్రారంభిస్తారని తెలిపారు. 12న తాం డూ రు భద్రేశ్వర్ చౌక్‌లో యాత్ర ముగింపు సభను నిర్వహించనున్నట్లు వె ల్లడించారు. వ్యక్తిగత అజెండాకు తావులేకుండా పార్టీ పటిష్టత కోసమే ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నానని చెప్పారు. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్‌సింగ్ కూడా తన యాత్రకు సానుకూలంగా స్పందించారని, తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్సేననే అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని తనకు సూచించారని కార్తీక్ వెల్లడించారు. తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ దాదాపుగా పూర్తయిందని, ఈ నేపథ్యంలో కొత్త రాష్ట్ర నిర్మాణంలో యువతను భాగస్వామ్యం చేయాల్సిన అవసరముందని ఆయన అన్నారు. అందులోభాగంగానే తెలంగాణ నవ నిర్మాణ యాత్రను చేపడుతున్నట్లు తెలిపారు. ‘తెలంగాణ ఇచ్చింది మేమే... దాని పునర్నిర్మాణ బాధ్యత మాదే’ అనే నినాదంతో ప్రజల్లోకి వెళ్తున్నట్టు చెప్పారు. పాదయాత్రకు పార్టీ పెద్దల సంపూర్ణ ఆశీస్సులు, దీవెనలు ఉన్నాయని, కాంగ్రెస్ బలోపేతానికి చేస్తున్న యాత్ర కావడంతో పార్టీ శ్రేణులు కూడా ఉత్సాహంగా పాలుపంచుకునేందుకు ఆసక్తి చూపుతున్నాయని అన్నారు. తన యాత్రకు పీసీసీ కూడా అనుమతి ఇచ్చిందని ఒక విలేకరి అడిగిన ప్రశ్నకు బదులుగా చెప్పారు. సమావేశంలో డీసీసీబీ చైర్మన్ లక్ష్మారెడ్డి, పీసీసీ కార్యదర్శి రామ్మోహన్‌రెడ్డి, టీటీడీ మాజీ సభ్యుడు కాలె యాదయ్య, కాంగ్రెస్ ఎస్సీ సెల్ కన్వీనర్ వెంకటస్వామి, పార్టీ సీనియర్ నేత ఎ.మురళీధర్‌రెడ్డి, శంకర్పల్లి మండల కాంగ్రెస్ అధ్యక్షుడు గోవర్ధన్ రెడ్డి పాల్గొన్నారు.